రోహింజ్యాలు: నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు

ఖదీజా బేగం, ఆమె భర్త, కుమారుడు చనిపోయాక మయాన్మార్ నుంచి పారిపోయారు
    • రచయిత, స్వామినాథన్ నటరాజన్ , మోవజెమ్ హొస్సేన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

మలేషియాకి చేరాల్సిన 396 మంది ముస్లిం రోహింజ్యాలు ప్రయాణిస్తున్న బోటు రెండు నెలల పాటు సముద్రంలో చిక్కుకుపోయి, చివరకు బంగ్లాదేశ్ చేరింది. ఆ బోటులో ప్రయాణం చేస్తున్న వారిలో ఖదీజా బేగం కూడా ఉన్నారు.

అదే బోటులో ప్రయాణిస్తున్న ఆమె కొడుకు(ఇమామ్) ఆ బోటులో చనిపోయినవారికి అంత్యక్రియల సమయంలో చేయాల్సిన క్రతువులు నిర్వహించడం వలన ఎంతమంది చనిపోయారో అంచనా వేయగలిగారు.

వారు చేరాలనుకున్న చోటుకి వారు చేరలేక పోయారు.

మయాన్మార్లో రోహింజ్యాల పట్ల నెలకొన్న హింసాత్మక పరిస్థితుల కారణంగా ఆమె ఇల్లు వదిలి పారిపోయారు.

రోహింజ్యా ముస్లింల శరణార్థ శిబిరాలకు ఆలవాలంగా మారిన బంగ్లాదేశ్ ఆమెకి ఆశ్రయం కల్పించింది .

పడవలో కిక్కిరిసిన శరణార్థులు
ఫొటో క్యాప్షన్, పడవలో కిక్కిరిసిన శరణార్థులు

బంగ్లాదేశ్లో సుమారు 10 లక్షల మంది రోహింజ్యాలు కాక్స్ బజార్లో తల దాచుకుంటున్నారు. ఇక్కడ ఉంటున్నచాలా మంది లాగే ఖదీజాకి కూడా మలేషియా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే కలలు ఉన్నాయి.

కానీ, ఖదీజా కలలు పీడ కలలుగా మారాయి.

మానవ అక్రమ రవాణాదారులు కిక్కిరిసిన బోట్లో చోటు చేసుకున్న మరణాలని దాచిపెట్టి ఉంచిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

శవాలని నీటిలో విసిరేస్తున్న శబ్దం వినిపించకుండా బోట్ కి ఉన్న రెండు ఇంజన్లని ఎప్పుడూ ఆన్ చేసి ఉంచేవారు.

శవాలని సాధారణంగా రాత్రి పూట సముద్రంలోకి విసిరేసేవారు. " నాకు తెలిసి 14 నుంచి 15 మంది మహిళలు మరణించారు”.

ఆమె పక్కనే కూర్చున్న మరో మహిళ మరణం ఆమెని ఇప్పటికీ కలచి వేస్తోంది. నా కళ్ళ ముందే ఆమె మరణించారు. బోట్ సిబ్బంది ఆమె శవాన్ని బోట్ పైకి తీసుకుని వెళ్లి ఆమె మరణించినట్లు చెప్పారు.

ఆమెకి నలుగురు పిల్లలు. 16 సంవత్సరాల ఆమె పెద్ద కూతురుకి తల్లి మరణ వార్తని మా అబ్బాయి తెలియచేసాడు. “మిగిలిన ముగ్గురి పిల్లలకి వాళ్ళ తల్లికి ఏమైందో అర్ధం కాలేదు. వారు ఏడుస్తూనే ఉన్నారు”.

ఆమె శవాన్ని వెంటనే నీటిలోకి విసిరేశారు. ఆ పిల్లల ఏడుపు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపించింది.

ఖదీజాకి కూడా నలుగురు పిల్లలు. 2017 లో మయన్మార్లో చోటు చేసుకున్న సైనిక దాడుల్లో ఆమె భర్త, కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆమె నిరాశ్రయురాలయ్యారు.

ఆమె గ్రామానికి మంటలు పెట్టడంతో ఆమె పిల్లలతో సహా బాంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ లో ఉన్న శరణార్థ శిబిరంలో తల దాచుకున్నారు.

ఆమె పెద్ద కూతురికి పెళ్లి చేసిన తర్వాత మిగిలిన ఇద్దరి పిల్లలకి మంచి జీవితం ఇవ్వాలని ఆమె ఆశించారు. " మేము చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. శరణార్థ శిబిరంలో మాకు భవిష్యత్ లేదని అర్ధం అయింది.

అక్కడ నుంచి మలేషియా వెళ్లిన వారి జీవితాలు మెరుగుపడటం గురించి ఆమె విన్న కధలు ఆమెని ఆకర్షించాయి. ఆమె దగ్గరున్న నగలన్నీ అమ్మేసి సుమారు 56000 రూపాయిలు వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోవడానికి సహాయం చేస్తానని చెప్పిన మానవ అక్రమ రవాణాదారుల చేతుల్లో పెట్టారు.

రెండు నెలల పాటు సముద్రంలోనే ఉండిపోయిన పడవ
ఫొటో క్యాప్షన్, రెండు నెలల పాటు సముద్రంలోనే ఉండిపోయిన పడవ

ఫిబ్రవరి లో ఒక రోజు రాత్రి ఆమెకి ఫోన్ వచ్చింది.

ఒక చిన్న సంచిలో బట్టలు, నగలు పెట్టుకుని హాస్పిటల్ కి వెళుతున్నానని చుట్టు పక్కల వాళ్లకి చెప్పి బయలు దేరినట్లు ఆమె బీబీసీ కి చెప్పారు.

ఆమెతో పాటు ఆమె కొడుకు, కూతురు వెంట వెళ్లారు.

బస్సు స్టాండ్లో ఒక వ్యక్తి వారిని కలిశారు. అక్కడ నుంచి వారిని ఒక తోటలో ఉన్న ఇంటికి తరలించారు. అక్కడ తన లాంటి కొన్ని వందల మందిని ఖదీజా చూసారు.

వారందరినీ బంగ్లాదేశ్లో ఉన్న సెయింట్ మరిన్ ద్వీపానికి మయాన్మార్లో అకియాబ్ కి మధ్య ఉన్న ప్రాంతంలో బోటు ఎక్కించారు.

"మెరుగైన జీవితం కోసం నేనెప్పటి నుంచో కలలు కంటున్నాను. కొత్త దేశంలో కొత్త జీవితం ప్రారంభించాలనే ఆశ ఉంది. " అని ఆమె చెప్పారు.

రెండు రోజుల తర్వాత వారందిరినీ మరో బోటులోకి మార్చారు. అది మనుషులతో కిక్కిరిసి ఉంది.

ఆమె కాళ్ళు చాపుకోవడానికి కూడా స్థలం లేదని ఖదీజా చెప్పారు. " పిల్లలు, ఆడవారితో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అందులో సుమారు 500 మందిమి ఉండి ఉంటాము. అంత మంది పట్టే స్థలం మాత్రం ఆ బోటులో లేదు”.

బోటు సిబ్బంది పై భాగంలో ఉండేవారు. మహిళలు మధ్య భాగంలో, పురుషులు బోటు అడుగు భాగంలో ఉండేవారు. మా దురదృష్టం కొలదీ మేము ఏ దేశం నుంచైతే పారిపోయి వచ్చామో ఆ దేశానికి చెందిన సిబ్బందే బోటుని నడుపుతున్నారు.

ఖదీజా

“మొదట్లో చాలా భయపడ్డాను. మా భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్ధం కాలేదు. కానీ, మళ్ళీ కలలు కనడం మొదలుపెట్టాను”.

“ముందు మంచి జీవితం ఉండబోతోంది అని ఊహించుకున్నాను. అందుకోసం కష్టాలు భరించడానికి సంసిద్ధం అయ్యాను”.

బోటులో నీరు, పారిశుధ్యం లేదు. బోటులో ఉన్న రెండు నెలల్లో ఖదీజా సముద్రపు నీటితో రెండు సార్లు మాత్రమే స్నానం చేశారు.

రెండు చెక్క బల్లల మధ్య ఒక కన్నంతో టోయిలెట్లు ఉండేవి.

ఆ కన్నంలోంచి ఒకబ్బాయి సముద్రంలోకి పడిపోయి చనిపోయాడని ఖదీజా గుర్తు చేసుకున్నారు.

ఆమె చూసిన మరణాలలో అది మొదటిది.

ఏడు రోజుల ప్రయాణం తర్వాత మలేషియా తీరం కనిపించింది. అక్కడ నుంచి చిన్న చిన్న పడవలు వచ్చి తమని తీసుకుని వెళతాయేమో అని ఎదురు చూసారు.

కానీ, ఎవరూ రాలేదు. ఇంతలో కరోనావైరస్ మొదలైంది. దాంతో మలేషియా అధికారులు తీరం చుట్టూ భద్రతని కట్టుదిట్టం చేశారు.

మలేషియా వరకు వెళ్లలేమని షిప్ కెప్టెన్ ప్రకటించారు. ఈ విపత్తుతో ఖదీజా ఆశలు తలకిందులవ్వడం మొదలయ్యాయి.

బోటు

అప్పటికే బోటులో తిండి, నీటి కరువు ఏర్పడింది.

అంతకు ముందు వారికి అన్నం, పప్పు రెండు పూటలా పెట్టేవారు.

నెమ్మదిగా రోజుకి ఒక సారే భోజనం దొరికేది. క్రమేపీ రెండు రోజులకొకసారి ఒక పూట మాత్రమే భోజనం పెట్టడం మొదలుపెట్టారు. కేవలం పొడి అన్నం మాత్రమే ఇచ్చేవారు.

తాగడానికి నీరు దొరికేది కాదు.

నిస్సహాయ స్థితిలో కొంత మంది శరణార్థులు ఉప్పు నీరు కూడా తాగేవారు. కొంత మంది నీటిలో బట్టలని ముంచి అవి పిండినప్పుడు వచ్చే నీటితో గొంతు తడుపుకునే వారు.

ఖదీజా బేగం

కొన్ని రోజుల తర్వాత, థాయిలాండ్ నుంచి వచ్చిన ఒక బోటు కొన్ని సరుకుల్ని తెచ్చింది.వారు మలేషియా వెళ్లే లోపు బర్మా నావికాదళం వారిని అడ్డుకుంది.

"బోటు కెప్టెన్ ని, సిబ్బందిని వారు అరెస్ట్ చేసి మళ్ళీ విడుదల చేసినట్లు ఖదీజా చెప్పారు. వారి మధ్య ఒప్పందం కుదిరినట్లు తనకి అనుమానమున్నట్లు ఖదీజా చెప్పారు.

మలేషియా భూభాగంలోకి వెళ్లాలనే వారి ఆఖరి ప్రయత్నం కూడా విఫలమైనట్లే అనిపించింది.

“మేము తీరం చేరే ఆశ లేక సముద్రం మధ్యలోనే ఉండిపోయాం. చాలా మంది ఆశ కోల్పోతున్నారు. అలా ఎన్ని రోజులుండాలో మాకర్థం కాలేదు”.

కొంత మంది శరణార్థులు తమని ఎక్కడో ఒక చోట వదిలి పెట్టమని బోటు సిబ్బందిని వేడుకున్నారు.

కానీ, అది వారిని సమస్యల్లోకి నెట్టేస్తుందని వారు ఒప్పుకోలేదు.

బంగాళాఖాతంలో గమ్యం లేకుండా బోటు తిరుగుతూ ఉండటం చాలా భయం గా అనిపించింది. సిబ్బంది శరణార్ధుల పై మానభంగాలు, హింస చేస్తున్న వదంతులు కూడా వ్యాపించాయి.

పరిస్థితులు మా చేతులు దాటి పోతున్నాయని అర్ధమైంది. బోటు సిబ్బందిలో ఒకరి పై ఎవరో దాడి చేసి చంపేశారని కూడా విన్నాం.

బోటులో ఉన్న 400 కి పైగా శరణార్ధుల కోసం 10 మంది బోటు సిబ్బంది ఉండేవారు.

చిన్న పడవలని తెప్పించడానికి మమ్మల్ని మరిన్ని డబ్బులు ఇమ్మని డిమాండ్ చేశారు.

అందరం కలిసి మరో 90,000 రూపాయిలు పోగు చేసాం.

కొన్ని రోజులకి ఒక చిన్న పడవ వచ్చింది. అందులోకి కొంత మంది బోటు సిబ్బంది దూకి పారిపోయారు. మిగిలిన ఇద్దరు సిబ్బంది బోటుని మళ్ళీ బాంగ్లాదేశ్ కి తరలించారు.

రెండు నెలల తర్వాత తీరం చూసేసరికి నాకు చాలా ఆనందం కలిగింది. వాళ్లంతా మళ్ళీ బంగ్లాదేశ్ చేరుకున్నారు. వారి పరిస్థితి చూసి గ్రామస్థులు బాంగ్లాదేశ్ తీర ప్రాంత అధికారులకి సమాచారం అందించారు.

రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉన్న తర్వాత, ఖదీజా తిరిగి శరణార్థ శిబిరానికి చేరుకున్నారు. కాకపొతే ఆమె ఉండే స్థలంలో ఇప్పుడు మరో కుటుంబం నివసిస్తోంది.

మళ్ళీ మయాన్మార్ వెళ్లాలనే ఆశ ఆమెకి లేదు. బంగ్లాదేశ్లో దొరికిన చిన్న స్థలంలో ఆమె కొడుకు కూతురితో కలిసి ఆమె ఇప్పుడు బ్రతకాలి.

"నా కల నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగా నేను సర్వస్వము కోల్పోయాను. నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదు”.

(చిత్రాలు లు యాంగ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)