క‌రోనావైర‌స్: లాక్‌డౌన్‌తో ఖాళీ అయిన మహా నగరాల రోడ్లు మళ్లీ కిక్కిరిసిపోతున్నాయ్‌

కరాచీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాక్‌డౌన్ మినహాయింపులతో రద్దీగా మారిన కరాచీ రోడ్లు

క‌రోనావైర‌స్ విజృంభించ‌డంతో ఆసియాలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్‌లు విధించారు. ముఖ్యంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి ప‌క్కాగా వీటిని అమ‌లుచేశారు.

చైనాలోని బీజింగ్‌తో మొద‌లుపెట్టి.. వియ‌త్నాంలోని హ‌నోయ్ వ‌ర‌కు.. ప్ర‌జా ర‌వాణా స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వాలు తాత్కాలికంగా ర‌ద్దుచేశాయి. ల‌క్ష‌ల మంది ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీచేశాయి. దీంతో రోడ్లు ఖాళీ అయిపోయాయి.

రోడ్ల‌పై ట్రాఫిక్ త‌గ్గిపోవ‌డంతో ఊహించ‌ని సానుకూల ప‌రిణామాలు క‌నిపించాయి. ఆసియాలోని ప్ర‌ధాన న‌గ‌రాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో 2020 ప్రారంభంలో వాయు కాలుష్యం గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.

అయితే, ఇప్పుడు ఆసియాలోని చాలా దేశాలు నిబంధ‌న‌ల‌ను క్ర‌మంగా స‌డ‌లిస్తున్నాయి. దీంతో రోడ్ల‌పై ట్రాఫిక్‌తోపాటు కాలుష్యం కూడా పెరుగుతోంది.

వియత్నాం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వియత్నాం హనోయి వీధుల్లోకి మళ్లీ వచ్చిన మోపెడ్ల

"ఆసియా వ్యాప్తంగా వాయు కాలుష్యం గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తోంది"అని లీసెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో వాయు కాలుష్యంపై అధ్య‌య‌నం చేస్తున్న ప్రొఫెస‌ర్ పాల్ మాంక్స్.. బీబీసీకి వివ‌రించారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ మ‌నం క్ర‌మంగా కోవిడ్‌-19 మునుప‌టి స్థాయికి వెళ్లిపోతున్నామ‌ని అన్నారు.

2019తో పోలిస్తే.. 2020లో మొద‌టి మూడు నెల‌లూ గాలిలోని నైట్రోజ‌న్ డైఆక్సైడ్ స్థాయిలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని నాసా, ఐరోపా అంత‌రిక్ష సంస్థ‌ల‌కు చెందిన ఉప‌గ్ర‌హ స‌మాచారం చెబుతోంది.

మయన్మార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మయన్మార్‌లోని యాంగాన్ నగర వీధుల్లో మొదలైన ట్రాఫిక్

వాహ‌నాలు, ప‌రిశ్ర‌మ‌లు విడుద‌ల‌చేసే నైట్రోజ‌న్ డైఆక్సైడ్ చాలా హానిక‌ర గ్యాస్‌. దీంతో ఆస్థ‌మా లాంటి శ్వాస కోశ వ్యాధులు చుట్టుముట్టే ముప్పుంది.అత్యంత ప్ర‌మాద‌క‌ర గాలి క‌లుషితాల్లో ఒక‌టైన నైట్రోజ‌న్ డైఆక్సైడ్‌తో ఏటా 30 లక్ష‌ల మంది మ‌ర‌ణిస్తున్న‌ట్లు అంచ‌నా.

ఇది గ్రీన్‌హౌస్ గ్యాస్ కాదు. అయితే భూతాపానికి కార‌ణ‌మ‌య్యే కార్బ‌న్ డైఆక్సైడ్‌ విడుద‌లకు కార‌ణ‌మ‌య్యే చ‌ర్య‌ల వ‌ల్లే ఇది కూడా ఉత్ప‌త్తి అవుతోంది.

క‌రోనావైర‌స్ మొద‌ట చెల‌రేగిన చైనాలో ఈ ఏడాది జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో నైట్రోజ‌న్ డైఆక్సైడ్ స్థాయిలు సాధార‌ణం కంటే 10 నుంచి 30 శాతం వ‌ర‌కు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు నాసా వెల్ల‌డించింది.

ఎప్పుడూ ద‌ట్ట‌మైన పొగ మేఘాల‌తో క‌మ్ముకుని ఉండే భార‌త్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌పైనా తాజా ప్ర‌భావం క‌నిపించింద‌ని వివ‌రించింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 మ‌ధ్య దిల్లీలో నైట్రోజ‌న్ డైఆక్సైడ్ స్థాయిలు 55 శాతం వ‌ర‌కూ త‌గ్గినట్లు తెలిపింది.

మ‌రోవైపు అమెరికా, ప‌శ్చిమ యూర‌ప్‌, ఉత్త‌ర చైనాలో ఈ ఏడాది మొద‌ట్లో నైట్రోజ‌న్ డైఆక్సైడ్ స్థాయిలు 60 శాతం వ‌ర‌కూ త‌గ్గిన‌ట్లు కనిపించాయ‌ని జియోఫిజిక‌ల్ రీసెర్చ్ లెట‌ర్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన మ‌రో రెండు అధ్య‌య‌నాలు పేర్కొన్నాయి.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీజింగ్ తదితర చైనా నగరాల్లో కఠినమైన లాక్‌డౌన్ అమల్లో ఉండేది

"కాలుష్య ర‌హిత ఆర్థిక వ్య‌వస్థ‌లతో ప్ర‌పంచం ఎలా ఉంటుందో ఈ మ‌హ‌మ్మారి మ‌న‌కు చూపిస్తోంది"అని ప్రొఫెస‌ర్ మాంక్స్ వివ‌రించారు.

"ఏం సాధించామ‌న్న‌దే ఇక్క‌డ ముఖ్యం. ర‌వాణాను క‌ర్బ‌న ర‌హితంగా మార్చితే.. మంచి ఫ‌లితాలు ఉంటాయి"అని గాలి నాణ్య‌త‌పై బ్రిట‌న్ ప్ర‌భుత్వ సైన్స్ అడ్వైజ‌రీ క‌మిటీకి ఛైర్మ‌న్‌గానూ కొన‌సాగిన‌ ప్రొఫెస‌ర్ మాంక్స్ చెప్పారు.

జకార్తా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండొనేసియా రాజధాని జకార్తా రోడ్ల మీద మొదలైన వాహనాల హడావిడి

ప్ర‌స్తుతం ఆసియా దేశాలు త‌మ ఆర్థిక వ్య‌వస్థ‌ల‌ను గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ర‌వాణా స‌దుపాయాల‌ను ప్రారంభిస్తున్నాయి. దీంతో కాలుష్య స్థాయిలూ పెరుగుతున్నాయి.

గ‌తేడాది ఏప్రిల్‌తో పోల్చిన‌ప్పుడు ప్ర‌స్తుత ఏప్రిల్‌లో చైనాలో నైట్రోజ‌న్ డైఆక్సైడ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గ్రీన్‌పీస్ చైనా విడుద‌ల చేసిన స‌మాచారం చెబుతోంది.

"గాలి కాలుష్యం, వాతావ‌ర‌ణ మార్పుల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వాలు చిత్త‌శుద్ధితో ఉంటే.. తాజా మ‌హ‌మ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవాలి"అని ప్రొఫెస‌ర్ మాంక్స్ అన్నారు.

మిలాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిలాన్ రోడ్ల మీద సైకిళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

యూర‌ప్‌లోని కొన్ని దేశాలు కార్ల వినియోగంపై ఆంక్ష‌లు విధించి రోడ్ల‌పై ట్రాఫిక్‌ను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు.. వేస‌విలో సైక్లింగ్‌ను ప్రోత్స‌హించేలా 35 కి.మీ. మేర‌ వీధుల‌కు మెరుగులు దిద్దుతామ‌ని ఇట‌లీ న‌గ‌రం మిలాన్ ప్ర‌క‌టించింది.

లాక్‌డౌన్ స‌మ‌యంలో కొన్ని దేశాలు ఇలాంటి చ‌ర్య‌లు తీసుకున్నాయి. ప్ర‌త్యేక సైక్లింగ్ మార్గాల ఏర్పాటు, రోడ్ల‌పైకి కార్లు రాకుండా చూడ‌టం లాంటి చ‌ర్య‌ల‌ను మొద‌లుపెట్టాయి.

"వాతావ‌ర‌ణ అత్య‌యిక స్థితి ఎక్క‌డికీ పోలేదు. దాని స్థానాన్ని కోవిడ్‌-19 అత్య‌యిక స్థితి భ‌ర్తీ చేయ‌లేదు"అని ప్రొఫెస‌ర్ మాంక్స్ అన్నారు.

(అన్ని ఫోటోలకు కాపీరైట్స్ ఉన్నాయి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)