వరవరరావు అరెస్ట్: ‘బెయిలూ ఇవ్వడం లేదు.. కేసు విచారణ సాగనివ్వడం లేదు.. ఎటూ తేల్చకుండా ఎన్నాళ్లు జైల్లో పెడతారు’

ఫొటో సోర్స్, Facebook/Bhasker Koorapati
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్రలోని పుణె సమీపంలో బీమా కోరేగాం హింసలో మావోయిస్టుల ప్రమేయం ఉందని.. ఆ కేసు దర్యాప్తు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నిన విషయం వెలుగు చూసిందని.. అరెస్టయిన వారిలో కొందరికి అందులోనూ ప్రమేయం ఉందని పోలీసులు ఆరోపించారు.
విరసం నేత వరవరరావు సహా అరెస్టయిన తొమ్మిది మంది ఉద్యమకారులూ ఏడాది కాలంగా జైళ్లలోనే ఉన్నారు. వారి బెయిలు దరఖాస్తులను కోర్టులు పలుమార్లు నిరాకరించాయి. కొన్ని పిటిషన్లపై విచారణలు, తీర్పులు వాయిదా పడుతున్నాయి. కేసు విచారణ కూడా వాయిదాలతో సాగుతోంది.
బెయిలు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఎన్నాళ్లు జైళ్లలో ఉంచుతారని వీరి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలింతకీ ఈ కేసు ఏమిటి? ఇప్పటివరకూ ఏం జరిగింది... ?

ఫొటో సోర్స్, Mayuresh Konnur
భీమా కోరేగాం హింస... హక్కుల కార్యకర్తల అరెస్టులు
2018 జనవరి 1న మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల భీమా-కోరెగావ్‌లో.. ''పీష్వాలపై దళితుల విజయం'' ద్విశతాబ్ది ఉత్సవాల నిర్వహణ సందర్భంగా హింస చెలరేగింది. ఆ హింసలో ఒక వ్యక్తి చనిపోగా, పోలీసులు సహా పలువురు గాయపడ్డారు.
తొలుత.. ఆ హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై హిందూ సంస్థల ప్రతినిధులు శంభాజీ భిడే, మిలింద్ ఏక్బోటేలపై కేసు నమోదు చేశారు. వీరిలో మిలింద్ ఏక్బోటేను అరెస్ట్ చేయగా ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. శంభాజీ భిడేను అరెస్ట్ చేయలేదు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
అనంతరం.. ఆ హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై రిపబ్లికన్ పాంథర్స్ జాతి అంతాచీ చల్వల్(ఆర్‌పీ) నేత సుధీర్ ధవలే, నాగ్‌పూర్‌కి చెందిన హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, దిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్‌లతో పాటు.. నాగ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సోమా సేన్, పీఎంఆర్‌డీ మాజీ పరిశోధకుడు మహేశ్ రావుత్‌లను ముంబై, నాగ్‌పూర్, దిల్లీలలో పుణె పోలీసులు 2018 జూన్ మొదటి వారంలో అరెస్ట్ చేశారు.
వీరందరూ పట్టణాల్లో అగ్రస్థాయి మావోయిస్టులని పోలీసులు ఆరోపించారు. వీరి నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో కొన్ని ఎలక్ట్రానిక్ స్టోరేజీ పరికరాలు, సీడీలు, కొన్ని ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నామని.. వాటిని పుణె ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించి.. వాటి నుంచి మిర్రర్ ఇమేజీలను సేకరించామని పేర్కొన్నారు.
ఆ ప్రింటవుట్లను పరిశీలించగా.. రాజీవ్‌గాంధీ హత్య తరహాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని హత్య చేయటానికి నక్సలైట్లు కుట్ర పన్నిన విషయం వెల్లడైందని తెలిపారు. ఈ సాక్ష్యాల ఆధారంగా ఈ ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images / Facebook
వరవరరావు సహా ఐదుగురు ఉద్యమకారుల అరెస్ట్
అనంతరం 2018 ఆగస్టు 28న.. విప్లవ రచయితల సంఘం (విరసం) నేత పెండ్యాల వరవరరావు సహా.. పలువురు హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, రచయితల ఇళ్లల్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేశారు. హైదరాబాద్ నుంచి వరవరరావును అరెస్ట్ చేసి తమతో పాటు పుణె తీసుకెళ్లారు.
అదే రోజు దేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి.. న్యాయవాది, హక్కుల కార్యకర్త సుధా భరద్వాజ్, ప్రజాస్వామ్య, మానవ, పౌర హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖా, సుధీర్ ధావలె విడుదల కోసం పనిచేస్తున్న న్యాయవాది, హక్కుల కార్యకర్త అరుణ్ ఫెరీరా, రచయిత, ఉద్యమకారుడు వెర్నన్ గొంజాల్వెజ్‌లను కూడా అరెస్ట్ చేశారు.
భీమాకోరేగావ్ అల్లర్లకు సంబంధించి జూన్‌లో అరెస్టు చేసిన వారిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని.. వారంతా ప్రధానమంత్రి మోదీ హత్యకు కుట్ర పన్నారని.. వారికి వరవరరావు ఆర్థికంగా సహకరిస్తున్నారని మహారాష్ట్ర పోలీసుల అభియోగం.
ఈ మేరకు వరవరరావుపై ఐపీసీ 153 (ఏ), 505 (1) (బీ), 117, 120 (బీ), చట్ట వ్యతిరేక చర్యల (నియంత్రణ) చట్టం సెక్షన్ 13, 16, 17, 18 (బీ), 20, 38, 39, 40 సెక్షన్ల కింద మహారాష్ట్ర పుణె జిల్లా విశారంబాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఈ కేసులన్నీ పోలీసుల సృష్టేనని.. భీమా-కోరేగావ్ హింసకు కారకులైన శంభాజీ భీడే, మిలింద్ ఏక్బోటేల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్ర పోలీసులు ఇలా చేశారని విరసం నేత వరవరరావు గతంలో బీబీసీతో మాట్లాడుతూ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏడాది గడచినా విచారణ ఖైదీలుగానే...
ఐదుగురు కార్యకర్తల అరెస్టును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కోర్టు ఈ ఐదుగురిని అక్టోబర్ 25 వరకూ గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. అనంతరం గౌతమ్ నవలాఖాకు నిర్బంధం నుంచి కోర్టు విముక్తి కల్పించగా 2018 నవంబర్‌లో మిగతా నలుగురిని పోలీసులు మళ్లీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.
వీరందరూ వామపక్షవాదులు, మావోయిస్టు సానుభూతిపరులుగా భావిస్తున్నారు. వీరు ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని చాలా అంశాల్లో వ్యతిరేకిస్తున్నారు. వీరిలో ఫెరీరా, వరవరరావులను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అంతకు ముందు కూడా అరెస్టు చేశారు.
మావోయిస్టులతో వారికి సంబంధాలున్నాయని, అందుకు సంబంధించిన ఆధారాలు దొరికినందునే వారిని అరెస్ట్ చేశామని పుణె పోలీసులు పేర్కొన్నారు. హక్కుల సంఘాలు, వామపక్ష ప్రజాసంఘాలు మాత్రం ఇదంతా కుట్రేనని, ప్రశ్నించే గొంతును నొక్కడమేనని ఆరోపించాయి.
2019 ఫిబ్రవరిలో దళిత ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డేను కూడా పోలీసులు అరెస్టు చేయగా, ఆ అరెస్టు అక్రమం అంటూ ఆయన్ను పుణె కోర్టు విడుదల చేసింది.
ఈ కేసు విచారణను కొనసాగిస్తూనే తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఇటీవల వరవరరావు భార్య హేమలత 2019 ఏప్రిల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు.
2018 జూన్‌లో అరెస్టయిన సురేంద్ర గాడ్లింగ్, సోమాసేన్, సుధీర్ ధావాలే, మహేశ్ రౌత్, రోనా విల్సన్‌లు.. ఆగస్టులో అరెస్టయిన వరవరరావు, సుధా భరద్వాజ్, సుధీర్ ధావాలె, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెజ్‌లు.. ఏడాది దాటినా ఇంకా విచారణ ఖైదీలుగానే పుణె ఎరవాడ జైలులో నిర్బంధంలో ఉన్నారు.
ఈ కేసులో పోలీసులు 2018 నవంబర్‌లో ప్రాథమిక చార్జిషీట్ సమర్పించారు. మళ్లీ 2019 ఫిబ్రవరిలో అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొదటి చార్జిషీట్ దాఖలు చేసి దాదాపు పది నెలలవుతున్నా.. విచారణలో పురోగతి లేదు. వీరి బెయిల్ దరఖాస్తులూ పెండింగ్‌లోనే ఉన్నాయి.

'ఇంకా 290 వాయిదాలు ఉంటాయి' అన్నారు: హేమలత
''కేసు విచారణ ముందుకు సాగడం లేదు. ఆరు నెలలుగా బెయిల్‌పై వాదనలు నడుస్తున్నాయి. తీర్పు రిజర్వు చేశాక జడ్జి బదిలీ అయ్యారు. కొత్త జడ్జి మళ్లీ మొదటి నుంచి వాదనలు వినాలి అంటున్నారు'' అని వరవరరావు భార్య హేమలత బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
''పై కోర్టుల్లో బెయిల్ కోసం వెళితే కింది కోర్టుల నుంచి రావాలి అంటారు. కింది కోర్టు రిజెక్ట్ చేస్తే పైకోర్టుకు వెళ్లొచ్చు. కానీ కింది కోర్టు రిజెక్ట్ చేయదు. అలా సాగదీస్తారు. బెయిలూ ఇవ్వడం లేదు.. కేసు ముందుకు సాగనివ్వడం లేదు'' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికి పది వాయిదాలు అయ్యాయని.. అయినా ఒక్కరి వాంగ్మూలం కూడా పూర్తి కాలేదని చెప్పారు. ''ఈ పిటిషన్ వంక పెట్టి బెయిల్ ఇంకా ఆలస్యం చేస్తున్నారు. మీ కేసు ఇంకా 290 వాయిదాలు పడుతుందని అక్కడి పీపీ, శివాజీ పవార్ అనే పోలీస్ అధికారి చెప్పారు'' అని తెలిపారు.
దీనికితోడు సంబంధం లేనివీ, ఎప్పుడో మూసేసినవీ కేసులు తీసి మళ్లీ పెడుతున్నారని హేమలత పేర్కొన్నారు. ''ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అహిర్ స్టేషన్ పరిధిలో మందు పాతర కేసు పెట్టారు. కర్ణాటకలో ఒక కేసు పెట్టారు. బెయిల్ వచ్చినా బయటకు రాకుండా కుట్రలు చేస్తున్నారు'' అని ఆమె ఆరోపించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/KRANTHI TEKULA
‘‘నేను ఆయన భార్యనని పోలీసులు సర్టిఫికెట్ ఇవ్వాలట’’
''సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాను. సమాధానం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశా. సమాధానం లేదు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు, వరవరరావూ ఎమర్జెన్సీ సమయంలో కలిసే జైల్లో ఉన్నారు. ఆ పరిచయం ఉంది. ఆయనకూ లేఖ రాశాం. ఆయన ఆ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు అంతే. అంతకుమించి ఎవరూ ఏమీ చేయడం లేదు'' అంటూ హేమలత విచారం వ్యక్తంచేశారు.
''ఏడాది కాలం చాలా భారంగా, కష్టంగా ఉంది. వరవరరావుకు ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా వెనుకటిలా తట్టుకునే శక్తిలేదు. ఛత్తీస్‌గఢ్ ప్రయాణంతో ఆయనకు 20 ఏళ్ల తరువాత పైల్స్ తిరగపెట్టింది. దీంతో ఎంతో రక్తం పోతోంది'' అని తెలిపారు.
''సోమాసేన్‌కి ఆర్థరైటిస్ ఉంది. కానీ కనీసం మంచం కూడా లేదు. వరవరరావుకూ మంచం, కుర్చీ ఏమీలేవు. గతంలో పదేళ్లు జైల్లో ఉన్నా ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ లేదు. సురేంద్ర గాడ్లింగ్‌కు అక్కడకు వెళ్లాక స్టెంట్ వేశారు'' అని వివరించారు.
పది రోజుల క్రితం పుణె వెళ్లానని.. అక్కడ జైళ్ల పరిస్థితి ఏమీ బాలేదని చెప్పారామె. ''పుణె జైలు నిబంధనలు విచిత్రంగా ఉన్నాయి. నేను జైల్లో ఆయన కలవాలంటే, నేను ఆయన భార్యననే హైదరాబాద్ పోలీసులు నాకు సర్టిఫికేట్ ఇవ్వాలంట. ఆయన ఇంటి పేరు ఉంటేనే కలవనిస్తున్నారు. మా అమ్మాయిల ఇంటిపేర్లు మార్చుకోలేదు కాబట్టి వారిని పంపించారు. మనవళ్లు కొడుకు పిల్లలైతే పంపుతారు. నాకు కొడుకులు లేరు. కూతురు పిల్లల్ని పంపరట'' అని చెప్పారు.
''ఇలాగే అరెస్టయిన ఒకాయన భార్య ఇంటి పేరు రికార్డుల్లో మారలేదని ఆమెను పంపలేదు. అంతేకాదు, కలవడానికి వెళ్లే ముందు వారిచ్చే ఫామ్‌లో గ్యాంగ్ పేరు రాయాలన్నారు. అక్కడ గ్యాంగ్ అని ఒక కాలమ్ ఉంది. వీళ్లు గ్యాంగ్ నుంచి రాలేదు.. రాజకీయ ఖైదీలు అని చెప్పాను వారికి అర్థం కాలేదు. ఒప్పుకోలేదు. చివరకు అక్కడ విరసం అని రాయాల్సి వచ్చింది'' అని హేమలత తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఎమర్జెన్సీని మించిన భయం ఇప్పుడుంది: రొమిలా థాపర్
- 'మమ్మల్ని కొట్టకండి, కాల్చి చంపేయండి...' భారత సైన్యం హింసకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న కశ్మీరీలు
- ‘ఫాసిజం వైపు ఫాస్ట్ ఫార్వర్డ్?’
- ‘నక్సలైట్ల కుట్ర కేసులు’ ఎన్నిసార్లు రుజువయ్యాయి?
- స్ఫూర్తి ప్రదాతల కోసం దళితుల వెదుకులాట
- ఇందిరాగాంధీతో పోటీపడుతున్న నరేంద్ర మోదీ
- విపిన్ సాహు పారాగ్లైడింగ్: ‘రూ.500 ఎక్కువ ఇస్తా, కిందకు దించు బాబోయ్’
- Fact Check: యువకుడిని కొట్టి చంపారంటూ వైరల్ అయిన వీడియోలో నిజమెంత?
- హ్యూమన్ రైట్స్ వాచ్: కశ్మీర్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలను భారత్ పునరుద్ధరించాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









