కరోనావైరస్: వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్ విధానాన్ని అనుసరించిన పురాతన నగరం ఇది

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో డుబ్రోవ్నిక్ నగర వీధులు

ఫొటో సోర్స్, Ivan Vuković Vuka

ఫొటో క్యాప్షన్, కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో డుబ్రోవ్నిక్ నగర వీధులు
    • రచయిత, క్రిస్టిన్ వుకోవిక్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్ (స్వీయ నిర్బంధం), క్వారంటైన్ అనే పదాలు తరచూ వినిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రోగులను ఒంటరిగా క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.

నిజానికి, అంటు వ్యాధులు సోకినవారిని అలా ఒంటరిగా (ఐసోలేషన్‌లో) ఉంచాలనే ఆలోచన ఈనాటిది కాదు. కొన్ని వందల ఏళ్ల నుంచి అలా చేస్తున్నారు. క్వారంటైన్ అనే పదానికి ఉన్న చరిత్ర గురించి తెలుసుకుంటే స్వీయ నిర్బంధం ప్రాముఖ్యం ఏంటో బాగా అర్థం చేసుకోవచ్చు.

"క్వారంటైన్" అనే పదానికి మూలాలు ఇటాలియన్‌లో ఉన్నాయి. 14వ శతాబ్దంలో ఐరోపా ఖండాన్ని బ్లాక్ డెత్ (ప్లేగు) మహమ్మారి అతలాకుతలం చేసింది. ఆ అంటువ్యాధి బారిన పడి దాదాపు రెండు కోట్ల మంది చనిపోయారని అంచనా.

డుబ్రోవ్నిక్ నగరానికి పర్యటకమే ప్రధాన ఆర్థిక వనరు

ఫొటో సోర్స్, Ivan Vuković Vuka

ఫొటో క్యాప్షన్, డుబ్రోవ్నిక్ నగరానికి పర్యటకమే ప్రధాన ఆర్థిక వనరు

ఆ వ్యాధి వ్యాప్తి చెందుతున్న సమయంలోనే క్వారంటైన్ అనే విధానం బాగా వాడుకలోకి వచ్చింది.

ప్లేగు వ్యాప్తిని కట్టడి చేసేందుకు వ్యాధి ప్రబలిన ప్రాంతాల నుంచి ఇటలీలోని వెనిస్ నగరానికి వచ్చే ఓడలన్నీ 40 రోజుల పాటు యాంకర్ వద్దే ఉండాలని, వాటిలోని ప్రయాణికులు కూడా నగరంలో అడుగుపెట్టకుండా క్వారంటైన్‌లో ఉండాలని అప్పటి నగర కౌన్సిల్ ఆదేశించింది.

అలా నిర్బంధించడాన్ని“క్వారంటా జియోర్ని” అనేవారు. రానురాను దాన్ని క్వారంటైన్ అని పిలవడం అందరికీ అలవాటైంది. ఆ పదం ఇటాలియన్ నుంచి వచ్చింది. 40 రోజుల కాలాన్ని ఇటాలియన్ భాషలో 'క్వారంటినో ' అంటారు.

డుబ్రోవ్నిక్ నగర రేవు

ఫొటో సోర్స్, Ivan Vuković Vuka

ఫొటో క్యాప్షన్, డుబ్రోవ్నిక్ నగర రేవు

నిబంధనలు పాటించకుంటే కఠిన శిక్షలు

1374వ సంవత్సరంలో, వెనిస్‌ నగర పాలక సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక వైద్య మండలి అనుమతి ఇచ్చే వరకూ ఆ నౌకలు నగరంలోకి ప్రవేశించడానికి వీల్లేదని, నౌకలతో పాటు వాటిలోని ప్రయాణికులందరినీ సమీపంలోని శాన్ లాజారో ద్వీపంలో ఉంచాలని ఆదేశించారు.

ఆ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు 1377లో క్రొయేషియాలోని రగుసా (ప్రస్తుత డుబ్రోవ్నిక్) నగర కౌన్సిల్ కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల ఓడలు, ప్రయాణికులను తప్పనిసరిగా 30 రోజుల పాటు సముద్ర తీరంలోనే క్వారంటైన్‌ చేయాలని ఆదేశించింది.

ఆ చట్టంలో క్వారంటైన్‌ను ట్రెంటైన్ అని పేర్కొన్నారు. 1377 జులై 27 నాటి పత్రాల్లో ఈ పదం కనిపించింది.

ఆ చట్టాన్ని రగుసా కౌన్సిల్ విజయవంతంగా అమలు చేసిందని, దాంతో ఆ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అనుసరించారని ‘ది బిగినింగ్ ఆఫ్ ది క్వారంటైన్ రెగ్యులేషన్ ఇన్ యూరప్’ అనే పుస్తక సహ రచయిత ఆంటే బిలోసేవిక్ చెప్పారు.

వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, జంతువులు, సరుకులను క్వారంటైన్ చేసిన మొదటి మధ్యధరా ఓడరేవు డుబ్రోవ్నిక్ అని బిలోసేవిక్ చెబుతున్నారు.

30 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలన్న ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రగుసా రిపబ్లిక్ (డుబ్రోవ్నిక్) అత్యంత కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించింది.

తర్వాత వెనిస్ నగర కౌన్సిల్ కూడా అన్ని నౌకలనూ నిలిపివేసింది. దాంతో, వాణిజ్యం, జనజీవనం పూర్తిగా స్తంభించింది.

మధ్యయుగంలో రగూసా (ప్రస్తుత డుబ్రోవ్నిక్) వాణిజ్యపరంగా ఓ ప్రధాన ఓడరేవు

ఫొటో సోర్స్, Ivan Vuković Vuka

ఫొటో క్యాప్షన్, మధ్యయుగంలో రగూసా (ప్రస్తుత డుబ్రోవ్నిక్) వాణిజ్యపరంగా ఓ ప్రధాన ఓడరేవు

40 రోజులకు పొడిగింపు

వెనిస్ నగరంలో మొదట 30 రోజుల పాటు ఆ నిబంధనలను అమలు చేశారు. కానీ, తర్వాత దాన్ని 40 రోజులకు పొడిగించారు. 30 నుంచి 40 రోజులకు ఎందుకు మార్చారన్న విషయంలో స్పష్టత లేదు.

అయితే, మహమ్మారి వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకునేందుకు 30 రోజుల సమయం సరిపోదని, అందుకే ఆ గడువును పొడిగించి ఉంటారని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే ఆ వ్యాధి ఇంక్యుబేషన్ పీరియడ్ ఎన్ని రోజులన్నది అప్పుడు కచ్చితంగా తెలియదు.

మరికొందరేమో, క్రైస్తవ మత నమ్మకాల ఆధారంగా, బైబిల్‌లో పేర్కొన్న కొన్ని సంఘటనలకు గుర్తుగా క్వారంటైన్‌ను 40 రోజులకు పెంచారని అంటున్నారు.

తమ ఓడరేవులోకి ప్రవేశించే నౌకలన్నీ 30 రోజులు కాదు, 40 రోజులు క్వారంటైన్‌ పాటించాల్సిందే అంటూ 1448లో వెనిస్ కౌన్సిల్ అధికారిక ప్రకటన జారీ చేసింది.

డుబ్రోవ్నిక్ నగరానికి పర్యటకమే ప్రధాన ఆర్థిక వనరు

ఫొటో సోర్స్, The archive of Du List

ఫొటో క్యాప్షన్, డుబ్రోవ్నిక్‌లోని లాజరెట్టోలు పర్యటకులను ఆకర్షిస్తాయి.

అంతకు ముందు కూడా డుబ్రోవ్నిక్‌ నగరం అనేక అంటు వ్యాధుల బారిన పడింది. ఆ అనుభవంతోనే ప్రాణాంతకమైన ప్లేగు నివారణకు అక్కడి పాలకులు క్వారంటైన్‌ను అత్యంత కఠినంగా అమలు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు.

నిజానికి, 1377కి ముందు కూడా అంటు వ్యాధుల నివారణ కోసం స్వీయ నిర్బంధాన్ని అమలు చేశారని ‘స్టాట్యూట్ ఆఫ్ ది సిటీ డుబ్రోవ్నిక్’ అనే పేరుతో ఉన్న 1272వ సంవత్సరం నాటి పత్రాలు చెబుతున్నాయి. అప్పుడు కుష్టు వ్యాధి రోగులను ఒంటరిగా ఉంచేవారని ఆ రాతపూర్వక పత్రాల్లో పేర్కొన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కుష్టు వ్యాధి బాధితులను క్వారంటైన్ చేసేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాలను లాజరెట్టోలుఅని పిలుస్తారు. వాటిని తొలుత రగుసా నగర పాలక సంస్థ ఏర్పాటు చేయగా, తర్వాత యూరప్ అంతటా అదే విధానాన్ని అనుసరించారు.

రగుసా సమీపంలోని చిన్న ద్వీపాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారని రచయిత బకిజా-కొన్సువో చెప్పారు.

మొదట్లో, ఆ శిబిరాల్లో సరైన సదుపాయాలు ఉండేవి కాదని, గుడిసెలు, గుడారాలను క్వారంటైన్ కేంద్రాలుగా వాడేవారని, తర్వాత కాలంలో బాగా మెరుగైన వసతులు కల్పించారని బకిజా వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా పర్యటకులకు డుబ్రోవ్నిక్ స్వర్గధామం

ఫొటో సోర్స్, Ivan Vuković Vuka

ఫొటో క్యాప్షన్, ప్రపంచవ్యాప్తంగా పర్యటకులకు డుబ్రోవ్నిక్ స్వర్గధామం

1397, 1430, 1590, 1647, 1724 సంవత్సరాల్లోనూ పలు చోట్ల క్వారంటైన్ కేంద్రాలకు ప్రణాళికలు వేసినట్లు, నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి.

డుబ్రోవ్నిక్ రిపబ్లిక్ పతనమయ్యాక కూడా చాలాకాలం పాటు ఆ శిబిరాలు కొనసాగాయని, వాటిని ఏ సంవత్సరంలో రద్దు చేశారనే వివరాలు తమ దగ్గర లేవని బకిజా-కొన్సువో చెప్పారు.

డుబ్రోవ్నిక్‌లోని నేషనల్ ఆర్కైవ్స్ రికార్డుల ప్రకారం, 1872లో కూడా ఆ శిబిరాలు వాడుకలో ఉన్నాయి. రాళ్లతో నిర్మించిన విశాల భవనాల్లో సకల సదుపాయాలూ ఉండేవని స్థానిక చరిత్రకారులు చెబుతున్నారు.

రోగులను ఒక గదిలో నిర్బంధించకుండా, వారు ప్రశాంతమైన గాలి పీల్చుకుంటూ, ఉల్లాసంగా తిరిగేందుకు కూడా విశాలమైన ప్రాంగణం ఉండేదని, వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ప్రత్యేక పోర్షన్లలో ఉంచేవారని చరిత్రకారులు అంటున్నారు.

కచేరీలు, సంప్రదాయ లినియో నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పర్యటకులను అమితంగా ఆకర్షించే డుబ్రోవ్నిక్‌లోని లాజరెట్టోలు, శతాబ్దాల క్రితమే అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో అక్కడి పాలకుల దూరదృష్టిని గుర్తు చేస్తున్నాయి.

లాజరెట్టోలను స్థానికంగా "లాజరెట్" లేదా "లాజరెటి" అని పిలుస్తారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

పర్యటక రంగ పరంగా కీలకమైన క్రొయేషియా ప్రస్తుతం పూర్తి లాక్‌డౌన్‌లో ఉంది. దాంతో, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎప్పుడూ పర్యటకులతో కళకళలాడే డుబ్రోవ్నిక్‌ నగరంలో పూర్తిగా నిశ్శబ్దం అలముకుంది. అమెరికా, యూరప్ దేశాల నుంచి విమానాలన్నీ రద్దయ్యాయి. జూన్ వరకూ అన్ని క్రూయిజ్ షిప్‌లనూ రద్దు చేశారు.

ఆరు శతాబ్దాలు గడిచినా క్వారంటైన్ నిబంధనల విషయంలో పెద్దగా మార్పులేమీ లేవు. కానీ, అప్పుడైనా, ఇప్పుడైనా... ప్రాణాంతక మహమ్మారులను ఎదుర్కోవాలంటే స్వీయ నిర్బంధం, క్రమశిక్షణ చాలా ముఖ్యమనే విషయాన్ని డుబ్రోవ్నిక్‌ గుర్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)