కరోనావైరస్: ‘గుజరాత్‌లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’

తన భార్య షెఫాలీతో ఉమేశ్
ఫొటో క్యాప్షన్, తన భార్య షెఫాలీతో ఉమేశ్
    • రచయిత, రాక్సీ గాగ్డేకర్ ఛార
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ గుజరాత్‌ ప్రజల జీవితాల్లో ఎలాంటి కల్లోలం సృష్టిస్తోందో కళ్లకు కట్టినట్టు వివరించే కథనం ఇది. ఓ వైపు రోజు రోజుకీ రోగుల సంఖ్య పెరిగిపోతుంటే... మరో వైపు ఆస్పత్రులలో బెడ్స్ కరువవుతున్నాయి. ఏ ఆస్పత్రికి ఫోన్ చేసినా లేదు అన్న సమాధానమే వస్తోంది. ప్రభుత్వాసుపత్రులలో కరోనా రోగులకు ఎటువంటి చికిత్స అందిస్తున్నారో చాలామందికి తెలియుదు. బీబీసీ గుజరాతీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛార.. తాను ఎదుర్కొన్న దారుణమైన అనుభవాన్ని ఈ కథనంలో వివరించారు.

కుషాలీ తమైచీ.. నా మేన కోడలు.. తన 12వ తరగతి మార్క్ షీట్ చూడగానే కన్నీళ్లు పెట్టుకుంది. తన బ్యాచ్‌లో ఫస్ట్ క్లాస్ వచ్చిన కొద్ది మందిలో ఆమె కూడా ఒకరు. అయితే ఆమె కన్నీళ్లు పెట్టుకునేందుకు కారణమేంటో ఆమె చుట్టుపక్కల ఉన్న వారందరికీ తెలుసు. ఈ రోజు కోసమే ఆమె తండ్రి ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. కానీ కొద్ది రోజుల క్రితమే కుషాలీ తండ్రి ఉమేశ్ తమైచీ కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

44 ఏళ్ల ఉమేశ్ అహ్మదాబాద్ మెట్రో కోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేసేవారు. మే 12న ఆయనకు కోవిడ్-19 సోకిందని తేలింది. అది మే 11 సోమవారం రాత్రి. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందిగా ఉండేసరికి నా సోదరి షెఫాలీ ఆయన్ను సమీపంలో ఉన్న ఆనంద్ సర్జికల్ హాస్పటల్ అనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిజానికి ఆ ప్రాంతంలో అది పేరున్న ఆస్పత్రి. కొద్ది రోజుల క్రితమే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ఆస్పత్రిని కోవిడ్-19కి చికిత్స అందించే ఆస్పత్రిగా గుర్తించింది.

ఆనంద్ సర్జికల్ ఆస్పత్రి నుంచే షెఫాలీ నాకు ఫోన్ చేసింది. జరిగిన విషయాన్ని చెప్పింది. ఆ ఫోన్ కాల్ ఒక్కసారిగా నన్ను షాక్‌కు గురి చేసింది. కరోనావైరస్ మా ఇంటి తలుపు తడుతుందని నేను ఊహించలేదు. దాదాపు నెల రోజుల తర్వాత నేను ఔట్ డోర్ షూట్‌కి వెళ్లి సురేందర్‌నగర్‌లోని “లింది” నుంచి తిరిగి వస్తున్నాను. ఉమేష్‌కి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని తెలియగానే బహుశా కరోనా కావచ్చేమోనన్న అనుమానం నా మదిలో తలెత్తింది.

షెఫాలీని స్థిమితంగా ఉండమని చెప్పాను. వెంటనే ఆనంద్ సర్జికల్ ఆస్పత్రికి ఫోన్ చేశాను. అయితే తమ ఆస్పత్రిని కోవిడ్-19 ఆస్పత్రిగా గుర్తించినప్పటికీ ప్రత్యేకంగా ఐసోలేషన్ రూం లేదని సిబ్బంది చెప్పారు. వాళ్ల దగ్గర వెంటిలేటర్లు లేవు, కనీసం కరోనావైరస్ అనుమానిత రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు కూడా లేరు. వెంటనే నేను అక్కడి నుంచి మరో ఆస్పత్రికి మారాలాని షెఫాలీకి చెప్పాను. వెంటనే దగ్గర్లోనే ఉన్న మరో ఆస్పత్రికి ఆయన్ను తీసుకెళ్లారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఉమేశ్‌కి చికిత్స అందించేందుకు ముందుకు రాలేదు.

చివరకు విసింటీ అనే మరో ప్రైవేటు ఆస్పత్రి ఆయన శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడేందుకు అసలు కారణమేంటో తెలుసుకునేందుకు ఎక్స్ రే తీసేందుకు ముందుకొచ్చింది. అది కూడా షెఫాలీ పదే పదే ప్రాధేయపడిన తర్వాత మాత్రమే. ఛాతిలో కఫం పేరుకుపోయిందన్న విషయం ఎక్స్ రే ద్వారా తెలిసింది. దాంతో అప్పటి వరకు ఆమెకు ఉన్న సందేహం తీరిపోయింది. ఆయన కరోనావైరస్‌తో బాధపడుతున్నారన్న విషయం స్పష్టమయ్యింది.

నా సోదరి షెఫాలీ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో జనరల్ మేనేజర్. ఆమె తన కుటుంబంతో కలిసి కుబేర్‌నగర్లోని ఛారనగర్లో నివసిస్తున్నారు. ఆ ప్రాంతం ఓ రకంగా ముంబైలోని ధారవి ప్రాంతానికి సూక్ష్మ రూపం(మినీయేచర్)లా ఉంటుంది. ఎటు చూసినా ఇళ్లు, ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తమైన నిర్మాణాలు, కనీస సౌకర్యాలు కూడా కరువే అక్కడ. అక్రమ మద్యం అమ్మకాలకు ఛారనగర్ పెట్టింది పేరు. అక్కడంతా మధ్యతరగతి కుటుంబాలే నివసిస్తూ ఉంటాయి. మేమంతా అక్కడే కలిసి పెరిగాం. అయితే ఆ తర్వాత నేను ఆ ప్రాంతం నుంచి వేరే చోటుకి మారిపోయాను. తాను మాత్రం అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఛారనగర్లోని నవఖోలీ ప్రాంతంలో తమ సొంతింటి నిర్మాణం కోసం ఉమేశ్-షెఫాలీ చాలా కష్టబడ్డారు. వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ కూడా కాన్వెంట్‌ స్కూల్లో చదువుతున్నారు. నిజానికి ఆ ప్రాంతంలో నివసించే వారిలో ఆడపిల్లల చదువుకోసం అంతంత ఖర్చు పెట్టడం చాలా అరుదు. పెద్దమ్మాయి కుషాలీ 12వ తరగతి పరీక్షలు రాసి నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతోంది. చిన్నమ్మాయి ఊర్వశి వయసు 15 ఏళ్లు. పదో తరగతి పరీక్షల కోసం సిద్ధమవుతోంది. పెద్దయ్యాక తన తండ్రిలా న్యాయవాద వృత్తిని చేపట్టాలన్నది ఆమె కోరిక.

ఉమేశ్ కుటుంబం
ఫొటో క్యాప్షన్, ఉమేశ్ కుటుంబం

ఉమేశ్‌కి పాజిటివ్ అని తేలింది

ఉమేశ్ ఎక్స్ ‌రే వచ్చిన తర్వాత ఆస్పత్రిలో ఉన్న రేడియాలజిస్ట్ కరోనా కావచ్చని చెప్పినట్టు షెఫాలీ నాకు ఫోన్ చేసి చెప్పింది. కొద్ది రోజుల క్రితమే నేను కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు గుజరాత్ ఎలా సిద్ధమయ్యిందన్న కథనాన్ని రాశాను. ఆ సమయంలో నేను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జయ ప్రకాశ్ శివ్‌హరే, అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ జీ.హెచ్. రాథోడ్‌లను ఇంటర్వ్యూ చేశాను. ఆ సమయంలో వాళ్లు కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు తాము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తగినన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కూడా ఉన్నారని నాకు వారు వివరించారు.

వెంటనే నాకు ఆ విషయం గుర్తొచ్చింది. ప్రాథమిక చికిత్స కోసం వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లమని షెఫాలీకి నేను చెప్పాను. అక్కడ ఆ ఆసుపత్రి మొత్తం కరోనా రోగులతో నిండిపోయింది. షెఫాలీ అక్కడకు చేరుకోక ముందే నేను ఆస్పత్రి సూపరింటెండెంట్‌కి, అలాగే అక్కడ ఉన్న వైద్యులకు ఫోన్ చేశాను. రోగిని చూసిన తర్వాత అవసరమైతే వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని వాళ్లు నాకు చెప్పారు.

ఛాతికి సంబంధించిన ఎక్స్‌ రే చూసిన తర్వాత వైద్యులు ఆయన్ను ఆస్పత్రిలో అడ్మిట్ చెయ్యాలని సూచించారు. మొదట కరోనా అనుమానిత వార్డులో ఉమేశ్‌ను చేర్చుకున్నారు. ఆ తర్వాత కరోనా వార్డుకు తరలించారు. అయితే ఉమేశ్‌కు ఆ ఆస్పత్రిలో సరైన చికిత్స అందుతోందా లేదా అన్న భయం నాకు వేసింది. వెంటనే నేను ఆరోగ్య శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్‌ను కలిశాను. నా విజ్ఞప్తిని సానుకూలంగా ఆలకించిన ఆయన వెంటనే ఉమేశ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని వైద్యుల్ని ఆదేశించారు.

సాధారణంగా రోగి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వారి బంధువులకు వైద్యులు తెలియజేస్తూ ఉంటారు. కానీ ఉమేశ్ విషయంలో అటువంటి ఫోన్లేవి డాక్టర్ల నుంచి రాలేదు.

మంగళవారం మధ్యాహ్నానికి ఉమేశ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను ఐసీయూకి తరలించారు. నాకు ఆ ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్సపై నమ్మకం లేకపోవడంతో ఉమేశ్‌ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాను.

ఉమేశ్

ఒక్క ప్రైవేటు ఆస్పత్రిలోనూ బెడ్ దొరకలేదు

వెంటనే నేను కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న స్టెర్లింగ్ ఆస్పత్రికి ఫోన్ చేశాను. అయితే అంత వేగంగా వారు ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. ఎంతో సేపు ప్రయత్నించగా చివరకు లిఫ్ట్ చేశారు. కానీ తమ ఆస్పత్రిలో ఖాళీ లేదన్నది వారి నుంచి వచ్చిన సమాధానం. ఆ తర్వాత హెచ్‌సీజీ ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించాను. వారి నుంచి కూడా అదే సమాధానం. ఆపై ఛాంద్‌ఖేడాలో ఉన్న ఎస్ఎంఎస్ ఆస్పత్రికి ఫోన్ చేశాను. అయితే ప్రభుత్వాసుపత్రి నుంచి వచ్చే రోగుల్ని తమ ఆస్పత్రిలో చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమని వాళ్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత వరుసగా తపన్ హాస్పటల్, సిమ్స్, నారాయణీ, ఇలా అందుబాటులో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ ఫోన్ చేశాను. ఎంతో సేపటికి కానీ ఎవ్వరూ ఫోన్ లిప్ట్ చెయ్యలేదు. చేసిన తర్వాత కూడా వారిది కూడా అదే సమాధానం . అలా కేవలం ఒకే ఒక్క బెడ్ కోసం నగరమంతా ప్రయత్నించాను. కానీ లాభం లేకపోయింది.

నా స్నేహితులైన కొంత మంది క్రైమ్, హెల్త్ రిపోర్టర్లకు ఫోన్ చేశాను. పాపం వాళ్లు కూడా నా కోసం ప్రయత్నించారు. కానీ మే 12, 13 తేదీలలో ఏ ఒక్క ఆస్పత్రిలోనూ కనీసం ఒక్క బెడ్ కూడా దొరకలేదు. మరో దారి లేక నగర మేయర్‌ను సంప్రదించాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ దొరకడం కష్టమని ఆమె చెప్పారు. అయితే ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి ఉమేశ్‌కి సరైన చికిత్స అందించేలా ప్రయత్నిస్తానని ఆమె హామీ ఇచ్చారు. బహుశా ఆమె మాట్లాడి ఉంటారనే నేను నమ్ముతున్నాను.

ఇక ప్రైవేటు ఆస్పత్రిలో బెడ్ దొరుకుతుందన్న ఆశల్ని వదులుకొని, ప్రభుత్వాసుపత్రిలో ఉమేశ్‌కి అందుతున్న చికిత్సపై దృష్టి పెట్టాను. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రే మంచిదని చాలా మంది స్నేహితులు నాకు చెప్పారు. వెంటనే నేను గత మూడు రోజులుగా నా ఫోన్లకు జవాబిస్తున్న రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌తో మాట్లాడాను. వాస్తవమేంటంటే ఉమేశ్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తోంది. బయట నుంచి ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఎక్కువవుతోంది.

ఉమేశ్‌ను వెంటిలేటర్‌పైకి తరలించే ముందు డాక్టర్ కమలేష్ ఉపాధ్యాయ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ప్రస్తుతం ఉమేశ్ ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమవుతోందని వెంటిలేటర్‌పై ఉంచుతున్నామని ఆయన నాకు చెప్పారు. ఆక్సిజన్ పీల్చుకునేందుకు ఉమేశ్ ఎలా ఇబ్బంది పడుతున్నారో నాకు వీడియో కాల్ ద్వారా చూపించారు. ఆయన మాట్లాడే పరిస్థితుల్లోలేరు. తనకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతోందని కేవలం సైగల ద్వారా చెప్పేందుకు ప్రయత్నించారు.

నిజానికి ఉమేశ్ ఆరోగ్యంగా ఉంటారు. రోజూ వ్యాయామం చేస్తారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. మందులు కన్నా ఆత్మ శక్తినే నమ్ముతానని చెప్పే ఆయన, ఎక్కడ నుంచో వచ్చిన ఓ వైరస్ తనను ఇలా ఐసీయూ బెడ్‌ ఉండేలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదు. తన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కష్టపడాల్సిన ఆయన.. ఇలా ఊపిరి పీల్చడం కోసం ఇంత కష్టబడాల్సి ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. పూర్తిగా నీరసించిపోయారు. కళ్లలో భయం కనిపిస్తోంది. యుద్ధంలో దాదాపు ఓడిపోయినట్టు ఉంది ఆయన పరిస్థితి. ఏదో ఒకటి చేసి తనను తిరిగి తన కుటుంబం దగ్గరకు చేర్చాలని ఆయన నాతో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక వాళ్ల కుటుంబం మరో రకమైన పరిస్థితులతో పోరాడుతోంది. ఛార వర్గంలో విద్యావంతులైన మహిళల్లో షెఫాలీ ఒకరు. తనన కలల్ని నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరితోనూ ఆమె పోరాడారు.

వెంటిలేటర్‌పై పేషెంట్

ఫొటో సోర్స్, ROBERT NICKELSBERG

నా సోదరిని ఇలా చూస్తాననుకోలేదు

కానీ ఆమెను ఇలా చూడటం చాలా దురదృష్టకరం. ఏ సోదరుడు కూడా తన సోదరిని ఇటువంటి పరిస్థితుల్లో చూడాలనుకోరు. ఆమె చాలా భయపడుతున్నారు. రోజు రోజుకీ నీరసించిపోతున్నారు. మా కుటుంబ సభ్యులందరూ వాళ్లకు సమీపంలోనే ఉంటున్నప్పటికీ ఏ ఒక్కరూ కూడా ఆమెను కలిసి ఓదార్చేందుకు అవకాశం లేదు. తమ తండ్రి కోలుకొని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావాలని పదే పదే ప్రార్ధిస్తున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఉంటున్నారు. ఇటీవల తమ తండ్రి ఫోటోతో కూడిన ఓ పోస్టర్‌ను ఉమేశ్‌కి బహుమతిగా ఇచ్చారు ఇద్దరు బిడ్డలు. దానిపై ‘ది బెస్ట్ పాప’ అని రాసి ఉంటుంది. దాన్ని చాలా గర్వంగా తన డ్రాయింగ్‌ రూంలో పెట్టుకున్నారాయన.

ఓ వైపు ఉమేశ్‌కు చికిత్స కొనసాగుతుండగా మరోవైపు ఆయనతో కలిసి ఉండటంతో షెఫాలీ కూడా కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంది. షెఫాలీ బీపీ, షుగర్ వ్యాదులతో బాధపడుతున్నారు. ఆమె కోవిడ్-19 పరీక్ష చేయించుకునేందుకు 104కి ఫోన్ చేశారు. నేను కూడా చాలా మంది అధికారులకు ఆమెను టెస్ట్ చెయ్యాలంటూ ఫోన్ చేశాను. కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె అప్పటికే డయాబెటిక్‌తో బాధపడుతున్నారు. ఒక వేళ ఆమెకు కూడా పాజిటివ్ అని తేలితే అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది.

ప్రభుత్వాధికారుల నుంచి ఎంతకూ స్పందన లేకపోవడంతో మేం ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్‌కి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని అనుకున్నాం. అప్పటికి ఇంకా ప్రైవేటు లేబొరేటరీలలో పరీక్షలు నిలిపివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు రాలేదు. దాంతో ల్యాబ్ సిబ్బంది మమ్మల్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడిగారు. ఆ ప్రాంతంలోని చిన్న చితకా డిస్పెన్సరీలన్నీ కోవిడ్ కారణంగా మూతబడ్డాయి. నేను ఏదోలా ప్రయత్నించి ఘట్లోడియా అనే ప్రాంతంలోని ఓ ప్రైవేటు వైద్యుడి ప్రిస్క్రిప్షన్ సంపాదించాను. కానీ అప్పటికే ప్రభుత్వం ఇకపై ఎటువంటి శాంపిళ్లను సేకరించవద్దని ప్రైవేటు లేబొరేటరీలను ఆదేశించిదని అక్కడి సిబ్బంది తెలిపారు.

ప్రైవేటు ల్యాబ్‌కి వెళ్లే ముందు రోజు స్థానిక నగర ఆరోగ్య కేంద్రానికి షెఫాలీ వెళ్లారు. అప్పటికే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. కానీ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు అక్కడ ఏ ఒక్క వైద్య సిబ్బంది లేదు. సిబ్బంది వస్తారేమో అని తన ఇద్దరు బిడ్డలతో కలిసి చాలా సేపు ఆమె ఎదురు చూశారు. కానీ ఏ ఒక్కరూ రాలేదు. దాంతో షెఫాలీ తిరిగి వెనక్కి వచ్చేశారు. ఆ తర్వాత ప్రైవేటు ల్యాబ్‌లో కూడా టెస్ట్ చేయించుకోవడం కుదరలేదు.

ఆమె బాధను చూసి తట్టుకోలేక గుజరాత్ రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్ష చేయించుకోవడం ఎంత కష్టంగా ఉందో ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రికి తెలియజేస్తూ నేను ట్వీట్ చేశాను. చాలా సార్లు రీట్వీట్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. అంటే ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడం నా ట్వీట్ ఉద్ధేశం కాదు. నా కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను వారికి తెలియజేయడమే.

మొత్తానికి నా ఆఫీస్‌లోని ఓ కొలీగ్ సాయంతో మే 15న షెఫాలీకి కోవిడ్-19 పరీక్ష చేయించగల్గాం. మర్నాడే ఫలితాలు వచ్చాయి. అందులో షెఫాలీకి, ఆమె కుమార్తెకు పాజిటివ్ అని తేలింది. వెంటనే వారిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించాం.

మే 16 సాయంత్రం 4 గంటల సమయంలో 108 అంబులెన్స్‌లో వారిని ఎక్కించి ఆ వాహనం వెనుకనే నేను నా కారులో సైన్స్ సిటీ రోడ్‌లో ఉన్న సీఐఎంఎస్ ఆస్పత్రికి బయల్దేరాను. నేను పని చేస్తున్న ఆఫీస్‌లోని నా సహోద్యోగి సాయంతో అక్కడ అడ్మిషన్ ఖరారయ్యింది.

కరోనావైరస్

ఫొటో సోర్స్, DAVID BENITO

ఆ క్షణం నన్ను నిస్తేజంగా మార్చేసింది

నేను అంబులెన్స్‌ను వెంట కారులో వెళ్తుండగా నా బంధువు ఒకరు ఫోన్ చేశారు. మీరు వెళ్లే దారిలోనే ప్రభుత్వాసుపత్రి ఉంది కనుక ఓ సారి ఉమేశ్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసుకొని వెళ్లమని చెప్పారు. అయితే నేను ఉదయం నుంచి అక్కడున్న వైద్యులకు ఫోన్ చేస్తునే ఉన్నాను కానీ ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వ లేదని, లోపల ఏం జరుగుతోందో నాకు తెలియడం లేదని చెప్పాను. అయితే ఉమేశ్ ఉదయమే మరణించినట్టు నాకు సమాచారం అందిందని ఆయన నాకు చెప్పారు.

నాకు నోట మాట రాలేదు. మరో ఆలోచన లేదు. నిజానికి నేను చెయ్యడానికి కూడా ఏం లేదు. అలా అంబులెన్స్ వెంట వెళ్తూనే ఉన్నాను. కనీసం నా కారును కూడా ఆపలేదు. కాసేపటికి కాస్త ధైర్యాన్ని తెచ్చుకొని డాక్టర్ కమలేశ్ ఉపాధ్యాయకు ఫోన్ చేశాను. అయితే ఆ రోజు ఆయన విధుల్లో లేనని ఉమేశ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదని చెప్పారు. ఆయన చెప్పిన సమాధానం నిజంగా నాకు షాక్‌నకు గురి చేసింది. ప్రభుత్వాసుపత్రిని నమ్మి తప్పు చేశానన్న భావన అప్పుడు నాకు కల్గింది.

మరి కొంత మందికి ఫోన్ చేశాను. ఆ తర్వాత శనివారం ఉదయం ఉమేశ్ శ్వాస తీసుకుంటున్నారని చెప్పిన డాక్టర్ మైత్రేయి గజ్జర్‌కి ఫోన్ చేశాను. సాయంత్రం ఐదు గంటలకు నా అంతట నేను ఆస్పత్రికి ఫోన్ చేసేంత వరకు ఏ ఒక్కరూ ఉమేశ్ చనిపోయారన్న విషయాన్ని నాకు చెప్పలేదు.

ఆ క్షణం నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే కరోనావైరస్ భయంతో ఉన్న ఆ కుటుంబానికి ఉమేశ్ చనిపోయారన్న వార్త ఏ మాత్రం భరించలేని విషయం. షెఫాలీకి ఈ విషయం తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రిలో అడ్మిట్ కాకుండా వెనక్కి వచ్చేస్తారు. తన భర్తను కాస్త దూరం నుంచైనా చివరిసారిగా చూడాలంటారు.

ఆమె భర్త ఇక లేరన్న విషయాన్ని ఆమెకు చెప్పడం నా వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. తన జీవితాంతం ఆమెను ప్రేమించిన వ్యక్తి ఐసీయూలో ఒంటరిగా ప్రాణాలు విడిచారు. అంతేకాదు కొన్ని గంటలుగా ఆయన మృతదేహాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కానీ ఆ విషయాన్ని నేను ఆమెకు చెప్పి తీరాలి.

అలాగని 108 అంబులెన్స్ ఆమెను తిరిగి ఇంటికి తీసుకొని రాదు. ప్రైవేటు వాహనాలు అందుబాటులో లేవు. నేను నా కారులో కూడా ఆమెను తీసుకొని రాలేను. తిరిగి ఇంటికి తీసుకొని వెళ్లడం చాలా కష్టం. చివరకు ఆస్పత్రి సిబ్బంది ప్రస్తుతం అడ్మిట్ చేసుకునేందుకు అంగీకరించడం లేదని తిరిగి రేపు వద్దామని షెఫాలీతో చెప్పాను. అక్కడే ఓ స్కూటర్‌ను సంపాదించి ఆమెను నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్లమన్నాను. వెనకనే ఆమెను అనుసరిస్తూ నేను వస్తానని చెప్పాను. ఇంటికి చేరిన తర్వాత ఉమేశ్ ఇక లేరన్న కఠోన నిజాన్ని ఆమెకు చెప్పక తప్పలేదు.

ఆస్పత్రిలో వెంటిలేటర్‌ను పరిశీలిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ

ఫొటో సోర్స్, vijayrupani/fb

ఫొటో క్యాప్షన్, వెంటిలేటర్‌ను పరిశీలిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ

ఆమె ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు

చాలా సేపు ఆమె నిస్తేజంగా ఉండిపోయారు. ఆ తరువాత ఆమె “ అన్నయ్యా.. ఉమేశ్ తిరిగి ఇంటికి వస్తారని నాకు మాట ఇచ్చావు. ఉమేశ్ ఎక్కడ?” అని అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకుండా పోయింది.

కరోనావైరస్ కేవలం మూడంటే మూడే రోజుల్లో ఆమె 20 ఏళ్లు కష్టబడి నిర్మించుకున్న జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసేసింది. ఆమె ఒంటరైపోయారు. నేను ఎలాగైనా తన భర్తను ఆరోగ్యంగా తిరిగి ఇంటికి తెస్తానని బలంగా నమ్మింది. కానీ నేను ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయాను. ఆ సమయంలో నా ముఖాన్ని ఆమెకు చూపిచేందుకు నాకు ఏ మాత్రం ధైర్యం సరిపోలేదు.

గత 20 ఏళ్లుగా నేను అదే నగరంలో పాత్రికేయ వృత్తిలో ఉన్నాను. రాష్ట్రంలోని అత్యున్నత పదవుల్లో ఉండే వ్యక్తులతో నాకు సత్సంబంధాలున్నాయి. కానీ వాటంతట అవే జరగాల్సిన చిన్న చిన్న విషయాల కోసం కూడా చాలా సార్లు వాళ్లకు ఫోన్ చేయాల్సిరావడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలా సార్లు నిస్సహాయంగా మిగిలిపోవాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌లో కరోనా సృష్టించిన గందరగోళం ముందు ఏ ప్రయత్నమూ ఫలించలేదు.

ఉమేశ్ మరణించిన 20 రోజుల తర్వాత కూడా ఆయనకు ఎటువంటి చికిత్స అందించారు? ఏ సమయంలో చనిపోయారు? ఆయన్ను కాపాడేందుకు వైద్యులు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? ఏ వెంటిలేటర్‌పై చికిత్స అందించారు? ఒక వేళ గుజరాత్‌లో వివాదాస్పదమైన ధమన్-1 వెంటిలేటర్‌నే ఆయనకు కూడా వినియోగించారా? ఈ విషయాలు ఏవీ నాకు తెలియదు.

ఆయన విషయంలో నాకు, నా సోదరికి ఇప్పటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అనేక సార్లు అనేక విధాలుగా అధికారులను అడిగి చూశాను. సమాధానం లేదు. ఆయన చివరిగా ఉపయోగించి మొబైల్, ఆయన సిమ్ కార్డ్, రిస్ట్ వాచ్ వాటి గురించి అడిగినా వైద్య సిబ్బంది నుంచి జవాబు లేదు. బహుశా ఆయన మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన వస్తువుల్ని ఎవరో ఎత్తుకెళ్లి ఉంటారు.

ఈ సంఘటన గురించి నేను ఎవ్వరికి చెప్పినా... సుదీర్ఘ కాలంగా పాత్రికేయ వృత్తిలో ఉన్న నీకే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏ ఒక్క ఉన్నతాధికారి కానీ, వ్యక్తులు కానీ పరిచయం లేని వ్యక్తుల విషయంలో ఇలా జరిగితే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి.

రోజు రోజుకీ అహ్మదాబాద్‌లో కరోనా రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరోవైపు ఆస్పత్రులలో బెడ్స్ సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం లక్షణలు ఉన్న వారికి మాత్రమే కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంటే టెస్ట్ చేయించుకున్న ప్రతి ఒక్కరినీ ఆస్పత్రిలో చేర్చుకోవాల్సి ఉంటుంది. వైద్యం అందించాల్సి ఉంటుంది. కానీ నగరంలో అదనంగా వైద్యులు లేరు. వైద్య సౌకర్యాలు లేవు.

అహ్మదాబాద్‌లో ఒక్క ప్రైవేటు ఆసుపత్రిలో కూడా బెడ్ దొరకట్లేదు (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అహ్మదాబాద్‌లో ఒక్క ప్రైవేటు ఆసుపత్రిలో కూడా బెడ్ దొరకట్లేదు (ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పోయింది

అహ్మదాబాద్‌లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కొద్ది రోజులుగా నేను ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులలో అడ్మిషన్ కోసం ప్రయత్నించే వారికి సాయం చేస్తున్నాను. చాలా మంది సాయం కోసం నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల 60 ఏళ్ల సుర్సింగ్ భజరంగీ అనే వ్యక్తికి పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన కుమారుడు వివేకంత్ భజరంగీ సుర్సింగ్‌ను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రయత్నించారు.

ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రులను ఏ ఒక్కరూ నమ్ముతున్నట్టు కనిపించడం లేదు. ఆయన సిఐఎంఎస్, హెచ్‌సీజీ సహా అనేక ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు ఫోన్ చేశారు. కానీ ఏ ఆస్పత్రిలోనూ బెడ్ దొరకలేదు. చివరకు చాలా ప్రయత్నాల తర్వాత ఆశ్రమ్ రోడ్‌లో ఉన్న సేవియర్ ఆస్పత్రిలో ఆయనకు అడ్మిషన్ దొరికింది.

నేను ఈ కథనం రాస్తున్న సమయంలో నికుల్ ఇంద్రకర్ అనే యువకుని తల్లి జైడుస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సాయంత్రం ఆమెకు కోవిడ్-19 సోకిందని తేలింది. ఆమెను తక్షణం అక్కడ నుంచి వేరే ఆస్పత్రికి మార్చాలి. ఆయన అన్ని ప్రైవేటు ఆస్పత్రులలోనూ అడ్మిషన్ కోసం ప్రయత్నించారు. కానీ ఎక్కడా ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు. ప్రభుత్వాసుపత్రిపై ఆయనకు నమ్మకం లేదు. ప్రస్తుతానికి ప్రైవేటు ఆస్పత్రిలో బెడ్ ఖాళీ అయ్యేంత వరకు ఆయన వేచి చూడటం తప్ప ఇంకేం చెయ్యలేరు.

అహ్మదాబాద్ నగరంలో ఇలాంటి నిస్సహాయ పరిస్థితి నిత్యం ఎవరికో ఒకరికి ఎదురవుతునే ఉంటోంది. బెడ్స్ లేకపోవడంతో చాలా మంది తమ ఇంట్లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల్లో నా తల్లికి చికిత్స అందించేందుకు ఒక్క ఆస్పత్రిలో కూడా బెడ్ దొరకకపోతే... ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెంది ఏం లాభం? అని నికుల్ నాతో అన్నారు.

షెఫాలీ సహా ఎంతో మంది కుటుంబాల్లో కరోనావైరస్ కల్లోలం సృష్టిస్తోంది. చూస్తుంటే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద కూడా ఎలాంటి పరిష్కారం ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ మైరుగైన చికిత్సను పొందడం, గౌరవంగా చనిపోవడం ఈ రెండింటికీ మన అందరం అర్హులమే.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)