మోదీ మన్ కీ బాత్: ‘కూతురి చదువు కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్‌డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని’

సి.మోహన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సి.మోహన్

ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాపించినంత తీవ్రంగా కరోనా భారత్‌లో వ్యాపించలేదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో మరణాలూ తక్కువే నమోదయ్యాయని, అయితే, ముందుముందు సవాళ్లున్నాయని ఆయన అన్నారు.

మన్ కీ బాత్‌లో మాట్లాడిన ఆయన దేశంలో కరోనావైరస్ వల్ల ఇప్పటివరకు జరిగిన నష్టం అందరినీ బాధిస్తోందన్నారు.

దేశాన్ని కరోనా నుంచి కాపాడుకోగలిగామంటే అది కచ్చితంగా దేశ ప్రజల సామూహిక సంకల్ప శక్తి ఫలితమేనని మోదీ చెప్పారు.

‘‘ఇంత పెద్ద దేశంలో ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో నిలబడ్డారు. ఈ పోరాటంలో మన అతిపెద్ద శక్తి, దేశ ప్రజల సేవా శక్తి. సేవ, త్యాగం అనే ఆదర్శాలే భారతీయుల జీవనశైలి అనేది మనం చూపించాం.సేవా పరమో దర్మహః అన్నారు. అంటే సేవలోనే సుఖం, సంతోషం ఉన్నాయి’’ అన్నారు.

ఇతరులకు సేవ చేసేవారిలో ఎలాంటి ఒత్తిడి కనిపించదని.. జీవితంపై వారిలో ఆత్మవిశ్వాసం, సానుకూలత ప్రతిక్షణం కనిపిస్తుందని మోదీ అన్నారు.మన డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, స్వచ్ఛ కార్మికులు, పోలీసులు మీడియా అందరూ తమవంతు సేవ చేస్తున్నారు.. వీరితోపాటూ తమ సంపాదనలో కొంత పేదల కోసం ఖర్చు పెట్టి సేవ చేస్తున్నవారు ఎందరో ఉన్నారంటూ ఈ క్లిష్ట సమయంలో సేవాకార్యక్రమాలు చేస్తున్న కొందరు సామాన్యుల గురించి చెప్పుకొచ్చారు.

మోదీ

ఫొటో సోర్స్, Ani

తమిళనాడులో సెలూన్ యజమాని.. పంజాబ్‌లో దివ్యాంగుడు.. త్రిపురలో తోపుడు బండి వర్తకుడు

‘‘తమిళనాడు మదురైలో సెలూన్ నడిపే మోహన్ తన కూతురి కోసం కష్టపడి పొదుపు చేసిన 5 లక్షల రూపాయలను, ఇబ్బందుల్లో ఉన్న పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. అలాగే అగర్తలలో తోపుడుబండి ఆధారంగా జీవించే గౌతమ్ దాస్ తన రోజువారీ సంపాదనలో కొంత డబ్బుతో ప్రతి రోజూ పప్పు, అన్నం కొని పేదల కడుపు నింపుతున్నారు. పంజాబ్ పఠాన్ కోట్‌లోని దివ్యాంగుడు భైరాజు మిగతా వారి సాయంతో చిన్న మొత్తం సేకరించి 3 వేలకు పైగా మాస్కులను పేదలకు పంచారు. ఎన్నో కుటుంబాలకు నిత్యావసరాలు పంచారు.దేశవ్యాప్తంగా మహిళా స్వయం సేవక బృందాలు, పల్లెల్లో,పట్టణాల్లో ఎన్నో సామాజిక సంస్థలు మాస్కులు తయారు చేసి పంచుతున్నాయి. నమో యాప్ ద్వారా వారందరూ తాము చేస్తున్న సాయం గురించి నాకు చెబుతున్నారు. సమయాభావం వల్ల వారందరినీ నేను పేరుపేరునా ప్రస్తావించలేకపోతున్నా. వారందరినీ నేను గౌరవిస్తున్నా.ఈ కరోనా సమయంలో పల్లెల నుంచి పట్టణాల వరకూ ఎంతోమంది ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. నాసిక్‌లో సత్సా గ్రామంలోని రాజేంద్ర యాదవ్ గ్రామాన్ని కరోనా నుంచి కాపాడ్డానికి తన ట్రాక్టరుకు జోడించగలిగే శానిటైజేషన్ యంత్రం తయారు చేశారు.అలాగే కొందరు దుకాణదారులు వస్తువులు ఒక వైపు నుంచి ఇస్తే ఇంకోవైపు నుంచి జనం ఆ వస్తువులు తీసుకునేలా పైపుల్లాంటి ఏర్పాట్లు చేశారు.విద్యారంగంలో కూడా ఎంతోమంది టీచర్లు, విద్యార్థులు కలిసి పనిచేశారు. ఆన్ లైన్ క్లాసులు, వీడియో క్లాసులు రూపొందించార’’ని మోదీ చెప్పారు.

వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సిన్ కోసం వడివడిగా అడుగులు..

‘‘కరోనా వ్యాక్సిన్ కోసం మన ప్రయోగశాలల్లో జరుగుతున్న ప్రయోగాలను ప్రపంచమంతా గమనిస్తోంది. ఏ పరిస్థితులనైనా మార్చేయగలిగిన బలం ఆవిష్కరణలకు ఉంది. మనం ఇప్పుడు ఆవిష్కరణలపై ఆధారపడాలి.వేల ఏళ్ల మానవచరిత్ర ఆవిష్కరణలమీదే ఆధారపడింది. మనిషి విజయానికి ఆ ఆవిష్కరణలు అవసరం. కరోనాతో పోరాటం చాలా సుదీర్ఘమైనది. దీనికి చికిత్స లేదు. ఇంతకు ముందు దీని అనుభవం కూడా లేదు. అందుకే దీనివల్ల కొత్త కొత్త సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా అన్న దేశాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. దీనికి భారత్ అతీతం కాదు’’ అన్నారు.

వలస కూలీలు

ఫొటో సోర్స్, JEWEL SAMAD/GETTY IMAGE

‘ఈ సంక్షోభంలో తీవ్రంగా నష్టపోయింది పేదలు, కార్మికులు, వలస కూలీలే’

‘‘ఈ కరోనా సంక్షోభం వల్ల ఎవరైనా తీవ్రంగా నష్టపోయారంటే అది పేదలు, కార్మికులు, వలస కూలీలే. వారి కష్టాలను నేను మాటల్లో చెప్పలేను. వారి, వారి కుటుంబాల కష్టాలను మనందరం కలిసి పంచుకుందాం.పేదలు, వలస కూలీల సంక్షేమం దిశగా ముందుకు వెళ్తున్నాం. స్కిల్ మ్యాపింగ్ చేస్తున్నాం. చాలా స్టార్టప్స్ ఆ పనిలోనే ఉన్నాయి.ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామాల్లో ఉపాధి, పనులు అన్నీ పెరుగుతాయి.ఆత్మనిర్భర భారత్ కోసమే ఈ నిర్ణయాలు. మన గ్రామాలు, రాష్ట్రాలు, దేశం స్వయం సమృద్ధి సాధిస్తే ఈరోజు మన ముందు ఈ సమస్య ఉండేది కాదు.ఆత్మనిర్భర భారత్ గురించి దేశంలో చాలా చర్చ జరగడం సంతోషం కలిగిస్తోంది. దేశంలో చాలా మంది దీనికి సిద్ధమయ్యారు. దేశంలో ఏ వస్తువులు తయారవుతున్నాయో వాటి జాబితా ఏర్పాటు చేస్తున్నారు.కొన్ని ప్రాంతాల్లో స్థానిక వస్తువులే కొంటున్నారు. 'వోకల్ ఫర్ లోకల్' అనే మాటను ప్రమోట్ చేస్తున్నారు.ఈ దశాబ్దంలో ఆత్మనిర్భర భారత్ మన దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది’’ అన్నారు.

హాలీవుడ్ నుంచి హరిద్వార్ వరకు యోగా

‘‘నేను ప్రపంచంలో ఎంతోమంది నేతలతో మాట్లాడాను. వారందరూ యోగా, ఆయుర్వేదంపై ఆసక్తి చూపించారు. ఇది ఎలా సహాయపడుతుంది అని అడిగారు.యోగాపై ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది.హాలీవుడ్ నుంచి హరిద్వార్ వరకూ జనం ఇళ్లలోనే ఉండి యోగా మీద దృష్టి పెడుతున్నారు. ఆయుర్వేద గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారుఎప్పుడూ యోగా చేయనివారు ఇప్పుడు ఆన్ లైన్ యోగా క్లాసులు చూస్తున్నారు. ఆన్ లైన్ వీడియో ద్వారా యోగా నేర్చుకుంటున్నారుయోగా కమ్యూనిటీ, ఇమ్యూనిటీ, యూనిటీ అందరికీ మంచిదికరోనా సంకట సమయంలో యోగా చాలా కీలకం. ఈవైరస్ మన రెస్పిరేటరీ సిస్టంపై ఎక్కువ ప్రభవం చూపిస్తోంది. దీనిని బలంగా మార్చే యోగాసనాలు ఎన్నో ఉన్నాయ’’ని చెప్పారు.

మోదీ చెప్పిన ఆత్మనిర్భరతను స్వదేశీ అంశంతో ముడిపెట్టి చూడవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ చెప్పిన ఆత్మనిర్భరతను స్వదేశీ అంశంతో ముడిపెట్టి చూడవచ్చు

ఆయుష్మాన్ భారత్

‘‘కోట్లాది మంది చాలా పెద్ద ఆందోళనలో ఉన్నారు. అనారోగ్యానికి గురైతే ఎలా, వైద్యం చేయించోకవాలా, కుటుంబం కడుపు ఎలా నింపాలా అని ఆలోచిస్తున్నారు. వీరికోసమే ఏడాదిన్నర క్రితమే ఆయుష్మాన్ భారత్ యోజన ప్రారంభించాం. దీని లబ్ధిదారుల సంఖ్య కోటి దాటింది. అంటే కోటికి కంటే ఎక్కువ కుటుంబాలకు సేవ అందాయి. ఆస్పత్రిలో చేరే పేదలకు ఉచిత వైద్యం జరిగింది. ఈ యోజన లేకపోతే లబ్ధిదారులు 14 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ప్రత్యేక పోర్టబిలిటీ సౌకర్యం వల్ల ఒక రాష్ట్రంలోని పేదలు ఆరోగ్య సేవలు మెరుగ్గా ఉన్న మరో రాష్ట్రంలో కూడా వైద్య సేవలు పొందుతున్నారు.కోటి మంది లబ్ధిదారుల్లో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారే. వారిలో సుమారు 50 శాతం మంది మహిళలే. మొత్తం లబ్ధిదారుల్లో 70 శాతం మందికి సర్జరీలు కూడా చేశారు.ఈ ఆయుష్మాన్ భారత్‌కు అసలైన హక్కుదారులు టాక్స్ పేయర్లే. వారికి నా అభినందనలు.ఒకవైపు కరోనా, మరోవైపు తుఫానులు ఉంటే, మరోవైపు దేశంలో మిడతల దాడి కూడా జరుగుతోంది.వ్యవసాయ రంగానికి దీనివల్ల నష్టం రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ దీన్నుంచి బయటపడ్డానికి రైతులకు సాయం చేస్తున్నాయి. మనం నిర్లక్ష్యంగా ఉంటే, జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం ప్రత్యామ్నాయం కాదు. మన ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడాలి. ఇంతకు ముందులాగే రెండు గజాల దూరం, ముఖానికి మాస్క్, చేతులు కడగడం అనే జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. మీరు మీకోసం, మీ కుటుంబం కోసం, మీ దేశం కోసం ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ముగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)