కరోనా వ్యాక్సిన్ పేరుతో శరీరాల్లో చిప్స్ అమర్చడానికి బిల్ గేట్స్ కుట్ర చేస్తున్నారా

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
- రచయిత, జేన్ వేక్‌ఫీల్డ్
- హోదా, బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్
వాంకోవర్‌లో 2015లో జరిగిన టెడ్ టాక్ షోలో బిల్‌గేట్స్ పాల్గొన్నారు. ఇందులో ఆయన ప్రపంచానికి ఒక హెచ్చరిక చేశారు.
''రాబోయే కొన్ని దశాబ్దాల్లో ప్రపంచంలో వందకోట్ల మందిని చంపగలిగేది ఏ యుద్ధమో కాదు. అది భయంకరమైన ఒక వైరస్'' అని అన్నారు.
అప్పుడాయన మాట్లాడిన మాటలను బీబీసీతోపాటు కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసినా వాటి గురించి చాలామంది పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే టాక్‌షో వీడియో దాదాపు ఆరున్నరకోట్లకుపైగా వ్యూస్‌ను సంపాదించింది.
చాలామంది ఆయన మాటల్లో పరమార్ధం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కొందరు ఆయనను ఉన్నత వర్గాలకు నాయకత్వం వహించే వ్యక్తిగా అభివర్ణిస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన ప్రపంచ జనాభాను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
మరికొందరయితే వ్యాక్సిన్ తప్పనిసరి చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని, దాని ద్వారా మనుషుల్లో మైక్రోచిప్స్ పెట్టబోతున్నారనే వరకు వెళ్లారు

ఫొటో సోర్స్, Getty Images
ప్రజారోగ్యానికి ప్రతీక
''బిల్‌గేట్స్ చుట్టూ కుప్పలుతెప్పలుగా కుట్ర సిద్ధాంతాలు అల్లుకుంటున్నాయి'' అని ఫస్ట్ డ్రాఫ్ట్ న్యూస్‌లో ఫ్యాక్ట్ చెకర్‌గా పని చేస్తున్న రోరిస్మిత్ అన్నారు. ''కుట్రలు ఆపాదించే వారికి ఒకరకంగా ఆయన పావుగా మారారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటారు'' అని రోరీ అన్నారు.
కరోనా కుట్రలను ఆపాదిస్తూ వివిధ సోషల్ మీడియాలలో, టీవీ షోలలో దాదాపు 12లక్షల మంది బిల్‌గేట్స్ ప్రస్తావన తెచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్, జిగ్నల్ ల్యాబ్స్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇందులో ఎక్కువగా ఫేస్‌బుక్ పోస్టులు ఉండగా, మిలియన్ల సంఖ్యలో అవి షేర్ అయ్యాయి. ఇటువంటి కుట్ర సిద్ధాంతాలలో చైనాకు చెందిన సోషల్ మీడియా సైట్ టిక్‌టోక్ కూడా విస్తృతంగా పాలుపంచుకుంటున్నట్లు ఫస్ట్ డ్రాఫ్ట్ న్యూస్ వెల్లడించింది.

బీబీసీ యాంటీ డిస్‌ఇన్ఫర్మేషన్ టీమ్(ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్) కూడా ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టి కొన్ని కీలకమైన విషయాలను గుర్తించింది. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి.
• ఇండియా, ఆఫ్రికాలలో పిల్లలపై బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యాక్సిన్ టెస్టులు నిర్వహించిందని, ఈ కారణంగా వేలమంది చిన్నారులు చనిపోయారని, కొందరు అనారోగ్యం పాలయ్యారని ఓ పోస్టులో ఉంది. దీనికి సంబంధించి బిల్‌గేట్స్ ఇండియాలో కేసులను కూడా ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది ఈ పోస్ట్.
• కెన్యాలో అబార్షన్ డ్రగ్స్ కలిగి ఉండే టెటనస్ వ్యాక్సిన్‌ను బిల్‌గేట్స్ ప్రవేశపెట్టారని ఆరోపించారు.
• 'ది న్యూ అమెరికన్ మేగజైన్' ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక వీడియో ఉంది. ప్రపంచ జనాభాను తగ్గించేందుకు అబార్షన్లు, వ్యాక్సిన్ల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని, బిల్‌గేట్స్‌కు చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నాయని ఆ వీడియోలో ఉంది. దీనికి రెండు లక్షల వ్యూలు రాగా, 6,500సార్లు షేర్ అయ్యింది.
• ప్రజల శరీరాల్లో మైక్రోచిప్‌లు పెట్టించేందుకు బిల్‌గేట్స్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్న వీడియోను యూట్యూబ్‌లో 20లక్షలమంది చూశారు.

కుబేరుడు, సుప్రసిద్ధుడు-అందుకే ఆరోపణలా?
ప్రపంచ కోటీశ్వరులలో ఆయన ఒకడు. తన సంపదలో పెద్ద మొత్తాన్ని ఆరోగ్య రంగం కోసం వెచ్చిస్తూ తన భార్య మెలిండాతో కలిసి ఛారిటీ నడుపుతున్నారు. మరి అలాంటి వ్యక్తి పేరు ఈ కరోనా కుట్రల్లో ఎందుకు వినిపిస్తోంది? ధనవంతుడు, పేరున్న వ్యక్తి కావడంవల్లే ఆయన చుట్టూ వివాదాలను కుట్రలను అల్లుతున్నారని మియామీ యూనివర్సిటీలో పొలిటికల్ సైంటిస్టుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ జోసెఫ్ అన్నారు. ఆయన ఇలాంటి కుట్ర సిద్దాంతాలపై ఒక పుస్తకం కూడా రాశారు. '' పేరున్న వ్యక్తులకు భయంకరమైన కుట్రలను ఆపాదిస్తారు'' అని ప్రొఫెసర్ జోసెఫ్ బీబీసీతో అన్నారు. ''కుట్రలన్నీ దాదాపు ఒకేరకంగా ఉంటాయి. కానీ పేర్లు మారుతుంటాయి అంతే'' అని వివరించారు ప్రొఫెసర్ జోసెఫ్. ''బిల్‌గేట్స్‌కు ముందు జార్జ్ సోరోస్, కోచ్ బ్రదర్స్, రోత్‌చైల్డ్స్, రాక్‌ఫెల్లర్ల పేర్లు కూడా వినిపించాయి'' అని ఆయన అన్నారు.
కొన్ని కుట్ర సిద్దాంతాలు ఆదిలోనే సమసిపోతాయి. పెద్ద మనుషుల పేర్లున్నవి, ప్రజలకు పెద్ద సమస్యలు అనిపించినవి మాత్రమే కొంతకాలం కొనసాగుతాయి. ''కుట్ర సిద్ధాంతాలను ధనవంతులకు, బడా కార్పొరేట్ సంస్థలకు ఆపాదించడం కొత్తకాదు. కొందరైతే ప్రజల మెడల్లో మైక్రోచిప్స్ పెట్టబోతున్నారు అంటూ ప్రచారం చేస్తారు. ఎందుకంటే అలాంటి వాటికి మనం భయపడతాం'' అని ప్రొఫెసర్ జోసెఫ్ అన్నారు.
'' కుట్ర సిద్దాంతాలకు చాలాకాలంగా ఇలాంటివే ఆయుధాలుగా మారుతున్నాయి'' అన్నారు జోసెఫ్. ఇలాంటి కుట్ర సిద్ధాంతాలలో నిజాలకు ఎక్కడా చోటుండదు. కానీ జనం వాటిని నమ్మేస్తూనే ఉంటారంటున్నారు ప్రొఫెసర్ జోసెఫ్. బిల్‌గేట్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ పేరుతో ప్రజల శరీరాల్లో మైక్రోచిప్‌లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న మాటలను అమెరికాలోని నాలుగింట ఒకవంతుకంటే ఎక్కువమంది ప్రజలు, రిపబ్లికన్లలో 44%మంది గట్టిగా నమ్ముతున్నారని యాహూన్యూస్, యూ-గవ్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఎక్కడో ఒక పాయింట్‌ను పట్టుకుని దాన్ని అసందర్భంగా వాడుకునే ప్రయత్నాలు జరుగుతాయని ఫ్యాక్ట్ చెకర్ రోరీ స్మిత్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఒక అధ్యయనానికి సంబంధించి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి నిధులు సమకూర్చింది. ఇది రోగి టీకా చరిత్రను డై ప్యాటర్న్‌లో నిల్వ చేసే అవకాశాన్ని పరిశీలించింది. ఇది కంటికి కనిపించదు. అయితే దీన్ని టీకాలాగా మన శరీరంలోకి కూడా పంపించవచ్చు. ఇలాంటి వాటిని పట్టుకుని కథలు అల్లేస్తారని స్మిత్ అన్నారు.
ఈ కుట్ర థియరీలకు మూలాలు ఎక్కడని వెతకడం చాలా కష్టం. కాకపోతే ఇంటర్నెట్‌లో అవి వేగంగా వ్యాప్తి చెందుతుంటాయి. '' గతంలో ఇలాంటివన్నీ వివిధ వర్గాలు, గ్రూపుల మధ్యే ప్రచారమయ్యేవి. ఇంటర్నెట్ రాకతో అవి విస్తృతంగా మారాయి. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు అనేక రకాల కుట్ర సిద్దాంతాలు పుట్టుకు రావడానికి ఇంటర్నెట్‌తో ఆస్కారం ఏర్పడింది'' అన్నారు ఫ్యాక్ట్ చెకర్ రోరీ స్మిత్. ''ప్రజలు మానసికంగా బలహీనంగా ఇటువంటి సమయంలో ఇలాంటి థియరీలు మరింత ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి'' అన్నారు స్మిత్. ''ఇప్పుడున్న సంక్షోభం పరిణామంలో, పరిధిలో ఎన్నడూ ఊహించనిది. ఇందులో సందిగ్ధత ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. ప్రజలు ఇలాంటి సందర్భాన్ని తట్టుకోలేరు'' అన్నా రోరీ స్మిత్. ఇలాంటి వాటిని అందరూ కలిసి కట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటారాయన. 'మనం ఏదైనా ఒక సమాచారాన్ని ఇవ్వాలని ప్రయత్నించినప్పుడు అక్కడే కల్పిత కథలు పుట్టుకొస్తుంటాయి. బిల్‌గేట్స్‌లాంటి కుట్ర సిద్ధాంతాలు సమాచార శూన్యతను ఆక్రమిస్తాయి'' అని చెప్పారు స్మిత్.

ఫొటో సోర్స్, Getty Images
వీటిని చూసి నవ్వుకోవాలా?
ఒకపక్క తప్పుడు వార్తలు వినిపిస్తున్నా, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం 300 మిలియన్ డాలర్లు ( 240 మిలియన్ యూరోలు)ను కేటాయించింది. ''ఆన్‌లైన్‌లో వెల్లువెత్తున్న కుట్ర సిద్ధాంతాలను చూసి మేం కలవరపడుతున్నాం. ఇలాంటివి ప్రజారోగ్యానికి చేటు తెస్తాయి'' అని బీబీసీకి ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్‌లో ఫౌండేషన్ ప్రకటించింది.
'' ఒకపక్క మహమ్మారి ప్రపంచంలో ఆరోగ్య సంక్షోభాన్ని, ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ప్రాణాలు ఎలా కాపాడాలని అంతా ఆలోచిస్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టాలి. అలాగే నిజాలను వ్యాపింపజేయాలి'' అని ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
తనపై ఇలాంటి కథనాలను వెలువడుతుండటడం పట్ల బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. '' ఇదంతా పిచ్చితనం. మనం వ్యాక్సిన్‌ను తయారు చేయగలిగితే 80శాతంమందికి దాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏదో కుట్ర ఉందని, ఎవరూ తీసుకోడానికి ముందుకు రాకపోతే, ఆ వైరస్ ప్రజలను చంపడం కొనసాగిస్తుంది'' అన్నారు బిల్‌గేట్స్
''ఇలాంటి వాటిలో నేను కేంద్ర బిందువుగా మారడంపై నాకు ఆశ్చర్యం వేస్తోంది. మేం కేవలం డబ్బు ఇస్తున్నాం. చెక్కులిచ్చేస్తున్నాం. పిల్లలను ఈ వ్యాధి నుంచి ఎలా రక్షించాలా అని మేం ఆలోచిస్తున్నాం. చిప్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటో నాకు అర్ధం కాలేదు. ఇలాంటి వాటిని చూసి నవ్వకోవడం తప్ప ఏం చేయలేం'' అన్నారు బిల్‌గేట్స్.
ఇవి కూడా చదవండి
- ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా తెగతెంపులు - ట్రంప్
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- ఏనుగు మరణం: కేరళ ఆలయాల్లో 600 ఏనుగులను చంపేశారని మేనకా గాంధీ ఆరోపణలు.. అది నిజమేనా?
- కరోనావైరస్తో కలిసి జీవించటం ఇలాగే ఉంటుందా? లాక్డౌన్ అనంతర ప్రపంచం ఎలా ఉందో చూపే ఫొటోలివీ...
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








