అమెరికా ఎన్నికలు 2020: ‘‘అధ్యక్ష ఎన్నికల్లో నేను ఓడిపోతే ఒప్పుకోను.. సుప్రీంకోర్టుకు వెళతా’’ - డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA
నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో తను ఓటమిపాలైతే శాంతియుత అధికార బదిలీకి కట్టుబడి ఉండడానికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నిరాకరించారు.
“ఏం జరుగుతుందో మనం చూడాల్సుంటుంది. అదేంటో మీకు తెలుసు” అని వైట్‌హౌస్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
పోస్టల్ ఓటింగ్ మీద తనకు సందేహాలు ఉండడంతో, ఎన్నికల ఫలితాలు చివరికి అమెరికా సుప్రీంకోర్టుకు కూడా చేరవచ్చని తను భావిస్తున్నట్లు కూడా ట్రంప్ చెప్పారు.
కరోనా మహమ్మారి వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎక్కువ రాష్ట్రాలు పోస్టల్ ఓటింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి.
ట్రంప్ ఏమన్నారు?
“డెమాక్రాట్ అభ్యర్థి జో బైడెన్ గెలిస్తే మీరు శాంతియుత అధికార బదిలీకి కట్టుబడి ఉంటారా?” అని బుధవారం సాయంత్రం ఒక విలేకరి ట్రంప్‌ను అడిగారు.
“నేను బ్యాలెట్ గురించి చాలా గట్టిగా ఫిర్యాదు చేస్తున్నాను. బాలెట్స్ ఒక విపత్తు లాంటిది” అని ట్రంప్ సమాధానం ఇచ్చారు.
“జనం ఆందోళనలకు దిగుతున్నారు కదా” అని జర్నలిస్ట్ ట్రంప్‌ను ప్రశ్నించినపుడు, ఆయన “బాలెట్స్ వదిలించుకుందాం. మీకు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్పు ఉండదు. నిజం.. కొనసాగింపు ఉంటుంది” అన్నారు.
2016లో డెమాక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌తో పోటీపడినప్పుడు కూడా ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి ట్రంప్ నిరాకరించారు. దానిని ఆమె అమెరికా ప్రజాస్వామ్యంపై దాడిగా వర్ణించారు.
ఆ ఎన్నికల్లో 30 లక్షలకు పైగా ఓట్లను కోల్పోయినప్పటికీ, ఆయన చివరికి విజేతగా నిలిచారు. ఆ ఫలితాలపై ట్రంప్‌కు ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి.

డెమాక్రాట్లు ఏమంటున్నారు?
ఈసారీ “ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించవద్ద”ని హిల్లరీ క్లింటన్ గత నెల జో బైడెన్‌ను కోరారు.
పోల్ కాని ఓట్లతో రిపబ్లికన్లు గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తారని, ఫలితాలను సవాలు చేసేందుకు తమ లాయర్ల సైన్యాన్ని మోహరిస్తారని ఆమె ఆరోపించారు.
“ట్రంప్ తిరిగి ఎన్నికైతే అమెరికాలో హింస తక్కువగా ఉంటుందని ఎవరైనా నమ్ముతున్నారా?” అని ఆగస్టులో చేసిన వ్యాఖ్యలతో జో బైడెన్ ఎన్నికలకు ముందు అశాంతి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని కన్జర్వేటివ్స్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు గురించి ట్రంప్ ఏం చెప్పారు?
రూత్ బాడెర్‌గిన్స్ బర్గ్ మృతితో ఖాళీ అయిన సుప్రీంకోర్ట్ జస్టిస్ స్థానాన్ని ఎన్నికల లోపు భర్తీ చేయాలనే తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు సమర్థించుకున్నారు. ఎన్నికల ఫలితాలు చివరికి కోర్టు ముందుకు వస్తాయని తనకు అనిపిస్తోందని ఆయన బుధవారం చెప్పారు.
“ఇది చివరికి సుప్రీంకోర్టుకు చేరుతుందని నాకు అనిపిస్తోంది. మనకు 9 మంది జస్టిస్‌లు ఉండడం చాలా ముఖ్యం” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
“మనం ఎన్నికలకు ముందే కోర్టుకు వెళ్లడం మంచిది. ఎందుకంటే డెమాక్రట్లు చేస్తున్నది ఒక కుంభకోణంలా నాకు అనిపిస్తోంది. ఇది స్కాం, ఈ కుంభకోణం అమెరికా సుప్రీంకోర్టు ముందు ఉంటుంది” అని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ వల్ల మోసాలు జరిగే అవకాశం ఉందనే తన వివాదాస్పద వ్యాఖ్యలను ట్రంప్ మళ్లీ ప్రస్తావించారు.
గత శనివారం మరణించిన జస్టిస్ గిన్స్‌బర్గ్ స్థానంలో వచ్చే శనివారం ఒక మహిళ పేరును నామినేట్ చేస్తానని అధ్యక్షుడు చెప్పారు.
దీనిని అమెరికా సెనేట్ ధ్రువీకరిస్తే, భవిష్యత్తులో దేశ అత్యున్నత న్యాయస్థానంలో సంప్రదాయవాదుల ప్రాబల్యం 6-3 నిష్పత్తితో బలంగా ఉంటుందని ట్రంప్ మద్దతుదారులు భావిస్తున్నారు.
గతంలో చాలాసార్లు పోటాపోటీగా ఎన్నికలు జరిగినప్పటికీ ఓటమి పాలైన అమెరికా అధ్యక్ష అభ్యర్థులు అందరూ దానిని అంగీకరిస్తూ వచ్చారు.
1960లో జాన్.ఎఫ్.కెనెడీ, రిచర్డ్ నిక్సన్ మీద స్వల్ప తేడాతో గెలవడం, 2000లో జార్జి డబ్ల్యు బుష్ ఫ్లోరిడాలో అల్ గోర్‌ను ఓడించడం ఇందులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పోస్టల్ బ్యాలెట్‌లో మోసాలు జరుగుతాయా?
కరోనావైరస్‌తో ప్రజల్లో ఆందోళన ఉండడంతో ఈసారీ పోస్టల్ ఓట్లు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు.
కానీ పోస్టల్ బ్యాలెట్ వల్ల మోసాలు జరుగుతాయనే కుట్ర సిద్ధాంతాలకు ఎలాంటి ఆధారాలూ లేవని దేశ ఎన్నికల కమిషనర్ ఎలెన్ వీన్‌ట్రాబ్ అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ వల్ల మోసాలు జరిగినట్లు 2018లో ఉత్తర కరోలినాలో, న్యూజెర్సీలో కొన్ని ఘటనలు బయటపడ్డాయి.
కానీ 2017లో బ్రెన్నన్ సెంటర్ ఫర్ జస్టిస్ చేసిన ఒక అద్యయనంలో అమెరికాలో ఓటింగ్ మోసాలు ఓవరాల్‌గా 0.00004 శాతం నుంచి 0.0009 శాతం మధ్య ఉండవచ్చని తేలింది.
పోస్టల్ ఓట్లు ఎక్కువగా గల్లంతవుతుంటాయని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ రాజకీయ శాస్త్రవేత్త చార్లెస్ స్టీవర్ట్ పరిశోధనలో వెల్లడైంది.
2008 ఎన్నికల్లో గల్లంతైన పోస్టల్ ఓట్లు 76 లక్షలకు పైగా ఉండవచ్చని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసిన ప్రతి ఐదుగురిలో ఒకరి ఓటు గల్లంతయి ఉండవచ్చని ఆయన లెక్కించారు.
ఇవి కూడా చదవండి:
- ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?
- మోదీకి మీడియా అంటే భయమా? ఇంటర్వ్యూల్లో ఆయన తీరు ఎలా ఉంటుంది?
- ‘నరేంద్ర మోదీ తరంగాలు’: విద్యావేత్తల వ్యాఖ్యలపై శాస్త్రవేత్తల అసహనం
- జీడీపీ వృద్ధిరేటులో పతనం మొదలైతే ఏం జరుగుతుంది
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- చైనా వెళ్లిన ఇంటర్‌పోల్ చీఫ్ ఏమయ్యారంటే..
- ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








