కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు. ఈ పదవికి పోటీ చేస్తున్న తొలి నల్లజాతి మహిళ, ఆసియా అమెరికన్ ఆమెనే కావడం విశేషం.
తనతోపాటు కమల బరిలోకి దిగుతున్నట్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ బిడెన్ తెలిపారు.
భారతీయ-జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా కొనసాగుతున్నారు. ఇదివరకు ఆమె అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డారు.
ప్రస్తుతం ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమె నిలవబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గానూ పనిచశారు.
అమెరికా వ్యాప్తంగా నల్లజాతి నిరసనలు జరిగేటప్పుడు పోలీసులు నిగ్రహంతో ఉండాలని ఆమె అభ్యర్థించారు.
నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి అయిన డోనల్డ్ ట్రంప్‌తో బిడెన్ తలపడనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కమలా హ్యారిస్ అసలు తమకు పోటీనే కాదంటూ వైట్‌హౌస్ న్యూస్ కాన్ఫెరెన్స్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు.
అక్టోబరు 7న ఉటాలోని సాల్ట్ లేక్ సిటీలో ప్రస్తుత ఉపాధ్యక్షుడు, ట్రంప్‌తోపాటు ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న మైక్ పెన్స్‌తో కమలా డిబేట్‌కు దిగబోతున్నారు.
ఇప్పటివరకు కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఉపాధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఎన్నికల్లో బరిలోకి దిగారు.
2008లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా సారా పాలిన్, 1984లో డెమొక్రటిక్ అభ్యర్థిగా గెరాల్డైన్ ఫెరారో పోటీచేశారు. అయితే వీరిద్దరూ విజయం సాధించలేదు.
నల్లజాతి మహిళలకు ఇప్పటివరకు రెండు పార్టీలూ అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ టికెట్ ఇవ్వలేదు.
మరోవైపు ఇప్పటివరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా మహిళలు గెలవలేదు.

ఫొటో సోర్స్, EPA
బిడెన్ ఏమంటున్నారు?
కమలా హ్యారిస్ తనతో కలిసి పోటీ చేయడంతో గర్వకారణమని బిడెన్ ట్వీట్ చేశారు. ''ఎలాంటి బెరుకూ లేకుండా పోరాటే యోధురాలు ఆమె. దేశంలోని అత్యుత్తమ ప్రజా సేవకురాల్లో ఆమె కూడా ఒకరు'' అని ప్రశంసించారు.
కాలిఫోర్నియా అటార్నీ జనరగల్‌గా ఉండేటప్పుడు ఆమె తన కుమారుడు బ్యూతో కలిసి పనిచేశారని ఆయన గుర్తుచేశారు. ''మహిళలు, పిల్లలు వేధింపుల బారిన పడకుండా వారు కృషిచేశారు. కార్మికుల కోసం పాటుపడ్డారు. నాకు అప్పుడు చాలా గర్వంగా అనిపించేది. ఆమె ఇప్పుడు నాతో కలిసి పోటీ చేయడం గర్వంగా అనిపిస్తోంది'' అని చెప్పారు. అమెరికా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగల సత్తా బిడెన్‌కు ఉందని హ్యారిస్ ట్వీట్ చేశారు. ''ఆయన జీవితమంతా మన కోసమే పోరాడారు. ఓ అధ్యక్షుడిగా అత్యుత్తమ విలువలకు అద్దంపట్టేలా అమెరికాను ఆయన పునర్నిర్మించగలరు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆయనతో కలిసి పోటీ చేయడం నాకు గర్వ కారణం. ఆయన మాకు కమాండర్-ఇన్-చీఫ్ లాంటివారు'' అని కమల పేర్కొన్నారు.
విల్మింగ్‌టన్, డెలావేర్‌లలో బుధవారం బిడెన్, హ్యారిస్ కలిసి ప్రచారం చేపట్టబోతున్నట్లు డెమొక్రటిక్ పార్టీ తెలిపింది. ''అమెరికా అంతరాత్మకు పునరుజ్జీవం పోయడం, దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో కార్మికులతో కలిసి నడవడం'' అంశంపై వారు మాట్లాడనున్నట్లు పేర్కొంది.
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓ మహిళకు అవకాశం ఇస్తామని మార్చిలోనే బిడెన్ చెప్పారు. ఆఫ్రికా అమెరికన్లపై పోలీసుల అరాచకాలపై ఇటీవలదేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగిన అనంతరం నల్లజాతి మహిళను ఉపాధ్యక్ష అభర్థిగా ఎంచుకోవాలని ఆయనకు సలహాదారులు సూచించారు.
డెమొక్రటిక్ పార్టీ ఓటు బ్యాంకులో ఆఫ్రికన్ అమెరికన్లు భారీగానే ఉంటారు.

కమలా హ్యారిస్ ఎవరు?
ప్రస్తుతం 55 ఏళ్ల వయసున్న కమలా డెమొక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డారు. అయితే డిసెంబరులో ఆమె తన అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకున్నారు.
ప్రాథమిక ఎన్నికల చర్చల్లో ఆమె పదేపదే బిడెన్‌ను విమర్శిస్తూ వచ్చారు. జాతి విద్వేష వ్యాఖ్యలుచేసే మాజీ సెనేటర్లతో బిడెన్‌కు ఉండే సంబంధాలపై ఆమె ధ్వజమెత్తారు. కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో వలసదారులకు కమల జన్మించారు. ఆమె తల్లి భారత్‌లో, తండ్రి జమైకాలో జన్మించారు.
కమల హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికాలో నల్లజాతీయులు ఎక్కువగా చదువుకునే యూనివర్సిటీల్లో ఇది కూడా ఒకటి. తన జీవితంపై ఎక్కువగా ప్రభావితం చూపిన అనుభవాల్లో కాలేజీ జీవితమూ ఒకటని ఆమె చెబుతుంటారు.
తన గుర్తింపుతో తనకు ఎలాంటి సమస్యాలేదని హ్యారిస్ చెబుతుంటారు. తనను తాను అమెరికన్‌గా ఆమె చెబుతుంటారు.

ఫొటో సోర్స్, ADAM SCHULTZ
కమలానే ఎంపిక చేసుకోవటానికి కారణమేమిటి?
ఉపాధ్యక్ష పదవికి ఒక మహిళను ప్రతిపాదించనున్నట్లు గతంలో జో బిడేన్ ప్రకటించారు. అయితే కమలా హారిస్ పేరు ఎలా బయటకువచ్చింది? సూసన్ రైస్ లేదా కరేన్ బాస్ లేదా మరొకరెవరో కాకుండా కమలా హ్యారిస్‌ను ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
ఇండియా - జమైకా సంతతికి చెందిన అమెరికా మహిళ కమలా హ్యారిస్‌ను ఎంపిక చేసుకోవటానికి ఈ కింది కారణాలు వినిపిస్తున్నాయి.
1. "నాతో పాటు పనిచెయ్యడానికి తెలివైన, దృఢమైన, నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి కావాలి. కమలా అందుకు తగినవారని" అని జో బిడెన్ ప్రచార ఈమెయిల్లో పేర్కొన్నారు.
కమలా హ్యారిస్‌కు ఉండవలసిన ప్రధాన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆమె ఒక నల్లజాతి మహిళ, వలసదారుల కుటుంబంనుంచీ వచ్చారు. జాతీయ స్థాయిలో ఆమె నాయకత్వ లక్షణాలను ఇదివరకే నిరూపించుకున్నారు. ఒక వ్యాఖ్యత అన్నట్టుగా మొదటిరోజునుంచే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడించగలిగే సత్తా ఉన్న వ్యక్తి.
రేసిజంకు వ్యతిరేకంగా, వలసదారులకు మద్దతుగా నిలిచే ప్రగతశీలత ఉన్నవారంతా కమలా హ్యారిస్‌కు మద్దతు పలికే అవకాశం ఉంది. ఆమె న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీగా పనిచేసారు. తరువాత కాలిపోర్నియా అటార్నీ జనరల్గా కొనసాగారు. ఆమె వాక్పటిమ, సంభాషణా చాతుర్యం, వాదనా పటిమతో చాలా తక్కువ సమయంలోనే ప్రజాకర్షణ పొందిన జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు.
కమలా హ్యారిస్ ఆన్‌లైన్ కార్యకలాపల్లో చాలా చురుకుగా ఉంటారు. డెమొక్రటిక్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసినప్పుడు ఆవిడ ప్రదర్శించిన నైపుణ్యాన్ని దేశ ప్రజలందరూ గమనించారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో ముఖాముఖి చర్చకు దిగినప్పుడు ఆమె దృఢమైన వాదనాపటిమతో నెగ్గుకురాగలని ఆశిస్తున్నారు. ఒక స్థానిక మీడియా రిపోర్ట్ ప్రకారం "సూక్ష్మపరిశీలనలో తొట్రుపాటు కనబరిచే" అభ్యర్థి ఉండకూడదని బిడెన్ వర్గం భావిస్తున్నట్టు చెప్పారు.
"ఇంటెలిజెన్స్, జ్యుడీషరీ విభాగాల్లో ఆమె ఒక దృఢమైన, సమర్థవంతమైన సెనేటర్గా గుర్తింపు పొందారు" అని బిడెన్ ప్రచార ఈమెయిల్లో తెలిపారు. "నేరస్థులను శిక్షించడంలోనూ, వివాహ వ్యవస్థలో సమానత్వం తీసుకురావడంలోనూ ఆమె గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి సందర్భంగా తలెత్తిన జాతి అసమానతల పట్ల ఆమె చాలా కఠినంగా వ్యవహరించారు" అని ఈమెయిల్లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. ఫిబ్రవరిలో జరిగిన సౌత్ కరోలినా ఎన్నికల్లో ఎక్కువమంది ఆఫ్రికన్ అమెరికన్లు ఓట్లు వేసి బిడెన్‌కు పెద్ద విజయాన్ని అందించారు. ఆ తరువాత ఆనేక రాష్ట్రాల్లో ఆఫ్రికన్ అమెరికన్లు బిడెన్‌కు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీనుంచి వచ్చిన వ్యక్తిని ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదించాలనే డిమాండ్ పెరిగింది.
అగ్రస్థాయి ఆఫ్రికన్ అమెరికన్ నాయకుడు జేమ్స్ క్లైబర్న్ ఒక నల్లజాతి మహిళను ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని బిడెన్‌ను కోరారు.
3. యూఎస్ పోలీసు అధికారుల చేతిలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో బిడెన్ వర్గంపై, డెమొక్రటిక్ పార్టీపై ఒత్తిడి మరింత పెరిగింది. జాతి అసమానతలను తొలగించడానికి తీసుకునే చర్యలను నోటిమాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని 'బ్లాక్ లైవ్స్ మేటర్' నిరసనకారులు డిమాండ్ చేశారు.
4. కుటుంబ వ్యవహారాలు కూడా ఈ నిర్ణయం తీసుకోడానికి కారణమని తెలుస్తోంది.
జో బిడెన్ ఈమెయిల్ ప్రకారం "నా కుమారుడు బో ద్వారా మొట్టమొదటిసారిగా నేను కమలా హ్యారిస్ను కలిసారు. వాళ్లిద్దరూ ఒకేసారి అటార్నీ జనరల్స్గా పనిచేసారు. కమలా నాయకత్వ లక్షణాల పట్ల బోకు ఎంతో గౌరవం ఉంది. ఉపాధ్యక్ష పదవికి ఎవర్ని ప్రతిపాదించాలా అని ఆలోచిస్తున్నప్పుడు మా అబ్బాయి మాటల్ని నేను పరిగణనలోకి తీసుకున్నాను. తన అభిప్రాయాల్ను నేను ఎక్కువ గౌరవిస్తాను. ఈరోజు కమలా హ్యారిస్ నా పక్కన ఉండడం నాకెంతో గర్వకారణం."
5. ఆఫ్రికన్ అమెరికన్లలో దాదాపు 13% ఓటర్లు ఉన్నారు. ఎలక్షన్లలో వారు ప్రముఖ పాత్ర వహించనున్నారు. ముఖ్యంగా ఒకే పార్టీకి కట్టుబడని రాష్ట్రాల్లో వీరి ఓట్లు ముఖ్యమైనవి.
2016లో హిల్లరీ క్లింటన్ ఓడిపోవడానికి ఆఫ్రికన్ అమెరికన్ ఓట్లు తగ్గిపోవడం ఒక ముఖ్య కారణమని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
6. మరొక ముఖ్య కారణం ఏమిటంటే బిడెన్-ఒబామా ద్వయాన్ని ప్రతిబింబించేలాగ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎన్నుకోవాలని బిడెన్ వర్గం భావించినట్టు తెలుస్తోంది.
అయితే బిడెన్-ఒబామా ద్వయం...విదేశాంగ శాఖలో అనుభవజ్ఞుడైన ఒక తెల్లజాతి వ్యక్తి, వలసదారునిగా వచ్చిన ఒక నల్లజారి యువకుడు. ఈసారి తెల్లజాతి వ్యక్తి ప్రెసిడెంట్‌గా పోటీ చేయనున్నారు. మరి అదే మ్యాజిక్ పునరావృతం కాగలదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వయసు 70 యేళ్ల పైబడిన బిడెన్ భవిష్యత్తు డెమోక్రటిక్ నాయకులకు తను వారధిలాంటి వాడినని చెప్పుకున్నారు. 2020 లో బిడెన్-కమలా ద్వయం గెలిస్తే 2024లో కమలా హ్యారిస్ అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే, జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో యూఎస్లో మళ్లీ తలెత్తిన జాతి అసమానతల పోరాటం నేపథ్యంలో కమలా హ్యారిస్ మీద కన్సర్వేటివ్స్ దాడి చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కన్సర్వేటివ్స్ ప్రతినిధిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, కమలా భారత సంతతికి చెందినవారని సూచిస్తూ ట్విట్టర్లో "ఆమె నల్లజాతి వ్యక్తి కాదు, ఆఫ్రికన్-అమెరికన్ కాదు" అని రాసారు.
హెల్త్ కేర్, ఇమిగ్రేషన్‌లాంటి అంశాల్లో కమలా హ్యారిస్ బిడెన్ కన్నా ఎక్కువగా ఉదారవాద స్థాయిని తీసుకున్నారని రిపబ్లికన్లకు ఇది గిట్టగపోవచ్చని ఒక అభిప్రాయం వ్యక్తమయ్యింది.
ప్రాథమిక చర్చలు జరుగుతున్న సమయంలో, ప్రైవేటు ఆరోగ్య భీమాను తొలగించడంలోనూ, చట్టవిరుద్ధంగా యూఎస్ సరిహద్దులు దాటి లోపలికి వస్తున్నవారిని నేరస్తులుగా భావించకపోవడంలోనూ ఎవరు ముందుంటారని అడిగిన ఒక ప్రశ్నకు కమలా హ్యారిస్ "నేను" అంటూ చెయ్యెత్తారు. తరువాత ఈ రెండు అంశాలపై ఆమె తన వాదనలను వినిపించారు. అయితే రిపబ్లికన్లు మొదట ఆవిడ చెయ్యెత్తిన విషయాన్నే చూపిస్తూ నిందలు వేసే అవకాశం లేకపోలేదు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో నిరసనలు: సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు ఉందా?
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- దేశ రాజధానిలో తెలుగువారికి వైద్యం అందుతుందా?
- తెలంగాణలో విద్యుత్ చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారా? అసలు బిల్లులను ఎలా లెక్కిస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








