వైజాగ్ గ్యాస్ లీకేజీ: "పాలిమర్స్ పేలిపోతోంది, వెళ్లిపోండి బాబూ..." - బీబీసీ ప్రతినిధి విజయ్ అనుభవం

విశాఖ గ్యాస్ ప్రమాదం
    • రచయిత, విజయ్ గజం
    • హోదా, బీబీసీ కోసం

విశాఖ నగరానికి ఆనుకొని ఉండే పద్మనాభపురంలో ఉంటాను నేను. నగరానికి దూరంగా గ్రామీణ వాతావరణం ఉండటం వల్ల సంవత్సరం క్రితం ఇక్కడకు అద్దెకు మారాం. రోజూ వివిధ పనుల కోసం సిటీకు వెళ్లాలంటే ఆర్ఆర్ వెంకటాపురం మీదుగా పద్మనాభపురం, గోపాలపట్నం, ఎన్ఏడీల మీదుగా వెళ్ళాలి.

లాక్ డౌన్ వల్ల ఇన్ని రోజులూ ఇంట్లోనే ఉన్నా నిన్న సాయంత్రం వేరే పని మీద సిటీకు వచ్చాను. లాక్ డౌన్ కావడంతో ఉదయం పూట చాలా తక్కువ మంది సిబ్బందితో, కేవలం ఉదయం షిఫ్టు మాత్రమే ఫ్యాక్టరీ నడుస్తోంది. నిన్న సాయంత్రం నేను తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు కూడా, ఫ్యాక్టరీ పక్క నుంచే వచ్చాను. అంతా ప్రశాంతంగా ఉంది. రాత్రి మా అబ్బాయికి రెండు కథలు చెప్పి నిద్రపుచ్చాము. ప్రశాంతంగా పడుకున్నాం.

తెల్లవారుఝామున 3.30 గంటలకు మంచి నిద్రలో ఉన్నాను.

ఎవరో తలుపు దబదబా బాదుతున్నారు.

"ఎవరో చూడు, ఉషా" అన్నాను నా భార్యతో. ఆమె తలుపు తీసింది. వెనకే నేనూ వెళ్లాను. తలుపు తీసి చూస్తే, ఎదురుగా, మా వెనుక ఇంట్లో ఉండే నాగమణి ఆంటీ, ఆయాసపడుతూ కనిపించింది.

"బాబూ ఎంతసేపు తలుపు కొట్టాలి? పాలిమర్స్ పేలిపోతోంది. వెళ్లిపోండి బాబూ.." అని చెప్పింది. (ప్రమాదం జరిగిన కంపెనీని స్థానికులు పాలిమర్స్ అనే పిలుస్తారు.)

ఆమె కొడుకు అదే కంపెనీలో పనిచేస్తాడు.

విశాఖ గ్యాస్ ప్రమాదం

నిద్రమత్తులో ఉన్న నాకు ఒక్క క్షణం ఆమె చెప్పేది అర్థం కాలేదు. రోడ్డు మీద జనం భయంతో పరుగులు పెట్టడం ఒకటే కనిపిస్తోంది. మా ఇంటి యజమాని కూడా కనిపించారు.

"వెళ్లిపోండి విజయ్. ఉషా, లక్కీ (మా అబ్బాయి)ని తీసుకుని వెళ్లిపో'' అంటూ ఆయనా, వాళ్ల కుటుంబం బయల్దేరుతున్నారు.

కొద్దికొద్దిగా ఘాటైన వాసన ముక్కుకు తగులుతోంది. కళ్లు మండుతున్నాయి. వెంటనే బయల్దేరడానికి సిద్ధమయ్యాం. గ్యాస్ లీక్ అయిందని తెలుస్తోంది. కాసేపటికే ఈ వాసన మరింత ఘాటెక్కింది.. తీవ్రత పెరుగుతోందని అర్థమవుతోంది. నాకు అప్పటికే శ్వాస సమస్య ఉంది. దీంతో మరి కాస్త భయం వేసింది.

"ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోతాం" అని అడిగింది ఉష.

"ముందు బయల్దేరు" అంటూ బట్టలు మార్చుకున్నాం.

బట్టలు తీసుకురానా అని అడిగింది నా భార్య. అవసరం లేదు అన్నాను.

విశాఖ గ్యాస్ ప్రమాదం

బైక్ మీద ప్రయాణమయ్యాం. రోడ్డు మీద వందల సంఖ్యలో బైకులు, పదుల సంఖ్యలో ఆటోలు జనాలతో ఉన్నాయి. చాలామంది రాత్రి పడుకున్నప్పుడు ఉన్న బట్టలతోనే ఉన్నారు. మహిళలు భయంతో పరుగులు తీస్తున్నారు.

ఆ జనంలో బండి నడపడం కూడా ఇబ్బంది అయింది. నా భార్యా పిల్ల్ని బైక్ దింపి కొద్ది దూరం నడవమని చెప్పి, నేను ఆ రద్దీ నుంచి బైక్‌ను తప్పించాల్సి వచ్చింది.

ఎలాగోలా సింహాచలం చేరుకున్నాం. అక్కడ దేవస్థానం గోశాల దగ్గరున్న డివైడర్ దగ్గర కూర్చున్నాం.

అక్కడ కూర్చోగానే ఆఫీసుకు సమాచారం ఇచ్చి, అప్పటికప్పుడు కొన్ని ఫొటోలు తీసి పంపించాను.

చాలామంది వాళ్ళ టూవీలర్స్, ఆటోలు, కార్లు ఇలా రకరకాలుగా వచ్చి, మా పక్కన కూర్చుంటున్నారు. చూస్తుండగానే ప్రజలతో ఆ ప్రాంతం నిండిపోయింది. అప్పుడే నా మిత్రుడు ఒకరు పిల్లలను తీసుకువెళ్తూ కనిపంచారు.

ఈలోపు అక్కడకూ కెమికల్ వాసన వస్తూండడంతో తిరిగి బండి స్టార్ట్ చేశాను. సింహాచలం దేవస్థానం క్రాస్ చేసిన తరువాత దారి పొడవునా, హనుమంతవాక జంక్షన్ వచ్చే వరకూ నాలాగా వచ్చేవారు ఎందరో కనిపిస్తూనే ఉన్నారు. తిన్నగా కైలాసగిరి బీచ్ దగ్గరకు చేరుకున్నాను.

వీడియో క్యాప్షన్, చెర్నోబిల్: భయానక ప్రాంతం, ఇప్పుడు విహార స్థలం!

కైలాసగిరి దగ్గర సముద్రం ప్రశాంతంగా ఉంది. వాసన లేదు. కానీ, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? ఇదే సమస్య!

చిన్న వాల్తేరులో మా బంధువులు ఉంటారు.

"చిన్న వాల్తేరు అమ్మమ్మ వాళ్లింటికి వెళ్దాం డాడీ" అన్నాడు మా అబ్బాయి. టైం చూస్తే ఆరు అయింది. ఇంత పొద్దునే వారి ఇంటికి వెళ్తే బావుంటుందా అని చిన్న అనుమానం.

మొత్తానికి బయల్దేరాం. కైలాసగిరి నుంచి చిన వాల్తేరు వస్తూండగానే, వారికి ఫోన్ చేశాను. "వచ్చేయండి మా ఇంటికి" అన్నారు. "హమ్మయ్య" అని ఊపిరి పీల్చుకుని వాళ్లింటికి వెళ్లిపోయాం.

ఆంటీ వాళ్లింటికి వెళ్లగానే కూర్చుని వాట్సాప్ తెరిచాను.

చాలా బాధ కలిగింది. వీడియోలు చూస్తే చాలా మంది శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పేలిపోయిందని చెప్పడంతో వాళ్లు భయంతో తలో దిక్కూ పరుగులు పెడుతున్నారు. ఎక్కువ మంది మేఘాద్రి గడ్డ వైపు వెళ్లారు. మేఘాద్రి వైపు వెళ్లిన వారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా చాలా మంది రోడ్డుపైనే ఉండిపోయారు.

నా భార్య, కొడుకును వాళ్లింట్లో వదిలాక, ఇక పూర్తి స్థాయిలో పనిలోకి దిగాను.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)