నిన్నటి వరకు హీరోలన్నారు.. ఇవాళ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు: ఇటలీ వైద్య సిబ్బంది ఆవేదన

ఫొటో సోర్స్, PAOLO MIRANDA
- రచయిత, సోఫియా బెట్జిజా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్యుల్ని, వైద్య సిబ్బందిని హీరోలుగా కీర్తిస్తూ సంబరాలు జరిపింది ఇటలీ. కానీ ఇప్పుడు ఆ హీరోలకు కష్టమొచ్చింది.
లాంబర్డీ ప్రపంచంలోనే వైరస్ ప్రభావం తీవ్రంగా ఎదుర్కొన్న ప్రాంతం. అక్కడ కోవిడ్-19ను అదుపులోకి తీసుకొచ్చేందుకు వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సెర్మొనాలోని ఇన్సెంటివ్ కేర్ యూనిట్‌లో నర్స్‌గా పని చేస్తున్నారు పాలొ మిరండ. ఇటీవల తనకు చికాకు తీవ్రంగా పెరిగిపోతోందని, ప్రతి చిన్న విషయానికి కోపం వస్తోందని, గొడవలు పెట్టుకుంటున్నానంటూ తన పరిస్థితిని వివరించారు.
ఇన్సెంటివ్ కేర్ యూనిట్లలో పరిస్థితిని ఫోటోల సహాయంతో ఓ పేపర్‌పై పెట్టాలని కొద్ది వారాల క్రితం ఆయన నిర్ణయించుకున్నారు. “మా విషయంలో ఏం జరిగిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా త్వరలో అది ఓ చరిత్రగా మారబోతోంది” అని నాతో చెప్పారు.
ఓ వైపు ఇటలీలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో కోవిడ్-19 రెండో దశను తన సహచరులు ఎలా ఎదుర్కొంటున్నారో తన ఫోటోల ద్వారా ప్రపంచానికి ఆయన చూపించాలనుకుంటున్నారు.
“నెమ్మది నెమ్మదిగా అత్యవసర పరిస్థితిని సడలిస్తున్నప్పటికీ, మా చుట్టూ చీకటి కమ్మేసినట్టు అనిపిస్తోంది. గాయాలతో నిండినట్టు ఉంది మా పరిస్థితి. లోపల జరిగే ప్రతిదీ మమ్మల్ని వెంటాడుతునే ఉంది.

ఫొటో సోర్స్, PAOLO MIRANDA
పీడకలలు వస్తున్నాయి-చెమటలు పట్టేస్తున్నాయి
మోనికా మారియోట్టి.. ఆమె కూడా ఐసీయూలోనే నర్సుగా పని చేస్తున్నారు. “సంక్షోభ సమయంలో కన్నా ఇప్పుడు పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి” అంటూ ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
“సంక్షోభ సమయంలో అందరూ క్షణం తీరిక లేకుండా ఉండేవారు. ఆలోచించేందుకు కూడా సమయం చిక్కేది కాదు. కానీ ఆ మహమ్మారి ప్రభావం తగ్గుతున్న కొద్దీ మాలో కూడా నిస్సత్తువ ఆవరిస్తూ వచ్చింది” అని ఆమె అన్నారు.వారిలో గత కొద్ది వారాలుగా పేరుకుపోయిన ఒత్తిడంతా ఇప్పుడు బయటపడుతోంది.
“నాకు నిద్ర పట్టడం లేదు. పీడ కలలు వస్తున్నాయి. రాత్రి నిద్రపోయిన తర్వాత కనీసం పది సార్లైనా మధ్యలో లేస్తున్నాను. నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది” అని మోనికా తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించారు.
కోవిడ్-19 సంక్షోభంలో తాను చాలా ధైర్యంగా ఉండేదాన్ని అని, కానీ ప్రస్తుతం తనలో నిస్సత్తువ ఆవరించినట్టు అనిపిస్తోందని మోనికా సహచరి ఎలిసా పిజ్జెరా అన్నారు. కనీసం వంట చేసుకునేందుకు కూడా ఓపిక లేకుండా పోయిందని, సెలవు రోజుల్లో చాలా సమయం మంచంపైనే గడుపుతున్నానని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, PAOLO MIRANDA
ఎక్కడ లేని ఆందోళన
మార్టినా బెండెట్టి టుస్కనీ ప్రాంతంలో ఓ ఆస్పత్రిలోని ఐసీయూ విభాగంలో నర్స్‌గా పని చేస్తున్నారు. ఎక్కడ తన వల్ల ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకుతుందేమో అన్న భయంతో ఇప్పటికీ తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా ఉంటున్నారు.
“ఇప్పటికీ నా భర్త నుంచి నేను భౌతిక దూరాన్ని పాటిస్తున్నాను. ఇద్దరం వేర్వేరు గదుల్లో నిద్రపోతున్నాం” అని ఆమె చెప్పారు.
చిన్న చిన్న పనుల విషయంలో కూడా ఆమె సమస్యలు ఎదుర్కొంటున్నారు.
“ప్రతిసారీ నేను వాకింగ్‌కి వెళ్లాలని అనుకుంటాను. అంతలోనే ఎక్కడ లేని ఆందోళన నాలో పెరిగిపోతుంది. వెంటనే తిరిగి ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తోంది” అని మార్టినా తన పరిస్థితిని వివరించారు.
ఇక ఎంతో కాలం నర్సుగా పని చెయ్యలేనని ఆమె నాతో చెప్పారు. గత ఆరేళ్లలో చూడనని మరణాలను ఈ రెండు నెలల్లోనే చూశానని అన్నారు.
ఇటలీలో కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పని చేసిన వైద్య సిబ్బంది ఇప్పుడు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని తాజా పరిశోధలో తేలింది. “ఇది వైద్యులకు, నర్సులకు అత్యంత కష్టకాలం” అని ఈ పరిశోధన నిర్వహించిన డాక్టర్ సెరినా బరెల్లొ వ్యాఖ్యానించారు.
సాధారణంగా మనం సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొనే సమయంలో సహాయపడేలా మన శరీరం కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
కానీ చివరకు ఆ సంక్షోభ ప్రభావం మీపై చూపించే సమయానికి చుట్టూ ఉన్న సమాజం ముందుకు వెళ్లిపోతూ ఉంటుంది. దీంతో ఒక్కసారిగా మీ పై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోయి మీలో మరింత నిస్సత్తువ ఆవరిస్తుంది. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు” అని డాక్టర్ బెరెల్లొ వివరించారు.
ఈ మహమ్మారి ప్రభావం తగ్గిన చాలా కాలం తర్వాత కూడా వైద్యులు, నర్సులలో పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) లక్షణాలు కనిపించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావం వ్యక్తి జీవితంపై కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు కూడా ఉండవచ్చు అని ఆమె తెలిపారు.
ముఖ్యంగా వైద్య సిబ్బంది విషయంలో వారి పని తీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సామర్థ్యం మేరకు వారు పని చేయలేకపోతారు.

వాళ్లంతా ఇప్పుడు నిన్నటి హీరోలే
తమ ప్రాణాలకు తెగించి కోవిడ్-19 బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యుల్ని, వైద్య సిబ్బందిని ప్రపంచమంతా హీరోలుగా కీర్తిస్తూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఇటలీలో వారి పట్ల ఆ ప్రేమ క్రమంగా క్షీణిస్తూ వస్తోంది.
“వాళ్లకు చావు భయం పుట్టుకొచ్చేసరికి ఒక్కసారిగా మేం వాళ్లకు హీరోల్లా కనిపించాం. కానీ వాళ్లంతా ఎప్పుడో మమ్మల్ని మర్చిపోయారు” అని మోనికా అభిప్రాయపడ్డారు.
“త్వరలోనే వారు మమ్మల్ని గాడిదల్ని కాసుకునే వారిలా, సోమరుల్లా, పనికి మాలిన వారిగా చూసే పరిస్థితికి వెళ్తాం.”
ఇటీవల ట్యురిన్‌లోని ఆస్పత్రి వార్డుల్లో పీపీఈ కిట్లు లేకపోవడం వల్ల తమ పరిస్థితి ఎలా ఉందో చూపించేందుకు కొంత మంది వైద్య సిబ్బంది తమను తాము గొలుసులతో కట్టుకొని బిన్ బ్యాగులు ధరించారు. తాము చేస్తున్న పనికి గుర్తింపు కావాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు.
“మార్చి నెలలో మేమంతా హీరోలం. కానీ ప్రస్తుతం అందరూ మమ్మల్ని మర్చిపోయారు” అంటూ వాళ్లు నినాదాలు చేశారు.
వాళ్ల ప్రాణాలకు తెగించి పని చేసినందుకు బోనస్ ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అటువంటి సూచనలేవీ కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, PAOLO MIRANDA
ప్రజల గుర్తింపే వారికి రక్ష
ఇటలీలో కరోనావైరస్ కారణంగా సుమారు 163 మంది వైద్యులు, మరో 40 మంది నర్సులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
లాక్ డౌన్ తర్వాత జనం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కోపం తట్టుకోలేకపోతున్నానని కోవిడ్-19 కేర్ హోమ్స్‌లో పని చేసిన డాక్టర్ ఎలిసా నానినో అన్నారు. కలిసి తింటున్నారు. తాగుతున్నారు. ఒక్కరూ కూడా మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం అన్న మాటే లేదు.
“నాకు ఇప్పుడు వాళ్ల వద్దకు వెళ్లి మీరు మీ చుట్టు పక్కల ఉన్న ప్రతి ఒక్కర్నీ ప్రమాదంలో పడేస్తున్నారని గట్టిగా వారి ముఖం మీదే చెప్పాలని ఉంది. వాళ్ల ప్రవర్తన పట్ల నాకే కాదు, నా సహచరులకు కూడా అవమానంగా ఉంది.
అయితే సంక్షోభ సమయంలో ప్రజలంతా పూర్తిగా సహకరించారని వైద్య సిబ్బంది అంతా చెబుతున్నారు.
“నిజానికి నేను హీరోను కాను. కానీ వారి ప్రవర్తన మేం అలా అనుకునేలా చేసింది” అని పాలొ అన్నారు.

ఫొటో సోర్స్, PAOLO MIRANDA
డాక్టర్ బరెల్లొ పరిశోధన ప్రకారం ప్రస్తుతం పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ బాధపడుతున్న వైద్య సిబ్బందికి కేవలం ప్రజల గుర్తింపు మాత్రమే సాయం చేయగలదు.
“మన అందరం చాలా కీలక పాత్ర పోషించాల్సిన సమయం ఇది. మన కోసం తమ ప్రాణాలకు తెగించి మరీ సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బందిని మర్చిపోలేదన్న విషయం వారికి తెలియాలి.” అని ఆమె వ్యాఖ్యానించారు.
సైనికులైతే యుద్ధ భూమిని విడిచి తిరిగి తమ సొంత ఊళ్లకు వెళ్లడం ద్వారా, తమ కుటుంబసభ్యులతో గడుపుతూ ఆ బాధ నుంచి బయటకు రాగలరు. కానీ వైద్యులు, వైద్య సిబ్బంది పరిస్థితి అలా కాదు. ప్రతి 12 గంటలకు వాళ్లు నిర్వర్తించాల్సిన విధులు వారి కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి.
తాము ఎక్కడైతే తీవ్ర వేదనకు గురయ్యారో ఆ ప్రాంతంలో ఉంటూనే అంతా భరించాలి.
“ఇప్పుడే యుద్ధం నుంచి తిరిగి వచ్చిన సైనికుడిలా ఉంది నా పరిస్థితి. అయితే నేను వస్తున్న దారిలో నాకు ఆయుధాలు కానీ శవాలు కానీ కనిపించలేదు. కానీ ఓ అగాధంలో చిక్కుకున్నట్టు అనిపిస్తోంది” అని పాలొ తన పరిస్థితిని వివరించారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- కరోనావైరస్: వ్యాక్సీన్ ప్రయోగాల్లో ఆఫ్రికా వాళ్ళు తప్పకుండా ఉండాలి... ఎందుకంటే?
- కరోనావైరస్: కోవిడ్ పరీక్షలు చేయడం ఎందుకంత కష్టం?
- కరోనావైరస్: ఈ మహమ్మారి మగవారినే ఎక్కువగా టార్గెట్ చేసిందా... మహిళల పట్ల పక్షపాతం చూపిస్తోందా
- కరోనావైరస్: లాక్డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- ‘నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా.. లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది’
- కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








