అజర్‌బైజాన్-అర్మేనియా యుద్ధం: ఇది ప్రాంతీయ యుద్ధంగా చెలరేగే ముప్పుంది - ఇరాన్ హెచ్చరిక : BBC Newsreel

హసన్ రౌహానీ

ఫొటో సోర్స్, Getty Images

నగార్నో-కరాబక్ ప్రాంతంలో అజర్‌బైజాన్, అర్మేనియాల మధ్య జరుగుతున్న యుద్ధం ఒక ప్రాంతీయ యుద్ధంగా చెలరేగే ముప్పుందని ఇరాన్ హెచ్చరించింది.

భారీ కాల్పుల నడుమ వివాదాస్పద నగార్నో-కరాబక్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆకాంక్షించారు.

ఈ ప్రాంతం అధికారికంగా అజర్‌బైజాన్‌లో భాగం. కానీ ప్రస్తుతం ఇది అర్మేనియా తెగల ఆధీనంలో ఉంది.

తాజా యుద్ధం.. దశాబ్దాల కాలంలో ఎన్నడూ ఎరుగనిది. హింసకు పొరుగు దేశమే కారణమని రెండు దేశాలూ ఆరోపిస్తున్నాయి.

''పొరుగునున్న అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రాంతీయ యుద్ధంగా మారిపోకుండా మనం జాగ్రత్త పడాలి''అని బుధవారం రౌహానీ వ్యాఖ్యానించారు.

''శాంతి కోసం మేం కృషి చేస్తున్నాం. త్వరలో ఇక్కడ శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నాం''

నగార్నో-కరాబక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నగార్నో-కరాబక్‌లో విధ్వంసం

ఇరాన్ గడ్డపై క్షిపణులు లేదా తూటాలు పడితే సహించేదిలేదని ఆయన తెగేసి చెప్పారు.

అర్మేనియా, అజర్‌బైజాన్‌కు సరిహద్దుల్లోని ఉత్తర ఇరాన్ గ్రామాల్లోకి కొన్ని తూటాలు దూసుకొచ్చాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.

''మన నగరాలు, గ్రామాల భద్రతకు మేం చాలా ప్రాధాన్యమిస్తాం''

సరిహద్దుల్లో యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో తమ బలగాలను మోహరించి ఉంచామని ఇరాన్ సరిహద్దు బలగాల కమాండర్ ఖాసిం రెజాయి వ్యాఖ్యానించారు.

''ఈ ఘర్షణ మొదలైనప్పటి నుంచీ కొన్ని రాకెట్లు, తూటాలు ఇరాన్‌లోకి దూసుకొచ్చాయి''అని ఆయన తస్‌నీమ్ వార్తా సంస్థతో చెప్పారు.

''సరిహద్దుల్లో చాలా అప్రమత్తంగా ఉన్నాం. తగిన ఏర్పాట్లు, మోహరింపులు చేశాం. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం''

షాహీన్‌ బాగ్: బహిరంగ ప్రదేశాల్లో నిరవధిక నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదన్న సుప్రీంకోర్టు

షహీన్ బాగ్

ఫొటో సోర్స్, ANADOLU AGENCY

బహిరంగ ప్రదేశాల్లో నిరవధికంగా నిరసన ప్రదర్శనలు జరపడానికి వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. దిల్లీలోని షాహీన్ బాగ్‌లో నెలల తరబడి జరిగిన నిరసనలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం నాడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్‌లో దీర్ఘకాలంగా కొనసాగిన నిరసనలపై పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దిల్లీ, నోయిడాలను కలిపే ఒక ముఖ్య రహదారిలో నిరసనకారులు బైఠాయించడంతో, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.

ఈ అంశంపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

శాంతియుతంగా నిరసనలు చేయవచ్చునని, అయితే, నిరసన ప్రదర్శనలు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని ధర్మాసనం చెప్పింది.

నిరసన ప్రదర్శనల వలన సామాన్య ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, అక్కడినుంచి నిరసనకారులను తొలగించాలని కోరుతూ అమిత్ సాహ్నీ, శశాంక్ దేవ్ సుధీ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే, మొదట్లో ఈ అంశంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.

మొదట సుప్రీం కోర్టు.. నిరసనకారులతో మాట్లాడి తమ ప్రదర్శనలను వేరేచోటుకి తరలించేట్లు ఒప్పించడానికి.. సంజయ్ హెగ్డే, సాధనా రామచంద్రన్, వజాహత్ హబీబుల్లాలను మధ్యవర్తులుగా నియమించింది. ఫిబ్రవరిలో ఈ మధ్యవర్తుల బృందం తమ రిపోర్టును సమర్పించింది.

డిసెంబర్ 15 నుంచి కొన్ని నెలల పాటు షాహీన్ బాగ్‌లో నిరసనలు కొనసాగాయి. వీటిలో ఎక్కువ శాతం మహిళలు పాలుపంచుకున్నారు. సీఏఏ చట్టాన్ని తొలగించేవరకూ నిరసనలు ఆపబోమని వారంతా తెలిపారు.

రియా చక్రవర్తి

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

సినీ నటి రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి మాదక ద్రవ్యాల వినియోగం కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సెప్టెంబర్ 8న ముంబైలో అరెస్ట్ చేసింది.

సుశాంత్ స్నేహితురాలైన రియా చక్రవర్తి సోదరుడు శోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ మేనేజర్‌ శామ్యూల్ మిరాందాలను కూడా ఎన్ఐఏ అంతకుముందే అరెస్ట్ చేసింది.

ఈ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు.. ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తి బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

సుశాంత్ మృతి కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో మాదక ద్రవ్యాల వ్యాపారం విషయంలో కొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఎన్‌సీబీ కేసు దర్యాప్తు ప్రారంభించింది.

ఈ కేసులో లింకులను జోడిస్తూ వెళ్లిన ఎన్‌సీబీ మొదట డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి కొంతమందిని విచారించింది. కొందరిని అదుపులోకి తీసుకున్నారని కూడా సమాచారం.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తు మూడు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు చేస్తున్నాయి.

డబ్బుల లావాదేవీలను ఈడీ, మృతి కేసును సీబీఐ, మాదకద్రవ్యాలకు సంబంధించిన కసును ఎన్‌సీబీ దర్యాప్తు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)