వలస కూలీలకు ప్రస్తుతం అందిస్తున్న సహాయం సరిపోదు.. రాష్ట్రం మరిన్ని చర్యలు చేపట్టాలి - ఏపీ హైకోర్టు ఆదేశాలు

వలస కార్మికులు

ఫొటో సోర్స్, JEWEL SAMAD/Getty Image

వలస కార్మికుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లను, గ్రామాలను విడిచిపెట్టి జీవనోపాధి కోసం నగరాలకు వెళ్లిన శ్రామికులు రోడ్డున ఉన్న విషయం తాము గుర్తించినట్టు హైకోర్టు పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వలస కార్మికులకు కొంత మేరకు సహాయం అందిస్తున్నప్పటికీ మరింత చేయాల్సిన అవసరం ఉందని అబిప్రాయపడింది. కాలినడకన వెళుతూ మార్గం మధ్యలో రోడ్డుపైనే పురుడు పోసుకున్న మహిళ గురించి పత్రికల్లో తెలుసుకున్నామని తెలిపింది. డెలివరీ అయిన రెండు గంటలకే మళ్లీ నడక ప్రారంభించిన ఆ మహిళ 150 కిలోమీటర్ల దూరం నడిచిన వెళ్ళిన విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా గమనించినట్టు పేర్కొంది.

ఈ మేరకు ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రాష్ట్ర, రాష్ట్రేతర కార్మికులకు రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రైళ్ళు, బస్సుల ద్వారా వారిని స్వస్థలానికి తిరిగి చేర్చడానికి ఏర్పాట్లు చేసినట్టు పేర్కొంది. వలసలు ఆగిపోయే వరకూ ఈ చర్యలన్నీ కొనసాగుతాయని వివరించింది.

అయితే ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న సహాయక చర్యలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది. అంతేగాకుండా దిగువన పేర్కొన్న రీతిలో తక్షణం చర్యలు చేపట్టాలని సూచించింది.

1) ఆరోగ్య పరంగా..

మంచి తాగునీరు, గ్లూకోజ్ ప్యాకెట్లను అన్ని చోట్లా అందుబాటులో ఉంచాలి. వీటిని వలస కార్మికులకు అందించాలి. పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి, అవసరం అయిన వెంటనే వారికి చికిత్స అందించేలా చర్యలుండాలి. తక్షణ వైద్య సహాయం అవసరం అయితే తరలించేందుకు ఆంబులెన్స్ లు అందుబాటులో ఉండాలి.

2) మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి

అధిక సంఖ్యలో మహిళలు ఎండలో నడుస్తున్నందున, పరిశుభ్రమైన స్థితిలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాంతాల్లో శానిటరీ ప్యాడ్ పంపిణీ యంత్రాలను అందుబాటులో ఉంచాలి.

3) ఆహారం

జాతీయ రహదారులపై నడిచి వెళుతున్న వారికి అందించేందుకు తగ్గట్టుగా ఆహారం కోసం తగిన ఏర్పాట్లు చేయాలి. వలస కార్మికులకు చాలా పెద్ద సంఖ్యలో వలంటీర్లు ఆహారాన్ని అందిస్తున్నారని కోర్టు తెలిపింది. వలస కూలీలకు ఆహారాన్ని ఉచితంగా అందించడానికి సిఎస్ఆర్ కార్యకలాపాల్లో పారిశ్రామికవేత్తల సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలి.

4) రవాణా

ఏపీ ప్రభుత్వం బస్సులను వినియోగిస్తోంది. దానికి అదనంగా ఎన్‌హెచ్ఏఐ, పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను కూడా వాడాలి. నడుస్తున్న వాళ్లలో ఇబ్బంది పడుతున్న వారిని తరలించేందుకు వాటిని ఉపయోగించాలి.

5) కరపత్రాలు

వసతి కేంద్రాలు, ఇతర సహాయం అందిస్తున్న వారి ఫోన్ నంబర్ల జాబితాను వలస కార్మికులను తెలియజేస్తూ కరపత్రాలను హిందీ మరియు తెలుగు భాషల్లో ముద్రించాలి, అత్యవసర పరిస్థితుల్లో వారు సంప్రదించడానికి అవకాశం ఉంటుంది.

6) భౌతిక దూరం పాటించేలా..

భౌతిక దూరం పాటించేలా చూడాలి. దానికి తగ్గట్టుగా పోలీసు సిబ్బందిని కూడా ఈ వసతి కేంద్రాల వద్ద ఉంచాలి. వలస కార్మికులకు వారు మార్గనిర్దేశం చేయాలి.

7) సేవలు

సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ ప్రయత్నాలను సమన్వయం చేస్తున్నారని రాష్ట్రం పేర్కొంది. కానీ మరింత సమిష్టి కృషి అవసరమని కోర్టు భావిస్తోంది. వాటి పర్యవేక్షణకు జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగంలో ఉన్నత అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించాలి.

వలస కూలీలకు ఉపశమనం కల్పించేలా ఈ చర్యలు ఉండాలని పేర్కొంటూ, అందరికీ సహాయం అందాలని కోర్టు ఆదేశించింది.

ఈనెల 22వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి సదుపాయాలు, ఇతర సహాయాక చర్యలకు సంబంధించిన స్పష్టమైన వివరాలను నివేదించాలని ఆదేశించింది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, PIB

నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్: ఏపీలో మిర్చి, తెలంగాణలో పసుపు క్లస్టర్లు.. రూ. 4 వేల కోట్లతో మూలికల సాగు

దేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు రూ. లక్ష కోట్లు కేటాయిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

దేశంలో ఆయా ప్రాంతాల్లో లభించే స్థానిక, ఆర్గానిక్ పదార్థాలను ప్రోత్సహించేందుకు, వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు రూ.10 వేల కోట్లను కేటాయిస్తున్నామని, వీటి ద్వారా మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్ ఫార్మలైజేషన్ (ఎంఎఫ్ఈ) స్కీమ్ అమలు చేస్తామన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగా ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదంతో ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

కర్ణాటకలో రాగి, కశ్మీరులో కుంకుమపువ్వు, తెలంగాణలో పసుపు, ఆంధ్రాలో మిర్చి క్లస్టర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు.

ఇలా ప్రతి రాష్ట్రంలోనూ ఆయా ప్రాంతాల్లో లభించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రాసెస్ చేసి, మార్కెట్ చేసేలా అత్యుత్తమ ప్రమాణాలతో సాంకేతిక సహాయాన్ని అందిస్తామన్నారు.

దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎంఎఫ్ఈలకు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

దేశంలోని మత్స్యకారులకు మరింత ఆదాయం పెరిగేలా, ఆ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.20 వేల కోట్లు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) ద్వారా ఖర్చు చేస్తామని వెల్లడించారు.

జాతీయ జంతు రోగ నివారణ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 53 కోట్ల జంతువులకు రూ. 13,343 కోట్ల వ్యయంతో టీకాలు వేస్తామని చెప్పారు.

అలాగే, దేశంలో యానిమల్ హజ్బెండరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని, దేశీయ డెయిరీ ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేసేలా ఈ రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు.

దేశంలో మూలికల సాగును ప్రోత్సహిస్తామని, దీనికోసం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.

నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు (ఎన్ఎంపీబీ) 2.25 లక్షల హెక్టార్లలో ఇప్పటికే వైద్యపరంగా ఉపయోగించుకోదగిన మొక్కలను సాగు చేస్తోందని వెల్లడించారు.

రాబోయే రెండేళ్లలో 10 లక్షల హెక్టార్లలో మూలికల సాగును కూడా ప్రోత్సహిస్తామన్నారు.

రూ.500 కోట్లతో ఆపరేషన్ గ్రీన్

దేశంలో అన్ని రకాల కూరగాయలు, పండ్లను అధికంగా ఉన్న మార్కెట్ల నుంచి అసలు లేని మార్కెట్లకు తరలించేందుకు రూ.500 కోట్లతో ఆపరేషన్ గ్రీన్స్ అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇప్పటి వరకూ ఈ పథకాన్ని టమోటోలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలకు మాత్రమే అమలు చేశామని తెలిపారు.

దీనివల్ల కూరగాయలు, పండ్ల రవాణాకు 50 శాతం రాయితీ, వాటి నిల్వకు 50 శాతం రాయితీ లభిస్తుందని చెప్పారు.

నిత్యావసర సరుకుల చట్ట సవరణ

దేశంలో అమలులో ఉన్న నిత్యావసర సరుకుల చట్టం 1955కు సవరణ చేస్తామని నిర్మల తెలిపారు.

దేశంలో రైతులు తమ ఉత్పత్తులకు తమకు నచ్చిన వారికి అమ్ముకునే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశ్యమని చెప్పారు.

తద్వారా రైతులు అంతర్ రాష్ట్ర మార్కెట్లలో తమ ఉత్పత్తులను అమ్ముకుని, అధిక ధర పొందవచ్చునని చెప్పారు.

ఈ మేరకు తృణ ధాన్యాలు, వంట నూనెలు, నూనె గింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు సహా నిత్యావసర వస్తువులపై నియంత్రణలను తొలగిస్తామన్నారు.

జాతీయ విపత్తులు, కరువు, ధరల పెరుగుదల వంటి అత్యవసర సమయాల్లో మాత్రమే ఈ నిత్యావసర వస్తువుల నిల్వలపై నియంత్రణ ఉంటుందన్నారు.

వీటిని ప్రాసెస్ చేసేందుకు, విలువ పెంచే ప్రక్రియలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన రీతిలో చట్టపరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.

రైతులు పంటలు వేసేప్పుడే అవి చేతికి అందినప్పుడు ఎంత ధర లభిస్తుందో అంచనా వేసేలా తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వివరించారు.

కాగా, ఈ ప్యాకేజీ కేటాయింపుల్లో కొన్ని ఇప్పటికే ప్రకటించిన ఫిబ్రవరి బడ్జెట్‌లో పేర్కొన్నామని, మరికొన్ని కేటాయింపులు తాజా కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా చేశామని ఒక ప్రశ్నకు సమాధానంగా నిర్మల చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిని తాము అవకాశంగా మలచుకుంటున్నామని, దేశవ్యాప్తంగా సాంకేతికతను పెంచుకునేందుకు, మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

రిక్ బ్రైట్

వచ్చే శీతాకాలం ఆధునిక చరిత్రలోనే 'అత్యంత గడ్డుకాలం'.. అమెరికాను హెచ్చరించిన టీకా నిపుణుడు

కరోనా మహమ్మారి వల్ల వచ్చే శీతాకాలంలో అమెరికా ఆధునిక చరిత్రలోనే అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావొచ్చని పదవి కోల్పోయిన టీకా నిపుణుడు, మాజీ వైద్యాధికారి రిక్ బ్రైట్ కాంగ్రెస్‌కు చెప్పారు.

అమెరికాలో టీకా తయారీకి ప్రయత్నిస్తున్న ప్రభుత్వ సంస్థకు రిక్ బ్రైట్ నాయకత్వం వహించారు. కానీ ఆయన్ను ఏప్రిల్లో ఆ పదవి నుంచి తొలగించారు.

అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రచారం చేసిన చికిత్సపై ఆందోళన వ్యక్తం చేసినందుకే తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆయన ఇంతకు ముందు చెప్పారు.

ఆ వాదనను కొట్టిపారేసిన అమెరికా అధ్యక్షుడు ఆయన ‘అసంతృప్తి’తో అలా మాట్లాడుతున్నారని అన్నారు.

మహమ్మారి వచ్చిన మొదట్లో ప్రభుత్వం ‘తగిన చర్యలు’ తీసుకోకపోవడం వల్లే దేశంలో భారీ ప్రాణనష్టం జరిగిందని కూడా ఆయన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సబ్ కమిటీకి చెప్పాడు.

కరోనావైరస్‌ను నియంత్రించడానికి ఉన్న అవకాశాలు మూసుకుపోతున్నాయని అమెరికాను హెచ్చరించారు.

‘‘మనం ఇప్పుడు సైన్స్ ఆధారంగా మన ప్రతిస్పందనను మెరుగుపరుచుకోకపోతే, ఈ మహమ్మారి మరింత ఘోరంగా మారి, దీర్ఘకాలం కొనసాగుతుందని నాకు భయంగా ఉంది.

మెరుగైన ప్రణాళికలు లేకపోతే 2020లో రాబోయే శీతాకాలం ఆధునిక చరిత్రలో అత్యంత గడ్డు కాలంగా నిలిచిపోవచ్చు.

మెడికల్ గ్రేడ్ ఫేస్ మాస్కులు సరఫరా చేసే ఒక పంపిణీదారు నుంచి నాకు జనవరిలో వచ్చిన ఈ-మెయిల్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మాస్కుల కొరత తీవ్రంగా ఉందని అందులో నన్ను హెచ్చరించారు” అని బ్రైట్ చెప్పారు.

‘‘మనం చర్యలు తీసుకోవాలి అని నేను దానిని హెచ్ఎస్ఎస్‌లో నేను పంపగలిగిన అత్యున్నత స్థాయి వరకూ ఫార్వార్డ్ చేశాను. కానీ ఎలాంటి స్పందనా రాలేదు’’ అని చెప్పారు.

మరోవైపు తాము కనిపెట్టిన ఒక టీకా కోతుల్లో సమర్థంగా పనిచేసినట్లు బ్రిటన్ పరిశోధకులు ప్రకటించారు. కరోనాకు సంబంధించి మరిన్ని వార్తలు.

కరోనా టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో 2,649కి పెరిగిన కోవిడ్-19 మరణాలు

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 81, 970కు చేరుకుంది. మొత్తం మృతుల సంఖ్య 2649కి చేరింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా వివరాల ప్రకారం ప్రస్తుతం 27,920 మంది చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో ప్రస్తుతం 51,401 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

భారత్‌లో అత్యంత ప్రభావితమైన మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,524కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1019కి పెరిగింది.

దేశంలో అత్యధిక కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలోకి చేరింది. ఇక్కడ మొత్తం 9,674 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మృతుల సంఖ్య 66.

మూడో స్థానంలో ఉన్న గుజరాత్‌లో మొత్తం కేసుల సంఖ్య 9591. రాష్ట్రంలో ఇప్పటివరకూ 586 మంది చనిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 57 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 57 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 2157కు చేరుకున్నాయి. ఇప్పటివరకూ 1252 మంది డిశ్చార్త్ జాగా, ప్రస్తుతం ఆస్పత్రుల్లో 857 మంది చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో కోవిడ్ మృతులేవీ నమోదు కాలేదు. దీంతో మృతుల సంఖ్య 48 దగ్గరే ఉంది.

రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో చిత్తూరు జిల్లాలో 13, నెల్లూరులో 8, కర్నూలులో 5, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. వీటిలో కోయంబేడు నుంచి వచ్చిన 28 కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఇప్పటివరకూ 599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 404 కేసులు, కృష్ణా జిల్లాలో 360 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 47 కొత్త కేసులు

తెలంగాణలో 47 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం గురువారం చెప్పింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1414కు చేరాయి. కొత్తగా డిశ్చార్జ్ అయినవారితో కలిసి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 952కు చేరింది. రాష్ట్రంలో మొత్తం 428 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిస్త పొందుతున్నారు.

కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీలో 40, రంగారెడ్డి జిల్లాలో 5, వలస వచ్చిన 2 కేసులు బయటపడ్డాయి.

రాష్ట్రంలో కొత్తగా కోవిడ్ వల్ల ఎవరూ మరణించలేదు. దీంతో మృతుల సంఖ్య 34 దగ్గరే ఉంది.

పంజాబ్ నుంచి స్వస్థలాలకు ఏపీ విద్యార్థులు

పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో ఒక రైలు ఏపీ చేరుకుంది.

మొత్తం 981 విద్యార్థులతో వచ్చిన ఒక ప్రత్యేక రైలు జలందర్ నుంచి విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వేస్టేషన్ కు చేరుకుంది.

అధికారులు ఈ రైల్లో వచ్చిన విద్యార్థులు అందరినీ ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

జపాన్‌లోని షాపింగ్ మాల్ లో మాస్కులు ధరించి ఎస్కలేటర్ పై వెళ్తున్న మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థకు 8.8 ట్రిలియన్ డాలర్ల నష్టం

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థకు 5.8 నుంచి 8.8 ట్రిలియన్ డాలర్ల మధ్య నష్టం ఏర్పడవచ్చని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) చెప్పింది.

ఇది ఏడీబీ గత నెల అంచనాల కంటే రెట్టింపు. ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 6.4 నుంచి 9.7 శాతానికి సమానం.

కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునే చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ప్రభావం నుంచి తమ ఆర్థికవ్యవస్థలను కాపాడుకోడానికి ప్రభుత్వాలు దుందుడుకు చర్యలు తీసుకుంటున్నాయి.

“ఈ కొత్త విశ్లేషణ కోవిడ్-19 వల్ల ఏర్పడే గణనీయమైన ఆర్థిక ప్రభావానికి సంబంధించి ఒక విస్తృత చిత్రాన్ని అందిస్తోంది” అని ఏడీబీ ప్రధాన ఆర్థికవేత్త యసుయుకి సవడా అన్నారు.

“ఆర్థికవ్యవస్థలకు జరిగే నష్టం తగ్గించేలా సాయం చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న విధాన జోక్యాలను కూడా ఇది హైలైట్ చేస్తోంది” అన్నారు.

బ్రిటన్‌లో పరిశోధకులకు భారీ విజయం

అమెరికా, బ్రిటన్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కరోనా వైరస్ టీకాపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ టీకా ప్రారంభ ఫలితాలు ఆశాజనంకంగా ఉన్నాయని వారు చెప్పారు.

పరిశోధకులు ఆరు కోతుల ఒక బృందంపై ఈ టీకాను ప్రయోగించారు. అవి పనిచేస్తున్నట్లు కనుగొన్నారు.

ఇప్పుడు మనుషులపై ఈ టీకా ప్రయోగాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. దానితోపాటు మరికొందరు శాస్త్రవేత్తలతో ముందు ముందు ఈ టీకాను రివ్యూ చేయిస్తామని చెప్పారు.

పరిశోధకులు తమ రిపోర్టులో.. ‘‘ఆరు కోతులకు కరోనావైరస్ భారీ డోస్ ఇచ్చే ముందు వాటికి ఈ టీకాను వేశాం. ఆ ప్రయోగంలో కొన్ని కోతుల శరీరంలో ఈ టీకా వల్ల 14 రోజుల్లో, కొన్నింటికి 28 రోజుల్లో యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు గుర్తించాం’’ పేర్కొన్నారు.

మక్కాలో అత్యధిక కేసులు నమోదు

సౌదీ అరేబియాలో కరోనా మొత్తం కేసులు ఇప్పుడు 46,869కి చేరుకున్నాయి. వీటిలో 77 శాతం కేసులు మక్కా, రియాద్, జెడ్డా, మదీనా, దమ్మంకు చెందినవే ఉన్నాయి. నాలుగు నగరాల్లో అత్యధిక కేసులు మక్కాలోనే బయటపడ్డాయి.

గురువారం సౌదీ అరేబియాలో 2039 కొత్త కేసుల నమోదయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే.

అల్-అరేబియా ప్రకారం సౌదీలో పిల్లల్లో 125 శాతం ఇన్ఫెక్షన్లు పెరిగాయి. మహిళల్లో వంద శాతం పెరిగాయి. దీంతో ఐదుగురికి మించి గుమిగూడడాన్ని సౌదీ ప్రభుత్వం నిషేధించింది.

పాకిస్తాన్ లో కరోనా వైరస్.. ప్రయాణాలు

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్‌ను పట్టించుకోని పాకిస్తాన్

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ లాక్‌డౌన్ సడలించిన తర్వాత బయటికి వచ్చిన ఫొటోలు ఆందోళన కలిగిస్తున్నాయి.

జనం సోషల్ డిస్టన్సింగ్ అసలు పాటించడం లేదనే విషయం వీటి ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

కరోనా ప్రభావమే లేనట్లు మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండానే చాలామంది మార్కెట్లలో తిరుగుతున్నారు.

ఒకే టూవీలర్ మీద నలుగురు కూర్చుని వెళ్తున్న ఈ ఫొటో పాకిస్తాన్‌లో తీసింది.

దీనిని లాహోర్‌లో తీశారు. లాక్‌డౌన్ సడలించిన తర్వాత కాసేపటికే రోడ్లలో ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.

లాహోర్ నగర వీధుల్లో వాహనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాహోర్ నగర వీధుల్లో వాహనాలు
BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

భారత్‌లో కరోనావైరస్ కేసులు

ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌‌డేట్ అవుతుంది. కానీ, ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన తాజా సమాచారం వెంటనే కనిపించకపోవచ్చు

రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం కేసులు కోలుకున్నవారు మరణాలు
మహారాష్ట్ర 1351153 1049947 35751
ఆంధ్రప్రదేశ్ 681161 612300 5745
తమిళనాడు 586397 530708 9383
కర్నాటక 582458 469750 8641
ఉత్తరాఖండ్ 390875 331270 5652
గోవా 273098 240703 5272
పశ్చిమ బెంగాల్ 250580 219844 4837
ఒడిశా 212609 177585 866
తెలంగాణ 189283 158690 1116
బిహార్ 180032 166188 892
కేరళ 179923 121264 698
అస్సాం 173629 142297 667
హరియాణా 134623 114576 3431
రాజస్థాన్ 130971 109472 1456
హిమాచల్‌ ప్రదేశ్ 125412 108411 1331
మధ్యప్రదేశ్ 124166 100012 2242
పంజాబ్ 111375 90345 3284
ఛత్తీస్‌గఢ్ 108458 74537 877
జార్ఖండ్ 81417 68603 688
ఉత్తర్‌ప్రదేశ్ 47502 36646 580
గుజరాత్ 32396 27072 407
పుదుచ్చేరి 26685 21156 515
జమ్మూ కశ్మీర్ 14457 10607 175
చండీగఢ్ 11678 9325 153
మణిపుర్ 10477 7982 64
లద్దాఖ్ 4152 3064 58
అండమాన్ - నికోబార్ దీవులు 3803 3582 53
దిల్లీ 3015 2836 2
మిజోరమ్ 1958 1459 0

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

కరోనావైరస్ హెల్ప్ లైన్
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)