విశాఖపట్నం గ్యాస్ లీకేజి: ‘‘నాకు పరిహారం వద్దు.. నాకు నా ఇద్దరు పిల్లల్ని, నా భర్తను ఇవ్వండి’’

- రచయిత, విజయ్ గజం
- హోదా, బీబీసీ కోసం
“బాబూ.. నా భర్త ఎక్కడ ఉన్నాడో.. అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు” ఓ ఇల్లాలి అవేదన. “మా అమ్మ చనిపోయింది. నేను ఆస్పత్రి పాలయ్యాను” ఓ టీనేజర్ దీన గాథ. “నా ఒళ్లు కాలిపోయింది. నా భర్త, కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. వాళ్లను కనీసం చూడలేకపోతున్నాను” ఓ మహిళ శోకం. “నాకు స్పృహ వచ్చే పాటికే నా భర్త చనిపోయాడన్నారు. కనీసం చివరి చూపు కూడా దక్కలేదు” మరో బాధితురాలి రోదన. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్) వద్ద పరిస్థితి ఇది.
విశాఖపట్నం నగర పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకేజీ ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. ఆ దుర్ఘటనలో శుక్రవారం నాటికి 12 మంది మరణించినట్లుగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు.
దాదాపు 454 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఎక్కువ మందికి కేజీహెచ్‌లో వైద్యం అందిస్తున్నారు.
ఈ ఆస్పత్రి వద్ద పలువురు క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులు, తమ ఆప్తుల ఆచూకీ కోసం వెతుకుతున్నవారు బీబీసీతో మాట్లాడారు.
“ఎల్‌జీ పాలిమర్స్ పక్కనే ఉన్న వెంకటాపురంలో ఉంటాను. మేం వెంకటాపురం వచ్చి 12 ఏళ్లు అవుతోంది. నేను గర్భంతో ఉన్నప్పుడు వచ్చాను. ఇన్నేళ్లలో ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చూడలేదు.
ఆ రోజు పొద్దున ఏం జరుగుతోందో అర్థం కాలేదు. పిల్లల్ని తల్లుల్ని వదిలేసి పరుగులు తీశాం. ఎటు పరిగెత్తామో కూడా మాకు తెలియదు. వాంతులు అయ్యాయి. రోడ్డు మీదకు తీసుకొచ్చేదాకా ఎం జరిగిందో తెలియలేదు. ఎవరో ఒకాయన వచ్చి గ్యాస్ లీక్ అవుతోంది పారిపోండని చెప్పారు. ఇంటి తాళాలు దొరకలేదు, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. తలుపు దగ్గరే వాంతులయ్యాయి. మా ఇంటి పక్కనే చిన్నచిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చనిపోయారు.
నా పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. తప్పిపోయిన వాళ్ల సమాచారం తెలుస్తుందేమో అని పేపర్లు కూడా చూశాను, కానీ దొరకలేదు. నా పిల్లల సమాచారం ఏదీ నా దగ్గర లేదు. డబ్బిస్తే నా పిల్లలు మళ్లీ వస్తారా.. నా భర్త జాడ కూడా తెలియడం లేదు. ఏ ఆస్పత్రిలో ఉన్నారో తెలియడం లేదు. చనిపోయాడో కూడా తెలియదు. నా బంధువులు కూడా రావడానికి వీలులేకుండా పోయింది. డాక్టర్లు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు పర్వాలేదు. కాస్త ఊపరి ఆడుతోంది” అని బంటు సీత బీబీసీతో చెప్పారు.

వెంకటాపురం గ్రామానికి చెందిన పవన్‌ది మరో గాథ. తెల్లారేసరికి ఆయన ప్రపంచం తలకిందులైంది. “మా అమ్మ పేరు వరలక్ష్మి. ఈ గ్యాస్ లీకేజి ప్రమాదంలో మా అమ్మ చనిపోయింది. 15 ఏళ్ల క్రితం కూడా ఇలాగే గ్యాస్ లీక్ అయింది. అప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇలా జరిగింది. అప్పుడు మా ఊరంతా చెల్లాచెదురైంది. ఈసారి గ్యాస్ ఒక్క సారిగా వచ్చింది. ప్రాణాలు కాపాడుకునేందుకు తెల్లవారుజామున మూడు గంటలకు గేటు తీసుకొని బయటకు పరుగెత్తుకొచ్చాం. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. కొంచెం ముందుకు వెళ్లాం. అందరం కింద పడిపోయాం. గ్యాస్ వల్ల స్పృహ తప్పడంతో మా అమ్మ పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. నేను కళ్లు తెరిచి చూసేసరికి ఆస్పత్రిలో ఉన్నాను. ఊపిరాడక అమ్మ చనిపోయిందని చెప్పారు” అని పవన్ చెప్పారు.

“రోజూ రాత్రి వాసన వస్తుండేది”
ఈ ప్రమాదంలో మరో మహిళ వరలక్ష్మి భర్త, కుమారుడు తీవ్రంగా అస్వస్థతకు గురైయ్యారు. వరలక్ష్మి శరీరం కాలింది.
“తెల్లవారుజామున మూడున్నర గంటలప్పుడు బాగా వాసన రావడంతో మా ఆయన, నేను ఒక్కసారిగా నిద్ర లేచి, మా బాబును లేపాము. రోజూ రాత్రి 12 గంటల సమయంలో ఆ కంపెనీ నుంచి వాసన వస్తుండేది. లాక్‌డౌన్ వల్ల ఈ మధ్య కాలంలో రాలేదు. నన్నూ, మా బాబును పోలాల వైపు పారిపొమ్మని మా ఆయన చెప్పాడు. కానీ, అటు వైపే వాయువు ప్రభావం ఎక్కువగా ఉంది. చాలామందిమి కిందపడిపోయాం. కళ్లు తెరిచి చూస్తే ఆస్పత్రిలో ఉన్నాను. మా వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మా బాబు ఒక చోట ఉన్నాడు, మా ఆయన ఇంకో చోట ఉన్నాడు. నాకు ఆ గ్యాస్ ప్రభావంతో ఒళ్లు కాలిపోయింది” అని ఆమె వివరించారు.
ఈ ప్రమాదంలో నేబరి అనే మహిళ భర్త చనిపోయారు. అమె భర్త పేరు నాని. సెంట్రింగ్ పని చేసేవారు.
“ప్రమాదం జరిగిన రోజు నా భర్త తెల్లవారుజామున నన్ను బయటకు లాక్కెళ్లారు. ఇద్దరం పరిగెత్తాం. ఎలా తప్పిపోయాయమో నాకు గుర్తులేదు. నాకు ఆయాసం ఎక్కువైంది. దాంతో, నన్ను గోపాలపట్నంలోని ఆస్పత్రిలో చేర్చారు. తర్వాత అక్కడి నుంచి కేజీహెచ్‌కు మార్చారు. కళ్లు తెరిచి చూస్తే నీ భర్త చనిపోయారని చెప్పారు. కనీసం చివరి చూపు కూడా నాకు దక్కలేదు” అని నేబరి ఆవేదన వ్యక్తం చేశారు.
పరిస్థితి మెరుగు పడింది - మంత్రి గౌతమ్ రెడ్డి
“ఇలాంటి సంఘటనలు జరుగకూడదు, కానీ జరిగింది. ప్రస్తుతం పరిస్థితి మెరుగు పడింది. పేషెంట్లు కూడా అదే చెబుతున్నారు. పోలీసులు, వైద్య బృందాలు చాలా అద్భుతంగా పనిచేశాయి. రక్షక్‌లు, ఇతర వాహనాలను తీసుకొచ్చి దాదాపు 4,500 కుటుంబాలను అధికారులు తరలించారు. ఎలాంటి రక్షణ లేకుండా అధికారులు తమ ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారు. ఆ ప్రాంతంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. త్వరలోనే సేఫ్ జోన్‌లోకి వస్తాం. 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చెల్లించాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఎల్‌జీ పాలిమర్స్‌ను ఆదేశించింది. నేను కూడా దక్షిణ కొరియా రాయబారితో మాట్లాడాను. ఇదే ఘటన అమెరికాలోనో, యూరప్ దేశాల్లోనో జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పాం. 48 గంటల తరువాత పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. అప్పుడే ఆ ప్రాంతంలోకి ప్రజలను అనుమతిస్తాం” అని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ పేషెంట్లను చూస్తే భయమేసింది: కేజీహెచ్ సూపరిండెంట్
‘‘స్టైరీన్ రసాయన వాయువు లీకేజీ వల్ల దాదాపు అయిదారు వేల మంది ప్రభావితం అయ్యారు. 500 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారు. మేం ముందుగా అప్రమత్తం అయ్యాం. ఉదయం 5.30 నుంచే సిద్ధంగా ఉన్నాం. వరుసగా అపస్మారక స్థితిలో వస్తున్న పేషెంట్లను చూసి మొదట మాకు భయమేసింది. ఎంత మంది చనిపొతారో, ఎటువంటి పరిస్థితులలో వస్తారో, ఎన్ని వెంటిలేటర్లు సిద్ధం చేయాలోనని అందోళనకు గురయ్యాం. అత్యవసర విభాగంలో మొదట 50 మందిని చేర్చిన తరువాత రాజేంద్రప్రసాద్ వార్డులో ఒకేసారి 150 మందికి చికిత్స చేయొచ్చనే ఆలోచనతో ఆ వార్డులో ఆక్సిజన్ సదుపాయాలు సిద్ధం చేశాం. ఉదయం 8 గంటలకల్లా 195 మంది కేజీహెచ్‌కు వచ్చారు. ఆరుగురు పెద్దవాళ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని ఐసీయూకు తరలించి చికిత్స అందించాం. ముగ్గురు పిల్లల పరిస్థితి కూడా అందోళనకరంగా ఉంటే వారిని ఇంటెన్సివ్ పిడియాట్రిక్ వార్డుకు తరలించి ఆక్సిజన్ అందించాం. గురువారం సాయంత్రానికి కేజీహెచ్‌లో 243 మంది చేరారు. అందులో 43 మంది పిల్లలు ఉన్నారు. శుక్రవారం మరో 52 మంది చిన్నారులు, 80 మంది పెద్దలు వచ్చారు. వారికి ప్రాథమిక చికిత్స చేసిన తరువాత ఫ్లూయిడ్స్ ఇచ్చాం. చాలా మంది కోలుకున్నారు.
గురువారం మొత్తంగా 11 మంది చనిపోయారు. వారిలో ముగ్గురు మహిళలను, ఒక చిన్నారిని చనిపోయిన తరువాత ఆస్పత్రికి తీసుకొచ్చారు. రెండు బెడ్లకు ఒక డాక్టరును ఏర్పాటు చేశాం. ఈ రసాయన వాయువు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయంపై ఏదైనా ప్రభావం ఉందా అన్నది కూడా చూశాం. కోలుకున్నవారిని ప్రభుత్వ అదేశాల అనంతరం డిశ్చార్జ్ చేస్తాం. గ్రామాలలో గ్యాస్ ప్రభావం పూర్తిగా తగ్గకుండా ఉంటే ప్రజలు మళ్లీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఎవరూ లేరు. 24 గంటలలో వారు ఆహారం తీసుకుని, ఎటువంటి వాంతులు లేకుండా ఉంటే వాళ్ల డిశ్చార్జ్ ప్రక్రియ మొదలు పెడతాం” అని కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ అర్జున్ వివరించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- విశాఖ గ్యాస్ లీక్: 'ఎల్జీ పాలిమర్స్ భద్రత నియమాలు పాటించలేదు' - బీబీసీతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
- వైజాగ్ గ్యాస్ లీక్: ఇప్పటిదాకా ఏం జరిగింది... ఇంకా తెలియాల్సింది ఏమిటి?
- భోపాల్ నుంచి వైజాగ్ ఎల్జీ పాలిమర్ వరకు... ప్రాణాలు తీస్తున్న పారిశ్రామిక ప్రమాదాలు
- కరోనావైరస్పై అమెరికాలో పరిశోధన చేస్తున్న చైనా సంతతి ప్రొఫెసర్ బింగ్ ల్యూ హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందా?
- లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులను పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలను వేధిస్తున్న ప్రశ్న
- కరోనావైరస్: విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా? ఆన్లైన్ తరగతుల ప్రభావం వారిపై ఎలా ఉంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








