ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి అనివార్యమా, ఆర్టికల్ 360 అమలు చేయాలనే డిమాండ్ ఎందుకొస్తోంది

జగన్, బుగ్గన

ఫొటో సోర్స్, Buggana Rajendranath Reddy/facebook

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందా.. అప్పుల ఊబిలో కూరుకుపోయిందా.. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన పరిస్థితి వచ్చిందా.

ఇవే అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

అధికార వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న కనుమూరి రఘరామకృష్ణంరాజు మరో అడుగు ముందుకేసి రాష్ట్రపతికి లేఖ రాశారు. ఏపీలో ఆర్టికల్ 360 అమలు చేయాలని కోరారు.

అసలు ఎందుకీ పరిస్థితి వచ్చింది. ఏపీలో అప్పుల వ్యవహారం, ఆర్థిక పరిస్థితిపై అనుమానాలకు ఎందుకు దారితీస్తోంది.

వీడియో క్యాప్షన్, పెద్ద పెద్ద గోతులతో స్విమ్మింగ్ పూల్స్‌ను తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రోడ్లు

ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితి ఏమిటి

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తుంటారు. 2020-21లో ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ రూ. 10,61,902 కోట్లుగా ఉంది.

నిబంధనల ప్రకారం అందులో 4 శాతం వరకూ అప్పులు చేసుకునే వీలుంటుంది. అంటే ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 42,472 కోట్ల వరకూ అప్పులు తెచ్చుకునే వీలుంది.

అందులో మూలధనం కింద రూ. 27,589 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది ఖర్చు చేస్తే అదనంగా మరో 0.5 శాతం అప్పులు చేసుకునే వీలుంటుంది.

గత ఏడాది చేసిన అప్పుల వివరాల్లో మూలధనం వ్యయం.. అంటే అభివృద్ధి కోసం చేసిన ఖర్చు వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ వివరాలు అందించకపోవడంతో కేంద్రం రూ. 5,309 కోట్ల మేర కోత పెట్టింది.

దాంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించుకోగల రుణపరిమితి రూ 37,163 కోట్లుగా ఉంది. దాంతో పాటుగా పాత రుణాలు తిరిగి చెల్లించడంతో రూ.14,429 కోట్లు వరకు అదనంగా అప్పులు చేసుకునే అవకాశం వచ్చింది. వాటిని కూడా కలుపుకొంటే ఏపీకి ఉన్న అప్పుల పరిమితి రూ. 51592 కోట్లకు చేరింది.

కానీ రాష్ట్రప్రభుత్వం తనకున్న పరిమితికి మించి 2020-21లో అదనంగా అప్పులు చేయడంతో రూ. 17,923.94 కోట్ల మేర కేంద్రం కోత వేస్తూ ఏపీ ప్రభుత్వానికి తెలియజేసింది. అంతేగాకుండా మిగతా రుణాల్లో కూడా మరో రూ. 6 వేల కోట్లు కోతపడింది. మొత్తంగా రూ. 23 వేల కోట్ల మేరకు కోత విధించారు.

దీంతో ఏపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేయడానికి అవకాశం ఉన్న అప్పుల పరిమితి రూ. 27688 కోట్లు మాత్రమేనని కేంద్రం తేల్చింది.

జగన్

ఫొటో సోర్స్, ysrcp/fb

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి ఏపీకి వాటాగా వచ్చిన అప్పులు రూ. 97,123 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరాంతానికి అవి రూ. 2,62,225 కోట్లకు చేరాయి. గత రెండేళ్ల అప్పులు మరింత పెరిగి ప్రస్తుతం మొత్తం రూ. 3,73,140 కోట్లకు చేరింది.

రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ప్రభుత్వం అయిదేళ్లలో రూ. 1.65 లక్షల కోట్ల అప్పులు చేయగా ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 1.15 లక్షల కోట్లు అప్పులు చేసింది.

ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5 వేల కోట్లకు పైగా అప్పులు చేయాల్సి వస్తోంది.

ఈ అప్పులతో పాటు వివిధ కార్పొరేషన్ల పేరుతోనూ అప్పులు చేశారు. రాష్ట్ర విభజన నాటికి ఇలాంటి అప్పులు రూ. 14 వేల కోట్లు ఉండగా ఆ తర్వాత ఐదేళ్లలో రూ. 44 వేల కోట్లు రుణం తెచ్చుకున్నారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత రెండేళ్లలో పాత అప్పుల కంటే అధికంగా రూ. 56 వేల కోట్లను ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ల ద్వారా రుణంగా పొందినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి.

వీడియో క్యాప్షన్, ‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు’ – పరకాల ప్రభాకర్‌

జీతాలు, పెన్షన్లకూ అప్పులే ఆధారం

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లతో పాటుగా పాత అప్పులకు వడ్డీలు చెల్లించడానికి కూడా ప్రస్తుతం నెలనెలా అప్పులు చేస్తున్నారు.

వేతనాలు, పెన్షన్ల నిమిత్తం నెలకు రూ. 5,500 కోట్లు అవసరం అవుతాయి. ఇక వడ్డీలు, పాత అప్పులు తీర్చాల్సిన వాటికి గానూ ప్రతి నెలా మరో రూ. 3,500 కోట్లు అవసరం అవుతోంది.

నెలానెలా కొత్తగా చేస్తున్న రూ. 5వేల కోట్లకు పైగా అప్పు ఈ రెండు పద్దులకే చాలని పరిస్థితి. అప్పులు సకాలంలో లభించని సమయాల్లో ఉద్యోగులకు వేతనాలు ఆలస్యమవుతున్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన

ఫొటో సోర్స్, Bugganarajendranathreddy/fb

ఫొటో క్యాప్షన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన(పాత చిత్రం)

పరిమితికి మించి అప్పులు ఎందుకు

ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల వరుసలో ఉంటుంది.

2020-21 సంవత్సరంలోనే వార్షిక రుణ లక్ష్యాల కన్నా అదనంగా అప్పులు చేస్తోంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ. 48,295 కోట్లుగా ఉంది.

మొదటి త్రైమాసికంలోనే అందులో మూడొంతుల రుణాలు తీసుకున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్స్ వేలం వేసినప్పటికీ వాటిని కూడా ఆర్బీఐ ఓడీల కింద జమచేసుకునే స్థితి ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ అప్పులు పెరుగుతున్నాయి. వాటికి వడ్డీల కోసం అదనంగా అప్పులు తీసుకురావాల్సి వస్తోంది.

2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణాలో రూ. 15454 తలసరి రెవెన్యూ ఉంటే ఏపీలో అందులో సగం మాత్రమే ఉంది.

హైదరాబాద్ వంటి మహానగరం కోల్పోయిన తర్వాత ఏపీకి రెవెన్యూ పడిపోయింది. అదే సమయంలో వివిధ పథకాల పేరుతో ప్రభుత్వాలు పంపకాలు చేపట్టడం మూలంగానే పరిమితికి మించి అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందని కొందరి వాదన.

ఉన్న ఆదాయ పరిమితి మేరకు వ్యయం చేయాల్సి ఉంటే, దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని గత ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం తీరు మీద అంతకుమించిన మోతాదులో ఆరోపణలున్నాయి.

రఘురామ కృష్ణ రాజు

ఫొటో సోర్స్, Raghuramakrishnaraju/fb

ఆర్థిక అత్యవసరం ఎందుకు, ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. వివిధ పథకాల పేరుతో సాగుతున్న నగదు బదిలీకి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.

తాజాగా కేంద్రం పార్లమెంట్ లో ప్రకటించిన లెక్కల ప్రకారం గత రెండేళ్లలో ఏపీకి చెందిన వివిధ కార్పోరేషన్ల ద్వారా రూ. 56,072 కోట్ల అప్పులు చేసినట్టు వెల్లడించింది.

మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురాగా అందులో అత్యధికంగా ఎస్బీఐ నుంచి రూ. 15,047 కోట్లు అప్పులు చేసినట్టు తెలిపింది.

ఆదాయం అంతంతమాత్రంగా ఉండగా, అప్పులతో రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకురావాల్సిన పరిస్థితి ఉందన్నది అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కేంద్రం అప్పుల పరిమితిపై కోత విధించగానే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి దిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలతో మంతనాలు జరపాల్సి వస్తోంది.

వీడియో క్యాప్షన్, ప్రత్యేక హోదా: ప్రజల స్పందన ఏంటి?

ఈ పరిస్థితుల్లో ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు రాష్ట్రపతికి లేఖ రాశారు.

నిజానికి ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించేందుకు రాష్ట్రపతికి అధికారం కల్పిస్తూ ఆర్టికల్ 360 ఉంది.

ఇప్పటి వరకూ దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం రాలేదు. ఆర్టికల్ 360 అమలు చేస్తే రాష్ట్రాల ఆర్ధిక వనరులను ఎలా ఉపయోగించాలో ఆదేశించే అధికారం కేంద్రానికి లభిస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కూడా ఈ చట్టంతో కేంద్రానికి అధికారం కల్పిస్తుంది.

''దేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వానికి, లేదా దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉందని రాష్ట్రపతి భావిస్తే.. అధికారిక ప్రకటన ద్వారా ఆయన దీన్ని అమల్లోకి తేవచ్చు'' అని ఈ చట్టంలోని 1వ అధికరణం చెబుతోంది. ఈ చట్టం రాష్ట్రపతి ఆమోదంతోనే 2 నెలల పాటు అమలుచేయవచ్చు. ఆపైన కొనసాగించాలంటే పార్లమెంట్ ఆమోదం అవసరమవుతుంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

పెరిగిపోతున్నఅప్పులపై ప్రభుత్వ వాదన ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో అప్పులు వేగంగా పెరుగుతున్న విషయాన్ని ప్రభుత్వ ప్రతినిధులు కూడా అంగీకరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా అప్పులు చేయక తప్పడం లేదని ఏపీ సీఎం ఆర్థిక సలహాదారు దవ్వూరి కృష్ణ అన్నారు.

‘‘అన్ని ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. వాటిని ఎలా ఉపయోగిస్తున్నారన్నదే ముఖ్యం. వాటిని సద్వినియోగం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైంది. అది ప్రస్తుత ప్రభుత్వానికి భారమైంది. దేశంలో వ్యవసాయదారుల మీద అప్పుల భారం 47 శాతం ఉంటే ఏపీలో 77 శాతంగా శాతం ఉంది. అయినా రుణమాఫీ హామీ ఇచ్చి మాట తప్పారు. ఐదేళ్లలో కొత్తగా ఒక ప్రభుత్వాసుపత్రి కూడా రాలేదు. ఇప్పటికే కేంద్రం నుంచి 3 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకున్నాం. మరో 13 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. ఇలా విద్య, వైద్య రంగాల్లో మౌలికవసతులు కల్పిస్తున్నాం.

ఏమి చేయకపోయినా చంద్రబాబు ప్రభుత్వం చివరి 3 ఆర్థిక సంవత్సరాల్లో పరిమితికి మించి రూ. 16వేల కోట్ల అప్పులు చేసింది. 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో అదనంగా అప్పులు చేయడంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు లేఖలు వచ్చాయి. ఇప్పుడు కేంద్రం అప్పుల్లో కోత పెడుతున్న రూ. 17వేల కోట్లకి కారణం గత ప్రభుత్వ విధానమే’’ అన్నారు కృష్ణ.

విభజన నాటికి అప్పులకు వడ్డీల కింద సుమారు రూ. 8వేల కోట్లు ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చే నాటికి రూ. 25వేల కోట్లకు వడ్డీల భారం పెరిగింది.

దాంతో పాటుగా కోవిడ్ కారణంగా ఎన్నడూ ఎరుగని విపత్తు ఎదుర్కొంటున్నాం. ప్రపంచమంతా రెవెన్యూ పడిపోయి, వ్యయం పెరగడంతో అన్ని ప్రభుత్వాలకు అప్పులు అనివార్యమయ్యాయి.

కేంద్రమే జీడీపీలో 3 శాతం చేయాల్సిన అప్పులను 11 శాతం వరకు చేయాల్సి వచ్చింది. ఎన్నడూ లేని రీతిలో ఏకంగా రూ. 21 లక్షల కోట్లు ఒక్క గత ఆర్థిక సంవత్సరమే చేసింది.

కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలో రూ.7700 కోట్లు తగ్గాయి. మరో రూ. 7వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. అదనంగా కోవిడ్ కోసం రూ. 8వేల కోట్లు ఖర్చు చేశాం. దాంతో అదనంగా రూ. 25వేల కోట్లు భారం అయ్యింది.

ప్రపంచమంతా ప్రజలకు చేయూతనందించడం ద్వారా వ్యవస్థను కాపాడాలని ఆర్థిక వేత్తలు చెబుతున్నదే మేం చేశాం. దానివల్లనే హామీలనుంచి వెనక్కి తగ్గకుండా అన్ని అమలు చేస్తున్నాం. ప్రతీ రూపాయి నేరుగా ప్రజలకు చేర్చడం ద్వారా సదర్వినియోగం చేశాం అంటూ దవ్వూరి కృష్ణ వివరించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

పంచుకుంటే పోతే ప్రమాదమే..

ఆంధ్రప్రదేశ్ అప్పులు ప్రమాదకరమైన స్థితికి చేరినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆర్థిక రంగ పరిశీలకుడు పి.సతీశ్ వ్యాఖ్యానించారు. ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించడంలో జగన్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడంతోనే అప్పుల భారం మరింత పెరుగుతోందని ఆయన అంటున్నారు.

‘‘పోస్ట్ కోవిడ్ ఆదాయం పడిపోతోందనేది వాస్తవం. కేంద్రం నుంచి వచ్చే వాటాకు కూడా కోతపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం కూడా పడిపోతోంది. ఇవన్నీ వాస్తవాలే అయినప్ప్పుడు ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి కదా.

ఉన్న ఆదాయంతో పాటుగా చేసిన అప్పులను కూడా ప్రజలకు పంచుకుంటూ పోతే ఏం ప్రయోజనం. ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించాలనే పేరుతో సంక్షేమ పథకాలకే ప్రాధాన్యమిస్తే ఆదాయం ఎలా వస్తుంది. ఎన్నాళ్లిలా అప్పులు చేస్తారు.

అభివృద్ధిని విస్మరించి ఏకపక్షంగా పంపకాలు చేయడం దీర్ఘకాలంలో ఖజానా కోలుకోలేని స్థితికి తెస్తుంది. రైతుల దగ్గర ధాన్యం కొన్న తర్వాత 3 నెలల వరకు డబ్బులు చెల్లించకుండా తిప్పించుకున్న దుస్థితి గతంలో ఎన్నడూ లేదు. అయినా వాస్తవ పరిస్థితిని గమనించకుండా ఆర్థిక నిర్వహణలో విఫలమయినట్టు కనిపిస్తోంది. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలి’’ అన్నారాయన.

యనమల

ఫొటో సోర్స్, facebook

'అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు వీళ్లదే'

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి చూస్తే 66 ఏళ్లలో ప్రభుత్వం అప్పులకు రూ. 60వేల కోట్లు ష్యూరిటీలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ. 60వేల కోట్లు ష్యూరిటీగా పెట్టింది. బయటకు వెల్లడించకుండా మరో రూ. 25వేల కోట్లు ఉందని చెబుతున్నారు.

‘‘తెచ్చిన అప్పులన్నీ మళ్లీ వడ్డీలకు, జీతాలకు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే సరిపోతోంది. ఇంక అభివృద్ధి ఎక్కడా.. రోజువారీ ఖర్చులకే అప్పులు తీసుకొచ్చిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు.

2019-20లో 217 రోజులు అప్పులతోనే గడిపారు. రాష్ట్రంలో రెండేళ్లలో ఒక్కటి కూడా కొత్తగా సృష్టించిన ఆస్తి లేదు. కానీ అప్పులు మాత్రం 33.7 శాతం, రెవెన్యూ లోటు 31 శాతానికి పెంచారు. అనుభవరాహిత్యం, అజ్ఞానం కలిసి రాష్ట్రం దిగజారిపోయేందుకు కారణమవుతున్నాయి’’ అంటూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)