భీమా కోరేగావ్: పుణేలోని ఎరవాడ జైల్లో నిర్బంధించిన ఆ అయిదుగురికి ఏడాదిగా బెయిల్ రాలేదు... ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images/Facebook
- రచయిత, హలీమా ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
భీమా కోరేగావ్ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన తొమ్మిది మంది రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. తమను విడుదల చేయాలని కోరారు. తమపై ఆరోపణలు బూటకమని వాదించారు. తమను మీడియా విచారిస్తోందని కూడా వారు ఆరోపించారు.
ఒకరి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన ఎవరినైనా అరెస్ట్ చేయటం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని వారన్నారు.
భీమా కోరేగావ్ హింస కేసులో పుణే పోలీసులు 2018 జూన్‌లో అయిదుగురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టులో మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
వీరిని అరెస్ట్ చేసి ఏడాది అవుతోంటే, పుణె పోలీసులు మరోవైపు రాంచీలో ఫాదర్ స్టెన్ స్వామి ఇంటిపై దాడి చేశారు. ఆయన ఇంటి నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పుణే పోలీసులు గత ఏడాది కూడా స్టెన్ స్వామి ఇంటిపై దాడి చేశారు. కానీ ఆయనను అరెస్ట్ చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అరెస్ట్ అయిన వారు ఎవరు?
పోలీసులు 2018 జూన్‌లో అరెస్ట్ చేసిన వారిలో ఉద్యమకారుడు సుధీర్ ధావలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, సామాజిక కార్యకర్త మహేశ్ రౌత్, ప్రొఫెసర్ సోమా సేన్, సామాజిక కార్యకర్త రోనా విల్సన్‌లు ఉన్నారు.
2018 ఆగస్టులో వరవరరావు, సుధా భరద్వాజ్, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరందరినీ యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. నిషిద్ధ మావోయిస్టు సంస్థతో వీరికి సంబంధం ఉందని, ఎల్గార్ పరిషత్‌కు మావోయిస్ట్ సంస్థ ద్వారా ఆర్థిక మద్దతు సమకూర్చారని వీరిపై పోలీసులు అభియోగం మోపారు.
ఈ నిందితుల బెయిల్ దరఖాస్తుల మీద ఏడాది కాలంగా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పుణే పోలీసులు రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేశారు.
ఒక చార్జ్‌షీటు 3,000 పేజీలు ఉంటే.. మరొకటి 5,000 పేజీలు ఉంది.
ఈ కేసులో దర్యాప్తు ఎల్గార్ పరిషత్‌కు పరిమితం కాలేదని పోలీసులు ఆ చార్జ్‌షీట్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్ట్ సంస్థ కార్యకలాపాల మీద ఈ దర్యాప్తు జరుగుతోందని చార్జ్‌షీటు చెబుతోంది.

ఫొటో సోర్స్, RAJU SANADI / BBC
భీడే, ఎక్బోటేల మీద ఆరోపణలు ఏమిటి?
శివ్‌ప్రతిష్ఠాన్ సంస్థ అధిపతి శంభాజీ భీడే, సమస్త్ హిందూ అఖాడీ అధిపతి మిలింద్ ఎక్బోటేల మీద పుణే రూరల్ పోలీసులు ఒక ఫిర్యాదు నమోదు చేశారు. పింప్రి చించ్వాద్‌కు చెందిన అనిత సవాలే అనే ఒక మహిళ ఆ ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత మిలింద్ ఏక్బోటేను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. ఆయన బహిరంగ ప్రసంగం చేయరాదని, పోలీస్ స్టేషన్‌లో రోజూ హాజరుకావాలని బెయిల్‌లో షరతులు ఉన్నాయి. తర్వాత ఈ షరతులను సడలించారు.
శంభాజీ భీడే మీద ఇంకా ఎటువంటి చర్య చేపట్టలేదు. ఆయన పాత్ర నిరూపణ అయిన తర్వాత మాత్రమే ఆయన మీద చర్యలు తీసుకుంటామని పుణే రూరల్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ సచిన్ బారి చెప్తున్నారు.
శంభాజీ బీడే మీద ఎఫ్ఐఆర్ ఇంకా ఉందని, దానిని రద్దు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కూడా డీఎస్‌పీ చెప్పారు.
శంభాజీ బీడే తరఫు న్యాయవాది పుష్కర్ దుర్గే బీబీసీ మరాఠీతో మాట్లాడుతూ.. భీమా కోరేగావ్ హింసతో శంభాజీ భీడేకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనను అనవసరంగా ఇరికించారని పేర్కొన్నారు.
''భీడే గురూజీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నట్లయితే ఆయనను అరెస్ట్ చేస్తారు.. ఎల్గార్ పరిషత్‌కు సంబంధించిన వ్యక్తులకు వ్యతిరేకంగా పోలీసులకు సాక్ష్యాలు లభిస్తుండటం వల్ల వారిని అరెస్ట్ చేస్తున్నారు'' అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

''దర్యాప్తు సరైన దిశలో ఉంది. ఈ ఘటన వంద శాతం అర్బన్ నక్సల్స్ పనే'' అని శంభాజీ భీడేకు చెందిన శివ్‌ప్రతిష్ఠాన్ సంస్థ అధికార ప్రతినిధి నితిన్ చౌగులే ఆరోపించారు.
''గురూజీకి వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదు మీద పోలీసులు దర్యాప్తు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలేవీ దొరకలేదు. ఎటువంటి సాక్ష్యమూ లేదు. కాబట్టి ఆయనను అరెస్ట్ చేసే ప్రశ్నే లేదు'' అంటారు నితిన్ చౌగులే.
ఆ ఘటన జరిగిన జనవరి 1వ తేదీన తాను ఇంటి వద్ద ఉన్నానని మిలింద్ ఏక్బోటే పోలీసులకు ఆధారాలను సమర్పించినందున ఆయనకు బెయిల్ లభించిందని మిలింద్ ఏక్బోటే తరఫు న్యాయవాది ప్రదీప్ గావడే పేర్కొన్నారు.
శంభాజీ భీడేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు అయిన అనితా సవాలే ముంబై హైకోర్టును ఆశ్రయించారు.
అదే ఫిర్యాదు మీద ఏక్బోటేను అరెస్ట్ చేసినపుడు, భీడేను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె అంటున్నారు.

ఫొటో సోర్స్, BBC / MAYURESH KONNUR
విచారణ కమిషన్ విషయం ఏమిటి?
భీమా కోరేగావ్ హింస తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైన ఈ కమిషన్‌లో జస్టిస్ జె.ఎన్.పటేల్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సుమిత్ మాలిక్‌లు ఉన్నారు.
విచారణ కమిషన్ చట్టం కింద ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ విధానం కోర్టు తరహాలో ఉంటుంది. విచారణ కోసం ఏ వ్యక్తినైనా పిలిచే అధికారం ఈ కమిషన్‌కు ఉంది.
భీమా కోరేగావ్ హింసకు సంబంధించి ఎటువంటి ఆధారాలనైనా ఇవ్వదలచుకున్న వారు ఎవరైనా తమ ముందు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి కూడా చేసింది ఈ కమిషన్.
దీంతో కమిషన్ ఎదుట దాదాపు 470 అఫిడవిట్లు దాఖలయ్యాయి. వీటిలో ఐదు సాక్ష్యాలను నమోదు చేశారు.
ఈ కమిషన్ ఎదుట అనితా సవాలే తరఫున రాహుల్ మఖారే, మరో ఇద్దరు న్యాయవాదులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
నక్సల్స్‌తో సంబంధం ఉందన్న ఆరోపణకు సంబంధించి ఇప్పటివరకూ కమిషన్ ముందుకు ఎటువంటి ఆధారమూ రాలేదని మఖారే చెప్తున్నారు.
''శంభాజీ భీడే, మిలింద్ ఏక్బోటేలు హింస జరిగినపుడు తాము అక్కడ లేమని వాదిస్తున్నారు. అయితే, ఇటువంటి ఘటనల్లో నాయకులు ఎప్పుడూ మైదానంలోకి దిగరన్నది అందరికీ తెలిసిన నిజం. ఈ హింసకు వాళ్లు బాధ్యులని మేం అంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా మేం ఎండగడతాం'' అని కూడా ఆయన అన్నారు.
వీడియో సాక్ష్యాలన్నిటినీ తాము కమిషన్‌కు సమర్పించామని మఖారే చెప్పారు.

ఫొటో సోర్స్, BBC / MAYURESH KONNUR
నిజ నిర్ధారణ కమిటీ ఏం అంటోంది?
భీమా కోరేగావ్ హింస తర్వాత కొల్హాపూర్ రేంజ్ డీఐజీగా ఉన్న విశ్వాస్ నాంగారే పాటిల్, ప్రభుత్వేతర నిజ నిర్ధారణ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు.
పుణే డిప్యూటీ మేయర్ సిద్ధార్థ్ ధేండే ఈ కమిటీ సభ్యుడు. ''మేం మూడున్నర నెలల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించాం. ఆ హింసలో మిలింద్ ఓక్బోటే, శంభాజీ భీడేల ప్రమేయం ఉందని కూడా మేం అందులో చెప్పాం. ఏక్బోటే ఇప్పుడు బెయిల్ మీద బయటవున్నారు. భీడేను అరెస్ట్ చేయలేదు. భీడేను అరెస్ట్ చేయాలని మేం ఇంతకుముందు డిమాండ్ చేశాం. ఇప్పుడూ అదే డిమాండ్ చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
దర్యాప్తును నక్సలిజం వైపు మళ్లించటం సరికాదని ధేండే అంటున్నారు. దీని గురించి హోంశాఖకు కూడా తమ వైఖరిని తెలియజేశామన్నారు.
బెయిల్ ఎప్పుడు వస్తుంది?
ఈ కేసులో అరెస్టయిన సురేంద్ర గాడ్లింగ్ తనే సొంతగా వాదిస్తున్నారు. ఎరవాడ జైలులోని ఇతర ఖైదీలకు తన భర్త ఉచితంగా న్యాయ సహాయం అందిస్తున్నారని గాడ్లింగ్ భార్య మినాల్ బీబీసీకి చెప్పారు.
''ఆయన సొంత కేసులో పోరాడుతుండటంతో తనకు కొన్ని పుస్తకాలు కావాలని కోర్టులో డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఒకసారి గరిష్టంగా ఎనిమిది పుస్తకాలు తీసుకెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ జైలు అధికారులు కేవలం రెండు పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లటానికి అనుమతిస్తున్నారు. గత ఏడాది కాలంగా మేం భౌతికంగా, మానసికంగా, సామాజికంగా వేధింపులను ఎదుర్కొంటున్నాం'' అని ఆమె వివరించారు.
''సురేంద్రను కలవటానికి లేదా విచారణకు హాజరవటానికి నేను పుణే నుంచి నాగ్‌పూర్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే రోజు మళ్లీ వెనక్కు తిరిగి రావాల్సి ఉంటుంది. నాకిలా జరుగుతోందని నేను ఇప్పటివరకూ నమ్మలేకపోతున్నాను. జీవనాధారం కోసం నేను చిన్న వ్యాపారం మొదలుపెట్టాను'' అని తెలిపారు.
ఈ కేసులో సురేంద్రను తప్పుగా ఇరికించారని, నిజమైన దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆమె అంటున్నారు.
వరవరరావును పుణే పోలీసులు గత ఏడాది నవబంర్ నెలలో తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ మీద విచారణ పూర్తి అయిన తరువాత తీర్పు ప్రకటించాల్సిన సమయంలో జడ్జి సెలవు మీద వెళ్ళడం, ఆ తరువాత బదిలీ కావడం, జూన్ 4 మరో కొత్త న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించి కేసును మళ్ళీ విచారిస్తాననడం చూస్తుంటే ఇదంతా ఉద్దేశపూర్వకంగా సాగుతున్న వేధింపేనని అర్థమవుతోందని ఆయన సమీప బంధువు, జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ బీబీసీతో అన్నారు.
"జూన్ 27 నుంచి బెయిల్ పిటిషన్ మీద మళ్ళీ విచారణ మొదలవుతుంది. సప్లిమెంటరీ చార్జిషీట్ల పేరుతో బెయిల్ రాకుండా చేశారు. గత ఏడాది డిసెంబర్ నుంచి 2019 ఏప్రిల్ వరకు బెయిల్ మీద వాదనలు ముగిశాయి. కానీ, తీర్పు రాలేదు. వరవరరావును నిర్బంధించిన జైలు గదిలో కనీసం కుర్చీ కూడా లేదు. పుణేలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. గదిలో ఫ్యాన్ అయినా పెట్టించాలని కోరితే, మూడు నెలలకు ఫ్యాన్ పెట్టారు. కానీ, స్విచ్ గది అవతల పెట్టారు" అని వేణుగోపాల్ చెప్పారు.
నాగ్‌పూర్‌కు చెందిన ఇంగ్లిష్ లిటరేచర్ ప్రొఫెసర్ సోమా సేన్‌ను 2018 జూన్‌లో అరెస్ట్ చేశారు.
''మా అమ్మ ఓ మంచి మనిషి. ఆమె ఎల్లప్పుడూ అణగారిన ప్రజల కోసం పనిచేశారు. అరవై ఒక్క ఏళ్ల వయసులో ఆమె జైలులో బతుకుతుండటం మాకందరికీ చాలా బాధకలిగిస్తోంది'' అని ఆమె కూతురు కోయిల్ సేన్ పేర్కొన్నారు.
''బెయిల్ ప్రక్రియ ఏడాది కాలంగా కొనసాగుతూ ఉంది. ఇంకా పూర్తికాలేదు. జడ్జి బదిలీ మూలంగా మరింత ఆలస్యం అవుతుంది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తవ్వాలని, బెయిల్ మంజూరవ్వాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








