ఫెలిసియన్ కబుగా: 8 లక్షల మందిని బలితీసుకున్న రువాండా మారణ హోమం మోస్ట్ వాంటెడ్ అరెస్ట్

ఫొటో సోర్స్, EPA
ఫెలిసియన్ కబుగా.. రువాండా నరమేధంలో మోస్ట్ వాంటెడ్. ఆయన్ను పారిస్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు ఫ్రాన్స్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అస్నీరెస్ సుర్ సీన్‌లో తప్పుడు గుర్తింపు పత్రాలతో నివసిస్తున్న కబుగాను ఫ్రాన్స్ పారామిలటరీ బలగాలు పట్టుకున్నాయి. 84 ఏళ్ల కబుగాపై ‘ది ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్ ఫర్ రువాండా’ మారణహోమం, మానవజాతిపై సాగించిన నేరాభియోగాలు చేసింది.
1994లో రువాండాలో టుట్సీ తెగకు చెందిన 8 లక్షల మందిని హూటూ అతివాదులు చంపేశారు. హూటూ అతివాదులకు ధనసహాయం చేసిన ప్రధాన వ్యక్తి కబుగా అనేది ఆరోపణ.
మైనారిటీ తెగ అయిన టుట్సీకి చెందినవారిని, తమ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని హూటూ అతివాదులు 1994లో మారణహోమం సృష్టించారు. కబుగాకు సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి 50 లక్షల అమెరికన్ డాలర్ల బహుమతిని కూడా అమెరికా ఇదివరకే ప్రకటించింది.
ఎవరీ కబుగా..
హూటూ తెగకు చెందిన వ్యాపారవేత్త కబుగా. రువాండా నరమేధానికి ధన సహాయం చేసింది ఈయనేనన్న ఆరోపణలున్నాయి.
నరమేధానికి పాల్పడిన మిలీషియాలకు ఈయన భారీగా డబ్బులిచ్చారని చెబుతారు.
‘రేడియో టెలివిజన్ లిబర్ డెస్ మిల్లీ కొలీనెస్’(ఆర్టీఎల్ఎం) అనే దుష్ట మీడియా సంస్థను స్థాపించింది ఈయనే.
ఈ మీడియా సంస్థ.. ‘‘టుట్సీలను వెతికి పట్టుకుని చంపేయండి’ అంటూ నిత్యం పిలుపునిస్తూ హూటూలను రెచ్చగొట్టేది.

ఫొటో సోర్స్, AFP
ఎలా పట్టుకున్నారు..
పారిస్ సమీప ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో కబుగా తన పిల్లలతో కలిసి మారు పేరు, తప్పుడు గుర్తింపుతో నివసిస్తున్నారని ఫ్రెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.
శనివారం ఉదయం 5.30(ఫ్రాన్స్ కాలమానం)కి ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. రువాండాలోని దారుణ నేరాలకు సంబంధించి విచారణ జరుపుతున్న హేగ్‌లోని ఇంటర్నేషనల్ రెసిడ్యుయల్ మెకానిజం ఫర్ క్రిమినల్ ట్రైబ్యునల్స్ చీఫ్ ప్రాసిక్యూటర్ నేతృత్వంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో కబుగా చిక్కినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
ఇంతకీ ఈ నరమేధం ఏమిటి?
రువాండాలో 1994లో ఎనిమిది లక్షల మందిని 'హూటూ' జాతికి చెందిన అతివాదులు చంపేశారు.
100 రోజుల పాటు ఈ నరమేధం సాగింది.హూటూ అతివాదులు మైనారిటీలైన టుట్సీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ మారణకాండ సాగించారు. జాతితో నిమిత్తం లేకుండా రాజకీయ ప్రత్యర్థులనూ లక్ష్యంగా చేసుకున్నారు.
చనిపోయినవారిలో అత్యధికులు టుట్సీలు, ఉదారవాద హూటూలు. రువాండాలో దాదాపు 85 శాతం మంది హూటూలు.. కానీ మైనారిటీలైన టుట్సీలే సుదీర్ఘకాలం ఆధిపత్యం సాగించారు. 1959లో టుట్సీ రాచరిక పాలన అంతమైంది.
వేల మంది టుట్సీలు రువాండా నుంచి పారిపోయారు. ఉగాండా, ఇతర ఇరుగుపొరుగు దేశాలకు చేరుకున్నారు.రువాండాను వీడిన కొందరు టుట్సీలు ఒక తిరుగుబాటు గ్రూపును ఏర్పాటు చేశారు.
అదే- రువాండన్ పేట్రియాటిక్ ఫ్రంట్(ఆర్‌పీఎఫ్). ఆర్‌పీఎఫ్ 1990లో రువాండాపై దాడికి దిగింది.
ఆర్‌పీఎఫ్, వైరి పక్షాల మధ్య 1993 వరకు పోరాటం కొనసాగింది. 1993లో శాంతి ఒప్పందం కుదిరింది. 1994 ఏప్రిల్ 6న రువాండా అధ్యక్షుడు జువెనల్ హబ్యారిమానా, పొరుగుదేశం బురుండి అధ్యక్షుడు సైప్రీన్ నటార్యమిరా ఇద్దరూ వెళ్తున్న విమానం కూల్చివేతకు గురైంది.
వీరిద్దరూ హూటూలు. వీరిద్దరితోపాటు విమానంలోని అందరూ చనిపోయారు.
విమానాన్ని ఆర్‌పీఎఫ్ వారే కూల్చేశారని హూటూ అతివాదులు ఆరోపించారు.
వెంటనే టుట్సీలను లక్ష్యంగా చేసుకొని జాతిహననానికి తెగబడ్డారు. ఇరుగుపొరుగు వారే ఒకరినొకరు చంపుకొన్నారు.
కొందరు పురుషులు టుట్సీ వర్గానికి చెందిన తమ భార్యలను చంపేశారు.
''మిమ్మల్ని చంపకపోతే మిలీషియా సభ్యులు మమ్మల్ని చంపేస్తారు'' అంటూ వారి ప్రాణాలు తీశారు.
హూటూలు వేల మంది టుట్సీ మహిళలను నిర్బంధంలోకి తీసుకొని, వారిని లైంగిక బానిసలుగా మార్చుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- రువాండా మారణకాండకు 26 ఏళ్లు: వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని ఊచకోత కోశారు.. బయటపడ్డ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు?
- విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం: స్టైరీన్ ప్రభావం పర్యావరణంపై ఎంత కాలం ఉంటుంది?
- విశాఖపట్నం గ్యాస్ లీకేజి: ‘‘నాకు పరిహారం వద్దు.. నాకు నా ఇద్దరు పిల్లల్ని, నా భర్తను ఇవ్వండి’’
- మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ: ఆర్థిక జాతీయవాదం ఆచరణ సాధ్యమా? స్వావలంబన ఇంకెంత దూరం?
- WHO హెచ్చరిక: ‘కరోనావైరస్ ఎప్పటికీ పోకపోవచ్చు’
- కరోనావైరస్: ‘ఈ సంక్షోభంలో ఖండాలు దాటుతూ చేసిన ప్రయాణాలు నాకు ఏం నేర్పాయంటే...’ - బ్లాగ్
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








