కరోనా లాక్‌డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది?

ఫొటో సోర్స్, Lars Barthel
- రచయిత, స్వామినాథన్ నటరాజన్,
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ మరింత వ్యాపించకుండా అడ్డుకోడానికి అందరూ తమ ఇళ్లలోనే ఉండాలని ప్రపంచ దేశాలన్నీ చెప్పాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్లు సడలిస్తున్నారు.
ఇప్పటికీ వయసు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నపిల్లలు, గర్భవతులు బయటకు వెళ్లకూడదని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
చాలామందికి మూడు నెలలపాటు ఇంట్లోనే ఉండడం, బయటకు వెళ్లలేకపోవడం కష్టంగా అనిపించింది. కరోనావైరస్ వల్ల జనం తమ ఇళ్లలోనే బంధీల్లా ఉండాల్సి వచ్చింది.
అలా ఇంట్లో ఉన్నవారు నాలుగ్గోడల మధ్య ఎండ తగలకుండా ఉండడం చాలా కష్టంగా భావిస్తారు.
కానీ, ప్రతి ఏటా వందల మంది శాస్త్రవేత్తలు ఆర్కిటిక్, అంటార్కిటికాలకు వెళ్తుంటారు. వాళ్లందరూ అక్కడ ఎముకలు కొరికే చలిలో, ప్రతికూల వాతావరణంలో చాలా రకాల ప్రయోగాలు చేస్తుంటారు.
ఆ శాస్త్రవేత్తలు అక్కడ కొన్ని నెలలపాటు, సూర్యుడి వెలుతురే లేకుండా ఉండాల్సి వస్తుంది.

ఫొటో సోర్స్, Steffen Graupner
ఎలా తట్టుకుంటారు?
అక్కడకు వెళ్లిన శాస్త్రవేత్తల్లో ఒకరైన విష్ణునందన్‌తో బీబీసీ మాట్లాడింది.
ఆయన “మొదట కొన్ని రోజులు నాకు సూర్యుడు కనిపించకపోవడంతో ఎలాగో అనిపించింది. ఆ సమయంలో పగటి వెలుతురు లేకుండా ఉండడం నాకు కష్టంగా అనిపించింది. కొన్ని రోజులకు ఆ వాతావరణానికి అనుకూలంగా మారాను. తర్వాత నాకు చీకటిలో ఉండడం అలవాటైపోయింది” అని చెప్పారు.
డాక్టర్ విష్ణునందన్ ఐస్ రిమోట్ సెన్సింగ్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన కెనడా యూనివర్సిటీ ఆఫ్ మేనిటోబా, సెంటర్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్ సైన్స్(సీఈఓఎస్)లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్.
ప్రపంచంలోని ఒకే ఒక ఆర్కిటిక్ క్లైమెట్ రీసెర్చ్ ఆపరేషన్‌లో పనిచేస్తున్న ఏకైక భారతీయుడు ఈయనే.
ఈ ఆపరేషన్‌ను ‘మొజాయిక్’(ఎంఓఎస్ఎఐసీ)అనే పేరుతో పిలుస్తారు. వివిధ దేశాలకు చెందిన సుమారు 60 మంది శాస్త్రవేత్తలు ఇందులో పనిచేస్తున్నారు. వీరంతా జర్మనీ రీసెర్చ్ ఐస్ బ్రేకర్ ఆర్వీ పోలార్‌స్టెర్న్ నౌక మీద ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Julienne Stroeve
బయోలాజికల్ క్లాక్
ఆర్కిటిక్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సభ్యులు తమ జీవగడియారాన్ని అంటే సమయానికి పడుకోవడం, లేవడం, తినడం లాంటి వాటిని మాస్కో సమయానికి తగినట్లు మార్చుకున్నారు.
కానీ, అది అంత సులభం కాదు. ఆ మార్పులకు వారి శరీరాలు వెంటనే స్పందించడం ప్రారంభించాయి.
నందన్ బీబీసీతో “నా బయోలాజికల్ క్లాక్ స్టేబుల్ కాలేదు. కొన్ని రోజుల వరకూ నేను టిఫిన్ చేయడానికి కూడా లేవలేకపోయాను. చాలాసార్లు త్వరగా నిద్రపోయేవాడిని. కొన్ని సార్లు అర్థరాత్రివరకూ మేలుకుని ఉండేవాడిని” అన్నారు.
ఆర్కిటిక్‌లో సుదీర్ఘంగా 127 రోజుల ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత నందన్ ఇటీవలే తిరిగి వచ్చారు.
క్రయోస్ఫియర్ రీసెర్చ్(భూమిపై గడ్డకట్టిన నీళ్ల భాగంపై అధ్యయనం)లో ఏడేళ్లకు పైగా సుదీర్ఘ కెరియర్ ఉన్న విష్ణునందన్ ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాలకు దాదాపు 15 సార్లు వెళ్లారు.
“అక్కడ మనకు సూర్యోదయం, సూర్యాస్తమయం కనిపించవు. అందుకే కాసేపు పడుకుని లేచిన తర్వాత నాకు చాలా అలసటగా అనిపించేది. బయట చూస్తే, మొత్తం చీకటిగా ఉంటుంది. మన శరీరం మనల్ని మత్తులోంచి లేవనివ్వదు” అన్నారు.

ఫొటో సోర్స్, Steffen Graupner
నిద్ర, ఆరోగ్యం ముఖ్యం
శరీరానికి అవసరమైన విటమిన్ డి అందించడంతోపాటు, సూర్యరశ్మి మన మూడ్‌ను కూడా సరి చేస్తుంది. అక్కడ పగలు రాత్రికి ఎలాంటి తేడా కనిపించదు. శరీరంలో సాధారణంగా జరిగే కదలికలు గందరగోళంగా అవుతాయి.
నిద్ర తారుమారు కావడం వల్ల మనకు అలసటగా, చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. వారాలు, నెలల వరకూ మనం అదే పరిస్థితులో ఉంటే, ఆ దుష్ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది.
చలికాలంలో అంటే అక్టోబర్ ప్రారంభం నుంచి మార్చి వరకూ ఉత్తర ధ్రువం అంతా చీకటి కప్పేసి ఉంటుంది.
అక్కడ “నా పరిస్థితి చాలా తక్కువగా నిద్రపోయే బొద్దింకలా అయిపోయింది. నిద్ర తక్కువ కావడంతో అలసటగా అనిపించేది. చాలాసార్లు మధ్యాహ్నం పనిచేయడానికి కూడా నన్ను నేను మోటివేట్ చేసుకోవడం చాలా కష్టం అయ్యేది” అని నందన్ చెప్పారు..
“బయట వాతావరణం చాలా కఠినంగా ఉండేది. ఉష్ణోగ్రతలు మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోయేవి. బలమైన గాలులు వీస్తుండేవి” అన్నారు.
ధ్రువాలపై గడపడంలో ఎంతో అనుభవం ఉన్న నందన్‌కు చీకటికి భిన్నంగా ఉండే వాతావరణ అనుభవం కూడా ఉంది.
ధ్రువాల్లో వేసవి కాలంలో ఎప్పుడూ సూర్యుడి వెలుతురు ఉంటుంది.
“మనకు 24 గంటలూ సూర్యుడి వెలుతురు ఉంటే, ఉదయం పూట చాలా ఎనర్జీగా ఉంటుంది. కానీ సాయంత్రం అయ్యే కొద్దీ, మనం చాలా అలిసిపోతాం. అర్థరాత్రి సమయంలో నాకు మెలకువ వస్తే వెలుతురు వల్ల మళ్లీ నిద్రపట్టేది కాదు” అని చెప్పారు నందన్.

ఫొటో సోర్స్, University of Bremen /Marcus Huntemann
అత్యంత అప్రమత్తత అవసరం
మొజాయిక్ శాస్త్రవేత్తలకు అత్యాధునిక పరికరాలతో ఉన్న రీసెర్చ్ ల్యాబ్‌తో నీటిపై తేలే పోలార్‌స్టెర్న్ నౌక ఇల్లులా ఉండేది. ఈ నౌక ఒక రికార్డు కూడా సెట్ చేసింది.
ఫిబ్రవరి 23న అది ఉత్తరంగా చాలా దూరం వెళ్లిపోయింది. చివరకు భూమి ఉత్తర ధ్రువానికి అది కేవలం 156 కిలోమీటర్ల దూరంలో ఆగింది.
“ఒక నౌక అంత భయంకరమైన చలికాలంలో ఉత్తర దిశగా అంత ముందుకు వెళ్లిపోవడం ఎప్పుడూ జరగలేదు” అని నందన్ చెప్పారు.
శాస్త్రవేత్త నందన్ రాడార్ శాటిలైట్స్, సర్ఫేస్ బేస్డ్ రాడార్ సెంటర్లు ఉపయోగించి గడ్డకట్టిన సముద్రంలో మంచు మందాన్ని కొలుస్తుంటారు.
“ఒకసారి మా సైట్ దగ్గరకు ఒక ఎలుగుబంటి వచ్చేసింది. మా పరికరాలతో ఆడుకోవడం మొదలుపెట్టింది. మాకు రక్షణగా రైఫిల్స్ పట్టుకుని సెక్యూరిటీ ఉంటుంది. వారు ఆ ఎలుగుబంటిని తరిమేశారు” అని నందన్ చెప్పారు.
‘‘చాలా కఠినంగా ఉండే ధ్రువ వాతావరణం మేము అప్రమత్తంగా ఉండాల్సిన స్థాయిని మరింత పెంచింది. మనం 24 గంటలూ చీకటిలో ఉంటున్నప్పుడు, చాలా అప్రమత్తంగా ఉంటాం” అని విష్ణు నందన్ చెప్పారు.
అది ఆయనకు తన దినచర్యను కొనసాగించడానికి సాయపడింది.
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఆయన టీమ్ ఫీల్డ్ ల్యాబ్‌లో పనిచేయడానికి వెళ్లేది. అదే ల్యాబ్‌లో ఆయన పరికరాలు కూడా ఉంటాయి.
చాలాసార్లు ఆకలి లేక నేను టిఫిన్ చేయకుండానే రీసెర్చ్ పని మీద వెళ్లిపోయేవాడిని. వాళ్లు మాత్రం లంచ్ కోసం తిరిగి షిప్ దగ్గరకు వచ్చేవాళ్లు. తర్వాత నాలుగు గంటలపాటు మళ్లీ ఫీల్డ్ వర్క్ కోసం వెళ్లిపోయేవారు.

ఫొటో సోర్స్, Lukas Piotrowski
విశ్రాంతి సమయం
“మనం మంచుపై ఉన్నప్పుడు, చాలా ఎనర్జీని ఖర్చు చేస్తాం. మన శరీరంలో ఉండే కేలరీలు కరిగిపోతాయి. నేను నాలుగు నెలల్లో 10 కిలోల బరువు తగ్గాను” అన్నారు నందన్.
షిప్‌లో ఉన్న కిచెన్ సిబ్బంది వారికోసం వంటలు చేసేవారు. శాస్త్రవేత్తల బృందంలో కొంతమంది వంట చేయడానికి ఆసక్తి చూపించేవారు.
విష్ణు తన సహచరుల కోసం వెజిటబుల్ బిరియానీ, పాలక్ టోఫూ కర్రీ చేసేవారు. వాటితోపాటు ఆయన తన మొత్తం టీమ్‌కు బేక్డ్ తందూరీ చికెన్, ఫిష్ కర్రీ కూడా రుచిచూపించారు.
టీమ్ ఏకాగ్రతతో ఉండడానికి ఎంటర్‌టైన్‌మెంటుకు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. వారానికి మూడు సార్లు వారికి బార్ నైట్స్ ఉండేవి. విశ్రాంతి సమయంలో గేమ్స్ కూడా ఆడేవారు.
శాస్త్రవేత్తల బృందం క్రిస్మస్, న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాయి. అదే సమయంలో విష్ణు పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి.
అన్నీ ఉన్నా, ఐసొలేషన్‌లో ఉండడం వల్ల నష్టాలు కూడా ఉంటాయి.
“ఫిబ్రవరి నెలలో ఎక్కువ పని చేయడం వల్ల అందరూ చాలా ఘోరంగా అలిసిపోయారు” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Lukas Piotrowski
ధ్రువాల నుంచి లాక్‌డౌన్‌లోకి
నార్త్ పోల్ నుంచి దూరంగా వచ్చిన తర్వాత విష్ణు నందన్ సూర్యుడి తొలి కిరణాన్ని చూడగలిగారు.
“నేను చీకటి అంటే విసిగిపోలేదు. షిప్ మీద మా జీవితం అదే” అన్నారు .
కరోనా వల్ల ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉందని ఆయనకు కెనడాలోని కాల్గరీకి తిరిగి వచ్చాకే తెలిసింది. కెనడాకు వచ్చే మిగతా ప్రయాణికుల లాగే ఆయన్ను కూడా కొన్ని రోజులు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని అధికారులు చెప్పారు.
“కఠిన పరిస్థితుల్లో గడిపిన మీకు, ఆంక్షల్లో, ఐసొలేషన్‌లో ఉండడం పెద్ద కష్టంగా అనిపించి ఉండదు” కదా అని అడిగితే..
“శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం జిమ్ వెళ్లాల్సిన అవసరమే లేదు. మనం ఇంట్లోనే ఉంటూ ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. దానికోసం ఎన్నో మంచి వీడియోలు ఉన్నాయి” అన్నారు నందన్.
“కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ సమయంలో పగటిపూట ఒకసారి ఎక్సర్‌సైజ్ చేయడానికి అనుమతి ఇస్తున్నారు. కానీ ఇళ్ల బయటకు వెళ్లలేనివారు, తమను తాము చాలా బిజీగా ఉంచుకోవాల్సి ఉంటుంది” అన్నారు.
“ఇళ్లలో ఏదో ఒక పని కచ్చితంగా చేస్తుండండి. మన జీవితంలో ఇది ఎలాంటి అత్యవసర సమయం అంటే, ఇలాంటి సమయాన్ని మనం బాగా ఉపయోగించుకోవాలి” అని నందన్ చెప్పారు.
“ఆకలితో ఉండడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం కఠిన పరిస్థితులను కూడా తట్టుకుని నిలబడగలం. ఇది జీవితాన్ని రీసెట్ చేయడం లాంటిది. దాదాపుగా అంతిమ పోరాటంలా ఉంటుంది” అంటున్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- ‘కరోనావైరస్ను ఎదుర్కోవటానికి 20 ఏళ్లుగా ఎలా సిద్ధమయ్యానంటే’
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- వివాహేతర సంబంధం బయటపడడంతో గుండు చేయించుకుని అభిమానులకు క్షమాపణ కోరిన గాయని.. సారీ చెప్పడంలో అదో పద్ధతి
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్ రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు ఇస్తున్నారు? అసలు ఇవి ఎలా పనిచేస్తాయి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








