కరోనావైరస్: ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనా స్థానాన్ని భారత్ సొంతం చేసుకోగలదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నిఖిల్ ఇనాందార్
- హోదా, బీబీసీ న్యూస్
కోవిడ్ 19 ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తయారీ రంగంలో ప్రపంచ కేంద్రంగా ఉన్న చైనా చాలా దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారతదేశం చైనా స్థానాన్ని ఆక్రమించాలని భావిస్తోంది.
ప్రపంచ దేశాల దృష్టిలో క్షీణించిన చైనా స్థానం భారతదేశానికి పెట్టుబడులు ఆహ్వానించడానికి వరంగా మారనున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ఒక ఇంటర్వ్యూ లో అన్నారు.
బ్రెజిల్ దేశంతో సమానంగా జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పరిశ్రమలని ఆకర్షించడానికి ఆర్ధిక టాస్క్ ఫోర్స్ ని రూపొందించే ప్రణాళికల్ని చేస్తున్నారు.
చైనా నుంచి తమ కార్యకలాపాల్నిఉపసంహరించుకోవాలని చూస్తున్న పరిశ్రమల కోసం కావల్సిన స్ధలాన్ని సమకూరుస్తోంది. ఇప్పటికే భారతదేశం పెట్టుబడుల కోసం 1000 అమెరికన్ కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు బ్లూమ్ బెర్గ్ పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘కంపెనీలతో సంప్రదింపులు జరపడమనేది నిరంతర ప్రక్రియ’ అని ఇన్వెస్ట్ ఇండియా ప్రధాన అధికారి దీపక్ బాగ్ల బీబీసీ కి చెప్పారు. కోవిడ్ కారణంగా చాలా కంపెనీలు తమ సేవలని చైనా నుంచి ఉపసంహరించుకునే అవకాశం పెరగవచ్చని ఆయన అన్నారు.
భారతదేశం పెట్టుబడుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోందని భారత్ -అమెరికా మధ్య పెట్టుబడుల కోసం లాబీ గ్రూప్ గా పని చేసే ‘ది యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్’ కూడా వ్యాఖ్యానించింది.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో కూడా సప్లై చైన్ లని ఆకర్షించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని యు ఎస్ ఐ బి సి అధ్యక్షురాలు నిషా బిస్వాల్ చెప్పారు.
ఇప్పటికే భారతదేశంలో కొంత భాగం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకి చైనా నుంచి మిగిలిన సేవలని తరలించి ఇక్కడ ఉత్పత్తిని పెంచడం సులభమవుతుందని అన్నారు.
కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇంకా చర్చల స్థాయిలోనే ఉన్నాయని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు కుంటుపడిన ఈ దశలో సప్లై చైన్లని తరలించమని చెప్పడం సులభంగా ఉన్నప్పటికీ ఆచరణలో చాలా కష్టతరమని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ విపత్తు వలన ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు, ద్రవ్య నిల్వలు, పెట్టుబడులు లేక సతమతమవుతున్నాయని, ఈ సమయంలో కంపెనీలని తరలించడంలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుందని ఆర్ధిక వేత్త రూపా సుబ్రమణ్యం అన్నారు.
భారతదేశంలో పరిశ్రమల కోసం భూమిని సమీకరించడం మంచి ప్రయత్నమే కానీ, కేవలం భూమి ఉందని పెద్ద కంపెనీలు ఏవీ తమ కార్యకలాపాల్ని పూర్తిగా తరలించవని హాంగ్ కాంగ్ ఫైనాన్షియల్ టైమ్స్ మాజీ బ్యూరో చీఫ్ రాహుల్ జాకబ్ అన్నారు.
ఉత్పత్తి చైన్లు, సప్లై చైన్లని అంత సులభంగా అర్ధం చేసుకోలేమని , రాత్రికి రాత్రి వాటిని తరలించడం సాధ్యం కాదని అన్నారు.
చైనా అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలకి అవసరమైన సమగ్రమైన పోర్టులు, హై వే లు, శిక్షణ పొందిన కార్మికులు, ఆధునిక సదుపాయాలతో కూడిన సౌకర్యాలని అందిస్తోందని తెలిపారు.
భారతదేశం ప్రపంచంలోని అన్ని సప్లై కేంద్రాలతో అనుసంధానమై లేకపోవడం కూడా భారతదేశానికి పెట్టుబడులు రాకపోవడానికి ఒక కారణం కావచ్చని అన్నారు.
ఏడు సంవత్సరాల పాటు చర్చలు నడిచిన తర్వాత గత సంవత్సరం భారత దేశం అతి కీలకమైన 12 ఆసియా దేశాలతో కుదరనున్న ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం నుంచి తప్పుకుంది. ఇలాంటి నిర్ణయాలు భారతీయ ఎగుమతిదారులకు లాభాలు చేకూర్చవు.

ఫొటో సోర్స్, Getty Images
"నేను సింగపూర్ మార్కెట్ లో అమ్మాలనుకుంటున్న ఉత్పత్తిని భారతదేశంలో ఎందుకు తయారు చేస్తాను?” అని ది ఫ్యూచర్ ఆఫ్ ఆసియన్ పుస్తక రచయత పరాగ్ ఖన్నా బీబీసీ తో అన్నారు.
పోటీ ధర ఇవ్వడం ఎంత ముఖ్యమో సంస్థాగతంగా చేసుకునే వాణిజ్య ఒప్పందాల్లో అనుసంధానత కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు.
అంతర్జాతీయ కంపెనీలు ‘ఉత్పత్తులు తయారు చేసిన చోటే అమ్మకాలు " చేయాలనే లాంటి విధానాలని అవలంబించాలని భావిస్తున్న తరుణంలో ప్రాంతీయ అనుసంధానత చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో భారతదేశం అవలంబించే తీరు , ఇక్కడ అమలులో ఉన్న వ్యాపార నిబంధనలు కూడా అంతర్జాతీయ సంస్థలు తమ పెట్టుబడుల్ని పెట్టడానికి సందేహంలో పడేస్తాయి.
ఈ - కామర్స్ కంపెనీలు అత్యవసర వస్తువుల అమ్మకాన్ని నిషేధించడంతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమావళిని మార్పులు చేయడం ద్వారా పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు భారతదేశం గండి పెట్టింది. వైరస్ విపత్తు నుంచి రక్షించుకోవడానికి ఇండియా తన చుట్టూ గోడలు నిర్మించుకుందనే భయం కూడా ఉంది.
ఇటీవల దేశ ప్రజల నుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో కూడా ప్రాంతీయత గురించి నొక్కి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో వ్యాపార నిబంధనలని క్రమబద్దీకరణ చేస్తే మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే అవకాశం ఉందని బిస్వాల్ అన్నారు.
భారత్‌తో పాటు, వియత్నాం, బాంగ్లాదేశ్, దక్షిణ కొరియా, తైవాన్ కూడా అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా ఉన్న దేశాలుగా కనిపిస్తున్నాయని జాకబ్ అన్నారు.
పెరుగుతున్న మానవ వనరుల ఖర్చు, పర్యావరణ అంశాల దృష్ట్యా చాలా అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాల్ని చైనా నుంచి ఉపసంహరించి ఈ దేశాలకి తరలించడం ఒక దశాబ్దం క్రితమే మొదలయిందని ఆయన అన్నారు.
ఇటీవల కాలంలో యు ఎస్ చైనా మధ్య వాణిజ్య కలహాలు పెరగడంతో ఈ తరలింపు కాస్త వేగవంతం అయిందని అన్నారు.
ఈ వాణిజ్య కలహాలు పెరగడానికి సరిగ్గా ఒక నెల రోజుల ముందు జూన్ 2018 నుంచి అమెరికా వియత్నాం నుంచి చేసుకునే దిగుమతుల్లో 50 శాతం పెరగగా, తైవాన్ నుంచి 30 శాతం పెరిగాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక పేర్కొంది.
అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తులని ప్రాంతీయ మార్కెట్లకు సరఫరా చేయడం కానీ, లేదా ఎగుమతులు చేయడానికి భారతదేశాన్ని ఉత్పత్తి స్థావరంగా మార్చుకోవడానికి గాని అనువైన పరిస్థితులు భారతదేశం కల్పించలేక పోయింది.
వ్యాపార సరళిని సులభతరం చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని రాష్ట్రాలు పురాతనమైన కార్మిక చట్టాలని సవరించడం కూడా మొదలు పెట్టారు.

ఫొటో సోర్స్, AFP
ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో ఫ్యాక్టరీలు పరిశుభ్రత, గాలి వెలుతురు పాటించడానికి పొందిన మినహాయింపులని కూడా రద్దు చేశారు.
అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించడానికి చేసే ప్రయత్నాలలో ఇది ఒకటి.
కానీ, ఇలాంటి విధానాల వలన లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని జాకబ్ అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ సంస్థలు, పని వాతావరణం, కార్మికులు, పర్యావరణం, భద్రతా విధానాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయని అన్నారు.
2013 లో బాంగ్లాదేశ్ లోని రానా ప్లాజా లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వలన ఫ్యాక్టరీలలో అమలు చేయవలసిన మౌలిక విధానాల పట్ల మరింత శ్రద్ధ తీసుకోవల్సిన అవసరాన్ని కలగచేసిందని అన్నారు.
భారతదేశం మరింత మెరుగైన నాణ్యతా ప్రమాణాలని పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇవి అంతర్జాతీయ వాణిజ్య రంగం లోని క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో అవగాహన లేని కొంత మంది అధికారులు పవర్ పాయింట్ లో వైట్ బోర్డు మీద రాసిన ఆలోచనలని అన్నారు.
చైనా అమెరికా వాణిజ్య సంబంధాలు, సంస్థల్ని బయటకి తరలించమని ప్రోత్సహిస్తున్న జపాన్, హువాయ్ కార్యకలాపాల్ని తమ దేశంలో విస్తరించేందుకు వ్యతిరేకతని ఎదుర్కొంటున్న యు కె ని చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా చైనా పట్ల ఉన్న వ్యతిరేకత పెరుగుతోందని తెలుస్తోంది.
సమగ్రవంతమైన నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టి ప్రపంచ దేశాలతో తమ వాణిజ్య సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి భారతదేశానికి ఇది అనువైన సమయమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్ డౌన్ ఎత్తేస్తున్న యూరప్ దేశాలు.. ఏఏ దేశాల్లో ఏమేం ప్రారంభం అయ్యాయంటే..
- కరోనావైరస్: రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
- కరోనావైరస్: తీవ్ర అనారోగ్యం పాలైన 30 శాతం రోగుల రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
- కరోనావైరస్: లాక్‌డౌన్‌తో ఖాళీ అయిన మహా నగరాల రోడ్లు మళ్లీ కిక్కిరిసిపోతున్నాయ్
- విశాఖ గ్యాస్ లీక్: తుప్పు పట్టిన పైపులు, అనుమతులు లేని కార్యకలాపాలు... ప్రమాద కారణాలపై బీబీసీ పరిశోధన
- కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
- సముద్రపు ముసుగు దొంగలు తుపాకుల మోతతో దాడి చేసి కిడ్నాప్ చేసిన రోజు...
- కరోనావైరస్: గల్ఫ్ దేశాల్లో దిక్కు తోచని స్థితిలో భారతీయ వలస కార్మికులు
- మే 31వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించిన తమిళనాడు, మహారాష్ట్ర
- కరోనా లాక్డౌన్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – నెదర్లాండ్స్ ప్రభుత్వ మార్గదర్శకాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








