ఏనుగు మరణం: కేరళ ఆలయాల్లో 600 ఏనుగులను చంపేశారని మేనకా గాంధీ ఆరోపణలు.. అది నిజమేనా?

- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
‘‘కేరళలోని ఆలయాలు సుమారు ఆరు వందల ఏనుగుల కాళ్లు విరగ్గొట్టి, హింసించి, తిండి పెట్టకుండా చంపాయి. ఏనుగుల యజమానులు వాటికి ఇన్యూరెన్స్ చేయించి, ఆ తర్వాత కావాలనే వాటిని నీటిలో ముంచి, తుప్పుపట్టిన మేకులు గుచ్చి చంపేస్తుంటారు’’ అంటూ బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె ఆరోపణల్లో నిజం లేదని కొందరు అంటున్నారు.
కేరళలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు మృతి చెందిన ఉదంతంపై మేనకా గాంధీ స్పందిస్తూ.. ‘‘కేరళలోని మలప్పురం ఇలాంటి ఘటనలకు పేరు పొందింది. భారత్‌లోనే హింసాత్మక జిల్లా అది. ఉదాహరణకు ఒకేసారి 300-400 పక్షులు, కుక్కలను చంపేందుకు వాళ్లు రోడ్లపై విషం చల్లుతుంటారు’’ అని ఓ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు.
ఏనుగుల నిపుణుడు, కేరళ అటవీ పరిశోధన కేంద్రం మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.ఎస్.ఈసా బీబీసీతో ఈ విషయంపై స్పందించారు.
‘‘ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉన్న మొత్తం ఏనుగుల సంఖ్య 507. వీటిలో 2017లో 17, 2018లో 34, 2019లో 14 ఏనుగులు చనిపోయాయి. 2007 నుంచి 2018 వరకూ క్రూరత్వం కారణంగా 14 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి’’ అని ఆయన చెప్పారు. ఇదే సమాచారం ఆయన ఓ కేసులో హైకోర్టుకు నివేదికగా కూడా ఇచ్చారు.
మేనకా గాంధీ చెబుతున్నట్లుగా ఏనుగులపై అంత పెద్ద ఎత్తున హింస జరుగుతుంటే, అది ఎవరి దృష్టికీ రాకుండా ఉండదని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR / AFP / GETTY IMAGES
‘‘అలా జరిగితే, ఎవరో ఒకరు సోషల్ మీడియాలోనైనా పెడతారు. కేసులు నమోదవుతాయి. ఏనుగులను నీటిలో ముంచి చంపిన, కాల్చి చంపిన ఘటనలను నేనైతే చూడలేదు. విన్నది కూడా లేదు’’ అని ఈసా అన్నారు.
త్రిచూర్‌లోని కూడల్‌మానిక్యం గుడిలో ఓ ఏనుగు నాలుగు కాళ్లను నాలుగు మూలలకు కట్టేసి హింసిస్తున్నట్లు మేనక గాంధీ ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏనుగుల యజమానుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.శశికుమార్ ఈ ఆరోపణపై స్పందించారు.
‘‘ఆ గుడిని ప్రభుత్వం నడిపిస్తోంది. ఆ ఏనుగును కట్టేసేందుకు గొలుసు కూడా లేదు. ఈ ఆరోపణ వచ్చినప్పుడు చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ పారెస్ట్స్ ఓ అధికారిని తనిఖీ కోసం పంపించారు. ఆయన ఎలాంటి ఉల్లంఘనలనూ గమనించలేదు. ఏనుగుల బాగోగులు చూసుకోవడంలో ఆ గుడికి మంచి పేరు ఉంది’’ అని శశికుమార్ బీబీసీతో చెప్పారు.
‘‘గురువాయూర్‌లో 48 ఏనుగులు ఉన్నాయి. కోచి దేవస్వోమ్ బోర్డు పరిధిలో 9, ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు పరిధిలో 30, మలబార్ దేవస్వోమ్ బోర్డు పరిధిలో 30 ఏనుగులు ఉన్నాయి. మొత్తంగా 486 పెంపుడు ఏనుగులు ఉన్నాయి. మా సమాఖ్య పరిధిలో 380 ఉన్నాయి’’ అని చెప్పారు.
ఆలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు ఏనుగులు వాటిని అవి గాయపరుచుకోకుండా, మనుషులపై దాడి చేయకుండా గొలుసులతో కట్టేస్తామని శశికుమార్ చెప్పారు.
‘‘ఏనుగుల కాళ్లపై కొన్ని మరకలు కనిపిస్తాయి. వన్య ప్రాణి ప్రేమికులని చెప్పుకునే కొందరు, వాటిని హింసలా చూపించే ప్రయత్నం చేస్తారు. ఏనుగును ఇంట్లో పెట్టుకున్నా, కుక్కలకు వేసినట్లు గొలుసులు వేస్తాం అంతే’’ అని ఆయన వివరించారు.
వన్య ప్రాణి ప్రేమికులుగా చెప్పుకుంటున్నవారి ప్రధాన లక్ష్యం ఆలయాల్లో ఉత్సవాలను ఆపించడమేనని, ఏనుగులు ఈ ఉత్సవాల్లో భాగమని ఆయన అన్నారు.
మేనక గాంధీ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలుపుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, దేశ ప్రధాని నరేంద్ర మోదీలకు తాము లేఖ రాసినట్లు శశికుమార్ వివరించారు.
‘‘మేం ఎలాంటి విచారణ ఎదుర్కొంనేందుకైనా సిద్ధంగా ఉన్నాం. ఏనుగుల పరిరక్షణ ముసుగులో చాలా డబ్బు చేతులు మారుతోంది’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆలయ ఉత్సవాల్లో మోహరించే ఏనుగుల పరిస్థితిని పశు వైద్యులతో అటవీశాఖ పరిశీలిస్తుందని, అనారోగ్యంతో ఉన్న ఏనుగును అన్నీ సవ్యంగా ఉన్నట్లు చూపడం సాధ్యపడదని డాక్టర్ ఈసా అన్నారు. అయితే, కొన్ని లోటుపాట్లు ఉండే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు.
యజమానులవైపు నుంచి నిర్వహణ లోపాల వల్ల ఏనుగుల సంఖ్య తగ్గుతూ వస్తోందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డాక్టర్ ఈసా తెలిపారు. ఏనుగులకు సమయానికి ఆహారం అందేలా చూసే విషయమై కొన్ని ప్రతిపాదనలు కూడా ఆయన చేశారు.
పేలుడు పదార్ధాలు నింపిన అనాసపండుని తిని గర్భంతో ఉన్న ఏనుగు చనిపోవడం చాలా అరుదైన ఘటన అని శశికుమార్ అన్నారు.
ఈ ఘటన పాలక్కడ్ జిల్లాలో జరిగిందని, మేనక గాంధీ మలప్పురం జిల్లాలో జరిగినట్లు తప్పుగా చెప్పారని ఆయన వివరించారు.
పాలక్కడ్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని, ఇలాంటి హింసను సహించకూడదని శశికుమార్ వ్యాఖ్యానించారు.
కేరళ అటవీశాఖ మంత్రి, అదనపు చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మొబైల్ నెంబర్లు, ల్యాండ్‌లైన్ నెంబర్లు, ఇ-మెయిల్ అడ్రెస్‌లను కూడా ట్విటర్‌లో మేనకా గాంధీ పెట్టారు. కనీసం వారానికి ఓసారి వారికి ఫోన్లు, ఇ-మెయిళ్ల ద్వారా ఫిర్యాదులు చేయాలని ప్రజలను అభ్యర్థించారు.
మరోవైపు పాలక్కడ్‌లో ఏనుగు చనిపోయిన చోటుకు వన్య ప్రాణి సంబంధిత నేర విచారణ బృందాన్ని పంపించినట్లు కేరళ ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- చనిపోయారని మృతదేహం అప్పగించారు... ఆ తర్వాత కోలుకున్నారు వచ్చి తీసుకెళ్లండని ఫోన్ చేశారు...
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ-పాస్ తీసుకోవాలా.. వెళ్లాక ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలా హోం క్వారంటైనా
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం-ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- గ్రహశకలం 60 డిగ్రీల కోణంలో వచ్చి భూమిని ఢీకొట్టింది.. 30 కిలోమీటర్ల లోతున బిలం ఏర్పడింది
- అన్‌లాక్: భక్తుల కోసం సిద్ధమైన ఆలయాలు.. కొత్తగా వచ్చే మార్పులు ఇవే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








