డైనోసార్లు: గ్రహశకలం 60 డిగ్రీల కోణంలో వచ్చి భూమిని ఢీకొట్టింది.. 75 శాతం జీవరాశులు తుడిచిపెట్టుకుపోయాయి

ఫొటో సోర్స్, chase stone
భూమిని 66 మిలియన్ ఏళ్ల క్రితం ఢీకొట్టిన భారీ గ్రహ శకలం ఎందుకంత విధ్వంసం సృష్టించిందో ఇప్పుడిప్పుడే స్పష్టంగా తెలుస్తోంది.
డైనోసర్లతోపాటు భూమిపై 75 శాతం జీవరాశుల్ని తుడిచిపెట్టిన ఆ గ్రహ శకలం.. భూమిపై అత్యంత సున్నితమైన ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకర కోణంలో ఢీకొట్టిందని తాజా పరిశోధన చెబుతోంది.
ప్రస్తుతం గ్రహ శకలం ఢీకొట్టడంతో ఏర్పడిన బిలం దగ్గర కంప్యూటర్ సిమ్యులేషన్ల సాయంతో శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. దీంతో దాదాపు 60 డిగ్రీల కోణంతో భూ ఉపరితలాన్ని గ్రహ శకలం ఢీకొట్టినట్లు తేలింది.
అలా ఢీకొనడంతో వాతావరణ విధ్వంసం మరింత పెరిగినట్లు వెలుగులోకి వచ్చింది.
గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని గ్రహ శకలం ఢీకొన్న రాళ్లలో సల్ఫర్ భారీగా ఉంది. ఈ సల్ఫర్ జిప్సం ఖనిజం నుంచి వచ్చింది. గ్రహ శకలం ఢీకొట్టిన అనంతరం ఎత్తుకు ఎగిసిన సల్ఫర్.. వాతావరణంలోని నీటి ఆవిరితో కలిసిపోవడంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా శీతాకాలం లాంటి పరిస్థితి ఏర్పడింది.
గ్రహ శకలం ఢీకొట్టిన తీరు.. పర్యావరణంపై ప్రభావం మరింత ఎక్కువగా, దీర్ఘకాలం ఉండేలా చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
"45 నుంచి 60 డిగ్రీల కోణంతో ఢీకొడితే.. ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఢీకొట్టడంతో ఎగిసిపడిన పదార్థాలు వాతావరణంలో భారీ ఎత్తులకు చేరుతాయి. అయితే ఈ కోణం ఇంతకంటే తగ్గినా లేదా పెరిగినా.. వాతారణంలో ఈ స్థాయి మార్పులు రాకపోవచ్చు." అని ఇంపీరియల్ కాలేజీ లండన్‌లోని ప్రొఫెసర్ గ్యారెత్ కోలిన్స్ వివరించారు.
"గ్రహ శకలం ఢీకొట్టిన చోటు, ఆ కోణం కలిసి ఒక పెద్ద విధ్వంసంలా మారినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి." అని బీబీసీ న్యూస్‌తో ఆయన చెప్పారు.
భూమిపై నివసించే చాలావరకు జీవరాశులు ఈ ప్రభావానికి తట్టుకోలేక మరణించాయి.
ప్రొఫెసర్ కోలిన్స్ చేపట్టిన ఈ అధ్యయనం జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైంది.
గ్రహ శకలం ఢీకొట్టిన బిలంపై పరిశోధన చేపడుతున్న అంతర్జాతీయ పరిశోధకుల బృందంలో ప్రొఫెసర్ కోలిన్స్ కూడా ఒకరు.
200 కి.మీ. వైశాల్యమున్న ఈ బిలం మెక్సికోలోని యుకటన్ ద్వీపకల్పంలో ఉంది. దీని కేంద్ర భాగం చిక్సులూబ్ నౌకాశ్రయానికి సమీపంలో ఉంది.
బిలం ఏర్పడటానికి కారణమైన శక్తి తీవ్రతను అంచనా వేయడం కొంచెం కష్టమే.
12 కి.మీ. వ్యాసమున్న ఆ గ్రహ శకలం ఢీకొట్టడంతో భూ ఉపరితలంపై దాదాపు 30 కి.మీ. లోతైన బిలం ఏర్పడింది. బిలానికి కేంద్ర స్థానంలో కరిగిపోయిన రాళ్లు పైకి ఎగసి.. కొన్ని నిమిషాల్లోనే ఎవరెస్టు కంటే ఎత్తైన పర్వతంలా రూపాంతరం చెందాయి. అయితే ఇది ఎక్కువసేపు నిలువలేదు. మళ్లీ వెనక్కి పడిపోయి.. చిన్న కొండలు, శిఖరాలతో వలయంలా ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, G.collins
ప్రొఫెసర్ కోలిన్స్ చెబుతున్న దానిలో విశేషమేంటంటే.. చిక్స్‌లూబ్ భూ ఉపరితల నిర్మాణాల్లో ఆ తేడాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.
ఉదాహరణకు బిలం కేంద్రాన్ని చూస్తే.. గ్రహ శకలం ఢీకొట్టడంతో ఏర్పడిన కొండ.. కిందపడిన తర్వాత ఏర్పడిన వలయ కేంద్రం (పీక్ రింగ్ సెంటర్), భూమి లోపల లావా ఎక్కువగా ఎగసిపడ్డ కేంద్రం (మాంటిల్ అప్‌లిఫ్ట్ సెంటర్) ఒకదానిపై ఒకటి లేవు. నిజానికి ఒకటి ఈశాన్య దిశలో మరొకటి వాయువ్య దిశలో ఉన్నాయి. ఈ రెండు కేంద్రాలకు మధ్యలో బిలం కేంద్రం (క్రేటర్ సెంటర్) ఉంది.
గ్రహ శకలం వచ్చిన దిశతోపాటు అది ఢీకొట్టిన కోణాన్నీ కనిపెట్టడంలో ఇది కీలకమైన ఆధారం.
దీనికి సంబంధించి యూకే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెసిలిటీస్ కౌన్సిల్ (ఎస్‌టీఎఫ్‌సీ)కి చెందిన డీఐఆర్ఏసీ హైకంప్యూటింగ్ సదుపాయాల్లో ఇంపీరియల్ కాలేజీ పరిశోధకుడు కోలిన్స్ చాలా సిమ్యులేషన్లు తయారుచేశారు. అయితే ప్రస్తుతమున్న భూఉపరితల నిర్మాణం ఏర్పడాలంటే.. గ్రహశకలం ఈశాన్య దిశలో రావాలని, 60 డిగ్రీల కోణంలో అది భూమిని ఢీకొట్టాలని ఆయన తేల్చారు.
"30 డిగ్రీలు, 45 డిగ్రీలతో గ్రహ శకలం ఢీకొట్టి ఉంటే ఇలాంటి భూఉపరితలం ఏర్పడి ఉండేదికాదని సిమ్యులేషన్లు చెబుతున్నాయి. ఒకవేళ 30 లేదా 45 డిగ్రీలతో ఢీకొట్టివుంటే.. క్రేటర్ సెంటర్‌కు.. మాంటిల్ అప్‌లిఫ్ట్ సెంటర్, పీక్ రింగ్ సెంటర్ రెండూ వాయువ్య దిశలోనే ఉండేవి. 90 డిగ్రీలతో నేరుగా ఢీకొట్టి ఉంటే అన్ని ఒకదానిపై ఒకటి ఉండేవి" అని ప్రొఫెసర్ కోలిన్స్ చెప్పారు.
"ఏ దిశలో గ్రహ శకలం ఢీకొట్టిందో తెలుసుకోవడమంటే... భూమిపై అత్యంత తీవ్రమైన ఒత్తిడి ఏ ప్రాంతంపై పడిందో తెలుసుకోవడమే"అని అధ్యయనంలో పాలుపంచుకున్న ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ జోయానా మోర్గన్ వివరించారు.
తూర్పు నుంచి పశ్చిమం, దక్షిణం వెళ్లేకొద్దీ సల్ఫర్, కార్బన్‌లతో నిండిన అవక్షేప శిలల మందం పెరుగుతూ వస్తోందని ఆమె అన్నారు.
"గ్రహ శకలం వచ్చిన దిశ, అది ఢీకొట్టిన కోణంపై ఇప్పటివరకు జరిగుతున్న చర్చకు కొత్త మోడల్ ముగింపు పలుకుతోంది"అని బీబీసీ న్యూస్‌కు టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సీన్ గులిక్ చెప్పారు.
"సల్ఫర్ శిలల అవక్షేపం వాతావరణంలోకి భారీగా ఎగసిపడేందుకు కారణమయ్యే కోణాల్లో 60 కూడా ఒకటి కావడం.. అనే కీలకమైన సమాచారాన్ని ఈ పరిశోధన తెలిపింది"
"జీవరాశులు ఎలా మరణించాయో తెలుసుకోవడంలో ఈ పరిశోధనా ఫలితాలు కీలకంగా మారనున్నాయి"
2016లో చిక్స్‌లూబ్ బిలంలో శిలల కోసం అన్వేషణ జరిపిన పరిశోధకుల బృందానికి గులిక్, మోర్గన్ నేతృత్వం వహించారు. ఈ నిర్మాణాలకు సంబంధించిన 3డీ నమూనాలు సిద్ధంచేసేందుకు అవసరమయ్యే హైరిజొల్యూషన్ సైస్మిక్ సర్వే వచ్చే వేసవిలో జరగనుంది.

ఫొటో సోర్స్, Getty Images
భూమిపై జీవం స్థితిగతులు మారాయి ఇలా..
- 66 మిలియన్ ఏళ్ల క్రితం 12 కి.మీ. వ్యాసమున్న ఓ గ్రహ శకలం భూమిని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
- గ్రహ శకలంతో ఏర్పడిన బిలం 200 కి.మీ. వ్యాసంలో ఉంది. చాలావరకు ఇది సముద్రం లోపల ఉంది.
- నేలపై కనిపిస్తున్న బిలంపై సున్నపురాయి ఉంది. దాని అంచుల్లో చిన్న చిన్న బిలాలు కనిపిస్తున్నాయి.
- శిలలపై అధ్యయనం చేపట్టేందుకు, గ్రహ శకలం ఢీకొట్టినప్పటి పరిస్థితులను తెలుసుకునేందుకు పరిశోధకులు బిలంలో అన్వేషణ చేపట్టారు.
- ఈ గ్రహశకలం ఢీకొట్టడంతో జరిగిన పరిణామాలకు.. భూమిపై భారీగా జీవులు అంతరించిపోయేలాచేసే సామర్థ్యం ఉందని వారంటున్నారు.
ఇవి కూడా చూడండి:
- చిరుత పులి బలహీనతలేంటో మీకు తెలుసా!?
- BBC Special: ఈ ఆవులను ఎవరు చంపుతున్నారు?
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- గూగుల్‌లో మగవారిపై వివక్ష!
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








