ఆంధ్రప్రదేశ్: 'జగనన్న కాలనీ'లపై విమర్శలేంటి? సౌకర్యాలపై లబ్ధిదారులు ఏమంటున్నారు

మెగా గ్రౌండింగ్ (శంకుస్థాపన) మేళా పేరుతో పేద‌లంద‌రికీ ఇళ్ల నిర్మాణ ప‌థ‌కాన్ని ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రారంభించనున్నారు

ఫొటో సోర్స్, AndhraPradeshCMO/twitter

ఫొటో క్యాప్షన్, జులై 1 నుంచి జగనన్న కాలనీలకు ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోంది.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

మెగా గ్రౌండింగ్ (శంకుస్థాపన) మేళా పేరుతో పేద‌లంద‌రికీ ఇళ్ల నిర్మాణ ప‌థ‌కాన్ని ఏపీ ప్రభుత్వం మరోసారి ప్రారంభించింది. గత నెల 3వ తేదీన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ఇదే పథకాన్ని ప్రారంభించారు.

ఈ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన స్థలాల పంపిణీ గతేడాది డిసెంబర్‌లో సీఎం చేతుల మీదుగా కాకినాడలో ప్రారంభమైంది. ఒక పథకానికి అనేకసార్లు వివిధ పేర్లతో సీఎం ప్రారంభోత్సవాలు చేయడంపై తెలుగుదేశం పార్టీ తప్పుబడుతోంది.

తాము ఇస్తున్న ఇళ్లకు అతిగా ప్రచారం చేసుకుంటూ... గత ప్రభుత్వ హాయంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1, 3, 4 తేదీల్లో మెగా ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన మేళా జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల్లో భాగంగా సాగుతున్న ఈ ఇళ్ల కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలు అని పేరు పెట్టారు.

ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించిన సీఎం, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టారు
ఫొటో క్యాప్షన్, ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్న అధికారులు

నిర్మాణానికి మూడు ఆప్షన్లు...

రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మొత్తం రూ.28,084 కోట్లతో మొదటి దశలో 15.60 లక్షల పక్కా గృహాల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వీటిని జూన్‌లో ప్రారంభించిన సీఎం, వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టారు. అలాగే రెండో దశలో రూ. 22,860 కోట్లతో మరో 12.70 లక్షల గృహాల నిర్మాణం చేయ‌నున్నారు. ఇవి 2023 చివరకు పూర్తి చేయాలనేది టార్గెట్.

కొత్తగా అర్హులు చేరినా, వారికి కూడా ఇల్లు ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని ఏపీ ప్రభుత్వం చెప్తోంది.

ఈ పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మూడు అప్షన్లను ఇచ్చింది. లబ్దిదారుడే స్వయంగా ఇల్లు నిర్మించుకోవడం, దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వం దఫదఫాలుగా ఇస్తుంది.

రెండోది ఇంటికి అయ్యే మెటీరియల్‌కు అయ్యే ఖర్చును ప్రభుత్వం సబ్సిడీతో అందించడం, మూడు...పూర్తిగా ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇవ్వడం.

ఈ పథకంలో నిర్మించే ఇళ్లు 340 చదరపు అడుగుల్లో ఉంటాయి. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బులు, ఒక వాటర్ ట్యాంక్ ఉంటాయి.

ఈ మూడు అప్షన్లలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా...ప్రభుత్వం తరపున గరిష్టంగా లక్షా 80వేల రూపాయిల సాయం లబ్ధిదారుడికి అందుతుంది.

రేషన్ కార్డు ఉండి, సెంటు స్థలం లేని వారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని కూడా చేపడుతుంది. ఈ పథకంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుడికి మూడు దఫాలుగా రూ. 1,59,750లతో పాటు 20 వేల విలువైన 90 బస్తాల సిమెంట్ లభిస్తుంది.

మొత్తం లక్షా 80 వేల రూపాయిలు లబ్ధిదారుడికి ప్రభుత్వ సాయంగా అందుతుంది. ఈ మోడల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 వేల కాలనీలను ఏపీ ప్రభుత్వం నిర్మించనుంది. తొలి దఫాలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను నిర్మిస్తుంది.

అలాగే 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' (ఇందులో భాగమే వైఎస్సార్‌ జగనన్న కాలనీలు) కార్యక్రమంలో జూన్ 2023 నాటికి రెండు దశల్లో 28,30,227 ఇళ్లను నిర్మిస్తుంది. ఇందు కోసం రూ. 50,994 కోట్లు ఖర్చు చేయనుంది.

ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్నది తన కల అన్నారు జగన్
ఫొటో క్యాప్షన్, ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్నది తన కల అన్నారు జగన్

’అవినీతి ఉండకూడదు...నాణ్యత తగ్గకూడదు‘

''పేదలందరికీ ఇళ్లు పథకం''పై వారం కిందట సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్లు, వాటి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ మొదలైన వివరాలను అధికారులు సీఎం జగన్‌కు అందచేశారు. రాష్ట్రంలో 3.03 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు.

జులై 10కల్లా మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతాయని, జూన్‌ 2022 నాటికల్లా మొదటి విడత ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగలమని అధికారులు సీఎంకు తెలిపారు.

''రాష్ట్రంలో పేదలందరికి ఇల్లు అనేది నా కల. దీనికి అంతా సహకరించి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయాలి. నాణ్యతపై ఫిర్యాదులు, సలహాలకు ఒక ప్రత్యేక నెంబరు ఏర్పాటు చేసి...దాని ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలి" అని సమీక్షా సమావేశంలో సీఎం అధికారులను ఆదేశించారు.

ఒకే ఇళ్ల పథకానికి పదే పదే శంకుస్థాపనలు చేస్తున్నారని ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేసింది.
ఫొటో క్యాప్షన్, ఒకే ఇళ్ల పథకానికి పదే పదే శంకుస్థాపనలు చేస్తున్నారని ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేసింది.

టిడ్కో ఇళ్లు ఏమయ్యాయి...

బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గతంలోనే టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందించాలన్న నిర్ణయానికి కేబినేట్ ఆమోదం లభించింది.

కేంద్ర, రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) సంయుక్తంగా 88 మున్సిపాలిటీల పరిధిలో జీ+3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించారు. ఇవి గత టీడీపీ ప్రభుత్వంలో జరిగాయి.

అయితే రాజకీయ కారణాలతో ప్రభుత్వం ఈ ఇళ్లను ఇవ్వకుండా... తాము కట్టిస్తున్న ఇళ్ల కోసం భారీ ప్రచారం చేసుకుంటుందని టీడీపీ నాయకులు అంటున్నారు.

"పట్టణ పేదల కోసం కేంద్రం 7,58,788 గృహాలను (టౌన్ షిప్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్-టిడ్కో) గత ప్రభుత్వ హయాంలో ఏపీకి మంజూరు చేసింది. అవన్నీ గృహ ప్రవేశాలకు సిద్ధమైన దశల్లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం రాగానే పేర్లు సైతం మార్చేసింది. టీడీపీ హయాంలో ఈ హౌసింగ్‌ కాలనీలకు ఎన్టీఆర్‌ నగర్‌ అని పేరు పెట్టగా, వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌ నగర్‌లుగా మార్చింది’’ అని టీడీపీ సీనియర్ నేత సీహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు.

ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చింది.
ఫొటో క్యాప్షన్, ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇచ్చింది.

‘ఒకే పథకానికి ఎన్ని ప్రారంభోత్సవాలు ?‘

‘‘ఒకే పథకాన్ని పదే పదే ప్రారంభించడం ఎందుకో కూడా అర్థం కావడం లేదు. పైగా ఒకసారి ఇళ్ల పట్టాల పేరుతో, మరోసారి ఆ స్థలాల్లో శంకుస్థాపన పేరుతో, ఇంకోసారి ఇళ్ల నిర్మాణాల పేరుతో ప్రారంభోత్సవాలు, వర్చువల్ ఓపెనింగులు చేయడం చూస్తుంటే తమ కార్యక్రమాలకు డప్పుకొట్టుకుని ప్రచారం చేసుకోవడం తప్ప మరొకటి కనిపించడం లేదు’’ అన్నారు టీడీపీ నేత బండారు సత్యనారాయణ.

’వసతులు లేవు...నిర్మాణాలు అరకొర‘

టీడీపీ హాయంలో నిర్మించిన టిడ్కో ఇళ్లలో చాలా వరకు వసతులు లేవని, అవన్నీ కూడా అరకొర కట్టడాలేనని వైసీపీ నాయకులు అంటున్నారు. టిడ్కో ఇల్లు ఇవ్వడానికి టీడీపీ డబ్బులు కట్టించుకుందని, కానీ మా ప్రభుత్వం ఒక్క రూపాయికే వాటిని ఇస్తుందని చెప్పారు.

‘‘ప్రస్తుతం 2 లక్షల 62 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి మంత్రి వర్గం కూడా అమోదించింది. వాటిని పూర్తి సౌకర్యాలతో కట్టి లబ్ధిదారులకు అందిస్తాం’’ అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.

"గత ఆగస్టులో టిడ్కో గృహాలపై సర్వే చేస్తే...వాటిలోని వసతుల లేమీ, నాణ్యత లోపాలు బయటపడ్డాయి. అదే సమయంలో ఈ క్రమంలో 25,080 ఇళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. దాంతో డబ్బులు కట్టిన వారిలో మూడు వేల మందిని పక్కనపెట్టాల్సి వచ్చింది. వారికి వైస్సార్ జగనన్న కాలనీలలో ఇల్లు ఇస్తున్నాం’’ అని అమర్‌నాథ్ బీబీసీతో చెప్పారు.

ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లలో కొన్ని ఇబ్బందులున్నాయని లబ్ధిదారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, CMO Andhra Pradesh/twitter

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లలో కొన్ని ఇబ్బందులున్నాయని లబ్ధిదారులు అంటున్నారు.

సమస్యలున్నాయి...

ప్రభుత్వం నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు వైసీపీ మంత్రులు, నేతలు. వాస్తవానికి నిర్మాణం జరుపుకుంటున్న ఇల్లు, అవి కడుతున్న ప్రాంతాలపై లబ్ధిదారుల నుంచే ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.

సొంత పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైతం బెడ్ రూం చాలా చిన్నదిగా ఉందని...పెళ్లైన వారికి ఇబ్బందేనని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీలపై బీబీసీ అక్కడ లబ్ధిదారులతో మాట్లాడింది.

"శ్రీకాకుళం జిల్లాలోని పాత్రుని వలసలో సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలు శ్రీకాకుళానికి చాలా దూరంగా ఉన్నాయి. వీటి లబ్ధిదారులు చాలా మంది కూలీలే. అక్కడ నిర్మిస్తున్న ఇళ్ల పర్యవేక్షణకు వెళ్లాలంటే కూలీ పనులు మానుకోవాలి. పైగా అక్కడ ఇల్లు నిర్మించినా...అక్కడ నుంచి కూలీ పనులకు వెళ్లడమంటే చాలా దూరమే అవుతుంది. అలాగే కొందరు లబ్దిదారులకు మ్యాపింగ్, జియో ట్యాగింగ్ అవ్వలేదు. దీంతో వాళ్ల స్థలమెక్కడుందో తెలియకుండా...ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి‘‘ అని కొందరు లబ్ధిదారులు ప్రశ్నించారు.

అలాగే కోడూరు, మగతపాడు గ్రామస్తులకు కోడూరు గ్రామానికి కిలోమీటరు దూరాన జీడి తోటల్లో... గొల్లల వలస, ఎస్‌ఎల్‌పురం వారికి తోటాడ కొండల ప్రాంతంలో స్థలాలు ఇచ్చారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.

కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, నీటి సదుపాయం అందుబాటులో లేదు.

పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లలో మూడో దానికే ఎక్కువమంది సై అన్నారు. అంటే ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుని ఇల్లు నిర్మించడం. అయితే ఈ ఆప్షన్‌ను రెండో అప్షనుగా మార్చేందుకు అధికారులు లబ్ధిదారులతో మాట్లాడుతున్నారు.

రెండో అప్షను ప్రకారం ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి సామాగ్రి సహాయం చేస్తుంది. ఇంటి నిర్మాణం చేపట్టకపోతే స్థలాలు రద్దయ్యే అవకాశం కూడా ఉందని 'హింట్' ఇచ్చి మరీ తమని ఆప్షన్ మార్చుకునేట్లు చేస్తున్నారని కొందరు లబ్ధిదారులు చెప్పారు.

వైఎస్సార్-జగనన్న కాలనీలపై వస్తున్న విమర్శలు, ప్రజల వినతులపై రాష్ట్ర స్థాయి అధికారులను బీబీసీ సంప్రదించడానికి ప్రయత్నించగా...మెగా గ్రౌండింగ్ కార్యక్రమంలో అంతా బీజీగా ఉన్నామని చాలామంది నుంచి సమాధానం వచ్చింది.

"త్వరలోనే అన్నీ అందుబాటులోకి వస్తాయి. జనావాసాలకు బాగా దూరంలో ఉన్నవి, పెద్ద లేఅవుట్లలో షెడ్ల వంటి తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నాం. అయితే ముందుగా లబ్ధిదారులు మాత్రం తమ ఇళ్ల స్థలాల వద్దకు వచ్చి మ్యాపింగ్, జియో ట్యాగింగ్ వంటి అంశాలను పరిశీలించుకోవాలి. తద్వారా ఒక్కో సమస్యను పరిష్కరించవచ్చు" అని శ్రీకాకుళం జిల్లా గృహనిర్మాణ సంస్థ పీడీ టి. వేణుగోపాల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)