'ఎల్‌జీ పాలిమర్స్ ఎండీ, ఉద్యోగులే బాధ్యులు': విశాఖ గ్యాస్ లీక్‌పై విచారణ కమిటీ నివేదిక - ప్రెస్ రివ్యూ

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనకు మానవ తప్పిదమే కారణమని ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ శేషశయనారెడ్డి కమిటీ నివేదిక తేల్చిందని 'ఈనాడు' దినపత్రిక రాసింది. ఈ నివేదికను పరిశీలించి ఆదేశాలు జారీ చేస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ పేర్కొన్నట్లు చెప్పింది.
ఎల్జీ పాలిమర్స్ సంస్థలో పలు నిర్వహణా లోపాలున్నాయని, అదే ప్రమాదానికి కారణమైందని శేషశయనా రెడ్డి నివేదికలో పేర్కొన్నట్లు 'ఈనాడు' వెల్లడించింది. ఈ కథనం ప్రకారం స్టైరిస్ ఆవిరి లీక్ కావడానికి
ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఎండీ, అక్కడ పనిచేసే వివిధ విభాగాల ఉద్యోగులే బాధ్యులని నివేదికలో ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని కూడా పేర్కొన్న కమిటీ, ఇందుకు సంబంధించి పలు ఆధారాలను కూడా తన నివేదికలో పొందు పరిచింది.
ఎల్జీ పాలిమర్స్ నిర్వహణకు సంబంధించి కేంద్ర పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసినా, ఇంకా అనుమతి రాలేదని, రాష్ట్ర కాలుష్య నివారణ మండలి అనుమతులతో కార్యకలాపాలు ప్రారంభించారని తేల్చింది. కంపెనీ నిర్వహణలో అనేక లోపాలున్నందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు శేషశయనారెడ్డి నివేదిక తేల్చింది.

ఫొటో సోర్స్, @TELANGANACMO
'తెలంగాణ జీడీపీ 4 లక్షల కోట్ల నుంచి 9.6 లక్షల కోట్లకు పెరిగింది'
ఆరేళ్ల తెలంగాణ రాష్ట్రసమితి పాలనా కాలంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతి సాధించిందని, ఈ రోజు సగర్వంగా ఆవిర్భావ దినోత్సం జరుపుకుంటోందని 'నమస్తే తెలంగాణ' దినపత్రిక రాసింది.
సంక్షేమ రంగంలో అనేక పథకాలు ప్రవేశ పెడుతూనే, ఆర్దికరంగంలో కూడా గణనీయమైన పురోగతి సాధించినట్లు కథనాలు రాసింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రూ.4 లక్షల కోట్లున్న జీడీపీ ఇప్పుడు రూ.9.6 లక్షల కోట్లకు చేరుకుందని పేర్కొంది.
'నమస్తే తెలంగాణ' కథనం ప్రకారం వృద్ధిరేటు విషయంలో తెలంగాణ జాతీయ సగటును అధిగమించింది. అలాగే రూ.95 వేల పైచిలుకున్న తలసరి ఆదాయం, ఈ ఆరేళ్ల కాలంలో రూ.2.28 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే పెట్టుబడులు వస్తాయనడానికి తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ అని ఆ కథనంలో పేర్కొంది.
నూతన పారిశ్రామిక విధానం వల్ల రాష్ట్రంలో ఉత్పత్తులు, ఎగుమతులు పెరగడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయని రాసింది. జీడీపీ, తలసరి ఆదాయంలో దేశ సగటును మించిన తెలంగాణ, కరోనా కష్టకాలంలో ఏ విధంగా ఆర్ధిక సవాళ్లను ఎదుర్కుంటుందో చూడాల్సి ఉందని ఈ కథనంలో రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
'ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటం వల్లే పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ దిగుమతి'
ఆంధ్రప్రదేశ్‌లో మద్యాన్ని అక్రమంగా రవాణ చేస్తున్నవారిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనం రాసింది.
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్న వారికి సహకరించడమే కాదు..స్వయంగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మద్యం సీసాలను అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారని కూడా ఈ కథనంలో పేర్కొంది.
'ఆంధ్రజ్యోతి' కథనం ప్రకారం...ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పొరుగు రాష్ట్రాలలో తక్కువ ధరకు దొరికే మద్యాన్ని కొనడానికి మందుబాబులు ఉవ్విళ్లూరుతున్నారు.
పేరున్న బ్రాండ్‌ల మద్యం దొరక్కపోవడంతో పక్కనున్న రాష్ట్రాల నుంచి దిగుమతి అయిన మద్యానికి గిరాకీ పెరుగుతోంది. ప్రముఖ బ్రాండ్‌కు చెందిన ఒక్క బాటిల్‌లను తీసుకొస్తే దాదాపు రూ.వెయ్యి మిగిలినట్లేనని ఈ కథనంలో పేర్కొంది.
ఓ మంత్రి గన్‌మ్యాన్, మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ , ఐటీ అధికారి, ఎంపీడీవో, స్పెషల్ బ్రాంచ్ పోలీస్, ఎన్డీఆర్‌ఎఫ్ కానిస్టేబుల్.. ఇలా అనేకమంది ఇలా మద్యం తరలిస్తూ దొరికిపోయారని రాసింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆరుగురు పోలీసు అధికారులు పట్టుబడి సస్పెన్షన్‌కు గురయ్యారని, మరికొందరు చోటా మోటా నేతలు కూడా ఇలా మద్యాన్ని సరిహద్దులు దాటించే ప్రయత్నాలు చేశారని పేర్కొంది.

ఏపీ ఎన్నికల కమిషనర్ వివాదం: హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సర్కారు పిటిషన్
ఏపీ ఎన్నికల కమిషనర్ విషయంలో హైకోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినట్లు 'సాక్షి' పత్రిక ఒక కథనం రాసింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ విషయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును, కొత్తగా మరో ఎన్నికల కమీషనర్ నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది.
'సాక్షి' కథనం ప్రకారం.. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని, దానిని రద్దు చేయాలని ప్రభుత్వం తన పిటిషన్‌లో సుప్రీంను కోరింది. మంత్రి మండలి సిఫార్సు మేరకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తారని, నిమ్మగమ్మ నియామకమూ ఇలాగే జరిగిందని, అలా సిఫారసు చేసే అధికారమే మంత్రి మండలికి లేదంటే రమేశ్ నియామకం కూడా చెల్లదని తన పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. సర్వీసు నిబంధనలకు, పదవీ కాలానికి మధ్య తేడాను హైకోర్టు గుర్తించలేకపోయిందని ప్రభుత్వం వ్యాఖ్యానించింది. హైకోర్టు తన తీర్పుకు తానే విరుద్ధమైన తీర్పు నిచ్చిందని, కాబట్టి దీనిని రద్దు చేయాలని కోరింది.
ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ సందర్భంగా పిటిషనర్‌లు ముఖ్యమంత్రి, మంత్రుల వ్యాఖ్యల ఆధారంగా వాదనలు వినిపించారని, కానీ వారికి నోటీసులివ్వకుండానే, అనవసర విషయాల ఆధారంగా తీర్పు ఇచ్చారని తన పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వం కుటిల ఉద్దేశంతో వ్యవహరించిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా ప్రభుత్వం అన్నది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ అవతరణ దినోత్సవం: విలీనం నుంచి విభజన దాకా..
- జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడానికి ముందు ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది?
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








