ఏనుగు మరణం: గర్భంతో ఉన్న ఏనుగును పేలుడు పదార్థాలు తినిపించి చంపేశారు

ఏనుగు మృతి

ఫొటో సోర్స్, MOHAN KRISHNAN

ఫొటో క్యాప్షన్, నీటిలో చిక్కుకుపోయిన ఏనుగుకు గుర్తుతెలియని వారు పేలుడు పదార్థాలు తినిపించారు

కేరళలో నీలంబూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఏనుగుకు కొందరు పేలుడు పదార్ధాలు నింపిన అనాసపండుని తినిపించారు. అది తిన్న ఏనుగు చనిపోయింది.

సుమారు14-15 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ ఏనుగు గర్భంతో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

గాయపడిన తరువాత వెల్లియార్ నదిలో మూడు రోజులుగా చిక్కుపడిపోయిన ఆ ఏనుగుని బయటకి తీసుకుని రావడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఏనుగు తొండంతో సహా నీటిలో కూరుకుపోయింది.

"ఏనుగుకి గాయం ఎక్కడయిందో కూడా మాకు అర్ధం కాలేదు. అది నీటిలో చిక్కుకుని ఉన్నంత సేపు కేవలం నీరు మాత్రమే తాగింది. ఏనుగు దవడల రెండు వైపులా బాగా గాయాలై దాని దంతాలని కూడా కోల్పోయినట్లు” పాలక్కాడ్ లోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ , వన్య జీవుల సంరక్షకుడు శామ్యూల్ పచావ్ చెప్పారు.

ఆ ఏనుగు మే 25వ తేదీన దగ్గరలో ఉన అడవుల్లోకి ఆహారం కోసం వెళ్లినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్ళినప్పుడు పొరపాటున నీటిలో చిక్కుపడి బయటకి రాలేకపోయిందని, కడుపులో ఉన్న బిడ్డకి ఆహారం కోసం ఆ పండు తిని ఉండవచ్చని పాలక్కాడ్ జిల్లా మన్నార్కాడ్ అటవీ శాఖ అధికారి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు.

రాపిడ్ రెస్పాన్స్ టీం కి చెందిన మోహన్ కృష్ణన్ అనే అటవీ శాఖ అధికారి రాసిన ఫేస్ బుక్ పోస్ట్ తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏనుగు మృతి

ఫొటో సోర్స్, MOHAN KRISHNAN

ఫొటో క్యాప్షన్, మూడు రోజులుగా నీటిలోనే చిక్కుకుపోయిన ఏనుగును రక్షించటానికి అటవీశాఖ ప్రయత్నాలు ఫలించలేదు

ఆ ఏనుగు ఎంత మంచిదో ఆయన ఫేస్ బుక్ పోస్ట్ లో రాస్తూ దానికి గాయాలైనప్పటికీ గ్రామ వీధుల్లో నొప్పితో పరుగు పెట్టింది కానీ, ఎవరికీ హాని చేయలేదని రాసారు . ఆ ఏనుగు ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు.

అయితే ఆ ఏనుగు అనుభవించిన బాధని, వేదనని ఆ ఫోటోలలో బంధించలేకపోయారు.

ఏనుగుని చిక్కుపడిన నీటిలోంచి బయటకి తీసుకుని వచ్చి వైద్యం చేయడానికి రాపిడ్ రెస్పాన్స్ బృందాన్ని, రెండు శిక్షణ పొందిన ఏనుగులని తెప్పించినప్పటికీ దానిని రక్షించలేకపోయామని సునీల్ కుమార్ చెప్పారు. దానికి వైద్యం అందించే లోపే అది మరణించిందని తెలిపారు.

మే 27 వ తేదీన నీటిలో ఉండగానే అది మరణించినట్లు అధికారులు తెలిపారు. దానికి పోస్ట్ మోర్టమ్ నిర్వహిస్తున్నపుడు అది గర్భం తో ఉన్న విషయం బయటపడినట్లు చెప్పారు.

మరణించిన ఏనుగుతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా మరణించినట్లు ఈ ఏనుగుకి పోస్ట్ మోర్టమ్ నిర్వహించిన డాక్టర్ చెప్పినట్లు కృష్ణన్ తన ఫేస్ బుక్ పోస్టులో రాసారు . "డాక్టర్ ముఖం మాస్క్ తో కప్పి ఉండటం వలన కళ్ళల్లో విచారం కనిపించలేదు గాని, ఆయన గొంతులో బాధ ధ్వనించింది".

అక్కడే ఏనుగుకి అంత్యక్రియలు నిర్వహించి ఆఖరి వీడ్కోలు పలికినట్లు ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఈ ఘటన పై కేసు నమోదు చేసి దీనికి బాధ్యులైన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పచావ్ తెలిపారు.

నీలంబూర్ అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు మనుషుల మధ్య పోరు ఎప్పటినుంచో కొనసాగుతోంది కానీ, పేలుడు పదార్ధాలతో ఏనుగుని అంతమొందించడం మాత్రం ఇదే మొదటిసారని పచావ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)