తెలంగాణ విద్యుత్ బిల్లు స్లాబులు: చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారా? అసలు బిల్లులను ఎలా లెక్కిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో విద్యుత్ బిల్లులు భారీగా పెంచేశారని ట్విటర్ వేదికగా నెటిజన్లు వెల్లడిస్తున్నారు. బిల్లులో తప్పులు ఉన్నాయని, శ్లాబులను పెంచేసి చార్జీలను ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌తో విద్యుత్ చార్జీల వసూలుకు అంతరాయం ఏర్పడింది.
మీటర్ రీడింగ్‌లను తీసేందుకు ఇంటింటికీ వెళ్లే విద్యుత్ సిబ్బందికి కోవిడ్-19 ముప్పు ఉండటంతో బిల్లుల జారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పీడీసీఎల్) తెలిపింది.
అయితే, గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వినియోగం ఆధారంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వినియోగదారులు బిల్లులు చెల్లించాలని టీఎస్ఎస్‌పీడీసీఎల్ సూచించింది.
లాక్‌డౌన్ తెరచిన అనంతరం రీడింగ్‌లు తీస్తామని, వినియోగదారులు ఎక్కువ చెల్లించినా లేదా తక్కువ చెల్లించినా.. వచ్చే నెలలో సవరించి బిల్లులు ఇస్తామని స్పష్టంచేసింది.

"మూడు నెలల బిల్లులు కలిపి ఇచ్చారు"
ప్రస్తుతం కంటైన్‌మెంట్ జోన్‌లు మినహాయించి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సడలించారు. దీంతో విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌లు తీసుకోవడం మొదలుపెట్టారు. గత మూడు నెలల్లో వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని కొత్త రీడింగ్‌తో సవరించి బిల్లులు ఇస్తున్నారు.
అయితే ఈ బిల్లుల్లో తప్పులున్నాయని, చార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
"మార్చి 5న నేను రూ. 247 బిల్లు చెల్లించాను. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గతేడాది చార్జీల ప్రకారం టీఎస్ఎస్‌పీడీసీఎల్ సూచించినట్లే మొత్తం రూ. 463 పేటీఎంలో చెల్లించాను. అయితే జూన్‌లో వచ్చిన బిల్లు.. నేను కేవలం రూ. 285 చెల్లించినట్లు చూపిస్తోంది. సవరించిన అనంతరం మళ్లీ రూ. 1,519 కట్టాలని అడుగుతున్నారు. బిల్లులో తప్పులున్నాయా? లేక చార్జీలను పెంచి వసూలు చేస్తున్నారా?" అని వినియోగదారుడు సీహెచ్ సంతోష్ ప్రశ్నించారు.
"మా కరెంటు బిల్లు ఎప్పుడూ రూ. 1,200 దాటేది కాదు. ఇప్పుడేమో మూడు నెలలకు కలిపి రూ. 7,000 బిల్లు ఇచ్చారు. ఇది నిజంగా దోచుకోవడమే. లాక్‌డౌన్‌తో అన్ని విధాలుగా నష్టమే జరిగింది" అని సి.సంస్కృతి వివరించారు.
మరోవైపు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను నెటిజన్ రాఘవ్ గాజుల కోరారు. "లాక్‌డౌన్ సమయంలో బిల్లులను లెక్కించే విధానంలో తేడాలు జరిగినట్టు అనిపిస్తోంది. నెలవారీ శ్లాబ్ రేట్‌లను తీసుకోకుండా.. మూడు నెలల బిల్లుపై వచ్చే శ్లాబ్ రేటును తీసుకుంటున్నారు. ఫలితంగా బిల్లులు పెరిగిపోతున్నాయి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చార్జీల వసూలు ఇలా
ఇంటి అవసరాలకు ఉపయోగించే విద్యుత్ చార్జీల ఆధారంగా వినియోగదారులను టీఎస్ఎస్‌పీడీసీఎల్ మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తోంది. 0 నుంచి 100 యునిట్ల విద్యుత్ వినియోగం వరకు కేటగిరీ-1గా, 101 నుంచి 200 వరకు కేటగిరీ-2గా, 200 యూనిట్లకుపై వినియోగించే వారిని మూడో కేటగిరీగా విభజిస్తోంది. ఈ కేటగిరీల్లో కూడా శ్లాబులు ఉంటాయి. వాటి ఆధారంగానే చార్జీలు వసూలు చేస్తోంది.
ఉదాహరణకు 170 యూనిట్లు వినియోగిస్తే.. కేటగిరీ-2లోకి వస్తారు. దీని ప్రకారం.. మొదటి 100 యూనిట్లకు రూ. 3.3 చొప్పున (ఒక యూనిట్‌కు) రూ. 330, ఆ తర్వాత 70 యూనిట్లు ఒక్కో యూనిట్‌కు రూ. 4.3 చొప్పున రూ. 301 అవుతుంది. మొత్తంగా రూ. 631 చెల్లించాల్సి ఉంటుంది.
మూడు నెలల బిల్లులు కలిపి ఒకేసారి ఇవ్వడంతో తమ శ్లాబులు మారిపోయాయని నెటిజన్లు అంటున్నారు. అందుకే బిల్లులు ఎక్కువగా వచ్చాయని చెబుతున్నారు.
అయితే ఈ ఆరోపణలను టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ జె.శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు.

"మూడు నెలల సగటు ఆధారంగా శ్లాబులు"
"మార్చి, ఏప్రిల్, మే నెలల బిల్లును కలిపి ఒకే బిల్లులో ఇస్తున్నాం. అయితే శ్లాబుల విషయానికి వచ్చేసరికి బిల్లు మొత్తాన్ని మూడుతో భాగించి.. వచ్చే మొత్తం ఆధారంగా శ్లాబులు నిర్ణయిస్తున్నాం. దీనివల్ల వారు ఎంత వినియోగిస్తున్నారో అదే శ్లాబులో ఉన్నట్లు అవుతుంది" అని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు.
ఈ విధానం ప్రకారం.. మూడు నెలలకు గాను 1,723.47 యూనిట్లను వినియోగించి ఉంటే.. రూ. 12,152గా బిల్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మొదట 1,723.47ను మూడు భాగాలుగా విభజిస్తారు. అప్పుడు నెలవారి వినియోగం 574.49 యూనిట్లుగా తేలుతుంది. దీనిలో మొదటి 200 యూనిట్లకు రూ. 5 చొప్పున (ఒక యూనిట్‌కు); 201 నుంచి 300 యూనిట్లకు రూ. 7.20 చొప్పున; 301 నుంచి 400 వరకు రూ. 8.50 చొప్పున; 401కుపై యూనిట్లకు రూ. 9 చొప్పున వసూలు చేస్తారు.
అప్పుడు ఒక నెల బిల్లు వస్తుంది. దీన్ని మళ్లీ మూడుతో గుణిస్తే మూడు నెలల బిల్లు (రూ. 12,152) వస్తుంది. గత ఏడాది వినియోగం ఆధారంగా ఇప్పటికే కొంత బిల్లు చెల్లించి ఉంటే.. ఈ మొత్తంలో దాన్ని మినహాయిస్తారు.
"టారిఫ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతిస్తే తప్ప.. టారిఫ్‌లు మార్చడం సాధ్యంకాదు. టారిఫ్‌లు పెంచామంటూ వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజమూ లేదు" అని శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.
ప్రస్తుత బిల్లును రెండు లేదా మూడు వాయిదాల్లో చెల్లించొచ్చని ఆయన తెలిపారు. అయితే మూడొంతుల్లో ఒక వంతు బిల్లు ప్రస్తుతం తప్పనిసరిగా చెల్లించాలని స్పష్టంచేశారు. వాయిదాలకు వెళ్తే వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుందన్నారు.
"ఎక్కడా తప్పులు జరగలేదు"
బిల్లుల్లో తప్పులతోపాటు చార్జీలను పెంచారన్న వార్తలను టీఎస్ఎస్‌పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రఘుమారెడ్డి కూడా ఖండించారు.
"బిల్లుల్లో ఎలాంటి తప్పులూ లేవు. వినియోగం పెరగడం వల్లే బిల్లులు ఎక్కువగా వచ్చినట్లు కనిపిస్తోంది. వినియోగం పెరగడం వల్లే శ్లాబులు మారాయి. ప్రతి వేసవిలోనూ ఇదే జరుగుతుంది" అని చెప్పారు.
"ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇంటి అవసరాల కోసం ఉపయోగించే విద్యుత్ వినియోగం 39 శాతం పెరుగుతుంది. ఫలితంగా శ్లాబ్ లలోనూ మార్పులు వస్తుంటాయి. లాక్‌డౌన్ వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. నిజానికి మా ఇంట్లో విద్యుత్ వినియోగం కూడా 15 శాతం పెరిగింది" అని ఆయన పేర్కొన్నారు.
డిస్కంలు మరిన్ని కష్టాల్లోకి...
ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలను లాక్‌డౌన్ మరింత కష్టాల్లోకి నెట్టిందని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
గతేడాదితో పోలిస్తే ప్రతి రోజు ఎనిమిది నుంచి పది మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగం తగ్గినట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా వాణిజ్య విద్యుత్ వినియోగం బాగా పడిపోయిందన్నారు.
మరోవైపు గత మూడు నెలల్లో వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయమూ బాగా తగ్గిందని రఘుమారెడ్డి చెప్పారు.
"మార్చిలో 67 శాతం మంది మాత్రమే బిల్లులు చెల్లించారు. ఏప్రిల్‌లో ఇది 44 శాతం, మేలో 68 శాతంగా ఉంది. సగటున ఈ మూడు నెలల్లో కేవలం 60 శాతం మంది మాత్రమే బిల్లులు చెల్లించారు" అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కరోనా లాక్‌డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది?
- ఈ 5 ప్రాంతాల్లో జన్మిస్తే 100 ఏళ్లు బతికేసినట్లే
- బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పేరుతో శరీరాల్లో చిప్స్ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా
- అధికారం పదిలం చేసుకోవడానికి కరోనాను వాడుకుంటున్నారా
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేసే అవకాశాన్ని ప్రపంచం ఎలా చేజార్చుకుంది?
- హోక్కైడో: లాక్ డౌన్ ఎత్తేశాక మళ్లీ మొదలైన కరోనా కేసులు.. జపాన్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి?
- "నా హౌస్‌మేట్ సామాజిక దూరం పాటించడంలేదు, అర్ధరాత్రి వేరేవాళ్లను తీసుకొస్తున్నాడు"
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా.. అందుకు ఆధారాలు ఉన్నాయా
- కరోనావైరస్: కొన్ని దేశాల ప్రజలు మాస్క్‌లు వాడతారు, మరికొన్ని దేశాల ప్రజలు వాడరు, ఎందుకు
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








