కరోనావైరస్:లాక్ డౌన్‌లో ఉన్నప్పుడు కాలం వేగంగా కదిలిపోయిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్లాడియా హమ్మండ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడిప్పుడే ఆంక్షల్ని సడలించడం మొదలుపెట్టాయి. ఈ సమయంలో ఓ సారి వెనక్కి తిరిగి చూస్తే ఐసోలేషన్‌లో ఉండగా రోజులు చాలా వేగంగా గడిచిపోయినట్టు కొంత మందికి అనిపిస్తోంది. నిజానికి ఇలా అవుతుందని ఎవ్వరూ పెద్దగా ఊహించలేదు. మొదట్లో అందరూ మన జీవితాల్ని ఆంక్షల పేరిట కట్టి పడేస్తున్నారని అన్నారు.
ఈ సమయంలో దీనిపై పరిశోధనలు గురించి మాట్లాడుకోవడం అంటే కాస్త తొందరపడ్డట్టే. కానీ చాలా మందికి లాక్ డౌన్‌లో రోజులు ఇంత అద్భుతంగా త్వరగా గడిచిపోవడం ఇప్పటికీ ఓ పజిల్‌లానే ఉంది. మే నెలాఖరుకి వచ్చేశాం... అంటే దాదాపు రెండు నెలలు పూర్తయ్యాయంటే ఇంకా చాలా మంది నమ్మలేక పోతున్నారు.
బ్రిటన్‌లో ఇప్పటికీ గురువారం వచ్చిదంటే చాలు ప్రతి ఒక్కరూ తమ గుమ్మం ముందు నిల్చొని వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు కృతజ్ఞతగా చప్పట్లు కొడుతున్నారు.
నా వరకు అయితే తరచు ఆ కార్యక్రమం చేస్తే బాగుణ్ణనిపించింది. ఎందుకంటే ఆ పేరుతోనైనా ఇరుగు పొరుగు వారిని పలకరించే అవకాశం వస్తుంది. కానీ మరోవైపు, బాధేస్తోంది కూడా... ఎందుకంటే వారాలు మెరుపు వేగంతో గడిచిపోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా నుంచి పొలాండ్ వెళ్లిన కొంత మంది పాత్రికేయులు కూడా లాక్ డౌన్‌లో రోజులు ఇంత త్వరగా గడిచిపోతున్నాయి కారణమేంటని నన్ను అడిగారు. అంటే నా ఒక్కరికే అలా అనిపించడం లేదన్నమాట.
సాధారణంగా కాలానికి సంబంధించి మనం మనస్సులో ఓ రకమైన భావనను ఏర్పరుచుకుంటాం. అయితే అది అన్ని సార్లు గడియారంలో చూపించే సమయంతోనూ, క్యాలెండర్లో రోజులతోనూ సరిపోలదు. ఉదాహరణకు స్నేహితుడితో కలిసి మాట్లాడుకుంటూ 20 నిమిషాల సేపు భోజనం చేసినా అది కేవలం 20 సెకెన్లలా అనిపిస్తుంది. అదే 20 నిమిషాలు ఆలస్యమైన రైలు కోసం ప్లాట్ ఫాంపై వేచి చూస్తున్నప్పుడు గడియారంలో ముల్లు ఎంతకీ కదలనట్టే అనిపిస్తుంది.
సాధారణంగా టైం పాస్ చెయ్యడాన్ని రెండు విధాలుగా లెక్కేస్తాం. ఒకటి రాబోయే కాలం, రెండోది గడిచిపోయిన సమయం.
లాక్ డౌన్ సమయంలో స్నేహితులు, కుటుంబం, ఉద్యోగం నుంచి దూరంగా ఉన్న వాళ్లకు రోజులు సుదీర్ఘంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటి వాళ్లు టైం పాస్ చెయ్యడానికి వంట చెయ్యడం, మొక్కలు నాటడం, వీడియోకాల్స్ ఇలా ఏదో పని చేస్తూ ఉంటారు. ఒకటి రెండు రోజుల వరకు అది బాగానే ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ రోజూ అదే పని చేస్తూ ఉంటే విసుగు మొదలవుతుంది. కొంత మందికైతే వారాంతాలకు, సాధారణ రోజులకు తేడా కూడా తెలియకుండా పోతుంది.
పెద్దగా తేడా తెలియకుండా అస్పష్టంగా గడిచిపోయిన రోజులు పరిమిత స్థాయిలో కొత్త జ్ఞాపకాల సృష్టికి దారి తీస్తాయి కాలంపై అవగాహనకు ఇది చాలా కీలకం. ఎంత సమయం మనం గడిపామన్న విషయాన్ని నిర్ధారించుకునే మార్గాలలో జ్ఞాపకాలు కూడా ఒకటి.
ఓ వారం రోజులు సెలవుపై ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు ఆ వారం రోజులు చాలా త్వరగా గడిచిపోతాయి. కారణం అక్కడ ప్రతిదీ మీకు కొత్తే. ఇంటికొచ్చిన తర్వాత ఓ సారి ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే చాలా కొత్త కొత్త జ్ఞాపకాలుంటాయి. మరో వారం గడిచిన తర్వాత కూడా ఇంకా ఆ జ్ఞాపకాలు మదిలో మెదులుతునే ఉంటాయి.
ఈ లాక్ డౌన్ సమయంలో సరిగ్గా దానికి వ్యతిరేకంగా జరిగి ఉండవచ్చు. రోజులు నెమ్మదిగా గడిచినట్టు అనిపించినా వారంతంలో ఓ సారి వెనక్కి తిరిగి చూసుకొని ఎంత సమయం గడిపామో సింహావలోకనం చేసుకుంటే మీకు ఎప్పటిలా కాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే కొత్త జ్ఞాపకాలు ఉంటాయి. సమయం ఎలా గడిచిపోయిందో కూడా మీకు తెలీకుండా పోతుంది.
కొంత మంది జైల్లో.. లేదా జబ్బుపడి మంచం పడుతుంటారు. అలాంటి వాళ్లకు కాలం గడవటం చాలా కష్టమవుతుంది. ఎప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడతామా అని అనుక్షణం తపిస్తుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత కూడా వాళ్లు ఆస్పత్రిలో లేదా జైల్లో ఉన్నప్పటికీ ఓ సారి వెనకటి రోజుల్ని గుర్తు చేసుకుంటే వారికి కొత్తగా ఏ జ్ఞాపకాలు ఉండవు. రోజులు ఎలా గడిచిపోయాయో కూడా వారికి తెలీకుండా పోతుంది.
కొంత మంది లాక్ డౌన్‌లో కూడా వర్క్ ఫ్రం హోం చేస్తూ... అందులో బాగంగా ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల్ని పరిష్కరించుకుంటూ, మరోవైపు, పిల్లలకు పాఠాలు చెబుతూ.. ఇలా తమను తాము బిజీగా ఉండేలా చూసుకున్నారనుకోండి.
అయితే వారు ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ వాళ్ల ఈ కొత్త జీవితమంతా దాదాపు ఒక్క చోటే గడుపుతారు. దీంతో గడిచిపోయిన రోజుల్ని గుర్తు చేసుకుందామంటే కొత్తగా ఏం చేశారో చెప్పడానికి ఒకట్రెండు జ్ఞాపకాలు కూడా ఉండవు.ఎప్పటిలా కాకుండా రోజులు ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్టనిపిస్తుంది.
ఉన్న చోటు నుంచే రోజూ చేసే జూమ్ కాల్స్ అన్నీ మన మెమెరీలో, నిజ జీవిత జ్ఞాపకాలతో పోల్చితే వేర్వేరుగా కాకుండా ఒక్క చోటే వచ్చి కలిసిపోతాయి. అందువల్ల మనం రోజూ మాట్లాడినప్పటికీ ఆ జ్ఞాపకాలు మదిలో ఒక్కొక్కటి ఒక్కో చోట నిక్షిప్తం కావు.

ఫొటో సోర్స్, Getty Images
బహుశా వర్తమాన పరిస్థితుల్లో మన అవసరాలకు తగినట్టు, ఈ లాక్ డౌన్ సమయంలో కాలం పట్ల మన అవగాహన మారిందేమోనన్న ఆశ్చర్యం వేస్తోంది.
మనం అనుకున్న భవిష్యత్తుకు మనం చేరుకొని ఓ సారి వెనక్కి తిరిగి కరోనావైరస్ పట్టి పీడించిన కాలాన్ని చూస్తే లాక్ డౌన్ సమయంలో గడిపిన నెలల్లో కొన్ని రోజులైనా గుర్తుంటాయో లేదో. నాకైతే అనుమానంగానే ఉంది. బహుశా మనకు వైరస్ గురించి ఎప్పుడు విన్నాం? మన దేశంలో ఎప్పుడు అడుగు పెట్టింది ? లాక్ డౌన్ ప్రకటన సమయంలో మనం ఉన్నామా లేదా అన్న విషయాలు మాత్రమే మనకు గుర్తుండవచ్చు.
సైకాలజిస్టులు ఇలాంటి వాటిని ఫ్లాష్ బల్బ్ మెమొరీస్ అని పిలుస్తారు. పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటివి సర్వ సాధారణం.
కానీ ఆ సమయంలో మన జీవితంలో గుర్తుపెట్టుకోదగ్గ ఇతర విషయాలేవీ లేకపోవడంతో లాక్ డౌన్ మొదలైన తర్వాత మిగిలిన వారాల్లో కూడా మనకు పెద్ద తేడా ఏం కనిపించదు. వాటిని విడి విడిగా జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం.
మనం తరచుగా చేసిన పనులు కాకుండా జీవితంలో భిన్నంగా..అంటే కొత్త ఉద్యోగంలో చేరడం, ఎవరిదైనా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వంటివన్నమాట. నిజానికి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మీరు ఎప్పుడో కానీ ఇంటి నుంచి బయటకు వెళ్లకపోయినా ఈ ప్రత్యేకమైన రోజులు మాత్రం ఇంతకముందు చెప్పుకున్నట్టు ఒకదానిలో ఒకటి విలీనం కావు.
కాలం పట్ల ఒక్కొక్కరు ఒక్కో రకమైన అవగాహన కల్గి ఉంటారని చెప్పేందుకు అద్భుతమైన మార్గం ఉంది. దాదాపు మనలో సగం మంది ఉన్న చోటు నుంచి కదలకుండానే తమకు ఏదో జరగబోతోందన్న ఉద్ధేశంలో భవిష్యత్తు వైపు చూస్తారు. మిగిలిన సగం మంది మాత్రం తమంతట తామే భవిష్యత్తు వైపు నడుస్తారు.
ఎవరు ఏ విభాగంలోకి వస్తారన్న విషయాన్ని ఈ చిన్న ప్రశ్నకు సమాధానం ద్వారా గుర్తించవచ్చు. “వచ్చే బుధవారం జరగాల్సిన సమావేశం ఆపై రెండు రోజుల తర్వాత జరుగుతుంది. అంటే బుధవారం జరగాల్సిన మీటింగ్ ఏ రోజు జరుగుతుంది?”
ఈ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలు వచ్చే అవకాశం ఉంది. ఉన్న చోటునే ఉంటూ భవిష్యత్తే తమ వైపు వస్తుందని భావించే వాళ్లు సోమవారం అని జవాబిస్తారు. కానీ తామే భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తున్నామని భావించేవాళ్లు శుక్రవారం అని సమాధానం చెబుతారు.
సాధారణంగా ప్రజలు ఏదో ఒక సమాధానానికి ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ ప్రయాణాలు వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు వారిచ్చే సమాధానాలను మార్చగలవు.
ఉదాహరణకు వేరే ఊరి నుంచి బయల్దేరినప్పుడు విమానాశ్రయంలో తప్పని సరి పరిస్థితుల్లో వేచి చూడాల్సి వస్తే ఏ రోజును ఎంచుకుంటారని ఎవరినైనా అడిగితే వెంటనే సోమ వారం అని చెబుతారట. అదే ఇంటికి వెళ్లేటపుడు వెళ్లాల్సిన సమయం కన్నా ముందు వెళ్లే పరిస్థితే వస్తే ఏ రోజు ఎంచుకుంటారని ప్రశ్నిస్తే శుక్రవారం ఎంచుకుంటారని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటికీ చెందిన సైకాలజిస్ట్ లెరా బోర్డోట్క్సీ అన్నారు.
నాకు తెలిసి లాక్ డౌన్ మనలో చాలా మందిని తాత్కాలికంగా మండే పీపుల్‌లా మార్చేసిందేమోనని ఆశ్చర్యమేస్తోంది. భవిష్యత్తే మనవైపు వస్తుందని బలవతంగా ఎదురు చూసేలా చేసిందేమోనని అనిపిస్తోంది. అలాగని నేను దీన్ని నిరూపించలేననుకోండి.
(క్లాడియా హమ్మండ్ టైమ్ రాప్డ్ పుస్తక రచయత)


ఇవి కూడా చదవండి
- 'కరోనావైరస్ ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది... రుణాలపై ఆగస్ట్ 31 వరకూ మారటోరియం' - ఆర్బీఐ గవర్నర్
- దిల్లీ - హైదరాబాద్/వైజాగ్ విమాన ప్రయాణం ఛార్జీ కనిష్ఠం రూ.3,500, గరిష్ఠం రూ.10 వేలు
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
- కరోనా లాక్డౌన్: 200 ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి బుకింగ్ ప్రారంభం... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే
- వీడియో, ఇండియా లాక్డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు, 4,29
- కరోనావైరస్కు తుపాను కూడా తోడైతే సామాజిక దూరం పాటించడం ఎలా
- కరోనావైరస్: తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ టెస్టులు తక్కువగా చేస్తోందా... పాజిటివిటీ రేటు ఎందుకు ఎక్కువగా ఉంది?
- 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది
- వీడియో, కరోనా కాలంలో సెక్స్ వర్కర్ల ఆకలి కేకలు వినేదెవరు, 3,18
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








