అమెరికాలో పోలీస్ కాళ్ల కింద నల్లజాతి వ్యక్తి మృతి: భగ్గుమన్న జనం.. పోలీసులతో ఘర్షణ

అమెరికాలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

పోలీస్‌ కస్టడీలో నల్లజాతి వ్యక్తి మరణంపై అమెరికాలోని మిన్నియాపోలిస్‌ నగరంలో ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వగా, పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. కొన్ని షాపులపై ఆందోళనకారులు దాడికి దిగారు.

సోమవారం నాడు నల్లజాతికి చెందిన జార్జ్‌ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నతెల్లజాతి పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు. తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్‌ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించినట్లు వైరల్ అయిన వీడియోలలో ఉంది.

ఈ ఘటనలో నలుగురు పోలీసులను ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. ''నల్లవాడిగా పుట్టడం మరణశిక్షకు అర్హత కాదు'' అని నగర మేయర్‌ వ్యాఖ్యానించారు.

అమెరికాలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

మేయర్‌ వ్యాఖ్యల తర్వాత ఆందోళకారులు మరింత రెచ్చిపోయారు. పలు షాపులను ధ్వంసం చేసి కొన్నింటికి నిప్పుపెట్టారు.

న్యూయార్క్‌లో 2014లో ఎరిక్‌ గార్నర్‌ అనే నల్లజాతి వ్యక్తిని హత్య తర్వాత అమెరికాలో జాతివివక్ష దాడులపై ఆందోళనలు పెరిగాయి. బ్లాక్‌ లైవ్స్ మ్యాటర్‌ పేరుతో ఆందోళకారులు ఈ తరహా దాడులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

అమెరికాలో నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

నిరసనలు ఎలా మొదలయ్యాయి ?

సోమవారంనాడు ఘటన జరిగిన తర్వాత, మంగళవారం మధ్యాహ్నం సంఘటన జరిగిన ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆందోళనకారులు నిర్ణయించారు. కరోనావైరస్‌ ప్రమాదం కారణంగా భౌతికదూరం పాటిస్తూ ఆందోళనకు దిగారు. కానీ తర్వాత పరిస్థితి అదుపు తప్పింది.

''మాకు ఊపిరాడటం లేదు'', ''రేపు నేనే కావచ్చు'' అన్న నినాదాలతో ర్యాలీ చేపట్టారు.

ఫ్లాయిడ్‌ చావుకు కారణమైన అధికారులు పనిచేసే కార్యాలయంవైపు వందలమంది ర్యాలీ తీశారు. ''ఇది చాలా దారుణం. పోలీసులే ఇలాంటి వాతావారణాన్ని సృష్టిస్తున్నారు'' అని ఓ ఆందోళనకారుడు వ్యాఖ్యానించారు. రెండో రోజున అంటే బుధవారంనాడు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. సాయంత్రం అయ్యేసరి వందల మంది నిరసనకారులు కాస్తా వేల మందిగా మారారు.

పోలీస్ కస్టడీలో వ్యక్తి మృతి

ఫొటో సోర్స్, DARNELLA FRAZIER

ఫొటో క్యాప్షన్, ఆ దారుణ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు ? పోలీసులు ఎందుకు చంపారు?

నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో సోమవారంనాడు పోలీసులు జార్జ్‌ ఫ్లాయిడ్‌ వాహనాన్ని వెంబడించారు. తాము వాహనం నుంచి బైటికి రావాలని అడిగామని, కానీ అతను తమతో ఘర్షణకు దిగాడని పోలీసులు చెబుతున్నారు.

''తాము అతన్ని సంకెళ్లతో బంధించడానికి ప్రయత్నించామని, అప్పటికే అతను ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని గుర్తించాం'' అని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే ఈ ఘర్షణ ఎలా మొదలైందో ఈ వీడియోలో లేదు. ఇందులో కేవలం తెల్లజాతి పోలీస్‌ అధికారి తన మోకాలితో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడను నేలకేసి అదుముతున్నట్లు ఉంది.

జార్జ్ ఫ్లాయిడ్

ఫొటో సోర్స్, TWITTER/RUTH RICHARDSON

ఫొటో క్యాప్షన్, ఊపిరాడటం లేదు, తనను వదలిపెట్టమని పోలీసులను జార్జ్ ఫ్లాయిడ్‌ పదే పదే అభ్యర్ధించాడు

''నాకు ఊపిరాడటం లేదు'', ''నన్ను చంపకండి ప్లీజ్‌ '' అని ఫ్లాయిడ్‌ అరుస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

మరోవైపు అక్కడ నిలబడ్డవారు అతన్ని వదిలిపెట్టమని పోలీసులను అడుగుతున్నట్లుగా కూడా ఆ వీడియోలో ఉంది. కాసేపటికి ఫ్లాయిడ్‌ కదలకుండా పడిపోవడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లగా అతను మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.

అధికారులు ఏమంటున్నారు?

ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను తొలగించడం సరైనదేనని మిన్నియాపోలిస్‌ మేయర్‌ జాకబ్‌ ఫ్రే వ్యాఖ్యానించారు. ''ఐదు నిమిషాలపాటు ఆ అధికారి అతని గొంతును నేలకేసి నొక్కిపట్టారు. ఆ సమయంలో అతన్ని ఎవరైనా రక్షించవచ్చు. కానీ అలా జరగలేదు'' అని జాకబ్ అన్నారు. ఈ కేసుపై ఎఫ్‌బిఐ విచారణ చెపట్టింది. త్వరలోనే ఈ ఘటనపై నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ కేసు ఎందుకు వివాదాస్పందగా మారింది?

అమెరికాలో పోలీసులు దాష్టీకాలపై ఇటీవల ఆందోళనలు పెరుగుతున్నాయి. బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్స్‌ పేరుతో ఒక ఉద్యమమే మొదలైంది.

ఒక ఆఫ్రో-అమెరికన్‌ ట్రవ్యాన్‌ మార్టిన్‌ను చంపిన జార్జ్‌ జిమ్మర్‌మ్యాన్‌ అనే వాచ్‌మన్‌కు ఎలాంటి శిక్షవేయకుండా వదిలేయడంపై ఆందోళనలు మొదలయ్యాయి. మైఖేల్ బ్రౌన్‌, ఎరిక్‌ గార్నర్‌ అనే ఇద్దరు బ్లాక్‌ అమెరికన్ల హత్యల తర్వాత ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)