ఏనుగుల దెబ్బకు భయపడి చెట్లపై జీవిస్తున్నారు

- రచయిత, విజయ్ గజం
- హోదా, బీబీసీ కోసం
మనిషికీ, ఏనుగుకూ మధ్య ఏర్పడుతున్న ఘర్షణకు మరో కోణమిది.
సుమి పోలై భర్త చైతన్య పోలై కోసం రోజూ రాత్రి వేళ చెట్టుపైకి భోజనం తీసుకెళ్తారు. ఏనుగుల నుంచి పంటలను, గ్రామస్థుల ప్రాణాలను కాపాడటానికి పొలం వద్ద చెట్లపై ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసంలో ఆయన భార్యాపిల్లలతో ఉంటున్నారు.
సుమి ఒక్కరే కాదు, ఒడిశాలోని కియోంజార్ జిల్లా పిట్టాపిటి గ్రామంలో ఎంతో మంది ఏనుగుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇలాంటి ఆవాసాల్లో ఉంటున్నారు.
ఈ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఏనుగుల గుంపుల ఆగడాలను భరించలేక స్థానికులు చెట్లపై ఉంటున్నారు. 30 ఏనుగుల మంద వీరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

25 అడుగుల ఎత్తుల ఏర్పాటు
దాదాపు 100 అడుగుల ఎత్తైన భారీ వృక్షాలపై కొమ్మల మధ్యలో, నేల నుంచి 25 అడుగుల ఎత్తులో వెదురుకర్రలు, టార్పాలిన్ షీట్లు, ఆకులతో గ్రామస్థులు ఈ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రొంగ మట్యా గ్రామానికి చెందిన జయకృష్ణ మహంతో అనే గిరిజనుడు బీబీసీతో మాట్లాడుతూ- ఏనుగులు తమ ఇళ్లను, పంటలను నాశనం చేస్తున్నాయన్నారు.
"ఇంట్లో ఉండాలంటే భయం. అందుకే రాత్రుళ్లు ఇక్కడ ఉంటున్నాం. పంటలను కాపాడుకోవడానికి మాకు ఇది తప్పడం లేదు. అటవీ అధికారులు పంట నష్టం అంచనా వేసుకొని వెళ్తున్నారు'' అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

'ఏనుగుల దాడిలో మా బంధువు చనిపోయారు'
ఏనుగులు ఇళ్ల మీదకు వస్తున్నాయని ఇదే గ్రామానికి చెందిన జానకీ మహంతో ఆందోళన వ్యక్తంచేశారు. తామెంతో ఖర్చు పెట్టి పంటలు వేస్తున్నామని, వాటిని ఏనుగులు నాశనం చేస్తున్నాయని చెప్పారు.
అటవీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఏనుగులు వెళ్లాకగాని రావడం లేదని ఆమె విమర్శించారు. వారు వచ్చేలోగా పంటలు పూర్తిగా నాశనమవుతున్నాయన్నారు.
"ఏనుగులు వస్తుంటే చెట్లపైన ఉండే మావాళ్లు కేకలు వేస్తుంటారు. మేం ఏనుగుల కంట పడకుండా దాక్కుంటాం. మా ఇంటి దగ్గర బియ్యం లాంటివి తినేసి మా నివాసాలను ధ్వంసం చేస్తున్నాయి. ఇటీవల మా బంధువుల ఇల్లును కూల్చేశాయి. వాటి దాడిలో బంధువు ఒకరు చనిపోయారు" అని ఆమె తన బాధను పంచుకున్నారు.

ఏళ్ల తరబడి చెట్లపైనే నివాసం
కియోంజార్ జిల్లాలో 50 నుంచి 100 వరకు ఏనుగులు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.
బీబీసీ పర్యటించిన పిట్టాపిటి, కియోంజార్, రొంగమట్యా, గోట్టా ఘా లాంటి ప్రాంతాల్లో ఏనుగుల సంచారం చాలా ఎక్కువ. 30 నుంచి 40 ఏనుగులు గుంపులుగా గ్రామాలపై దాడులు చేస్తున్నాయి.
గ్రామస్థులు ఉదయం పొలాల్లో పనులు చేసుకొని, రాత్రి చెట్లపై ఉన్న నివాసాలకు చేరుకొంటున్నారు.

జిల్లాలోని చంపూవా, జోడా, బార్బిల్, ఘటాగోవాన్ బ్లాకుల్లో గ్రామస్థులు చెట్లపై చెక్కవేదికను నిర్మిస్తున్నారు.
ఈ ఆవాసాలు పక్షులు పంటలను పాడు చెయ్యకుండా ఏర్పాటు చేసుకునే మంచెలను పోలి ఉంటాయి.
ఏనుగులు చెట్లను ఎక్కలేవు. ఈ ఆవాసాలను ధ్వంసం చేయలేవు.
పిట్టాపిటి వాసి చైతన్య పోలై కొన్నేళ్లుగా చెట్లపైనే నివసిస్తున్నారు.
తమకు, వ్యవసాయమే ఆధారమని, ఏనుగులను తరిమేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తైన ప్రదేశం నుంచి చూడడం వల్ల సుదూర ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలుస్తుందని, ఏనుగులు రావడం గమనిస్తే గట్టిగా శబ్దాలు చేస్తామని, ఒక్కోసారి ఏనుగులు తమపై తిరగబడతాయని, అప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏనుగులకు దొరక్కుండా పారిపొతామని తెలిపారు.

తప్పెవరిది?
ఏనుగులు తరచూ ఇలా జనావాసాల్లోకి రావడానికి మానవ తప్పిదాలే కారణమంటున్నారు పర్యావరణ కార్యకర్తలు.
కియోంజార్ జిల్లా ఇనుము, ఉక్కు పరిశ్రమలకు పెట్టింది పేరు. ఈ అటవీ భూముల్లో కర్మాగారాలు పెట్టడంతో ఏనుగులు ఆ శబ్దాలు, కాలుష్యం, ఆహార కొరత వల్ల మనుషులుండే చోటకు వస్తున్నాయని వారు చెప్పారు. ఈ క్రమంలో ఏనుగులూ ప్రమాదాల బారిన పడుతున్నాయి.
కియోంజార్ జిల్లాలో ఆగస్టు 21న రోడ్డు దాటుతుండగా రెండు ట్రక్కులు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు చనిపోయాయి. వీటి మరణంపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు అదేశించింది.

పర్యావరణ కార్యకర్త రత్నం బీబీసీతో మాట్లాడుతూ- ఏనుగుల ఆవాసాలను పరిశ్రమల పేరుతో ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఏనుగుల భయంతో ప్రజలు చెట్లపై నివసించే పరిస్థితికి కారణం పరిశ్రమలకు అనుమతులు ఏనుగులు నివాసముంటున్న ప్రాంతాల్లో ఇవ్వడమేనని తెలిపారు. దీంతో ఏనుగులు తప్పనిసరై గ్రామాలపై పడుతున్నాయన్నారు.
అసియా సంతతి ఏనుగులు అరుదైనవని, వీటిని కాపాడుకొవాల్సిన బాధ్యత ఉందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఏనుగుల అభయారణ్యాలను కాపాడుతూ గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ఈ అంశంపై ఒడిశా అటవీ శాఖ అధికారులను బీబీసీ సంప్రదించగా- వారి నుంచి స్పందన ఇంకా రాలేదు.
ఇవి కూడా చదవండి:
- మనుషుల కంటే ముందు అంతరిక్షంలోకి రోబోలను పంపనున్న ఇస్రో
- ఆంధ్రా బ్యాంకు చరిత్ర: తెలుగు నేలపై పుట్టిన బ్యాంకు పేరు త్వరలో కనుమరుగు
- ఇది భారత ఆర్థికవ్యవస్థ మందగమనమా లేక మాంద్యమా?
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- దళితులు: వివక్ష, కట్టుబాట్ల మీద పెరుగుతున్న ధిక్కారానికి కారణమేమిటి? ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








