వైజాగ్ గ్యాస్ లీక్: ఇప్పటిదాకా ఏం జరిగింది... ఇంకా తెలియాల్సింది ఏమిటి?

జగన్

ఫొటో సోర్స్, APCM FB

కళ్లెదుటే పిల్లలు కుప్పకూలుతుంటే నిస్సహాయంగా మిగిలిపోయిన తల్లులు.. నురగలు కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన అమ్మలను చూసి తల్లడిల్లిన పిల్లల హాహాకారాలతో విశాఖ నగరం గురువారం నిద్రలేచింది.

విశాఖ నగరంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి రసాయన వాయువులు వెలువడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అర్ధరాత్రి దాటాక నగరంలోకి కమ్ముకొచ్చిన రసాయన వాయువును నిద్రలోనే పీల్చి ఆ నిద్రలోనే స్పృహ తప్పినవారు కొందరైతే.. దాన్నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీస్తూ పడిపోయినవారు మరికొందరు.ఎక్కడికి వెళ్లాలో... ఎంతదూరం వెళ్తే ఈ విషవాయువు నుంచి ప్రాణాలు కాపాడుకోగలమో తెలియకపోయినా నగరం దాటిపోయేందుకు నడుస్తూ, పరుగెడుతూ, వాహనాలపైనా ప్రాణభయంతో పారిపోయారు.అయినా విషవాయువు స్టైరీన్ కొందరిని బలితీసుకుంది.. మరికొందరిని ఆసుపత్రిపాల్జేసింది.

ఇంతకీ ఏమిటీ స్టైరీన్ వాయువు? ఎలా లీకైంది? ఈ వాయువు అంత ప్రమాదకరమా? ఈ దుర్ఘటనలో ఇప్పటిదాకా ఏయే పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఇంకా సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ఏమున్నాయి...

ఎల్జీ పాలిమర్స్

ఎక్కడుందీ ప్లాంట్...

విశాఖ నగరంలోని గోపాలపట్నానికి సమీప ప్రాంతం ఆర్ఆర్ వెంకటాపురం. అక్కడికి దగ్గర్లోనే ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ ఉంది.

కరోనావైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో ఈ కంపెనీ కూడా కొన్నాళ్లుగా పనిచేయడం లేదు.

అయితే.. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ గ్రీన్ జోన్లలో పరిశ్రమలు నడవడానికి అనుమతులు ఇవ్వడంతో ఎల్‌జీ పాలిమర్స్ కూడా పనిచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2.30 గంటల సమయంలో ప్లాంటులోని ట్యాంకు నుంచి ఈ విషవాయువు పొంగుకొచ్చింది. స్మోక్ డిటెక్టర్లు వెంటనే గుర్తించి శబ్దం చేసినప్పటికీ అప్పటికే దట్టంగా వాయువు కమ్ముకోవడంతో ప్లాంటు సిబ్బంది అక్కడికి వెళ్లలేకపోయారు.

101కి ఫోన్ చేసి సమాచారమివ్వడంతో అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ లీకేజినీ ఆపడానికి ప్రయత్నాలు చేశారు.

విశాఖ గ్యాస్ లీకేజి

ఏఏ ప్రాంతాల్లో ప్రభావం తీవ్రంగా ఉంది

ప్లాంటుకు సమీపంలో ఉన్న వెంకటాపురం, పద్మనాభనగర్, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రినగర్‌లలో ఈ వాయువు దట్టంగా వ్యాపించింది.

దుర్వాసన, చర్మంపై దద్దుర్లు రావడం, కళ్లు మండడం, ఊపిరి అందకపోవడంతో జనం ఏదో గ్యాస్ లీకయిందని గుర్తించి కుటుంబాలతో అప్పటికిప్పుడు పరుగులు తీశారు.

అయితే, సుమారు 2 వేల మంది సకాలంలో ఈ ఉత్పాతాన్ని గుర్తించలేక ఇళ్లలోనే ఉండిపోయారు.

వారి చాలామందిని స్పృహతప్పిన స్థితిలో, ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారు.

నేవీ కూడా వెంటనే రంగంలో దిగి సహాయ చర్యల్లో పాలుపంచుకుంది.అందరినీ ఆసుపత్రులకు తరలించారు.

అధికారులు హుటాహుటిన సింహాచలం డిపో నుంచి ఆర్టీసీ బస్సులను రప్పించారు.

పదుల సంఖ్యలో అంబులెన్సులు మోహరించాయి. వీటితో పాటు ఆటోలు, బైకులు, ట్రక్కులు.. ఇలా అందుబాటులో ఉన్న ప్రతిమార్గంలో అక్కడి ప్రజలను తరలించారు.

మృతులు వీరే...

ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోయారు. వారి వివరాలు:

రత్నాల గంగాధర్(64), మేకా కృష్ణమూర్తి(73), నారాయణమ్మ(35), అప్పలనరసమ్మ(45), గ్రీష్మ(9), కుందన్ శ్రేయ(6), చంద్రమౌళి(19), గంగాధర్(35), గంగరాజు(48)తో పాటు మరో ఇద్దరు(గుర్తించాల్సి ఉంది) మరణించారు.

ఈ విషవాయువు ప్రభావానికి మూగజీవాలు కూడా బలయ్యాయి. పెద్దసంఖ్యలో పశువులు మృతి చెందాయి.

నగర శివారు ప్రాంతం కావడంతో పాల వ్యాపారంపై ఆధారపడేవారు పెంచుకునే పశువులతో పాటు పెద్దసంఖ్యలో వీధి కుక్కలు, ఇళ్లలోని బల్లులు వంటివీ మరణించాయి.

జగన్

ఫొటో సోర్స్, APCM FB

ప్రభుత్వం ఏమంటోంది?

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే నిర్దేశిత ప్రక్రియలను పాటించడంలో కంపెనీ నిర్లక్ష్యం వహించిందని అర్థమవుతోంది. కార్యకలాపాలు ప్రారంభించే ముందు, ప్రత్యేకించి ఇలాంటి కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత నిబంధనలను పాటించి తీరాలని ప్రభుత్వం చాలా విస్పష్ట ఆదేశాలు జారీచేసింది. ఈ నిబంధనల అమలులో ఎల్జీ పాలిమర్స్ విఫలమైందని నిరూపణ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.

మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హుటాహుటిన ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించారు.

మరణించిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నవారికి 10 లక్షల చొప్పున, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు, రెండు మూడు రోజులు చికిత్స పొందినవారికి లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఈ ఘటనపై పూర్తి దర్యాప్తుకు కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మృతుల కుటుంబ సభ్యుల్లో ఒక‌రికి అదే సంస్థలో ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామ‌ని చెప్పారు.

సుమోటోగా తీసుకున్న హైకోర్టు

విశాఖలోని పరిశ్రమలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై హైకోర్టు విచారణ జరిపింది.

గ్యాస్ లీకై పలువురు మ‌ర‌ణించిన‌ దుర్ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు, అధిక జనాభా ఉన్న ప్రాంతంలో ఇటువంటి పరిశ్రమకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించింది.

ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయ‌స్థానం నోటీసులు జారీ చేసింది.త‌దుప‌రి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)