రువాండా మారణకాండకు 26 ఏళ్లు: వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని ఊచకోత కోశారు.. బయటపడ్డ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు?

ఫొటో సోర్స్, CHRYSTAL DING
రువాండాలో 1994 నాటి జాతిహననం నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి కొనసాగుతున్న చికిత్సను నిక్షిప్తం చేయటానికి ఫొటో జర్నలిస్ట్ క్రిస్టల్ డింగ్ కౌన్సెలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఆమె అక్కడ రెండు వారాల పాటు ఉండి.. చికిత్స పొందుతున్న వారి ఫొటోలు, వారి చేతిరాత ప్రతిస్పందనలు, ఆ ప్రాంతం చిత్రాలు తీశారు.
హెచ్చరిక: ఈ కథనంలోని వివరాలు కొందరు పాఠకులకు బాధ కలిగించవచ్చు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
రువాండాలో 1994లో కేవలం 100 రోజుల్లో దాదాపు 8,00,000 మంది ప్రజలను ఊచకోత కోశారు ఆదివాసీ హుటు తీవ్రవాదులు.
మైనారిటీలైన టుట్సీ జాతి ప్రజలతో పాటు తమ రాజకీయ ప్రత్యర్థులందరినీ లక్ష్యంగా చేసుకుని ఈ మారణకాండ సాగించారు.
‘‘అప్పుడు నా వయసు మూడేళ్లు. నాడు నా వయసులో ఉండి ఆ మారణకాండ నుంచి బయటపడ్డ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? జాతిహననం నుంచి కోలుకోవటం ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవాలని నాకు బలంగా అనిపించింది’’ అని చెప్పారు క్రిస్టల్.
రువాండా కౌన్సెలర్లు నిర్వహిస్తున్న మానసిక చికిత్స కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. ఆ చికిత్స తీసుకుంటున్న వారు తాము చిన్నప్పుడు అనుభవించిన భయోత్పాతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పిన చాలా భయానక కథనాలు విన్నారు. వారిలో చాలా మంది తల్లిదండ్రులు, అన్నచెల్లెళ్లను కోల్పోయారు.

అసలే మానసికంగా కుంగిపోయివున్న వారితో మాట్లాడుతూ తన ‘యువర్స్ ఈజ్ గోయింగ్ టు బి హీల్డ్ యాజ్ వెల్’ అనే ఈ ఫొటోగ్రఫీ ప్రాజెక్టు చేయటం చాలా కష్టమైందని క్రిస్టల్ తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు రెబెకా వసీ మెమోరియల్ అవార్డు, ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సర్వైవర్స్ ఫండ్‌తో కలిసి నిధులు సమకూర్చింది.
‘‘జనం తమ అనుభవాల గురించి మాట్లాడలేమని భావించటానికి.. దేశంలో సాధాణంగా ‘టుట్సీ’, ‘హుటు’ అని మాట్లాడకపోవటం ఒక కారణమని నాకు తట్టింది. ‘మేమంతా రువాండన్లం.. మనదంతా ఒకే దేశం, ఒకే జాతి’ అనే ప్రచారం ఉండటం’’ అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
ఆ మారణహోమం తర్వాత.. దానికి పాల్పడినవారు, దాని నుంచి బయటపడ్డవారు మళ్లీ అవే గ్రామాలు, సమాజాలకు రావటం కూడా.. జనం తమ జ్ఞాపకాల గురించి మాట్లాడటానికి సంకోచించటానికి కారణమని ఆమె వివరించారు.
‘‘ఇరు పక్షాల్లోనూ ఇంకా చాలా గాయాలున్నాయి.. హుటుల్లో కొందరు ఇప్పటికీ జాతి విభజనలు ప్రాతిపదికగా అతివాద అభిప్రాయాలతో ఉండి ఉండొచ్చు. కొందరు పశ్చాత్తాపంతో ఉండి ఉండొచ్చు. ఇరువైపులా తమ కథలను పంచుకోవటానికి ఎవరిని నమ్మాలనేది ఎవరికీ తెలియదు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
రువాండాకు చెందని, బయటి నుంచి వచ్చిన తనతో తమ గాథలు పంచుకోవటం చాలా సులభంగా ఉందని వారు తనతో చెప్పినట్లు చైనీస్-బ్రిటిష్ వ్యక్తి అయిన క్రిస్టల్ తెలిపారు.
క్రిస్టల్‌తో తన కథ చెప్పిన వారిలో పేషెన్స్ (35) ఒకరు.
1994లో మారణకాండ జరిగినపుడు ఆమె వయసు తొమ్మిదేళ్లు. ఆమె తండ్రి ఆమెతో పాటు ఆమె సోదరులందరినీ దాచిపెట్టారు. కానీ ఆమె ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.
వారిని హతమారుస్తున్నపుడు వాళ్లు ఏడుస్తున్న శబ్దం తనకు పదే పదే వినిపిస్తుంటుందని.. ఆ దృశ్యాలు తన మనసులోనే నిలిచిపోయి తనకు నిద్రపట్టనివ్వటం లేదని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
‘నీకు ఇప్పుడు ఒక మంచి ఇల్లు ఉంది. ఎందుకు ఎక్కువగా నవ్వవు? ఎందుకు సంతోషంగా ఉండవు?’ అని జనం ఆమెను అడుగుతుంటారు.
‘‘నేను ఎప్పుడూ ఆలోచించే విషయాలు చాలా ఉన్నాయి. నా ఇల్లు చాలా స్వల్పమైన విషయం. నన్ను నవ్వించటానికి అది సరిపోదు’’ అని ఆమె బదులిస్తారు.
తన తండ్రి హత్యలో సమాజంలోని ఒక వ్యక్తి పాత్ర ఉందన్న అనుమానం తనకు ఉందని పేషెన్స్ వివరించారు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
‘‘తన తండ్రికి చెందిన ట్రౌజర్లు, షూలు ధరించి ఆ వ్యక్తి తిరుగుతుండేవాడని ఆమె చెప్పారు. మారణకాండ నాటి నుంచి ఆమె తండ్రి ఆచూకీ లేదు. అతడి మృతదేహం ఎక్కడుందో ఎవరికీ తెలీదు’’ అని క్రిస్టల్ తెలిపారు.
ఆ వ్యక్తిని ‘నీకు ఆ షూ ఎక్కడి నుంచి వచ్చాయి?’ అని ఆమె అడిగినపుడు.. ‘మీ నాన్న మాయమయ్యే ముందు చర్చి దగ్గర మరచిపోయి ఉంటాడు’ అని అతడు బదులిచ్చాడు.
ఆమె చర్చికి వెళ్లి.. ‘ఇక్కడ మా నాన్న షూ విడిచివెళ్లారా?’ అని అడిగారు. ఆ సమయంలో ఆయన అక్కడకు రాలేదని వాళ్లు చెప్పారు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
‘‘ఆ వ్యక్తి తన తండ్రిని చంపి, ఆయన షూ తీసుకున్నాడని.. తన తండ్రి శరీరాన్ని ఎక్కడ పాతిపెట్టాడో అతడికి తెలుసునని.. కానీ ఆ విషయం తనకు చెప్పడని ఆమె నమ్మకం’’ అని వివరించారు క్రిస్టల్.
ఇక్కడ కౌన్సెలింగ్‌లో ఇతర ప్రాంతాల్లో ఉపయోగించిన తరహా మానసిక వైద్య పరిభాషను ఉపయోగించరు.
ఈ కౌన్సెలింగ్‌కు వచ్చిన వాళ్లు తమకు నాటి భయానక ఘటనలు గుర్తుకొచ్చినపుడు ఒంటరిగా ఉండలేమని చెప్పారు. అవసరమైనపుడు పొరుగువారి దగ్గరకు ఎలా వెళ్లాలో కౌన్సెలిర్లు సూచిస్తారు.
క్లాడైన్ (38) అనే మరో వ్యక్తిని క్రిస్టల్ కలిశారు. మారణహోమం జరిగినపుడు ఆమె వయసు 13 సంవత్సరాలు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
‘‘నేను ఆమెను ఆమె ఇంట్లో కలిశాను. ఎంతో మృదువుగా.. ఓ 13, 14 ఏళ్ల వయసు యువతి ఎంత ప్రేమగా వ్యవహరిస్తుందో అంత మృదువుగా ఉన్నారామె’’ అని క్రిస్టల్ తెలిపారు.
ఆమె గతంలో ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇప్పుడు కౌన్సెలింగ్ గ్రూప్‌తో కలిసి తన జీవితాన్ని పునర్నించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
ఆమె స్కూలు విద్య కూడా పూర్తి చేయలేదని, అందువల్ల ఆమె తన కాళ్ల మీద తాను నిలబడలేదని, అది మరింత కష్టాలకు దారితీస్తుందని క్రిస్టల్ పర్కొన్నారు.
ఆమె ఇంటికి వెళ్లినపుడు ఆమె తన కొడుకుతో ఉన్న ఏకైక ఫొటోను తనకు కానుకగా ఇవ్వబోయారని తెలిపారు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
ఈ కౌన్సెలింగ్ సెషన్లకు హాజరవటానికి కొంతమంది దాదాపు ఐదు గంటల పాటు నడిచి వస్తారు. ఇక్కడికి వచ్చే తల్లుల పిల్లలు, శిశువులకు తగిన ఏర్పాట్లు చేయాలని సర్ఫ్ ప్రయత్నిస్తోంది.
‘‘ఈ పసివాళ్లు ప్రతి వారం దాదాపు రెండు గంటల పాటు అత్యాచారానికి సంబంధించిన కథలు వింటూ ఉంటారు. అది వారికి మంచిది కాదు’’ అంటారు క్రిస్టల్.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
అయితే.. తమ కథలను చెప్తున్నపుడు తమకు మనసు తేలికపడుతుందని, సంతోషంగా అనిపిస్తుందని ఈ సెషన్స్‌కు హాజరైన వారు చెప్తున్నారు.
ఈ ప్రాజెక్టు తన మీద వ్యక్తిగతంగా ప్రభావం చూపినట్లు క్రిస్టల్ చెప్తున్నారు.

ఫొటో సోర్స్, CHRYSTAL DING
‘‘నేను కలిసిన వాళ్లందరి గురంచి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. వాళ్లు అద్భుతమైన వ్యక్తులు. రువాండా నా కలల్లోనే ఉంది. మళ్లీ ఏదో రోజు అక్కడికి వెళతా’’ అని ఆమె తెలిపారు.
(పేర్లు మార్చాము)
ఫొటోలు: క్రిస్టల్ డింగ్; ఇంటర్వ్యూ: మాత్యూ టకర్
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్... ఈ భూమి మీద ఒక ఆదిమ జాతిని సమూలంగా నాశనం చేస్తుందా?
- కరోనావైరస్: కోవిడ్-19 రోగి చనిపోతే అంత్యక్రియలు ఎలా చేయాలి?
- కరోనావైరస్: 5జీ టెక్నాలజీతో కోవిడ్-19 వ్యాధి వ్యాపిస్తుందా?
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- కరోనావైరస్: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- క్యాన్సర్: ఒక్క రక్త పరీక్షతో ‘50 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు’
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- రోజుల బిడ్డ ఉన్నా.. కరోనావైరస్ సమయంలో విధుల్లో చేరిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం
- కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








