కరోనావైరస్: లాక్‌ డౌన్ ఎత్తేస్తున్న యూరప్ దేశాలు.. ఏఏ దేశాల్లో ఏమేం ప్రారంభం అయ్యాయంటే..

బండెస్లీగా ఫుట్ బాల్ మ్యాచ్‌లను మే 16 నుంచి ప్రారంభించారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బండెస్లీగా ఫుట్ బాల్ మ్యాచ్‌లను మే 16 నుంచి ప్రారంభించారు

జర్మనీలో వివిధ కార్యకలాపాలు మళ్లీ మొదలవుతున్నాయి. లాక్ డౌన్ ఆంక్షల్ని కొనసాగించాలా? వద్దా? అన్నది ఇప్పుడు ఆ దేశంలోని 16 రాష్ట్రాల ప్రభుత్వాల చేతుల్లో ఉంది.

అయితే ఛాన్స్‌లర్ ఏంగెలా మెర్కెల్ మాత్రం కొత్తగా పాజిటివ్ కేసులు పెరిగితే తక్షణం లాక్ డౌన్ ఎమర్జెన్సీ బ్రేక్ వెయ్యక తప్పదని స్పష్టం చేశారు.

* ప్రేక్షకులు లేకుండానే స్టేడియం తలుపులు మూసి వేసి బండెస్లీగా ఫుట్ బాల్ మ్యాచ్‌లను మే 16 నుంచి ప్రారంభించారు. లాక్ డౌన్ తర్వాత ప్రారంభమైన మొదటి అతి పెద్ద యూరోపియన్ లీగ్ ఇది.

* గతంలో మూత పడ్డ దుకాణాలన్నింటినీ ఇప్పుడు తిరిగి తెరిచేందుకు అనుమతిచ్చారు. అయితే అదనపు పరిశ్రుభ్రతను, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి.

* పరీక్షలు రాయాల్సిన విద్యార్థుల కోసం పాఠశాలలను పాక్షికంగా తెరిచారు. రానున్న వేసవిలో అన్ని తరగతులకు క్రమంగా తరగతులు ప్రారంభమవుతాయి.

* ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దుల్లో మే 15 నుంచి ఆంక్షల సడలింపులు ప్రారంభమయ్యాయి. జూన్ 15 నాటికి ఆంక్షల్ని పూర్తిగా తొలగిస్తారు.

* పక్క పక్క ఇళ్లలో ఉండే వారు ఇప్పుడు అవసరమనుకుంటే కలిసేందుకు అనుమతి ఇచ్చారు.

* భారీ ఉత్సవాలపై కనీసం ఆగస్టు వరకు నిషేధం అమల్లో ఉంటుంది.

ఇటలీలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి - జూన్‌లో ప్రయాణ ఆంక్షల సడలింపు

ఇటలీలో చాలా కఠినంగా లాక్ డౌన్ అమలు చేశారు. కనీసం వ్యాయామానికి కానీ, వాకింగ్ పేరుతో కానీ ఇంటికి 200 మీటర్ల దూరం దాటి వెళ్లనివ్వలేదు.

అయితే మే మొదటి వారం నుంచే ఇటలీలో ఆంక్షల్ని సడలిస్తూ వచ్చారు. ప్రస్తుతం అక్కడ సుదూరాలకు ప్రయాణించవచ్చు. అలాగే బంధువుల ఇళ్లకు కూడా పరిమిత సంఖ్యలో వెళ్లవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలకు, అంతర్జాతీయ ప్రయాణాలకు జూన్ 3 నుంచి అనుమతిస్తారు.

* ప్రస్తుతం “టేక్ అవే” సేవల్ని మాత్రమే అందిస్తున్న బార్లు, రెస్టారెంట్లు జూన్ 1 నుంచి పూర్తి స్థాయిలో తమ సేవల్ని ప్రారంభించే అవకాశం ఉంది

* హెయిర్ డ్రెసెస్, బ్యూటీ పార్లర్లు కూడా జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమవుతాయి.

* మ్యూజియంలు, గ్రంథాలయాలతో పాటు చాలా దుకాణాలు మే 18 నుంచి తిరిగి తెరుస్తారు.

* మే 18 నుంచి క్రీడాకారులకు కూడా మైదానాల్లో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించవచ్చు.

* అంత్యక్రియలకు గరిష్ఠంగా 15 మందికి అనుమతిస్తున్నారు.

* సెప్టెంబర్ వరకు పాఠశాలలు మూసే ఉంటాయి.

* మే 18 నుంచి కాథలిక్‌ చర్చిల్లో సామూహిక ప్రార్ధనలకు అనుమతిస్తారు.

కరోనావైరస్:యూరోప్ దేశాల్లో క్రమంగా ఆంక్షల సడలింపులు మొదలు

ఫొటో సోర్స్, REUTERS

ఫ్రాన్స్‌లో ప్రయాణాలపై ఆంక్షలకు ఇక సెలవు

మార్చి 17 నుంచి ఫ్రాన్స్‌లో లాక్ డౌన్ చాలా కఠినంగా కొనసాగుతోంది. ఎక్కడకు ప్రయాణించాలన్నా స్థానికులు కచ్చితంగా తగిన అనుమతి పత్రాలను చూపాల్సి వచ్చేది. మే 11 నుంచి అటువంటి ఆంక్షల్ని సడలించారు. మూడు వారాల అనంతరం పరిస్థితిని సమీక్షించిన తరువాత తగిన నిర్ణయం తీసుకుంటారు.

* వంద కిలోమీటర్లు లేదా అంత కన్నా తక్కువ దూరాల ప్రయాణాలకు ఇకపై ప్రయాణీకులు ఎలాంటి అనుమతి పత్రాలను చూపించాల్సిన అవసరం లేదు. దూర ప్రయాణాలకు మాత్రం తగిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. అలాగే పారిస్‌లో రద్దీ సమయాల్లో ఉద్యోగులు ప్రయాణించాలంటే కచ్చితంగా తమ సంస్థ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను చూపాలి. లేదా సరైన కారణాన్ని చెప్పాలి.

* మే 11 నుంచి ప్రాథమిక పాఠశాలలు, నర్సరీ పాఠశాలలు తిరిగి మొదలయ్యాయి. 11-15 ఏళ్ల మధ్య విద్యార్థులకు గ్రీన్ జోన్‌లో ఉన్న పాఠశాలలు మే 18 నుంచి ప్రారంభమవుతాయి. అయితే తరగతి గదికి 15 మంది మాత్రమే ఉండాలి. తప్పని సరిగా మాస్కులను ధరించాలి. 15 నుంచి 18 ఏళ్ల విద్యార్థులకు జూన్ వరకు తరగతులు ప్రారంభం కావు.

* పారిస్‌లోని షాపింగ్ సెంటర్లు తప్ప అన్ని షాపులను ప్రస్తుతం తెరవచ్చు. అయితే బార్లు, రెస్టారెంట్లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతాయి.

* 10 మంది కన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమికూడటంపై ఆంక్షలు ఎత్తివేశారు. అయితే వృద్ధులు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.

* బీచ్‌లను కూడా తిరిగి తెరవచ్చు. కఠినమైన ఆంక్షల మధ్య బ్రిట్నీ కోస్ట్ ప్రారంభమయ్యింది.

బాల్టిక్ దేశాలైన లిథ్వేనియా, లాట్వియా, ఈస్టోనియా దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేశారు. ఈ నిర్ణయం తీసుకున్న తొలి యూరోపియన్ దేశాలు ఇవే. అయితే ఆ సడలింపులు కేవలం ఆ మూడు దేశాల మధ్య ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తాయి.

ఐర్లాండ్‌లో ఐదు దశల్లో ఆంక్షల సడలింపు

యూరోప్‌లో లాక్ డౌన్‌ను అత్యంత కఠినంగా పాటించిన దేశాల్లో ఐర్లాండ్ కూడా ఒకటి. అయితే ఇక ఆంక్షల్ని సడలించాలని నిర్ణయించింది ఆ దేశం. అందులో భాగంగా ఐదు దశల్లో రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. మే 11 నుంచే కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రతి 3 వారాలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు.

* సెప్టెంబర్ వరకు పాఠశాలలు మూసే ఉంటాయి. మే 18 నుంచి భవన నిర్మాణ కార్మికులకు, తోట పని చేసే వారికి తిరిగి తమ విధులకు హాజరయ్యేందుకు అనుమతిస్తారు.

* తప్పనిసరి విధులకు హాజరయ్యే వారి పిల్లల కోసం శిశు సంరక్షణ కేంద్రాలు, నర్సరీలను జూన్ 29 నుంచి ప్రారంభిస్తారు. ఇతరుల విషయానికొస్తే జులై 20 నుంచి ప్రారంభమవుతాయి. మే 18 నుంచి తప్పనిసరి సేవలందించే వారి 5వేల మంది ఇళ్లకు శిశు సంరక్షణ సేవకుల్ని పంపుతారు.

* జూన్ 8 నుంచి ఇతరుల ఇళ్లకు వెళ్లవచ్చు. అలాగే జూన్ 29 నుంచి తాము నివసిస్తున్న ప్రాంతానికి 20 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించవచ్చు.

* జులై 20 నుంచి వివాహాలు, బాప్టిజమ్, ఇతర చిన్న చిన్న కార్యక్రమాలకు అనుమతిస్తారు. అయితే ఈ కార్యక్రమాల్లో కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉంటుంది.

* నిత్యవసరాలు కానీ వస్తువులను అమ్మే చిన్న దుకాణాలు జూన్ 8 నుంచి తిరిగి ప్రారంభించవచ్చు. పెద్ద పెద్ద దుకాణాలు జూన్ 29 నుంచి ప్రారంభించవచ్చు.

కరోనావైరస్:లాక్ డౌన్ కారణంగా బోసిపోయిన సముద్ర తీరం

ఫొటో సోర్స్, REUTERS

బెల్జియంలో నలుగురికి మించి కలుసుకోవడానికి లేదు

సంరక్షణ కేంద్రాల్లో అత్యధిక సంఖ్యలో మరణాలు నమోదైన బెల్జియంలో ఆంక్షల్ని ఇప్పుడిప్పుడే సడలిస్తున్నారు. క్రమంగా తిరిగి సాధారణ జీవితాలను ప్రారంభిస్తామని ప్రధాని సోఫి విల్మ్స్ తమ ఎగ్జిట్ రోడ్ మ్యాప్ గురించి చెప్పారు.

* మే 10 నుంచి ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్న నలుగురు సభ్యులు ఒకరినొకరు కలిసేందుకు అనుమతిచ్చారు. అయితే ఈ నలుగురు ఇంకెక్కడికీ వెళ్లకూడదు.

* వస్త్ర దుకాణాలు మే 4 నుంచి తిరిగి ప్రారంభయ్యాయి. 12 సంవత్సరాలు, ఆపై వయస్కులు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించే సమయంలో కచ్చితంగా మాస్కును ధరించాలి.

* భౌతిక దూరం నియమాలను కఠినంగా పాటిస్తూ దుకాణాలను తెరిచేందుకు మే 11 నుంచే అనుమతి ఇచ్చారు.

* మే 18 నుంచి పాఠశాలలు ప్రారంభించవచ్చు. తరగతి గదికి కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి.

* మే 18 నుంచి మార్కెట్లు, మ్యూజియంలు, జంతు ప్రదర్శన శాలలు తిరిగి తెరచుకుంటాయి. మార్కెట్లలో కేవలం 50 షాపులను మాత్రమే తెరచి ఉంచాలి. అలాగే మ్యూజియం, జూలలో టిక్కెట్లను ఆన్ లైన్‌లో మాత్రమే అమ్మాలి. టైం స్లాట్ల ప్రకారం ‘వన్ వే’లో మాత్రమే సందర్శించేందుకు అనుమతించాలి.

* మే 18 నుంచి హెయిర్ సెలూన్లు, బ్యూటీ సెలూన్లను తిరిగి ప్రారంభించవచ్చు. అయితే కచ్చితంగా ముందుగా అపాయింట్‌ తీసుకున్నవారికి మాత్రమే అనుమతించాలి.

* జూన్ 8 నుంచి కేఫేలు, రెస్టారెంట్లు తిరిగి ప్రాంభమవుతాయి.

నెదర్లాండ్స్‌లో ఐదు దశల్లో లాక్ డౌన్ సడలింపులు

నెదర్లాండ్స్‌లో ఐదు దశల్లో లాక్ డౌన్ సడలింపుల్ని అమలు చేయనున్నట్టు మే 11న ఆ దేశ ప్రధాని మార్క్ రుట్టీ ప్రకటించారు.

* మే 11 నుంచి లైబ్రరీలు, హెయిర్ సెలూన్లు, నెయిల్ బార్లు, బ్యూటీ పార్లర్లు, మసాజ్ థెరపీ సెంటర్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రాథమిక పాఠశాలలు పాక్షికంగా మొదలయ్యాయి.

* జూన్ 1 నుంచి సెకండరీ స్కూళ్లు కూడా ప్రారంభించవచ్చు.

* అలాగే జూన్ 1 నుంచి బార్లు రెస్టారెంట్లు కూడా తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించవచ్చు.

* ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించేవారు కచ్చితంగా మాస్కులు ధరించాలి.

* హాలిడే పార్క్‌లు, థియేటర్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లను జులై 1 నుంచి ప్రారంభించవచ్చు. కేవలం వంద మందికి మాత్రమే అనుమతిస్తారు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

* ఔట్ డోర్ టీం స్పోర్ట్స్‌కి అనుమతి. అయితే వారు కూడా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

కరోనావైరస్:చాలా యూరోపియన్ దేశాల్లో సెలూన్లు తెరిచేందుకు అనుమతి

ఫొటో సోర్స్, EPA

ఆస్ట్రియాలో పర్యటక కేంద్రాలు తిరిగి ప్రారంభం

యూరోప్‌లో మొట్ట మొదట లాక్ డౌన్ ఆంక్షల్ని సడలించిన దేశాల్లో ఆస్ట్రియా కూడా ఒకటి.

* పెద్ద పెద్ద దుకాణాలు, షాపింగ్ సెంటర్లు, హెయిర్ డ్రెసర్స్‌ సేవలను మే మొదటి వారంలోనే తిరిగి ప్రారంభించారు.

* ఏప్రిల్ 14 నుంచే పబ్లిక్ పార్కులు, చిన్న చిన్న దుకాణాలు తిరిగి మొదలయ్యాయి.

* పది మంది వరకు కలిసే అవకాశాన్ని మే 10 నుంచి ఇచ్చారు.

* మే నెల రెండో వారం తర్వాత నుంచి రెస్టారెంట్లు, కేఫేలను మధ్యాహ్నం వరకు తెరచి ఉంచవచ్చు. నెలాఖరు నుంచి హోటళ్లు, జూలు, స్విమ్మింగ్ పూల్స్, పర్యటక కేంద్రాలు కూడా తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చు.

* మే మొదటి వారం నుంచే చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.

డెన్మార్క్‌లోనూ ఏప్రిల్ రెండో వారం తర్వాత నుంచి లాక్ డౌన్ ఆంక్షల్ని సడలిస్తూ వచ్చారు. డే కేర్ సెంటర్లు, ప్రైమరీ స్కూళ్లను ఏప్రిల్ 14 నుంచి ప్రారంభించారు. అయితే వారు వచ్చి, వెళ్లే వేళల్ని మార్చారు. 12-16 ఏళ్ల మధ్య వయసు విద్యార్థులకు మే 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

సెలూన్లు, బ్యూటీ పార్లర్లు కూడా ఏప్రిల్ 20 నుంచే మొదలయ్యాయి. మే 11 నుంచే షాపింగ్ సెంటర్లకు అనుమతించారు. అయితే భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేశారు. కేఫేలు రెస్టారెంట్లు, జూలు, లైబ్రరీలను మే 18 నుంచి ప్రారంభిస్తారు. పది మందికి మించి ఒకే చోట కలవడానికి వీలు లేదు.

స్పెయిన్‌లో సెప్టెంబర్ వరకు పాఠశాలలు బంద్

స్పెయిన్‌లో మే 4 నుంచే లాక్ డౌన్ ఆంక్షల సడలింపులు మొదలయ్యాయి. 14 ఏళ్ల లోపు పిల్లల్ని ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆరు వారాల తర్వాత అనుమతించారు.

జూన్ పది లోగా రెండు విడతలుగా ఆంక్షల్ని సడలిస్తారు. అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. మాడ్రిడ్, బార్సిలోనా సహా మరి ఈశాన్య ప్రాంతంలోని కొన్ని చోట్ల మాత్రం ప్రస్తుతానికి లాక్ డౌన్ కఠినంగా కొనసాగుతుంది.

* మే 26 నుంచి పాఠశాలలు పాక్షికంగా ప్రారంభమవుతాయి. అవి కూడా రాబోయే పరీక్షల కోసం పాఠాలను మరోసారి రివిజన్ చెయ్యడానికి మాత్రమే. పూర్తి స్థాయిలో తరగతులు సెప్టెంబర్ వరకు ప్రారంభయ్యే సూచనలు లేవు.

* టెర్రస్ బార్లలో కస్టమర్లు బీర్లు ఆర్డరిచ్చే సదుపాయాన్ని మే 11 నుంచే ప్రారంభించారు. అయితే బార్లు, రెస్టారెంట్లు మాత్రం జూన్10 వరకు పూర్తి స్థాయిలో ప్రారంభం కావు. ఒక వేళ ప్రారంభమైనప్పటికీ వాటి సామర్థ్యంలో 50%కి మించి కస్టమర్లను అనుమతించరు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

* మే 26 నుంచి సినిమా హాళ్లు, ఎగ్జిబిషన్లను తిరిగి ప్రారంభించవచ్చు. అయితే అవి కూడా 30% సామర్థ్యంతోనే నడవాలి.

* మే 11 నుంచే చర్చిలకు, మసీదులకు అనుమతిచ్చారు. అయితే ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో జనాలను అనుమతిస్తున్నారు.

డెన్మార్క్

ఫొటో సోర్స్, Reuters

స్విట్జర్లాండ్‌లో మ్యూజియంలు, రెస్టారెంట్లకు అనుమతి

స్విట్జర్లాండ్‌లో 8 వారాల లాక్ డౌన్ ఆంక్షల్ని ఏప్రిల్ 27 నుంచే విడతల వారీగా తొలగిస్తూ వస్తున్నారు. గార్డెన్ సెంటర్లు, హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లకు ఆ రోజు నుంచే అనుమతిచ్చారు.

* మే 11 నుంచి పాఠశాలలు, గ్రంథాలయాలు, మ్యూజియంలు, కొన్ని రకాల దుకాణాలను భౌతిక దూరం పాటించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రారంభించారు.

* బార్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లకు నిబంధనల మేర అనుమతిచ్చారు. రైల్వే స్టేషన్లలో హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేశారు.

* ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించే వారు మాస్కులు ధరించడం తప్పని సరి చేశారు. వర్క్ ఎట్ హోంకి వీలైనంత వరకు ప్రాధాన్యమివ్వాలి.

* జూన్ 8 నుంచి జూలు, స్విమ్మింగ్ పూల్స్, మౌంటైన్ రేల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, థియేటర్లకు అనుమతిస్తున్నారు.

గ్రీస్‌లో మే 4 నుంచే సడలింపులు మొదలు

* మే 4 నుంచి చర్చిల్లో ఒక్కొక్కరూ వెళ్లి ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతించారు.

* మే 17 నుంచి మత పరమైన కార్యక్రమాలను తిరిగి ప్రారంభమయ్యాయి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మే 11 నుంచే కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య తరగతులు మొదలయ్యాయి.

* షాపులు మే 11 నుంచి ప్రారంభమయ్యాయి. ఇండోర్ షాపింగ్ సెంటర్లు జూన్ 1 నుంచి తిరిగి తెరచుకునే అవకాశం ఉంది.

* మే 18 నుంచి ప్రధాన నగరాల్లో రెస్టారెంట్లకు అనుమతిస్తారు. జూన్ 1 నుంచి మిగిలిన చోట్ల కూడా సామాజిక దూరం నియమాలకు లోబడి రెస్టారెంట్లు, కేఫ్‌లు ప్రారంభమవుతాయి.

మాస్కో

ఫొటో సోర్స్, Getty Images

రష్యాలో తిరిగి మొదలైన కార్యకలాపాలు

రష్యాలో మే 12 నుంచే లాక్ డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్నట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దేశంలో నిరుద్యోగం ఇంకా పెరిగి పోకుండా ఉండాలంటే అంతకు మించి మరో మార్గం లేదన్నారు. అయితే ఈ విషయంలో ప్రాంతాల వారీగా వారి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

* పుతిన్ చెప్పిన మాటల ప్రకారం నిర్మాణరంగం, పారిశ్రామిక రంగంలో పని చేసే వారు మొదట తమ కార్యకలాపాలను ప్రారంభించాలి.

* భారీ బహిరంగ సమావేశాలపై నిషేధం ఉంటుంది. అలాగే 65 ఏళ్ల పైబడి వృద్ధులు కచ్చితంగా ఇంటికే పరిమితం కావాలి.

* మాస్కోలో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో మే 31 వరకు అక్కడ కఠినమైన ఆంక్షలు అమల్లో ఉంటాయి.

* దుకాణాల్లో పని చేసేవారు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించేవారు కచ్చితంగా మాస్కులను, గ్లౌజులను ధరించాలి.

* కేవలం ఆహార వస్తువులను అమ్మే దుకాణాలు, ఫార్మసీలకు మాత్రమే అనుమతి. పాఠశాలలు మూసే ఉంటాయి. మెజార్టీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలి.

పార్కులు, అడవుల్ని ముందుగా తెరచిన పోలాండ్

యూరోపియన్ దేశాలన్నింటితో పోల్చితే తక్కువ కరోనావైరస్ కేసులు నమోదైన దేశాల్లో పొలాండ్ ఒకటి. అక్కడ ఏప్రిల్ 20 నుంచే పార్కులు, అడవుల మూసివేతపై ఉన్న ఆంక్షల్ని తొలగించారు.

హోటళ్లు, షాపులు, షాపింగ్ సెంటర్లను మే 4 నుంచి తెరిచారు. ప్రతి కస్టమర్‌కి కనీసం 15 చదరపు మీటర్ల స్థలం ఉండేలా ఆయా సంస్థలు చూసుకోవాలని స్పష్టం చేశారు.

మే 6 నుంచి నర్శరీలకు కూడా అనుమతిచ్చారు. మే 18 నుంచి రెస్టారెంట్లు,కెఫేలు, హెయిర్ సెలూన్లు, తిరిగి తమ సేవల్ని ప్రారంభించవచ్చు. టీకా వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి.

స్వీడన్‌లో కఠిన నిబంధనలు ఎప్పటికీ కొనసాగుతాయి

నిజానికి స్వీడన్‌లో లాక్ డౌన్ లేదు. కనుక అక్కడ ఆంక్షల సడలింపుల గురించి చెప్పుకునేందుకు కూడా పెద్దగా ఏం లేదు. యూరోప్‌లోని మిగిలిన దేశాల్లో తీసుకున్నట్టు ఎలాంటి కఠినమైన చర్యల్ని ఇక్కడ తీసుకోలేదు.

రెస్టారెంట్లు, బార్లు, పాఠశాలలు, ఇతర వ్యాపారాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే వచ్చాయి. అయితే 50 మందికి మించి ఒకే చోట కలవడాన్ని, అలాగే వృద్ధాశ్రమాలను సందర్శించడాన్ని నిషేధించారు.

స్వీడన్‌లో సుమారు 3వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇక్కడ మెజార్టీ ప్రజలు తమంతట తాముగానే భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు.

చాలా మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇతరుల నుంచి కనీసం మీటరు దూరంలో ఉంటున్నారు. కొంత కాలం పాటు ప్రయాణాలకు స్వస్తి పలికారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)