తిరుమల తిరుపతి దేవస్థానం: జూన్ 8 నుంచి ప్రయోగాత్మకంగా దర్శనాలు ప్రారంభం... ఆలయాల్లో కొత్తగా వచ్చే మార్పులు ఇవే..

వెలిగించిన అగరుబత్తిలతో హిందూ యువతి
    • రచయిత, వి. శంకర్
    • హోదా, బీబీసీ కోసం

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా తిరుమ‌ల శ్రీవేంకటేశ్వర స్వామి ద‌ర్శ‌నాన్ని ప్రారంభిస్తున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

ఆయన గురువారం తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల ఆదేశాల మేర‌కు దాదాపు 75 రోజులుగా భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం నిలిపి వేశామ‌ని చెప్పారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అనుమ‌తి మేర‌కు ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తూ జూన్ 8వ తేదీ నుండి తిరుమ‌లలో ప్రయోగాత్మకంగా ద‌ర్శ‌నం ప్రారంభిచాలని నిర్ణయించామన్నారు.

లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న ప్రభుత్వం ఆలయాలను తెరవటానికి అనుమతులు ఇచ్చింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఏపీలోని అన్ని ప్రధాన ఆలయాల్లోనూ దర్శనాల క్యూలైన్లలో భౌతికదూరం పాటించడం, తలనీలాలు సమర్పించే సందర్భంలోనూ, అన్న ప్రసాదం విషయంలోనూ అనేక మార్పులకు రంగం సిద్ధమవుతోంది.

అన్ని ఆలయాల్లోనూ సన్నద్ధంగా ఉండాలని ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజాగా వివిధ దేవాలయాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కూడా అందుకు అనుగుణంగా పలు సూచనలు చేశారు.

ఏటా కిటకిటలాడే ఆలయాలు..

సహజంగా ప్రతీ ఏడాది మార్చి నుంచి జూన్ వరకూ ఆలయాలకు ఎక్కువ సంఖ్యలో యాత్రికులు తరలివస్తూ ఉంటారు. టీటీడీ సహా అన్ని ఆలయాల సందర్శకుల సంఖ్య ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. టీటీడీ అధికార లెక్కల ప్రకారం 2019లో సగటున రోజుకి 76,411 మంది దర్శనాలు చేసుకున్నారు. అదే మే, జూన్ నెలల్లో అయితే ఆ సంఖ్య 85 వేల వరకూ ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, అన్నవరం, కాణిపాకం, సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీశైలం వంటి ఆలయాల్లో కూడా అదే రీతిలో భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించేది. వేసవి సెలవులు కావడంతో పాటుగా ఇతర అనేక కారణాలవల్ల సాధారణంగా ఈ సీజన్‌లో ఆలయాలు కిటకిటలాడిపోతూ ఉండేవి.

లాక్ డౌన్ తర్వాత భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

ఫొటో సోర్స్, FACEBOOK/TTD

ఫొటో క్యాప్షన్, లాక్ డౌన్ తర్వాత భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

లాక్ డౌన్ సడలింపులతో తిరిగి కార్యకలాపాలు

లాక్ డౌన్ కారణంగా అంతా తారుమారయ్యింది. ఆలయాల్లో భక్తుల రాకపోకలపై ఆంక్షలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ అమలులోకి రాగా ఏపీలో మార్చి 20 నుంచే ఆలయాల్లోకి భక్తుల రాకను నిలిపివేశారు.

తిరుమలలో కూడా సామాన్య భక్తులు కాలినడకన గానీ, వాహనాల్లో గానీ వచ్చే వారందరినీ అలిపిరి వద్దే నిలిపివేశారు. అప్పటి నుంచి అన్ని ప్రధాన ఆలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాలు, సేవా కార్యక్రమాలు మినహా ఇతర కార్యకలాపాలు సాగడం లేదు.

కేంద్ర ప్రభుత్వం మే 14 నుంచి లాక్ డౌన్ విషయంలో అనేక సడలింపులు ఇస్తూ వస్తోంది. దాంతో ఆయా ప్రధాన ఆలయాల్లో కొన్ని కార్యకలాపాలకు అవకాశం దక్కింది. అందులో భాగంగానే టీటీడీ లడ్డూ ప్రసాదం విక్రయాలకు తెరలేపింది. తొలుత మే 16 నుంచి అలిపిరి వద్ద లడ్డూ విక్రయాలు ప్రారంభించగా, ఆ తర్వాత ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, ఇతర ప్రధాన నగరాల్లోనూ లడ్డూ అమ్మకాలు సాగిస్తోంది. అదే సమయంలో దర్శనాలు ప్రారంభించేందుకు అనుగుణంగా పలు మార్పులకు కూడా శ్రీకారం చుట్టింది.

జూన్ 8 తర్వాత ఆలయాల్లో భక్తుల రాకపోకలకు అనుమతినిస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా అన్ని చోట్లా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. తిరుమల సహా ఇతర ఆలయాల్లోనూ అధికారులు పలు మార్పులు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా మార్పులు తీసుకోబోతున్నట్టు టీటీడీ పీఆర్వో టి.రవికుమార్ బీబీసీకి తెలిపారు.

అందులో భాగంగా క్యూ లైన్లలో భౌతికదూరం పాటించేందుకు మార్కింగ్ చేసే ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. సాధారణ క్యూ లైన్లలో కూడా భక్తులను నియంత్రించేందుకు ఇనుప కడ్డీలు ఏర్పాటు చేశారు. దానితో పాటుగా శానిటేషన్ చేసేందుకు, భక్తులందరూ జాగ్రత్తలు పాటించేలా చూసేందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు.

తిరుమలలో దర్శనాల కోసం ఏపీ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మరోవైపు తిరుమలలో భక్తుల దర్శనాలకు తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ దర్శనాల విషయంలో ఇంకా అధికారికంగా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని టీటీడీ పీఆర్వో రవికుమార్ తెలిపారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ “దేవాదాయ శాఖ ఆదేశాలు మాకు అందాయి. అయితే టీటీడీ ఈవో ఇతర ఉన్నత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. వివిధ శాఖల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అవసరమైన మార్పులపై చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సమగ్రమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి” అని వివరించారు.

అన్నవరంలో కొండపై భక్తుల క్యూలైన్ల తగ్గింపు, వ్రతాలు నిర్వహణలోనూ మార్పులు

ఫొటో సోర్స్, annavaramdevasthanam.nic.in

ఫొటో క్యాప్షన్, అన్నవరంలో కొండపై భక్తుల క్యూలైన్ల తగ్గింపు, వ్రతాలు నిర్వహణలోనూ మార్పులు

భక్తుల సంఖ్యపై నియంత్రణ

సుదీర్ఘ విరామం తర్వాత ఆలయాల్లో దర్శనాలకు మళ్లీ అనుమతించబోతున్న తరుణంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నియంత్రణ అవసరం అని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా టీటీడీ ముందుగా చిత్తూరు జిల్లా వాసుల వరకూ అనుమతించబోతున్నట్టు చెబుతున్నారు.

తాజాగా స్పెషల్ సీఎస్ ఆదేశాల్లో కూడా ఈ అంశం ఉంది. టీటీడీలో సిబ్బందితో ముందు ప్రయోగాత్మకంగా దర్శనాలు నిర్వహించాలని పేర్కొన్నారు. టీటీడీకి రెగ్యులర్ సిబ్బంది 7,400మందితో పాటుగా మరో 14వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. 3 రోజుల పాటు వారికి ప్రయోగాత్మకంగా దర్శనాలు కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈనెల 8 నుంచి ప్రయోగాత్మక దర్శనాలు ప్రారంభించబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

సాధారణ భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చినప్పటికీ గతంలో మాదిరిగా గంటల కొద్దీ వేచి చూసి దర్శనం చేసుకునే పరిస్థితి ప్రస్తుతం ఉండదని టీటీడీ అధికారి ఒకరు చెప్పారు. అప్పట్లో సగటున సాధారణ రోజుల్లో గంటకు 3,820 మంది వరకూ దర్శనం చేసుకునేవారు. ప్రత్యేక సందర్భాలు, ఉత్సవాల వంటివి ఉన్న సమయంలో భక్తుల సంఖ్య గంటకు 4,300 మంది వరకూ ఉండేది. ప్రస్తుతం దానిని బాగా కుదించాలనే ప్రతిపాదన ఉన్నట్టు ఆయన తెలిపారు. మూడోవంతుకు తగ్గించవచ్చని చెప్పారు. టీటీడీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదన్నారు. కానీ గంటకు వెయ్యి లోపు భక్తులకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. అంతేగాకుండా రోజుకి 14 గంటలు మాత్రమే తొలుత దర్శనాలకు అనుమతి ఇచ్చి దాన్ని క్రమంగా పెంచే ఆలోచన కూడా ఉందన్నారు.

ఇక సాధారణ భక్తులు సహా అందరికీ టైమ్ స్లాట్ విధానం అమలు కాబోతోందని ఆయన తెలిపారు. తద్వారా రద్దీని తగ్గించేందుకు, ఇతర జాగ్రత్తలు పాటించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నామన్నారు.

సీఎంతో సమావేశం తర్వాత తుది నిర్ణయం

ఏపీలో 12 ప్రధాన పుణ్యక్షేత్రాల్లో భక్తులకు దర్శనాల విషయంలో ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ దేవావాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ దేవస్థానాల అధికారులతో మాట్లాడారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి బీబీసీతో మాట్లాడుతూ ...

“లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించాల్సి ఉంది. సీఎం జగన్ నిర్ణయం తర్వాత ఆలయాల్లో భక్తులను అనుమతిస్తాం. డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం సూచనలను, మార్గదర్శకాలు జారీ చేశాం. అన్ని దేవాయాల్లో వాటిని అమలు చేసే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని తెలిపాం. దేవాలయానికి వచ్చే చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తో పాటు నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. భక్తులకు ఎటువంటి ఆటంకం కలకుండా చూసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు.

అన్నదానం

ఫొటో సోర్స్, facebook/KanakaDurgammatemple

ఫొటో క్యాప్షన్, ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాల్లో కూడా మార్పులు వస్తాయని అధికారులు చెబుతున్నారు

రవాణా, ఇతర సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ

సాధారణ భక్తుల రాకకు అనుమతి ఇచ్చిన తర్వాత ఎదురయ్యే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్తలు పాటించేలా చూస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ “రవాణా విషయంలో కూడా చాలా మార్పులు తప్పడం లేదు. గతంలో టీటీడీ బస్సులతో పాటు ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు కూడా కిక్కిరిసిపోయే కనిపించేవి. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. సంఖ్య పరిమితం చేస్తున్నాం. వసతి విషయంలో కూడా రూమ్ కి ఇద్దరు మాత్రమే ఉండేలా అనుమతి ఇవ్వబోతున్నాం. అన్ని చోట్లా శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, ఎక్కువ చోట్ల కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేలా మార్పులు చేయబోతున్నాం. ఇప్పటికే భక్తులు స్వామి వారి దర్శనాల కోసం ఎదురుచూస్తున్నారు. లడ్డూ ప్రసాదం విక్రయాలకు మంచి స్పందన వచ్చింది. తిరుమలలో దర్శనాలు ప్రారంభమయితే వాటిని నిలిపివేస్తాం” అని తెలిపారు.

కళ్యాణ కట్ట, అన్నప్రసాదం నిర్వహణలో పలు మార్పులు

ఆలయాల్లో దర్శనాలు పునః ప్రారంభించే సందర్భంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై అన్నవరం ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావుని బీబీసీ సంప్రదించింది. తమ ఆలయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను ఆయన ఇలా చెప్పుకొచ్చారు.

“కళ్యాణ కట్ట వద్ద ఎక్కువ జాగ్రత్తలు అవసరం అని గుర్తించాం. ఎదురెదురుగా కూర్చుని తలనీలాల కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మాస్కులు, శానిటైజర్లతో పాటుగా వేడినీళ్ల వినియోగం వంటి జాగ్రత్తలు పాటించాలని నిర్ణయించాం. ఇక అన్నప్రసాదం గతంలో మాదిరి జరిగే వీలు లేదు. భక్తులకు ఆహారం ప్యాకెట్లు అందించి, కొండ దిగువన వాటిని భుజించేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్నవరంలో వ్రతాల విషయంలో గతంలో 1200 మంది వరకూ ఒకేసారి అవకాశం ఉండేది. ఇప్పుడు మూడోవంతు మాత్రమే వీలు కల్పిస్తాం. క్యూ లైన్లు కూడా కేవలం రెండే లైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని చెప్పారు.

అన్నవరంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ ఇలాంటి మార్పులు తీసుకుంటున్నారని ఆయన ఆయన వివరించారు

విజయవాడ ఆలయంలో క్యూలైన్

ఫొటో సోర్స్, facebook/KanakaDurgammatemple

ఫొటో క్యాప్షన్, ఇలా కిక్కిరిసిన క్యూ లైన్లు ఆలయాల్లో ఇక కనిపించవా?

ఆన్‌లైన్ సేవలకు ప్రాధాన్యం

లాక్ డౌన్ సడలించిన తర్వాత కూడా ఆలయాల్లో ఆన్ లైన్ సేవలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం సాగుతున్న పరోక్ష సేవ లేదా డిజిటల్ సేవలను ఇకపై కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ “ప్రస్తుతం నిత్యం వంద వరకూ పరోక్ష సేవకు దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే భక్తులకు ప్రత్యక్ష దర్శనాలకు అనుమతిస్తాం. అవసరమైన స్థాయిలో శానిటైజర్లు, సిబ్బందికి మాస్కులు సహా ఇతర అన్ని ఏర్పాట్లు చేశాం” అని అన్నారు.

ఇక విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కూడా కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నట్టు ఈవో ఎం వి సురేష్ బాబు తెలిపారు. “ఆన్‌లైన్ టిక్కెట్లు ఆలయ వెబ్‌సైట్‌లో 24 గంటల ముందే తీసుకోవాలి. ఇతర ఏ కౌంటర్లలోనూ టికెట్లు అమ్మబడవు. గంటకు సుమారు 600 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఉదయం 5గం. నుంచి సాయంత్రం 6గం.ల వరకూ మాత్రమే దర్శనాలకు అవకాశం ఉండేలా సమయం కుదిస్తాం. దర్శన సమయాలను క్రమంగా పెంచుతాం” అంటూ ఆయన వివరించారు.

మొత్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల సహా ఏపీలోని అన్ని చోట్లా ఈనెల రెండో వారంలో ఆలయాలకు తెరుచుకునేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆలయ అధికారులు, సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భక్తులు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)