ఆంధ్రప్రదేశ్: అధికార పార్టీ నేతలపై ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోవచ్చా... చట్టం ఏం చెబుతోంది?

ముఖ్యమంత్రి జగన్‌ పై నమోదైన కేసుల ఉపసంహరణ అంశంపై హైకోర్టు జోక్యం చేసుకుంది.

ఫొటో సోర్స్, YS JAGAN/FB

ఫొటో క్యాప్షన్, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఉన్న కేసుల ఉపసంహరణ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. కేసులు ఎత్తివేసిన తీరు చట్టబద్ధంగా లేదనే ఫిర్యాదులతో ఏపీ హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఏపీ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఇతర నేతల కేసుల సంగతి కూడా చర్చనీయాంశంగా మారింది.

ఏపార్టీ అధికారంలోకి వస్తే ఆయా పార్టీ నేతల కేసులను ఉపసంహరిస్తున్న తీరు చాలకాలంగా ఆనవాయితీగా వస్తోంది. అందులో హత్యలు, అత్యాచారాలు సహా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన అభియోగాలతో కూడిన కేసులు కూడా ఉంటున్నాయి.

ఇటీవల కాలంలో నేతలు పదే పదే చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న సమయంలో విపక్షాల వారిపై కేసుల నమోదు జోరుగా సాగుతోంది. పాలకపక్ష నేతలయితే, పోలీసులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఇటీవల కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని పెట్టిన కేసుల్లో అధికార, విపక్ష పార్టీల నేతల పట్ల చూపిన వైరుధ్యం దానికి నిదర్శనంగా భావించవచ్చు.

కేసులు ఎత్తివేత, ప్రాసిక్యూషన్ ఉపసంహరణ విషయాల్లో ఫిర్యాదు చేసిన వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, HTTP://HC.AP.NIC.IN/

ఫొటో క్యాప్షన్, ఏపీ హైకోర్టు

ఉపసంహరించిన జగన్ కేసులేంటి?

సుమారు ఏడేళ్ళ పాటు జగన్ విపక్షం హోదాలో ఉన్నారు. ఆ కాలంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ సమయంలో పలు కేసులు నమోదయ్యాయి. 2019 ఎన్నికల సందర్భంగా పులివెందుల శాసనసభా స్థానానికి పోటీ చేసిన వైఎస్ జగన్ ఎన్నికల అఫిడవిట్‌లో మొత్తం 38 కేసులు ఆయనపై ఉన్నట్టు పేర్కొన్నారు.

అందులో ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులతో పాటుగా ఐపీసీ సెక్షన్ 353 వంటివి కూడా నమోదయ్యాయి. ఈ కేసుల్లో అనంతపురం, గుంటూరు జిల్లాల పరిధిలో నమోదయిన మొత్తం 11 కేసులను గత ఏడాది మార్చిలో ఉపసంహరించుకున్నారు.

వాటిలో 6 కేసులను ఇప్పుడు ఏపీ హైకోర్టు సుమోటోగా విచారణ పరిధిలోకి తీసుకుంది. అవి 2016లోనే నమోదు కావడం విశేషం.

రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన చేసిన ప్రసంగాల మీద వచ్చిన ఫిర్యాదులతో ఈ కేసులు నమోదయ్యాయి. యాడికి, నల్లచెరువు, పెదవడగూరు,అనంతంపురం టూటౌన్, పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్లలో నమోదయిన కేసులు వాటిలో ఉన్నాయి.

వాటికి ముందే 2016 మార్చి 3న మంగళగిరి రూరల్ పీఎస్‌లో నమోదయిన కేసు కూడా ఉపసంహరించిన వాటిలో ఉంది. రైతు దీక్ష సందర్భంగా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా ప్రసంగించారంటూ వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.

పులివెందుల పీఎస్‌లో 2011లో నమోదైన ఎఫ్ఐఆర్ నెం. 137/2011 ప్రకారం మారణాయుధాలు కలిగి, అల్లర్లకు పాల్పడ్డారంటూ ఉన్న అభియోగాలతో కూడిన కేసు కూడా తాజాగా ఉపసంహరించిన వాటిలో ఉంది.

ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నందిగామ వద్ద నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదం బాధితులు పరామర్శించిన సమయంలో నాటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుతో వాగ్వాదం అనంతరం సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ నమోదయిన కేసు కూడా ఉపసంహరించారు.

ఇక గుంటూరు జిల్లా నర్సారావుపేట, చిలకలూరిపేటలో నమోదయిన కేసులు కూడా తాజాగా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

జగన్

ఫొటో సోర్స్, IANDPR

ఉపసంహరణకు కారణాలేంటి?

తప్పుడు కేసులనే పేరుతో ఎక్కువ కేసుల్లో ఉపసంహరణ జరిగింది. మిస్టేక్ ఆఫ్ లా, యాక్షన్ డ్రాప్డ్, ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ వంటి కారణాలు కూడా చూపించారు. నందిగామ కేసుని మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్స్‌గా పేర్కొన్నారు.

జగన్ విపక్షంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం తప్పుడు కేసులతో వేధిస్తోందని పదే పదే విమర్శించేవారు. దానికి అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోగానే ఈ కేసులను ఆధారం లేని, తప్పుడు కేసులుగా పేర్కొంటూ ఉపసంహరణకు సిద్ధపడ్డారు.

కొన్ని కేసుల్లో జీవో విడుదల చేసి కేసులు కొట్టివేయగా, మరికొన్ని కేసుల్లో ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లే కేసులు ఉపసంహరించుకున్నారు. దాంతో ఆయా కేసులు కొట్టేస్తూ మెజిస్ట్రేట్లు తీర్పులిచ్చారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

రాజకీయ నేతల కేసులు అధికారం ఆధారంగా ఉపసంహరణ జరుగుతున్న తీరు పట్ల కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించాలని ఆదేశించింది.

ఐపీసీ సెక్షన్ 321 ప్రకారం ఏ కేసునయినా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ ముగించే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వయంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది

కేసులు ఎత్తివేత, ప్రాసిక్యూషన్ ఉపసంహరణ విషయాల్లో ఫిర్యాదు చేసిన వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

కేసుల ఉపసంహరణ విషయంలో తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఫొటో సోర్స్, SajjalaOfficial

ఫొటో క్యాప్షన్, సజ్జల రామకృష్ణా రెడ్డి

అదంతా దుష్ప్రచారమే...

ముఖ్యమంత్రిపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని, వాటిని ఉపసంహరించడమే నేరమన్నట్టుగా ఓ వర్గం చిత్రీకరిస్తోందని వైఎస్సార్సీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. కేసుల విచారణ వేగవంతంగా పూర్తి చేసి వాటిని కొట్టివేస్తే నేరమా అని ఆయన ప్రశ్నించారు.

"బస్సు ప్రమాదంలో బాధితుల కోసం నిలబడితే కేసులు పెట్టారు. అమరావతి రైతుల నోట్లో మట్టికొట్టారని అంటే అది నేరంగా చెబుతూ కేసులు పెట్టారు. అలాంటి కేసుల్లో విచారణ పూర్తి చేస్తే తప్పా? " అన్నారు సజ్జల.

"టీడీపీ హయంలో మా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టి బెదిరించి పార్టీ మారిన తర్వాత వాటిని ఉపసంహరించిన విషయం మరచిపోయారా? ప్రజల పక్షాన నిలబడి పోరాడిన సమయంలో కేసులు పెట్టిన చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ గతంలో తాను చేసిన తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అంతా నిబంధనల ప్రకారం చేసింది" అని ఆయన అన్నారు.

చంద్రబాబు హయాంలో కూడా టీడీపీ నేతలపై నమోదైన కేసుల ఉపసంహరణ జరిగింది.

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్, నారా చంద్రబాబు నాయుడు

చంద్రబాబు హయంలోనూ కేసులు ఉపసంహరణ

గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతల మీద కూడా కేసులు ఉపసంహరించుకున్నారు. అందులో కూడా సీరియస్ కేసులున్నాయి. హత్యలు, అత్యాచారాల వంటి అభియోగాలతో కూడా కేసులు కూడా ఉన్నాయి.

దివంగత అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ సహా నాటి మంత్రులు, ఇతర నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

2012లో కర్నూలు ఎన్నికల ప్రచారంలో నిబంధనలు పాటించకపోవడంతో చంద్రబాబు మీద నమోదయిన కేసు కూడా ఆయన సీఎం అయిన తర్వాతే రద్దయ్యింది.

అప్పట్లో 21 జీవోలను ఆయా కేసుల ఉపసంహరణ కోసం విడుదల చేశారు. మరికొన్ని కేసుల్లో విచారణ అర్థాంతరంగా ముగించారు.

అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్సార్, ఎన్టీఆర్ వంటి నేతల పాలనలోనూ ఇలా రాజకీయ కేసుల ఉపసంహరణ జరిగింది. జగన్ హయంలో కూడా ఆయనతో పాటుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు నేతలకు సంబంధించిన కేసులను కొట్టేశారు.

ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆయా పార్టీ నేతల కేసులను ఉపసంహరించడం ఆనవాయితీగా వస్తోంది.
ఫొటో క్యాప్షన్, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆయా పార్టీ నేతల కేసులను ఉపసంహరించడం ఆనవాయితీగా వస్తోంది.

విచారణ జరగడం మంచిదే

రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన కేసుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు.

"జగన్ కేసుల ఉపసంహరణ విషయంలో అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదిక ప్రకారం విచారణ జరగడం మంచిది. వివిధ పార్టీల నేతల కేసులు చర్చకు వస్తున్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్టు ఫిర్యాదులు రావడంతోనే హైకోర్టు జోక్యం చేసుకుంది. గత ఏడాది కరోనా సమయంలో కూడా జగన్ కి సంబంధించిన 11 కేసులు ఉపసంహరించుకోవడం ఆశ్చర్యంగా ఉంది.’’ అని ఆయన అన్నారు.

అత్యవసర కేసులు మాత్రమే విచారించాల్సిన సమయంలో ఇలాంటి నిర్ణయాలు ఎలా జరిగాయన్నది తేలాలని, భవిష్యత్తులో కేసుల విషయంలో ప్రభుత్వాలు న్యాయపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు చర్యలు అవసరమని సుబ్బారావు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)