మద్యం దుకాణాల ముందు భారీ క్యూల వెనుక చీకటి నిజం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తిని నివారించటానికి విధించిన లాక్‌డౌన్‌ను కొన్ని నగరాలు గత వారంలో సడలించిన తర్వాత దేశవ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు డవాటి క్యూలు కనిపించాయి.
కోవిడ్-19 హాట్‌స్పాట్ అయిన ముంబై వంటి నగరాల్లో మద్యపాన ప్రియులు సామాజిక దూరం నిబంధనలను తోసిపుచ్చారు. దీంతో ప్రభుత్వం దుకాణాలను మళ్లీ మూసివేయాల్సి వచ్చింది. అదుపులోని లేని కొనుగోలుదార్ల మీద పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు.
బెంగళూరులో ఒక కొనుగోలుదారుడు ఏకంగా రూ. 52,000 బిల్లు చేయటం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
మద్యపాన ప్రియులు వెర్రిగా దుకాణాలకు పరుగులు తీయటం ఆశ్చర్యకరమేమీ కాదు. కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షల వల్ల మద్యానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఆల్కహాల్ విక్రయాలు పెరిగినట్లు వార్తలు వచ్చాయి.
గత ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చినపుడు బ్రిటన్‌లో ఈ మార్చి నెలలో 22 శాతం పెరిగితే, అమెరికాలో 55 శాతం పెరిగింది.
భారతదేశంలో మద్యం విక్రయించటం ఎప్పుడూ సులభం కాదు. ఈ-కామర్స్, హెం డెలివరీలకు అనుమతి లేదు. చాలా రాష్ట్రాలు మద్యాన్ని వ్యతిరేకించాయి. ఎందుకంటే మద్యనిషేధం నినాదం ఓట్లు తెచ్చిపెట్టగలదు.
మద్యం ఉత్పత్తి, ధరలు, అమ్మకాలు, పన్నుల మీద దేశంలోని 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికీ తమ సొంత విధానాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, పరిమాణంలో చూస్తే మద్యపానంలో ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానం భారతదేశానిదేనని లండన్‌కు చెందిన పరిశోధన సంస్థ ఐడబ్ల్యూఎస్ఆర్ మద్యం మార్కెట్‌పై చేసిన విశ్లేషణ చెబుతోంది. భారతదేశం ఏడాదికి 66.30 కోట్ల లీటర్ల మద్యం వినియోగిస్తుంది. ఇది 2017 కన్నా 11 శాతం ఎక్కువ. తలసరి వినియోగం కూడా పెరుగుతోంది.
ప్రపంచంలో ఏ ఇతర దేశం కన్నా భారతదేశం అత్యధిక మొత్తంలో విస్కీ వినియోగిస్తుంది. ఈ విషయంలో రెండో స్థానంలో ఉన్న అమెరికా కన్నా కూడా మూడు రెట్లు ఎక్కువ.
ప్రపంచంలో విక్రయించే ప్రతి రెండు విస్కీ బాటిళ్లలో ఒక బాటిల్‌ను భారతదేశంలోనే అమ్ముతున్నారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా మద్య వినియోగం తగ్గినపుడు.. ప్రపంచ విస్కీ మార్కెట్‌ను భారత్ 7 శాతం మేర పెంచింది.
భారతదేశంలో మద్యం విక్రయాల్లో 45 శాతం ఐదు దక్షిణాది రాష్ట్రాలు – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళల్లోనే జరుగుతాయి.
ప్రభుత్వాల ఆదాయాల్లో 10 శాతం కన్నా ఎక్కువ భాగం మద్యం అమ్మకాల మీద పన్నుల ద్వారానే వస్తున్నాయని క్రిసిల్ పరిశోధన విభాగం లెక్కగట్టింది.
మద్యం వినియోగం ఎక్కువగా ఉన్న మరో ఆరు రాష్ట్రాలు – పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలు – తమ ఆదాయాల్లో 5 నుంచి 10 శాతం లిక్కర్ ద్వారానే ఆర్జిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘‘కానీ ఏప్రిల్‌లో ఒక్క చుక్క కూడా అమ్మలేదు. ఆదాయాల దయనీయ పరిస్థితుల్లో ఉండటంతో మద్యం దుకాణాలు తెరిచి అమ్మకాలు ప్రారంభించాలని ఈ రాష్ట్రాలు చాలా ఆతృతగా ఉన్నాయి’’ అని క్రిసిల్ పేర్కొంది.
మద్యం అమ్మకాల పన్నులు లేకపోవటంతో దాదాపు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలు లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఖర్చు చేయటానికి అవసరమైన నిధులు లేక తిప్పలు పడుతున్నాయి.
అయితే.. దేశంలో మద్యం వినియోగం పెరుగుతుండటం.. ఒక చీకటి నిజాన్ని కప్పిపెడుతోంది.
భారతదేశ పురుషుల్లో మూడో వంతు మంది మద్యం తాగుతారని ప్రభుత్వ నివేదిక ఒకటి చెప్తోంది. వయసు 10 సంవత్సరాల నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 14 శాతం మందకి పైగా మద్యం తాగుతారు.
భారతదేశ జనాభాలో 11 శాతం మంది అధికంగా మద్యం సేవిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్త సగటు 16 శాతంగా ఉంది.
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. మద్యం తాగేవారిలో మూడో వంతు మంది నాటు సారా, గుడుంబా వంటి స్థానికంగా తయారుచేసిన మద్యం సేవిస్తారు. ఇందులో కల్తీ కారణంగా అనేక విషాదాలకు కారణమవుతోంది.
మద్యం తాగేవారిలో సుమారు 19 శాతం మంది మద్యపాన బానిసలుగా ఉన్నారని ఆ నివేదిక చెప్తోంది. దాదాపు మూడు కోట్ల మంది జనం ‘‘ప్రమాదకర రీతి’’లో మద్యం తాగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతేకాదు, భారతదేశంలో వినియోగించే మద్యంలో సగం పైగా మద్యం ‘‘నమోదుకాని’’ మద్యమేనని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. ఉదాహరణకు స్థానికంగా కాచిన మద్యం వివరాలు కొన్ని రాష్ట్రాల్లో అధికారికంగా నమోదు కావు. వాటి మీద పన్నులు ఉండవు.
మద్యం తాగేవారిలో చాలా ఎక్కువ మంది స్థానికంగా తయారుచేసిన, ఇంట్లో కాచిన, నకిలీ మద్యాన్ని ఇష్టపడుతున్నారని 2014లో ఇంటర్నేషనల్ అలయన్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ డ్రింకింగ్ నిర్వహించిన సర్వేలో గుర్తించారు.
భారతీయులు గతం కన్నా మరింత ఎక్కువగా మద్యం తాగుతున్నారు. 1990 నుంచి 2017 మధ్య మద్య వినియోగం గురించి 189 దేశాల్లో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో.. భారతదేశంలో మద్యం వినియోగం 38 శాతం పెరిగిందని గుర్తించారు. వయోజన తలసరి వినియోగం 4.3 లీటర్ల నుంచి 5.9 లీటర్లకు పెరిగింది.
‘‘మద్య వినియోగాన్ని తగ్గించటం లక్ష్యంగా చేపట్టే చర్యల ప్రభావం కన్నా.. మద్యం కొనుగోలు చేయటానికి తగినంత ఆదాయం ఉన్న జనం సంఖ్య పెరగటం’’ వల్ల మద్య వినియోగం పెరిగిందని ఈ అథ్యయనానికి సారథ్యం వహించిన జర్మనీలోని టెక్నీష్ యూనివర్సిటాట్ డ్రెస్డెన్ ప్రొఫెసర్ జాకబ్ మాంథే నాతో చెప్పారు.
మద్యం అందుబాటు ధరల్లో ఉండటం కూడా పెరుగుతోంది. ఉదాహరణకు.. అధికాదాయ దేశాలతో పోలిస్తే.. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో బీరు మరింత చౌకగా ఉందని అధ్యయనంలో గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో మద్యపానం వల్ల ప్రధాన భారం.. లివర్ సిర్రోసిస్, గుండె జబ్బులు వంటి అంటువ్యాధులు కాని జబ్బుల వల్ల పడుతోందని ప్రొఫెసర్ జాకబ్ పేర్కొన్నారు. మద్యపానం పెరగటం వల్ల ఈ తీరు ఇంకా పెరుగుతుందన్నారు.
2012లో అన్ని రోడ్డు ప్రమాదాల్లో మూడో వంతు ప్రమాదాలకు కారణం మద్యం తాగి వాహనాలు నడపటమేనని అధ్యయనాలు చెప్తున్నాయి. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం వయోజన పురుషుల్లో దాదాపు 10 శాతం మంది మద్యపాన వ్యసనపరులు.
లివర్ సిర్రోసిస్ వల్ల సంభవించే మరణాల్లో 60 శాతం పైగా మరణాలకు కారణం మద్యపానమే. మద్యపానం అనేది ఓ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారుతోంది.
గృహ హింసకు కూడా మద్యపానం ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మద్యనిషేధానికి బలంగా మద్దతిస్తున్నది గ్రామీణ మహిళలే.
మద్యం ధరలను మరింతగా పెంచటం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు.
శ్యాం హూస్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త సంతోష్ కుమార్ నిర్వహించిన పరిశోధనలో.. విస్కీ, రమ్ వంటి మద్యాల ధరలను పెంచటం వల్ల వాటి వినియోగం అతి స్వల్పంగా, ఒక మాదిరిగా తగ్గుతుందని గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో హానికర మద్యపానం విషయంలో ధరల నియంత్రణతో పాటు అవగాహన కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని ఆయన భావిస్తున్నారు. దేశం మద్యం మీద ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించటానికి స్వరాజ్ ఇండియా పార్టీ నేత, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఒక జాతీయ ప్రణాళిక సూచిస్తున్నారు.
ప్రభుత్వాలు మద్యం నుంచి వచ్చే ఆదాయాల మీద ఆధారపడటం తగ్గించుకోవటం, మద్యాన్ని ప్రోత్సహించటం నిలిపివేయటం, మద్యం విక్రయాలపై ఇప్పుడున్న చట్టాలు, నిబంధనలను అమలుచేయటం, ఒక ప్రాంతంలో రిటైల్ లైసెన్స్ ఇవ్వటానికి స్థానిక ప్రజల్లో 10 శాతం మంది అంగీకారం తీసుకోవటం, మద్యం విక్రయాల మీద వచ్చే ఆదాయాలను జనాన్ని మద్యం నుంచి దూరం చేయటానికి ఖర్చుచేయటం వంటి చర్యలు ఈ ప్రణాళికలో ఉన్నాయి.
స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవటం కన్నా నిషేధం విధించటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని.. బ్లాక్ మార్కెట్‌కు బాటలు పరుస్తుందని నిరూపితమైంది. మద్యపానాన్ని ఒక నైతిక అంశంగా మారిస్తే ఉదారవాదుల నుంచి విమర్శలు వస్తాయి.
ప్రముఖ విశ్లేషకుడు ప్రతాప్ భాను మెహతా చెప్తున్నట్లు, ‘‘మనం స్వేచ్ఛ గురించి నిజంగా పట్టించుకున్నట్లయితే... సాంస్కృతికంగా, రాజకీయంగా మద్య అర్థికవ్యవస్థకు మన వ్యసనాన్ని కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంక్లిష్ట సమస్యను పరిష్కరించటానికి తెలివైన మార్గాలను కనుక్కోవాల్సి ఉంది.’’
అది సులభం కాదు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- మద్యం అతిగా తాగితే... డీఎన్ఏ డామేజ్ అవుతుందా...
- మహిళలు మద్యం తాగితే పిల్లలు పుట్టరా?
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- ‘మద్యపానం.. మితంగా తాగినా ముప్పే’
- ఓవర్ అయినా.. హ్యాంగోవర్ ఉండదు!
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- కొబ్బరి కల్లు.. శ్రీలంక నుంచి ప్రపంచమంతా ప్రయాణిస్తున్న మత్తు పానీయం
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








