కరోనావైరస్: కోతకొచ్చిన మామిడి కాసుల్ని రాలుస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.31లక్షల హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. సగటున 43.8 టన్నుల మామిడి దిగుబడి లభిస్తోంది.
మొత్తం ఫల సాగులో 68శాతం మామిడి పంటదే కావడం విశేషం. అందులో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా తెలంగాణలోని వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మామిడి సాగు అధికంగా ఉంది.
దేశంలో మొత్తం 24% మామిడి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దిగుబడి అవుతున్నట్టు డాక్టర్ వైఎస్సార్ ఉద్యానవన విశ్వ విద్యాలయ అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మామిడి సాగు ఎక్కువగా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానంగా బంగినపల్లి, తోతాపురి, సువర్ణరేఖ, నీలం, దషేరి, రసాలు వంటి మామిడి రకాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. కొన్ని ప్రధాన మార్కెట్లు కూడా ఉన్నాయి.
నున్న, తుని, వరంగల్, మదనపల్లి, హైదరాబాద్ మార్కెట్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మామిడి ఎగుమతులు జరుగుతూ ఉంటాయి.
సాధారణంగా ఏటా మార్చిలో మొదలయ్యే మామిడి సీజన్ జూన్ వరకూ సాగుతుంది. అందులో ఏప్రిల్, మే నెలల్లో మామిడి మార్కెట్ కళకళలాడుతూ ఉండేది. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు.

ఫొటో సోర్స్, Getty Images
మామిడితో అనేక ఉత్పత్తులు
మామిడితో పచ్చళ్లు పెద్ద స్థాయిలో తయారుచేస్తూ ఉంటారు. ఏటా ఈ సీజన్‌లో పచ్చళ్లు తయారు చేసి, మిగిలిన కాలమంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు సాగించేవారు అనేకమంది తెలుగు గడ్డ మీద ఉన్నారు. ఇక ఆంధ్రులకు ఆవకాయతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు.
మామిడి తాండ్ర పరిశ్రమకు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరు. కొన్ని గ్రామాలకు గ్రామాలే పూర్తిగా మామిడి తాండ్ర తయారీలో తలమునకలై ఉండే పరిస్థితి ఉంటుంది.
ఇక మామిడితో జామ్ వంటి ఇతర ఉత్పత్తులు ఉండనే ఉన్నాయి.
ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా పచ్చళ్ల తయారీతో పాటుగా తాండ్ర పరిశ్రమకి కూడా తీవ్ర ఆటంకాలు తప్పవని నిర్వాహకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశాలకు ఎగుమతి
ప్రపంచంలో అత్యధికంగా మామిడి ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ఒకటి. మనదేశం వాటా సుమారు 15 శాతం వరకూ ఉంటుంది. దేశం నుంచి ఎగుమతి అయ్యే పండ్ల సంబంధిత ఉత్పత్తుల్లో మామిడి వాటా 40శాతం వరకు ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారి ఎం.గుర్రాజు తెలిపారు.
ఏటా మార్చి నెలాఖరు నుంచే మామిడి ఎగుమతులు మొదలయ్యేవని విజయనగరం జిల్లాకు చెందిన మామిడి రైతు పి.శ్రీనుభాస్కర్ రెడ్డి బీబీసీకి తెలిపారు. ఆయన ప్రతి ఏటా బెంగాల్, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు మామిడి ఎగుమతి చేస్తుంటారు.
“మేము 25 ఎకరాల మామిడి తోటలను లీజుకు తీసుకున్నాం. ఎకరానికి రూ.50వేల చొప్పున పెట్టుబడి పెట్టాం. సాధారణంగా మామిడి కోత దశకు వచ్చిన తర్వాత వాటిని లారీల్లో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉంటాం.
అక్కడ మార్కెట్లో చాలా వరకూ అమ్ముడుపోగా, మిగిలిన సరకు విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పటికే కొన్ని రకాలు కోతకొచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఏం చెయ్యలేకపోతున్నాం.
సువర్ణరేఖ వంటి రకాలు దాదాపుగా పక్వానికి వచ్చి చెట్టుకే పండిపోతున్నాయి. వాటిని ఇప్పుడు కోయలేము.. కోసినా తరలించలేని పరిస్థితి.
పంట దిగుబడి బాగా వచ్చిందన్న సంతోషం కరోనావైరస్ కారణంగా ఆవిరైపోయింది. ఇప్పుడు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతున్నాం. ఎలా గట్టెక్కాలన్నది మాకు అర్థం కావడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మామిడి రైతులను ఆదుకోవాలి
మామిడి రైతులు తమ పంటను మార్కెటింగ్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఏపీలో విపక్ష నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మామిడి నిల్వ చేసుకునేందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు విషయాన్ని కూడా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే దిగుబడిని కొనుగోలు చేసి అమ్మకాలు చేపట్టాలన్నది మరి కొందరి మాట.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి పి.పెద్దిరెడ్డి ఈ విషయంపై బీబీసీతో మాట్లాడుతూ “ఇప్పటికే సీజన్ సగం పూర్తవుతోంది. మామిడి రైతులు, ఎగుమతిదారులు, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీలో ఉన్న లక్షల మంది ఆందోళనలో ఉన్నారు. ఏం జరుగుతోందో తెలియక సతమతం అవుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలి” అని కోరారు.

సమస్య మార్కెట్లలో ఉంది
మామిడి కాయల కోతకు కూలీల కొరతతో పాటు మార్కెట్‌కి తరలించిన కాయలు అమ్ముడుపోకపోవడమే అసలైన సమస్యగా ఉందని మామిడి వ్యాపారి సప్పా రాజు బీబీసీకి తెలిపారు.
“మేం ఏటా 100 లోళ్ల సరుకు ఎగుమతి చేస్తూ ఉంటాం. ఎక్కువగా జంషెడ్‌పూర్‌తో పాటు కోల్‌కతా కూడా తీసుకెళ్తాం. ఈ ఏడాది కూడా అనేక సమస్యలున్నా కొన్ని లోళ్లు వేసుకుని వెళ్లాం. కానీ అక్కడ మార్కెట్లన్నీ మూతపడ్డాయి.
మా కాయలు అమ్ముడుపోలేదు. దాంతో రవాణా ఛార్జీలు కూడా రాలేదు. రైతులంతా కాయలను చెట్టునే వదిలేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసి నేరుగా ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేస్తే మంచిది.
ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్న కమలాలు, యాపిల్స్ వంటి వాటి కొనుగోళ్లకు మన మార్కెట్లో ఆటంకాలు లేవు గానీ మన దగ్గర పండిస్తున్న మామిడికి మార్కెట్ లేకపోవడం విచారకరం. ప్రభుత్వాల ప్రకటనలకు చేతలకు పొంతన ఉండటం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఆటంకాలు లేవు
నిత్యావసర సరకులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఎటువంటి ఆటంకాలు లేవని ఏపీ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
“కరోనా కారణంగా మామిడి పంట రైతులు నష్టపోకుండా చూస్తున్నాం. ఎగుమతులకు అడ్డంకులు లేకుండా చూస్తున్నాం. ఇప్పటికే స్విట్జర్లాండ్‌కు 1.2 టన్నులు ఎగుమతి అయ్యాయి. మామిడి తాండ్ర తయారీకి అనుమతులు ఇచ్చాం. ఈ క్రాప్‌లో నమోదు అయిన ప్రతి పంటనూ కొనుగోలు చేస్తాం.
ఇప్పటికే తగిన విధానాలను రూపొందించాం. ఆక్వా, మామిడి వంటి ఉత్పత్తుల ఎగుమతికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. కోల్డ్ స్టోరేజ్ సహా అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. అవసరం అయితే ఇతర రాష్ట్రాలు, కేంద్రంతో కూడా మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. రైతు బజార్లు తరహాలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం” అని బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అందని మామిడి పుల్లనేనా?
ఓవైపు మార్కెట్ సీజన్ గడిచిపోతోంది. మే 3 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది, ఏప్రిల్ 20 తర్వాత కొంత సడలింపు ఉంటుందని ఆశిస్తున్నప్పటికీ అది ఏ మేరకు ఫలితాన్నిస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు.
ప్రభుత్వాలు తగిన చొరవ తీసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదన్నది రైతుల మాట. తియ్యని మామిడి పళ్లను రుచి చూడటంతో పాటు... కొత్త ఆవకాయ రుచులను ఆస్వాదించే అవకాశం తెలుగు వారికి ఏ మేరకు ఉంటుందన్నది ప్రస్తుతానికి శేష ప్రశ్న.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: హైదరాబాద్‌లో ఒకే కుటుంబంలో 17 మందికి కోవిడ్ వ్యాధి
- కరోనావైరస్ లాక్డౌన్: హైదరాబాద్‌లో ఉండలేక... ఇంటికి పోలేక వలస కార్మికుడి ఆత్మహత్య
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?వేడి నీళ్లు, పానీయాలు కోవిడ్-19 బారి నుంచి రక్షిస్తాయా?
- కరోనావైరస్: లాక్ డౌన్లో కొత్త నిబంధనలతో ఎవరికి ప్రయోజనం?
- కరోనావైరస్: హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో ప్రమాదాలు ఉన్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








