నల్ల జాతి వ్యక్తి మరణం: అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’

నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, వాషింగ్టన్ నుంచి బీబీసీ ప్రతినిధి

అమెరికాలో నల్ల జాతి వ్యక్తులపై పోలీసుల అరాచకత్వానికి వ్యతిరేకంగా మినియాపోలిస్‌లో పెల్లుబికిన ప్రజాందోళనలు, ఆగ్రహావేశాలు అమెరికా అంతటా పలు రాష్ట్రాలు, నగరాలకు విస్తరిస్తున్నాయి.

నిరాయుధుడైన ఆఫ్రికన్-అమెరికన్ పౌరుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా వెల్లువెత్తిన నిరసనలతో.. మినియాపోలిస్ నగరం మూడు రోజులుగా అతలాకుతలంగా మారింది.

న్యూయార్క్, అట్లాంటా, పోర్ట్‌లాండ్ సహా మరికొన్ని నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

వాషింగ్టన్ డీసీ లోని అధ్యక్ష భవనం శ్వేతసౌథాన్ని కొంతసేపు లాక్‌డౌన్ కూడా చేయాల్సి వచ్చింది.

ఆ దారుణ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

ఫొటో సోర్స్, DARNELLA FRAZIER

ఫొటో క్యాప్షన్, ఆ దారుణ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

అసలు ఏం జరిగింది?

మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో సోమవారం నాడు జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్ల జాతి వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ తెల్ల జాతి పోలీస్ అధికారి ఆయన మెడపై మోకాలితో బలంగా నొక్కి కూర్చున్నారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్జ్‌తో పాటు అక్కడున్న మిగతా వాళ్లు కూడా పోలీసును అలా చేయొద్దని వారించడం అందులో కనిపించింది.

‘‘ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు’’ అంటూ జార్జ్ మొరపెట్టుకున్నారు కూడా. పోలీసు వినిపించుకోలేదు. జార్జ్‌కు అవే ఆఖరి మాటలయ్యాయి. ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. దీనిపై విచారణ జరుగుతోంది.

జార్జ్ మెడపై మోకాలిని పెట్టి కూర్చున్న ఆ పోలీస్ అధికారి పేరు డెరెక్ షావిన్. ఆయన‌ అరెస్టయ్యారు. ఆయనపై హత్య కేసు నమోదైంది.

‘అమెరికాలో 2019లో పోలీసులు ఎవరినీ చంపకుండా ఉన్న రోజులు ఇరవై ఏడు మాత్రమే’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘అమెరికాలో 2019లో పోలీసులు ఎవరినీ చంపకుండా ఉన్న రోజులు ఇరవై ఏడు మాత్రమే’

ఈ వీడియో చాలా మందిని షాక్‌కు గురిచేసింది. ఘటన జరిగిన మినెసోటా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నిరసనలకు దారితీసింది.

మినియాపోలిస్ నగరంలో ఆందోళనకారులు దుకాణాలను దగ్ధం చేయటంతో పాటు పోలీస్ స్టేషన్‌కు సైతం నిప్పుపెట్టారు.

‘‘నల్ల జాతి ప్రజలకు వ్యతిరేకంగా మన సమాజంలో ఉన్న విద్వేష, జాత్యహంకారపూరిత భావనలకు ఈ చర్య సంకేతం’’ అని నేషనల్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ వ్యాఖ్యానించింది.

‘‘చావులతో విసిగిపోయాం’’ అని నినాదం చేసింది.

అమెరికాలో జాతి విద్వేషం గురించి ఎంతో కాలంగా చర్చ సాగుతోంది. అయితే, నల్ల జాతీయులపై పోలీసుల అరాచకత్వం ఎంతకూ ఆగకపోతుండటం జనాల ఆగ్రహానికి కారణం అవుతోంది.

‘నిరాయుధుడైన తెల్ల జాతి వ్యక్తి కన్నా నల్ల జాతి వ్యక్తి పోలీసుల కాల్పుల్లో మరణించే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ’

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ‘నిరాయుధుడైన తెల్ల జాతి వ్యక్తి కన్నా నల్ల జాతి వ్యక్తి పోలీసుల కాల్పుల్లో మరణించే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ’

‘‘2013-19 మధ్య పోలీసులు జనాలను చంపిన ఘటనల్లో 99 శాతం కేసుల్లో వారిపై అభియోగాలే నమోదు కాలేదు’’ అని పోలీసుల హింసకు సంబంధించిన కేసులను నమోదు చేస్తున్న మ్యాపింగ్‌పోలీస్‌వయోలెన్స్.ఓఆర్‌జీ వెబ్‌సైట్ తెలిపింది.

జార్జ్ ఫ్లాయెడ్ కుటుంబానికి, సన్నిహితులకు ‘హృదయపూర్వకంగా సానుభూతి’ తెలుపుతున్నానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. కానీ, ‘‘దోపిడీలు మొదలైతే, కాల్చివేత కూడా మొదలవుతుంది’’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ట్రంప్ తర్వాత ఆ వ్యాఖ్యపై వివరణ ఇచ్చుకున్నారు.

ఇటీవల కాలంలో మరో ఇధ్దరు నల్ల జాతీయులు కూడా ఈ తరహాలో ప్రాణాలు కోల్పోయారు.

ఫిబ్రవరి 23న అహ్మద్ అర్బెరీ (25) అనే నల్ల జాతి వ్యక్తిని తెల్ల జాతి వ్యక్తులు వెంటాడి, తుపాకీతో కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

అమెరికాలో ఆందోళనలు

ఫొటో సోర్స్, Reuters

మార్చి 13న బ్రెయన్నా టేలర్ అనే నల్ల జాతి మహిళ అపార్టెమెంట్‌పై తెల్ల జాతి పోలీసులు దాడి చేసి, ఆమెను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

‘‘అమెరికా‌లో నల్ల జాతి వ్యక్తిగా ఉండటం అంటే, మరణ శిక్ష పడినట్లు పరిస్థితి ఉండకూడదు’’ అని మినియాపోలిస్ మేయర్ జాకబ్ ఫ్రే ట్వీట్ చేశారు.

#BlackLivesMatter #JusticeforGeorgeFloyd హ్యాష్‌ట్యాగ్‌లు ట్వటర్ ట్రెండ్ అవుతున్నాయి.

‘‘నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నా’’ అని జార్జ్ పలికిన ఆఖరి మాట నిరసనల్లో నినాదమై మార్మోగుతోంది.

‘అమెరికా‌లో నల్ల జాతి వ్యక్తిగా ఉండటం అంటే, మరణ శిక్ష పడినట్లు పరిస్థితి ఉండకూడదు’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘అమెరికా‌లో నల్ల జాతి వ్యక్తిగా ఉండటం అంటే, మరణ శిక్ష పడినట్లు పరిస్థితి ఉండకూడదు’

ఎంతో కాలంగా కొనసాగుతున్న సమస్య

‘‘జార్జ్ ఫ్లాయెడ్ ఘటన నన్ను బాధించింది. ఆ వీడియో చూసినప్పుడు నేను ఏడ్చా. నా మనసు కకావికలమైంది’’ అని ఆఫ్రికన్ అమెరికన్ వ్యాపారి తనతో అన్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు, తొలి నల్ల జాతి అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ప్రకటనలో వివరించారు.

‘‘2020లోని అమెరికాలో ఇది ‘సాధారణం’ అవ్వడానికి వీల్లేదు. ‘సాధారణం’ అవ్వకూడదు’’ అని వ్యాఖ్యానించారు.

జార్జ్ ఫ్లాయెడ్ మృతి ఘటనతో అమెరికన్ సమాజంలో, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు, పోలీసుల వ్యవహారశైలి, ఫెడరల్ ప్రభుత్వం పాత్ర, న్యాయ వ్యవస్థలో జాతి విద్వేషపు ఛాయల గురించి వాదోపవాదాలు జరుగుతున్నాయి.

కరోనావైరస్ బారినపడి అమెరికాలో లక్షకుపైగా మంది మరణించారు. దాదాపు 4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నల్ల జాతి సహా మైనార్టీ వర్గాలపై దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో తాజా ఘటన చోటుచేసుకుంది.

అమెరికాలో పోలీసుల అరాచకత్వం అంశం ఎంతో కాలం నుంచి రగులుతోంది.

నల్ల జాతి వ్యక్తులపై పోలీసుల అరాచకత్వానికి వ్యతిరేకంగానే 1966లో ఓక్లాండ్‌లో బ్లాక్ పాంథర్ పార్టీ స్థాపితమైంది.

2014లో మైకేల్ బ్రౌన్ (18) అనే నల్ల జాతి యువకుడిని ఓ తెల్ల జాతి పోలీసు అధికారి కాల్చి చంపడం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది.

జమార్ క్లార్క్, జెరెమీ మెక్‌డోల్, విలియం చాప్‌మాన్-2, వాల్తేర్ స్కాట్... ఇలా బాధితుల జాబితాలో ఎంతో మంది పేర్లు వచ్చి చేరాయి.

మైకేల్ బ్రౌన్ లాంటివారి మరణాలు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం మొదలుకావడంతో ఈ సమస్యను పట్టించుకోవడం మొదలైంది.

అమెరికాలో ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోమవారం నుంచి అమెరికా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి

సమాచారం ఏం సూచిస్తోందంటే...

2015 జనవరిలో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పోలీసు షూటింగ్ డేటా బేస్‌ను మొదలుపెట్టింది. ఇప్పటివరకూ అందులో 4,400 ఘటనలు నమోదయ్యాయి.

పోలీసుల చేతిలో హత్యలకు గురవుతున్నవారిలో నల్ల జాతి అమెరికన్ల శాతం చాలా ఎక్కువగా ఉంటోందని ఆ డేటాబేస్ గుర్తించింది.

‘‘జనాభాలో నల్ల జాతి వ్యక్తుల జనాభా 13 శాతమే. కానీ, పోలీసుల కాల్పుల బాధితుల్లో 25 శాతానికిపైగా వారే ఉంటున్నారు. నిరాయుధులైన బాధితుల విషయంలో ఈ తేడా మరీ ఎక్కువగా ఉంది. ఇలాంటి బాధితుల్లో 66 శాతానికిపైగా నల్ల జాతి వ్యక్తులే ఉంటున్నారు’’ అని ఆ డేటాబేస్ తెలిపింది.

ఆ డేటాబేస్‌లో తేలినవి ఇవే:

  • నిరాయుధుడైన తెల్ల జాతి వ్యక్తి కన్నా నల్ల జాతి వ్యక్తి పోలీసుల కాల్పుల్లో మరణించే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ.
  • పోలీసుల కాల్పుల బాధితుల్లో ఎక్కువగా ఉండేది పురుషులే. వారిలో సగానికపైగా మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారే.
  • 2015 నుంచి పోలీసులు సగటున రోజుకు ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపారు.
  • 2019లో పోలీసులు 1,099 మందిని కాల్చి చంపారని మ్యాపింగ్‌వయోలెన్స్.ఓఆర్‌జీ తెలిపింది.
  • 2019లో పోలీసులు ఎవరినీ చంపకుండా ఉన్న రోజులు ఇరవై ఏడు మాత్రమేనని పేర్కొంది.

బాల్టిమోర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై 2016లో జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నివేదిక క్షేత్ర స్థాయిలో జాతి విద్వేషం ఎలా జీర్ణించుకుపోయి ఉందో చూపించింది.

‘‘ఆఫ్రికన్ అమెరికన్ పాదాచారులను బాల్టిమెర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎక్కువగా ఆపుతుంది. వయసు 50 దాటిన ఓ ఆఫ్రికన్ అమెరికన్‌ను నాలుగేళ్ల వ్యవధిలో 30 సార్లు పోలీసులు ఆపారు. ఈ 30 సార్లూ ఆయనపై ఎలాంటి నేరాభియోగాలూ నమోదు కాలేదు’’ అని ఆ నివేదిక పేర్కొంది.

‘‘ఆఫ్రికన్ అమెరికన్లను బాల్టిమోర్ పోలీసులు సోదాలు ఎక్కువగా చేస్తుంటారు. బాల్టీమోర్ జనాభాలో నల్ల జాతి వ్యక్తులు 63 శాతమే ఉన్నా, పోలీసులు నేరాలు మోపిన వారిలో వారు 86 శాతం దాకా ఉన్నారు’’ అని తెలిపింది.

డెట్రాయిట్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, టెట్రాయిట్‌లో ఆందోళనకారులను చెదరగొట్టటానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు

పోలీసు హత్యలు పెరగడానికి జాతి విద్వేషంతోపాటు సైనికీకరణ, పారదర్శకత లోపించడం, జవాబుదారీతనం లేకపోవడం కారణాలని కూడా వాదనలు ఉన్నాయి.

అమెరికా పోలీసుల్లో జాతి వైవిధ్యం లేకపోవడం ఈ సమస్యకు కారణమని ఇంకొందరు అంటున్నారు.

ఫుల్‌టైమ్ పోలీస్ అధికారుల్లో తెల్ల జాతి వాళ్లు 71 శాతం ఉండగా, నల్ల జాతి వాళ్లు 11.4 శాతంగా ఉన్నారని 2016లో సమాచారం తెలిపింది.

2017లో ఓ అధ్యయనం పోలీసు అధికారులు తెల్ల జాతీయులతో పోల్చితే నల్ల జాతీయులతో తక్కువ మర్యాదతో వ్యవహరిస్తున్నారని తెలిపింది.

తెల్ల జాతి వాళ్లు, నల్ల జాతి వాళ్లలో మాదక ద్రవ్యాల అమ్మకాలు, వాడకం ఒకే తీరుగా ఉన్నా, ఈ కేసుల్లో నల్ల జాతి వాళ్లు అరెస్టు అయ్యే అవకాశాలు 2.7 రెట్లు ఎక్కువని 2016లో ఓ నివేదిక వెల్లడించింది.

అమెరికాలో ఆందోళనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆరిజోనాలోని ఫీనిక్స్‌లో కూడా నిరసనకారుల మీద బాష్పవాయువు ప్రయోగించారు

పోలీసుల అరాచకత్వంలో జాతి పాత్ర ఏమీ ఉండదని అనే వాళ్లు కూడా ఉన్నారు. 2016లో డేనియల్ షెవర్ అనే తెల్ల జాతి వ్యక్తిని ఓ పోలీసు అధికారి కాల్చి చంపిన ఉదంతాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

‘‘పోలీసులు ఓ తెల్ల జాతి వ్యక్తిని వేధిస్తున్న వీడియో చూసినప్పుడు, తెల్ల జాతీయులు అసౌకర్యానికి, ఆగ్రహానికి లోనవుతారు. కానీ, ఆ బాధితుడి స్థానంలో తమను తాము ఊహించుకోరు. మనం మర్యాదగా, గౌరవంగా నడుచుకుంటే పోలీసులతో వాగ్వాదాలు జరగవు. డేనియల్ షెవర్‌కు జరిగినట్లుగా మనకు జరగదు అని వాళ్లు అనుకుంటారు. కానీ, అదే నల్ల జాతి వ్యక్తులు జార్జ్ ఫ్లాయెడ్ వీడియో చూస్తే, ఎక్కువ ఆగ్రహానికి గురవుతారు. తమ కొడుకును, స్నేహితుడిని, సోదరుడిని ఆ స్థానంలో ఊహించుకుంటారు’’ అని వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో రాడ్లీ బాల్కో అన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోటీలో జో బిడెన్‌కు నల్ల జాతి వ్యక్తుల ఓట్లు కలిసివస్తున్నాయి.

అధ్యక్ష ఎన్నికలు త్వరలో రాబోతుండంటంతో పోలీసుల అరాచకత్వం విషయం కూడా ఎన్నికల అంశల్లో ఒకటి కాబోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)