అల్లరి మూక ఓ యువకుడిని కొట్టి చంపిందంటూ వైరల్ అవుతున్న వీడియోలోని నిజానిజాలేంటి? :Fact Check

మూక దాడి

ఫొటో సోర్స్, Ani

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ ‌బృందం
    • హోదా, బీబీసీ న్యూస్

ఓ యువకుడిని కొందరు వ్యక్తులు కొడుతున్నట్లుగా ఉన్న గ్రాఫిక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక మతానికి చెందిన వ్యక్తుల గుంపు ఈ మూకదాడికి పాల్పడిందంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెడుతున్నారు.

భుజాన బ్యాగుతో ఉన్న యువకుడి చుట్టూ జనాలు చేరి ఉన్నారు. కొంతమంది అతన్ని కొడుతుండటం ఆ వీడియోలో కనిపిస్తుంది.

"దిల్లీలో కరీ మొహమ్మద్ ఒవైసీ అనే యువకుడిని కొందరు వ్యక్తులు దాడి చేసి చంపారు" అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే, ఈ వీడియోకు సంబంధించిన నిజానిజాలేంటో తెలియజేయాలంటూ 1500 మందికి పైగా పాఠకులు మాకు ఆ వీడియోను పంపించారు.

ఆ వీడియో దిల్లీలో తీసినది కాదని, అందులోని యువకుడిని ఎవరూ కొట్టి చంపలేదని బీబీసీ పరిశీలనలో తేలింది.

నకిలీ వార్తలు

ఫొటో సోర్స్, Social media

వాస్తవం ఏంటి?

రివర్స్ ఇమేజ్ టూల్ ద్వారా మేము శోధించినప్పుడు ఆ వీడియో ఉత్తర‌ప్రదేశ్‌లోని మీరట్ పట్టణంలో తీసిందని వెల్లడైంది.

మీరట్ సమీపంలో బస్సులో ఒక బాలికను వేధించాడనే ఆరోపణలతో ఆ యువకుడిని కొందరు వ్యక్తులు కొట్టారని ఆగస్టు 26న ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.

ఆ కథనం ప్రకారం, బాలిక బంధువులు కూడా బాలుడిని కొట్టే గుంపులో ఉన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులకు అప్పగించారు. ఆ విషయాన్ని మీరట్ పోలీసులు కూడా బీబీసీకి చెప్పారు.

"వీడియోలో కనిపిస్తున్న నిందితుడు దిల్లీలోని నవాడాకు చెందిన ఉమర్‌ అని గుర్తించాం. ఆ సంఘటన ఆగస్టు 26న జరిగింది. మీరట్‌లోని బ్రహంపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు" అని మీరట్ ఎస్‌ఎస్‌పీ అజయ్ కుమార్ సాహ్ని బీబీసీకి తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం, ఈ సంఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, ఈ కేసు పూర్తిగా వేధింపులకు సంబంధించింది.

"నిందితుడిని కొట్టడాన్ని చూస్తున్నట్లు వీడియోలో కనిపించిన వారి మీద కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.

నకిలీ వార్తలు

ఫొటో సోర్స్, SM VIRAL VIDEO GRAB

కైరీ మొహమ్మద్ ఓవైసీ ఎవరు?

కైరీ మొహమ్మద్ ఓవైసీ పేరుతో శోధించినప్పుడు... ఆగస్టు 28న ప్రచురితమైన కొన్ని మీడియా కథనాలు కనిపించాయి.

ఆ కథనాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌‌లోని షామ్లీకి చెందిన 27 ఏళ్ల కైరీ ఓవైస్, పాత దిల్లీ రైల్వే స్టేషన్ వెలుపల జరిగిన ఒక ఘర్షణలో చనిపోయాడు.

మూకదాడిలో తమ కొడుకు చనిపోయాడని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు.

ఈ కేసు వివరాల కోసం ఉత్తర దిల్లీ అదనపు డీసీపీ హరేంద్ర సింగ్‌ను బీబీసీ సంప్రదించింది.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆ సంఘటన 2019 ఆగస్టు 26న జరిగింది.

"ఎలక్ట్రానిక్ వస్తువుల ధర బేరమాడుతుండగా గొడవ జరిగిందని పోలీసులు గుర్తించారు. ఆ తరువాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలూ పరస్పరం దాడలకు దిగాయి. ఆ తర్వాత పోలీసులు ఓవైసీని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు."

ఈ కేసులో సర్ఫరాజ్, లాలన్ అనే ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

నిందితులపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు అదనపు డీసీపీ హరేందర్ సింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)