విశాఖ గ్యాస్ లీక్: తుప్పు పట్టిన పైపులు, అనుమతులు లేని కార్యకలాపాలు... ప్రమాద కారణాలపై బీబీసీ పరిశోధన

విశాఖ గ్యాస్ లీక్
    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విశాఖపట్నంలో మే 7 తెల్లవారుజామున జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించి బాధితులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడంతో పాటు ఆ సంస్థపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది. కానీ, చాలామంది గ్రామస్థులు మాత్రం.. నష్ట పరిహారంతో సరిపెడితే కుదరదని, ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి బీబీసీ తెలుగు ప్రయత్నించింది. ఈ పరిశీలనలో లభించిన పత్రాల ఆధారంగా చూస్తే పర్యావరణ క్లియరెన్స్ లేకుండానే ఎల్జీ పాలిమర్స్ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు ఇతర భద్రతా నిబంధనలను కూడా ఆ కంపెనీ ఉల్లంఘించినట్లు కనిపిస్తోంది.

గతంలో కూడా సంస్థ నుంచి వెలువడుతున్న గ్యాస్ గురించి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశామని, కానీ, వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఒక గ్రామస్థుడు తెలిపారు.

ఈ గ్యాస్ లీకేజీ ప్రభావంతో చెట్లు రంగులు మారిపోయాయి. పండ్లు రాళ్లలా గట్టిగా తయారయ్యాయి. ఇళ్లలో ఉన్న ఉప్పూ పప్పూ తినడానికి పనికిరాని విధంగా తయారైంది. ఈ ప్రమాదానికి పశువులు, పక్షులు కూడా బలయ్యాయి.

ఎల్జీ పాలిమర్స్, విశాఖపట్టణం

ఇళ్ల మధ్యలో అలాంటి పరిశ్రమ ఉండొచ్చా?

ప్రస్తుతం ఉన్నపరిశ్రమ ప్రాంగణాన్ని 1965లో హిందుస్తాన్ పాలిమర్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. ఆ తరువాత 1982లో అది మెక్ డొవెల్ అండ్ కంపెనీతో కలిసిపోయింది.

కానీ, జనావాసాల మధ్య కాలుష్యాన్ని కలిగించే ప్లాంట్‌లు ఉండకూడదనే ఉద్దేశంతో మెక్‌డొవెల్ సంస్థ ఆ ప్లాంట్‌లో కార్యకలాపాలు నిలిపివేసింది. అలా 1997లో ఎల్జీ పాలిమర్స్ సంస్థ మెక్.డొవెల్‌ నుంచి ప్లాంట్‌ను కొనుగోలు చేసి ఉత్పత్తి ప్రారంభించింది.

ప్రస్తుతం ఆ పరిశ్రమలో దిగుమతి చేసుకున్న స్టైరీన్ నుంచి పాలీస్టైరీన్‌, ఎక్స్‌పాండబుల్ పాలీస్టైరీన్‌ను తయారు చేయడంతో పాటు ప్రైమరీ ప్లాస్టిక్స్‌ను ఇంజినీరింగ్ ప్లాస్టిక్స్‌గా మారుస్తారు. ఈ కంపెనీ ప్రధాన ఉత్పత్తులైన పాలీస్టైరీన్, ఎక్స్‌పాండబుల్ పాలీస్టైరీన్‌ను ఫ్రిజ్‌లు, వాటర్ ప్యూరిఫయర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ ప్యానెల్స్, కూలర్ల లాంటి అనేక వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.

లాక్‌డౌన్‌కు ముందు వరకు ఆ ప్లాంట్ రోజుకు 313 టన్నుల పాలీస్టైరీన్‌, 102 టన్నుల ఎక్స్‌పాండబుల్ పాలీస్టైరీన్‌ను ఉత్పత్తి చేసేది. 168 కోట్ల రూపాయల పెట్టుబడితో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి 300 కొత్త ఉద్యోగాలు కూడా కల్పించాలని ఆ సంస్థ ప్రణాళిక వేసింది.

ప్రమాదం అనంతరం అధికారులు పరీక్షల కోసం అక్కడి నీరు, మట్టి, కూరగాయల నమూనాలను సేకరించారు. "ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇళ్లలో నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలను ఉపయోగించవద్దని స్థానికులకు సూచించాము. నివేదికలు వచ్చే వరకు చేతి పంపులు, బోరుబావుల్లో నీళ్లు కూడా వాడొద్దని గ్రామస్థులను కోరాము. వారి అవసరాల కోసం వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేశాం’’అని జీవీఎంసీ కమిషనర్ జి.సృజన తెలిపారు.

గ్యాస్‌ లీకేజీ అనంతర పరిణామాలు ఇలా ఉంటే, అసలు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనే ప్రశ్న గ్రామస్థులను కలవరపెడుతోంది. ఈ ఘటనకు కారణాలపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల హై పవర్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

దీనిపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి ఎం.గౌతం రెడ్డి "గ్యాస్ లీక్ వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు దీర్ఘకాలికంగా ఉండవచ్చు. అందుకే క్రమం తప్పకుండా స్థానికులకు ఆరోగ్య పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేశాం. సంస్థ లోపల నిల్వ చేసిన 13,000 టన్నుల స్టైరీన్‌ని కూడా దక్షిణ కొరియాకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం” అన్నారు.

విశాఖ గ్యాస్ లీక్

‘‘కంపెనీ నిర్లక్ష్యం కనిపిస్తోంది’’

ఎల్జీ పాలిమర్స్ లాంటి సంస్థకు క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ అవసరం. కానీ, లాక్‌డౌన్ సమయంలో సంస్థలో రసాయనాలు, పరికరాల నిర్వహణ బాధ్యతను చూసేందుకు సరిపడా సిబ్బందిని నియమించలేదని తెలుస్తోంది.

ముఖ్యంగా స్టైరీన్‌ రసాయన మోనోమర్‌ను క్రమం తప్పకుండా పరీక్షిస్తూ అందులోని పాలిమర్ స్థాయిని ప్రతి షిఫ్టులోనూ రికార్డు చేయాలి. దీనికోసం సంస్థలో మూడు షిఫ్టులను కేటాయించారు. కానీ, లాక్‌డౌన్ సమయంలో ఒక్క షిఫ్టులో మాత్రమే సిబ్బంది పనిచేసినట్లు పేరు గోప్యంగా ఉంచాలని కోరిన ఒక ఉద్యోగి చెప్పారు.

‘‘లాక్‌డౌన్ సమయంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఒక్క షిఫ్టులో మాత్రమే సిబ్బంది పనిచేశారు. దాంతో అన్ని వేళలా స్టైరీన్‌లో పాలిమర్ స్థాయిల్ని నోట్ చేయడానికి ఎవరూ లేరు. దానివల్ల స్టైరీన్‌ను భద్రపరిచిన ట్యాంకులో పాలిమరైజేషన్ జరిగింది. ఫలితంగా ట్యాంకులో ఉష్ణోగ్రతలు పెరిగి ఆవిరి(వేపర్) భారీగా గాల్లోకి విడుదలైంది’’ అని ఆయన తెలిపారు.

ఈ విషయంపై పరిశ్రమల శాఖ కమిషనర్‌ జేవీఎన్ సుబ్రహ్మణ్యం బీబీసీతో ‘‘కంపెనీవారు షట్‌డౌన్ సమయంలో నిర్వహణ పనులు చూసుండాలి. లాక్‌డౌన్ ప్రకటించాక భద్రత, అత్యవసర పనుల నిర్వహణ కోసం ఎల్జీ పాలిమర్స్‌లో 15 మంది ఉద్యోగులు పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ, ఆ నిర్వహణలో కంపెనీ నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఎమర్జెన్సీ సైరన్ సరిగా పనిచేసినా బావుండేది’’ అన్నారు.

విశాఖ గ్యాస్ లీక్

ఎమర్జెన్సీ సైరన్ ఎందుకు మోగలేదు?

ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీకవుతున్నప్పుడు అప్రమత్తం చేసే అత్యవసర సైరన్ మోగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దీనిపై బీబీసీ తెలుగుతో మాట్లాడిన ప్లాంట్ మాజీ కార్మికులు కొందరు... గతంలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి సైరన్ మోగించవద్దని ఆదేశించారని తెలిపారు.

“సాధారణంగా షిఫ్ట్‌లు మారినప్పుడు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 12 గంటలకు సైరన్ మోగుతుంది. అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సైరన్ మోగుతుంది.కానీ మాజీ ఎండీ నిర్ణీత సమయాల్లో సైరన్ మోగించవద్దని ఆదేశించారు. ప్రతి రెండో శనివారం మాత్రమే సైరన్ వాడాలని ఆయన చెప్పారు. సైరన్ ఎక్కువ కాలం వాడుకలో లేనందున, అది ఆ రోజు పని చేసుండకపోవచ్చు. ఫ్యాక్టరీస్ విభాగానికి చెందిన ఒక అధికారి సందర్శించినప్పుడు మేము ఈ విషయంపై ఫిర్యాదు చేశాము, కాని ఆయన పట్టించుకోలేదు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన మాక్ డ్రిల్ నిర్వహణ కూడా మానేసింది,”అని ఒక మాజీ ఉద్యోగి చెప్పారు.

2017 తరువాత ప్లాంట్ నుంచి సైరన్ వినిపించలేదని స్థానికులు కూడా తెలిపారు. దీనిపై విచారణ కోసం ప్లాంట్‌ను సందర్శించిన ఎన్‌జీటీ కమిటీ సభ్యుడు ఒకరు సైరన్ విషయంలో మరింత పరిశోధన అవసరం అన్నారు.

"సైరన్ ఇచ్చామని, ప్రజలకు భయాందోళనల్లో వినిపించకపోయి ఉండవచ్చు అని కంపెనీ వారు చెబుతున్నారు. సైరన్ కూడా స్టోరేజ్ వ్యవస్థలో భాగమే. కానీ, అది పని చేస్తుందా, లేదా మేము దర్యాప్తు చేయాలి. దీనిపై ఒక అంచనాకు రావడానికి సమయం పడుతుంది’’అని ఎన్‌జీటీ కమిటీ సభ్యుడు పి. జగన్నాథ రావు తెలిపారు.

విశాఖ గ్యాస్ లీక్

పర్యావరణ అనుమతి లేకుండా నడిపిస్తున్నారా?

సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పర్యావరణ శాఖ అనుమతి కోసం 2017లో ఎల్జీ పాలిమర్స్ దరఖాస్తు చేసింది. అయితే దీనికోసం ఆ సంస్థ రెండు దరఖాస్తులు చేయడం, అందులో ఒక దాన్ని ఒక కేటగిరీ నుంచి ఉపసహరించి. అదే రోజున మరో కేటగిరీలో దరఖాస్తు చేసుకోవడం గమనించాల్సిన విషయం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండానే ఉత్పత్తి కూడా ప్రారంభించినట్లుఈ దరఖాస్తులో సంస్థ పేర్కొంది.

అయితే, ఇక్కడ కేటగిరీ A, కేటగిరీ B మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

2015లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఒక నోటిఫికేషన్ ప్రకారం కేటగిరీ Aలో ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ శాఖ క్లియరెన్స్ కావాలి. అదే కేటగిరీ Bలోని సంస్థలైతే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థ (State Environment Impact Assessment Authority (SEIAA) అనుమతి పొందితే సరిపోతుంది.

అయితే, ఎల్జీ పాలిమర్స్ సంస్థలో ఉత్పత్తి కోసం అనువైన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఉత్పత్తిని ప్రారంభించినట్లు గుర్తించి 2018 సెప్టెంబరులో రాష్ట్ర అధికారులు, ఆ కంపెనీకి ఒక లేఖను పంపారు. అందులో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని పేర్కొన్నారు.

దీనిపై స్పందించేందుకు కంపెనీకి తొమ్మిది నెలలు పట్టింది.2019 మేలో ఆ లేఖకు జవాబుగా ఒక అఫిడవిట్ దాఖలు చేసింది.

ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్, 2006లోని నిబంధనలను పేర్కొంటూ, అందులోని వెసులుబాటును ఉపయోగించుకొని కంపెనీ ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్(ఈసీ) తీసుకోలేదని అంగీకరించింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

అప్పటిదాకా ఈసీ లేకుండానే కార్యకలాపాలు సాగించిన సంస్థ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి పొందాకే ఉత్పత్తులు మొదలుపెట్టినట్లు ఆ అఫిడవిట్‌లో తెలిపింది.

వీటిని బట్టి చూస్తే ఇంకా ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించిన ఈసీ దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దగ్గర పెండింగ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివిరాలను అధికారుల ద్వారా తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

కానీ, ‘‘కేసు విచారణ కోసం నియమించిన హైపవర్ కమిటీ అన్ని విషయాలనూ చూసుకుంటుంది’’ అని అధికారులు పేర్కొన్నారు.

అయితే ఇలాంటి పరిశ్రమల విషయంలో కేంద్ర పర్యావరణ శాఖ చర్యలను ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వ మాజీ సెక్రెటరీ ఈఏఎస్ శర్మ ఓ లేఖ రాశారు.

"ఎల్జీ పాలిమర్స్ తరహాలో కొన్ని వేల పరిశ్రమలు హానికారక రసాయనాలను నిర్వహిస్తున్నాయని, వాటిపైన తగిన నియంత్రణ కొరవడిందని, సరైన పర్యవేక్షణ లేకుండానే ఆ సంస్థలు పనిచేస్తున్నాయని, ఇప్పుడు జరిగిన ప్రమాదం ఆ పరిస్థితులకు ఒక చిన్న సాక్ష్యమని" ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

విశాఖ గ్యాస్ లీక్

కంపెనీలో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవా?

2016 ఆగస్టులో, 2019 డిసెంబరులో ఫ్యాక్టరీల శాఖ ఎల్జీ పాలిమర్స్‌లో తనిఖీలు నిర్వహించింది. ఆ తనిఖీల నివేదికల కాపీలు బీబీసీ తెలుగు సంపాదించింది.

‘‘హై ఇంపాక్ట్ పాలీస్టైరీన్ ప్లాంట్‌లోని భారీ వెజెల్స్‌కు వేసిన సిమెంట్ పూత బాగా దెబ్బతింది. దాన్ని వెంటనే రిప్లేస్ చేయాలి’’ అని 2016 నాటి నివేదికలో పేర్కొన్నారు. ఫ్యాక్టరీ చట్టాల్లోని కొన్ని నియమ నిబంధనలను కూడా ఎల్జీ పాలిమర్స్ అనుసరించట్లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు.

2019 డిసెంబర్ నాటి నివేదికలో కూడా కొన్ని కొత్త ఉల్లంఘనలను తనిఖీ అధికారులు గుర్తించారు.

అగ్నిప్రమాదం జరిగినపుడు నీళ్లు చిమ్మే పైపులు, స్టైరీన్ మోనోమర్ ట్యాంక్ 6కు సంబంధించిన పైప్‌లైన్లు కొన్ని తుప్పు పట్టాయని, పెంటేన్ ట్యాంకుకు సంబంధించిన వాల్వ్ లైన్ల పెయింట్ పెచ్చులు ఊడాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. స్టైరీన్ ట్యాంకులకు చూట్టూ రక్షణగా ఒక కంటెయిన్మెంట్ గోడను కూడా నిర్మించాలని నివేదిక సూచించింది. 2019లో సేఫ్టీ ఆడిట్ ఎందుకు నిర్వహించలేదని కూడా ప్రశ్నించింది.

విశాఖ గ్యాస్ లీక్

ప్రమాదం జరిగిన తర్వాత ఆ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీలో ఎన్జీటీ సభ్యుడైన పి.జగన్నాథరావు కూడా ఉన్నారు. ప్లాంట్‌‌లో ప్రాథమిక పరిశీలన తర్వాత ఆయన బీబీసీతో మాట్లాడారు.

‘‘ప్రమాదానికి కారణమైన ట్యాంకు చాలా పాతది. కొత్త ట్యాంకులకు ఆధునిక సెన్సార్లు, మానిటరింగ్ పరికరాలు అమర్చి ఉన్నాయి. ఈ సదుపాయాలు పాత ట్యాంకులకు లేవు. అయినా ఈ సంస్థకు ఆ రంగంలో చాలా అనుభవం ఉంది. అదృష్టవశాత్తూ, ట్యాంకు పాతదైనప్పటికీ దాని సేఫ్టీ వాల్వ్ పనిచేస్తోంది. సమయానికి ఆ వాల్వ్ తెరుచుకోవడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. లేకపోతే పరిస్థితి భయానకంగా ఉండేది’’ అన్నారు.

కానీ, దీనిక వెనుక పూర్తి వివరాలు సేకరించేందుకు లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నమోదైన రికార్డులను పరిశీలించాలని జగన్నాథరావు చెప్పారు.

ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని సంప్రదించిన బీబీసీ తెలుగు ఈ పరిణామాల గురించి వారిని ప్రశ్నించింది. కానీ, ఈ కథనం రాసే సమయానికి వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

మరోవైపు ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఎల్జీ పాలిమర్స్ ప్రెసిడెంట్ నేతృత్వంలో ఒక అత్యున్నత నిపుణుల బృందం భారత్‌కు వచ్చింది. బాధితులతో పాటు ప్రభుత్వ అధికారులతో కూడా ఆ బృందం చర్చిస్తుంది’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అటు, సంస్థపైన పోరాడేందుకు న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

‘‘భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుంచి మనం చాలా తక్కువ పాఠాలు నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విశాఖపట్నం ఘటన నుంచైనా ఏమైనా నేర్చుకుంటామో లేదోనని సందేహంగా ఉంది. అంతిమంగా చూస్తే.. భారీ వ్యాపారాలకు అనుకూలంగా ఉన్న నియమ నిబంధనల వల్ల మూల్యం చెల్లిస్తోంది మాత్రం సామాన్య ప్రజలే’’ అని ఈఏఎస్ శర్మ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

మరోవైపు పారిశ్రామిక పాలసీలను పునఃసమీక్షించాలని, హానికారక పరిశ్రమల చుట్టూ నివాసాలు పెరగకుండా టౌన్ ప్లానింగ్ లాంటి శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని కొందరు అధికారులు చెబుతున్నారు.

ఏదేమైనా పర్యావరణ అనుమతులు లేకుండానే పరిశ్రమను నిర్వహించడం, అధికారుల సూచనలు నిర్లక్ష్యం చేయడం, ఫ్యాక్టరీలోని పరికరాల నిర్వహణా లోపం లాంటి అనేక కారణాలు ప్రమాదానికి కారణమైనట్లు వివిధ దరఖాస్తులు, నివేదికలు, నిపుణుల అభిప్రాయాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)