ఆంధ్రప్రదేశ్: పీఆర్‌సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన పీఆర్‌సీ నివేదిక వ్యవహారం వివాదంగా మారుతోంది. ఆందోళనకు సిద్ధమంటూ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల నిర్వహణతో సరిపెడుతోంది.
పీఆర్‌సీ నివేదిక వెల్లడించేందుకు ప్రభుత్వం సముఖంగా లేదంటూ ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు తాజా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
అయితే ఉద్యోగుల జేఏసీ నాయకుల తీరు మీద సచివాలయ ఉద్యోగుల సంఘం అభ్యంతరం చెబుతోంది. అనవసర వివాదంగా అభిప్రాయపడుతోంది. ఈ పరిణామాలతో ఉద్యోగ సంఘాల నాయకుల మధ్యనే సఖ్యత లేదనే సంకేతాలు వస్తున్నాయి.
చివరకు ఉద్యోగ సంఘాలకు సరైన నాయకులు అవసరం అంటూ కొందరు రాజకీయ నేతలు వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్‌సీ విషయంలో ఏం జరుగుతోంది.. ఉద్యోగ సంఘాల మధ్య ఈ వైరుధ్యాలు ఎందుకనేది ఆసక్తిగా కనిపిస్తోంది.
పీఆర్‌సీ పూర్వపరాలు..
‘పే రివిజన్ కమిషన్’ దీనినే క్లుప్తంగా పీఆర్‌సీ అంటారు. ఉద్యోగుల వేతనాలను అయిదేళ్లకోసారి సవరించేందుకు ఈ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన ఇలాంటి కమిటీని ‘పే కమిషన్’ అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ‘పే రివిజన్ కమిషన్’ అని పిలుస్తారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం ఇవ్వాలి? భత్యం ఎంత వంటివి ఈ కమిషన్ సిఫార్సు చేస్తుంది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఆ మేరకు ఉద్యోగుల వేతన సవరణ జరుగుతూ వస్తోంది.
కమిషన్ చెప్పిన దానికి మించి వేతనాలు పెంచడం సంప్రదాయంగా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వేతన సవరణ సంఘాలను ఏర్పాటు చేసే విధానం 1969లో మొదలయ్యింది.
ఈ సంఘాలని నియమించడం నుంచి మొదలుకుని, నివేదిక సమర్పించడం, దానిని వెల్లడించడం, చర్చించిన తర్వాత ఆమోదించడం వరకూ అనేక సందర్భాల్లో కాలయాపన చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయి.
అంతా జరిగిన తర్వాత, కొత్త పీఆర్‌సీ ప్రకటించి, అమలును ఆలస్యం చేస్తూ ఉంటారు.
ఆ కాలయాపనపై ఉద్యోగ సంఘాల తరపున వినతులు, విజ్ఞాపనలు, రాయబారాలు, చర్చలు, ఆపైన కొన్ని కార్యక్రమాలతో ఆందోళనలు, నిరసనలు కూడా జరుగుతూ ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
11వ పీఆర్‌సీ నివేదిక కోసం..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 11వ పీఆర్‌సీ కోసం ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు. వేతన సవరణకు సంబంధించిన నివేదిక కోసం నియమించిన కమిషన్ కి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్రా సారధ్యంలో ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
2018 మే 18 పీఆర్‌సీ కోసమంటూ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. అదే ఏడాది జూలై 3న అశుతోష్ మిశ్రాకి కమిషన్ బాధ్యతలు అప్పగిస్తూ జీవో నెం. 1451ని విడుదల చేశారు.
అంతకు ముందు 2013 జూలై 1 నుంచి 10వ పీఆర్‌సీ వర్తింపజేస్తూ 2014 జూన్ 2 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర విభజన అపాయింట్ మెంట్ డేట్ ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త పీఆర్‌సీ అమలు చేయడం విశేషం.
ఆ తర్వాత అశుతోష్ మిశ్రా పీఆర్‌సీ కమిషన్ ని నియమించిన సమయంలో ఏడాది లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది.
నివేదిక వచ్చి ఏడాది దాటింది..
అశుతోష్ మిశ్రా కమిషన్ తన నివేదికను ఏడాది లోగా ఇవ్వాల్సి ఉండగా, 2020 అక్టోబర్ 5న ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కాలంలో ఆరు సార్లు గడువు పెంచాల్సి వచ్చింది.
ఏడాది గడిచినా ఈ నివేదిక నేటికీ అమలుకి నోచుకోలేదు. దానికి ముందు నివేదిక వెల్లడించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అందులో ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కమిటీ వేతన సవరణ సంఘం నివేదికను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. దానిని అందుకున్న సీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగులో చర్చించి మంత్రివర్గానికి సిఫార్సులు చేస్తారు.
దానికన్నా ముందు ఉద్యోగుల నుంచి వినతులను స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ నోడల్ అధికారిని నియమించాలి. ఏపీ ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నోడల్ ఆఫీసర్ గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రభుత్వం తరుపున ప్రధాన కార్యదర్శి నివేదికను వెల్లడించిన తర్వాత, వాటిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తరుపున వివిధ వినతులు నోడల్ ఆఫీసర్ కి చేరుతాయి. వాటిని పరిశీలించిన తర్వాత సీఎస్ తన నివేదికను క్యాబినెట్ కి సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మేరకు వేతన సవరణ జరుగుతుంది.
కానీ, ఏపీలో ఈ నివేదికను వెల్లడించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ పీఆర్‌సీ నివేదిక మాత్రం వెల్లడికాలేదు.
అక్టోబర్ 29న జరిగిన సమావేశంలో కూడా ఉద్యోగ సంఘాలు ప్రస్తావించినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. తాజాగా శుక్రవారం మరోసారి జేఎస్‌సీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కూడా నివేదిక విడుదల చేయకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు.
పీఆర్‌సీ అమలులో జాప్యం జరుగుతుందనే కారణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం జగన్ మధ్యంతర భృతి(ఐ.ఆర్.) ప్రకటించారు. 2019 జులై నుంచి 27% ఐ.ఆర్. ఇస్తున్నారు.
ఇది కొంత తాత్కాలిక ఊరట కల్పించినా 2018 నుంచి అమలు కావాల్సిన పీఆర్‌సీ వ్యవహారంలో స్పష్టత రాకపోవడం సామాన్య ఉద్యోగులను కలవరపరుస్తోంది.

ఆలస్యానికి కారణాలేంటి..
ఉద్యోగుల వేతన సవరణ విషయంలో ప్రభుత్వం హామీలు విస్మరిస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
''గత నెలలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో రెండు రోజుల్లో నివేదిక వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. జేఏసీ తరఫున ఆందోళనలకు పిలుపునిచ్చాం. ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించారు. సీపీఎస్ రద్దు, పీఆర్‌సీ, ఉద్యోగుల క్రమబద్దీకరణ సహా ఏ అంశంలోనూ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారు'' అని రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేత ఎం.శేషగిరి రావు అభిప్రాయపడ్డారు.
జేఎస్‌సీ మీటింగులో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినప్పటికీ పీఆర్‌సీ నివేదికను ఇంకా వెల్లడించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోందని ఆయన బీబీసీతో అన్నారు.
జాప్యం వల్ల వేలమందికి నష్టపోతున్నారు...
ఆంధ్రప్రదేశ్ లో వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహా సుమారు 8 లక్షల మందికి పీఆర్‌సీ కారణంగా ప్రయోజనం దక్కుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.
ప్రతిసారీ పీఆర్‌సీ అమలు ఆలస్యం కావడంతో రిటైర్మెంట్ కి చేరువలో ఉండే వారికి సమస్య అవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'' ప్రధానంగా పెన్షన్ల విషయంలో చాలామంది నష్టపోవాల్సి వస్తోంది. పీఆర్‌సీ అమలు జరిగితే పెరిగిన వేతనాలకు అనుగుణంగా పెన్షన్ పొందాల్సిన ఉద్యోగి మధ్యలో పదవీ విరమణ కారణంగా పాత వేతనానికి మాత్రమే బెనిఫిట్స్ పొందే పరిస్థితి రావడం సమస్య అవుతోంది'' అని పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.రాజశేఖర్ తెలిపారు.
పీఆర్‌సీ అమలు చేసే తేదీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుకునే తేదీ కి మధ్య ఉన్న సమయాన్ని నోషనల్ గా భావిస్తారు. వాస్తవ అమలు కాకుండా కాగితాల్లో మాత్రమే అమలు జరిగిందని చెప్పడానికి నోషనల్ గా పేర్కొంటారు. 10వ పీఆర్‌సీలో ఉద్యోగులు 11 నెలల కాలాన్ని నష్టపోయారని, 11వ పీఆర్‌సీ విషయంలో ఇది మరింత జాప్యం కావడం వల్ల చాలా నష్టం జరుగుతోందని ఆయన తెలిపారు.
''మా ఆఫీసులో ముగ్గరు ఉద్యోగులు ఈ ఏడాదిలో రిటైర్ అయ్యారు. ప్రభుత్వం నోషనల్ కాలంగా ఏది నిర్ణయిస్తుందన్నది స్పష్టం కాలేదు. కానీ వారికి నిబంధనల ప్రకారం 2018 నుంచి కొత్త పీఆర్‌సీ అమలు కావాలి. కనీసం 2019లో ఐ.ఆర్. అమలు చేస్తున్న తేదీ నుంచైనా దక్కాలి. ఇప్పుడు ఏం చేస్తారో తెలీదు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. వాళ్లంతా టెన్షన్ గా ఉన్నారు'' అన్నారు రాజశేఖర్.

పాత పీఆర్‌సీ లెక్కలే సమస్యా?
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం 2014 నుంచి అమలు చేసిన పీఆర్‌సీ లో ఫిట్‌మెంట్ 44 శాతంగా నిర్ణయించారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం 43 శాతం ఇవ్వగానే దానికి అదనంగా పీఆర్‌సీ అమలులోకి తీసుకొచ్చారు.
ఇప్పుడు ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీకి అప్పులు పెరిగాయి. ఆదాయం పడిపోయింది. కరోనా తర్వాత కష్టాలు రెట్టింపయ్యాయి. దాంతో పీఆర్‌సీ అమలుచేసే విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆలస్యం చేస్తూ నెట్టుకొస్తోంది.
''ఫిట్‌మెంట్ ప్రకటించాల్సి వస్తే ఉద్యోగులను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. గతంలో చంద్రబాబు 44 శాతం ఇవ్వడంతో జగన్ ప్రభుత్వాన్ని దానితో పోలుస్తారనే బెంగ పట్టుకుంది. ఉద్యోగులు ఇప్పుడు పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం మూలంగా ఆర్థిక భారం వారిలో అసహనం కలిగించడం అనివార్యం. అదే ప్రభుత్వానికి కష్టంగా మారినట్టు కనిపిస్తోంది'' అని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం తరుపున పని చేసిన రిటైర్డ్ అధికారి కె.ఆంజనేయులు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం డీఏ బకాయిలు కూడా చెల్లించకలేకపోతున్న ప్రభుత్వం, వేతనాలు నెలలో ఏదో ఒక తేదీన ఇవ్వడమే గొప్పగా భావిస్తున్నప్పుడు పీఆర్‌సీ మీద పెద్దగా ఆశలు పెట్టుకోవడం సమంజసం కాదని ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, UGC
నివేదిక ఇస్తామన్నా వివాదం ఎందుకు?
ప్రభుత్వం నివేదిక ఇస్తామని చెబుతున్నప్పుడు ఉద్యోగ సంఘాల నేతల కొందరు ఎందుకు వివాదం చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అంటున్నారు.
'' పీఆర్‌సీ అమలు చేసేవేళ మైలేజీ కోసమే ఇలాంటి ప్రయత్నాలు తగదు. పీఆర్‌సీ అమలు చేయాలని, అది అందరికీ సంతృప్తి కలిగించేలా ఉండాలని భావిస్తున్నాం. ప్రభుత్వం కూడా పరిస్థితులకు అనుగుణంగా మేలు చేయాలనే ఆలోచనతోనే ఉంది. దానికి ముఖ్యమంత్రితోనూ, ఇతరులతోనూ చర్చించి సాధించుకోవాలిగానీ, ఉద్యోగులను తప్పుదోవపట్టించడం సరికాదు'' అన్నారాయన.
పీఆర్‌సీ కోసం పట్టుబడుతున్న వేళ రెండు జేఏసీల నేతల తీరు సక్రమంగా లేదని వెంకట్రామి రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏదో ప్రయోజనాలు ఆశించే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన బీబీసీతో అన్నారు.
సచివాలయంలో సమావేశం సాక్షిగా ఉద్యోగ సంఘాల నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దీంతో ఉద్యోగ సంఘాలకు తగిన నాయకత్వం కొరవడిందని, ప్రశ్నించేవారిని ఎంచుకోవాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు వంటి వారు వ్యాఖ్యానించారు.
పీఆర్‌సీ కోసం ఉద్యోగుల ఎదురుచూస్తున్న వేళ ఉద్యోగ సంఘాల నేతల మధ్య విభేదాలు సత్ఫలితాన్నివ్వవనే అభిప్రాయం క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- హార్ట్ ఎటాక్ తప్పించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రి 10 గంటల్లోపే నిద్రపోండి..
- వరదలొస్తే నీటిని పీల్చేసుకునే నగరాలు.. స్పాంజ్ సిటీలను రూపొందిస్తున్న చైనా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- అల్లు అర్జున్‌కు లీగల్ నోటీసు పంపిస్తాం - టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- విశాఖపట్నం లైన్‌మన్ హత్య కేసు: మంత్రి మేనల్లుడిపై ఆరోపణలు
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








