ఉత్తర ప్రదేశ్: 8 ఆసుపత్రుల చుట్టూ తిరిగినా సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో స్పెయిన్, ఇటలీలను దాటి ఐదో స్థానానికి చేరుకున్న భారత్

ఫొటో సోర్స్, NARINDER NANU
ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన దేశాల్లో భారతదేశం ఐదో స్థానానికి చేరింది.
భారతదేశంలో శనివారం 9971 కరోనావైరస్ పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
కోవిడ్-19 కారణంగా దేశంలో గత 24 గంటల్లో 287 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,46,428కి చేరింది. ఇందులో 1,20,406 మంది చికిత్స పొందుతుండగా, 1,19,293 మంది చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.
కరోనావైరస్ కారణంగా దేశంలో 6929 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారతదేశంలో మొత్తం 46,66,386 శాంపిళ్లను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. గత 24 గంటల్లోనే 1,42,069 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.
తెలంగాణలో 3496కు పెరిగిన పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో శనివారం 654 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
ఇందులో 206 కేసులు తెలంగాణ స్థానికులవి కాగా, 448 కేసులు వలస కార్మికులు, తెలంగాణకు తిరిగొచ్చినవారివి అని వెల్లడించింది. తెలంగాణ స్థానికుల కేసుల్లో అత్యధికంగా 152 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదుకావటం గమనార్హం.
దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3496కు చేరింది.
రాష్రంలో ఇప్పటికి 1710 మంది చికిత్స పొంది ఇళ్లకు తిరిగి వెళ్లగా, 1663 మంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 123 మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 3588 పాజిటివ్ కేసులు
శనివారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య 3588కి చేరింది.
ఇందులో 2323 మంది చికిత్స పొంది తిరిగి వెళ్లగా, ఇంకా 1192 మంది చికిత్స పొందుతున్నారు. 73 మంది మరణించారు. ఇవి కాకుండా స్థానికేతర కేసులు 741 ఉన్నాయని, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి కోవిడ్-19 సోకిన కేసులు 131 ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 4,36,335 మందికి పరీక్షలు జరిపామని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
నోయిడాలో వైద్యం అందక గర్భవతి మృతి.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
సకాలంలో వైద్యం అందకపోవడంతో ఎనిమిది నెలల గర్భవతి అయిన 30 ఏళ్ల మహిళ ఒకరు మృతి చెందారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఒక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. ఈ సంఘటన శుక్రవారం నోయిడాలో జరిగింది. కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స అందించేందుకు 12 గంటల పాటు 8 ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అయితే ఆ ఆసుపత్రులన్నీ వైద్యం చేసేందుకు నిరాకరించాయి.
ఘజియాబాద్‌లోని ఖోరా ప్రాంతానికి చెందిన ఈ మహిళ భర్త ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. వీరికి తొలి సంతానం ఒక కుమారుడు. ఇప్పుడు అతడికి ఐదేళ్లు. రెండోసారి గర్భవతి అయిన ఈ మహిళకు గతంలో కూడా శ్వాస సంబంధిత, బీపీ సంబంధిత సమస్యలు వచ్చాయని మృతురాలి సోదరుడు శైలేంద్ర కుమార్ చెప్పారు.
ఆమెకు శ్వాస అందకపోవడం, బీపీ పెరిగిపోవడంతో ఆటో రిక్షాలో కూర్చోబెట్టి ఒకటి తర్వాత మరొకటి చొప్పున ఆరు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెకు ఆక్సిజన్ అందించడం తప్పనిసరి కావడంతో అంబులెన్స్‌లో ఎక్కించుకుని మరో రెండు ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
గర్భవతి అయిన ఈ మహిళకు చికిత్స నిరాకరించిన ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్స చేసేందుకు ఉద్దేశించిన శారదా ఆసుపత్రి కూడా ఉంది. అక్కడ కొంచెం సేపు ఈమెకు చికిత్స అందించారు. తర్వాత వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రైవేటు ఆసుపత్రి ఫోర్టిస్ కూడా గర్భవతికి చికిత్స చేయడానికి నిరాకరించిందని, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించిందని సింగ్ తెలిపారు.
చివరికి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)కు ఆమెను తీసుకెళ్లగా, అప్పటికే గర్భిణి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కృత్రిమ మేధస్సు: కరోనావైరస్ను ఈ అధునాతన సాంకేతికత అడ్డుకోగలదా?
- వలస కార్మికుల వల్ల కరోనావైరస్ గ్రామాలు, పట్టణాలకు చేరిందా?
- అమెరికాలో ప్రాణాలు తీసే పోలీసులు శిక్షల నుంచి ఎలా తప్పించుకుంటున్నారు
- ఈ 5 ప్రాంతాల్లో జన్మిస్తే 100 ఏళ్లు బతికేసినట్లే
- వీడియో: లాక్డౌన్లో మ్యూజిక్ వీడియోలు తీయడం ఎలా?
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








