కరోనావైరస్ లాక్‌డౌన్: హైదరాబాద్‌లో ఉండలేక... ఇంటికి పోలేక వలస కార్మికుడి ఆత్మహత్య

వలస కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో లాక్‌డౌన్ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో వలస కార్మికులు ముందు వరసలో ఉన్నారు. అలాంటి కార్మికుల్లో ఒకరు సొంతూరికి వెళ్లలేక, నగరంలో ఉండలేక ఆత్మహత్య చేసుకున్నట్లు హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీసులు తెలిపారు.

చనిపోయిన వ్యక్తిని బిహార్‌లోని లక్కీసరాయ్ జిల్లాకు చెందిన ఆమిర్‌గా గుర్తించారు. ఆమిర్ హైదరాబాద్‌లో ఒక మెకానిక్ షెడ్‌లో పనిచేస్తూ, స్నేహితుడు అజీమ్‌తో కలిసి ఉప్పల్ ప్రాంతంలో ఒక గది అద్దెకు తీసుకొని ఉండేవారు.

అజీమ్ మార్చి 13న ఊరికి వెళ్లారు. దాంతో లాక్‌డౌన్ ప్రకటించాక ఆమిర్ హైదరాబాద్‌లో ఒంటరిగా ఉన్నారు.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

చేతిలో చిల్లగవ్వలేదని, ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నానని, ఊరికి తిరిగొచ్చే పరిస్థితి కూడా లేదని ఆమిర్ ఇంట్లో వాళ్లకు, అజీమ్‌కు ఫోన్ చేసి చెప్పేవారు. ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేస్తామని కుటుంబ సభ్యులు నచ్చజెప్పేవారు.

ఈ మధ్యలోనే ఆమిర్ తన గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

సోమవారంనాడు ఆమిర్ పొరుగింటి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం నాడు ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమిర్ బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.

ఆమిర్‌లాగే బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన వలస కార్మికులు 3 లక్షలకుపైగా ఉంటారని ప్రభుత్వ అంచనా. వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. అలాంటి వారికి నగరంలోనే ఉండేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా, కార్మికులు మాత్రం స్వస్థలాలకు చేరుకోవడానికే ప్రయత్నిస్తున్నారు.

వలస కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

కాలినడకన శ్రీకాకుళానికి...

మంగళవారంనాడు శ్రీకాకుళానికి చెందిన చాలామంది వలస కార్మికులు సొంతూళ్లకు కాలి నడకన వెళ్దామని నిర్ణయించుకొని గుంపుగా బయల్దేరారు. చంటి పిల్లలను చంకన వేసుకొని, ముసలివాళ్లను కూడా వెంటబెట్టుకొని వాళ్లు ప్రయాణమయ్యారు.

కానీ, ఉప్పల్ దగ్గర పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కు పంపించేశారు. అలా వచ్చిన కార్మికులంతా మారేడ్‌పల్లి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొందరు భవన నిర్మాణ కూలీలుగా, కొందరు ఇళ్లలో పనివాళ్లుగా చేస్తున్నారు. ఉపాధి లేకపోవడంతో పాటు లాక్‌డౌన్‌ను పొడిగించడంతో వారంతా నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మారేడ్‌పల్లిలోనే వారు ఉండటానికి అనువైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు రాచకొండ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వలస కార్మికుల్లో 36వేల మందికి 12 కేజీల బియ్యం, రూ.500 నగదు ఇచ్చామని, మరో 41 వేల మంది క్రెడాయ్ సాయంతో భోజనం, వసతికి ఏర్పాట్లు చేశామని, 96 వేల మందికి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. లాక్‌డౌన్‌ను పొడిగించడంతో అప్పటివరకు కార్మికులందరికీ 12 కేజీల బియ్యం, రూ.500 నగదు అందేలా చూస్తామని, అద్దె కోసం వీళ్లను ఇబ్బంది పెట్టొద్దని ఇంటి ఓనర్లను కోరతామని ఆయన అన్నారు.

కానీ, అన్నిరోజులపాటు హైదరాబాద్‌లో ఉంటే తమను ఎవరూ పట్టించుకోరని కార్మికులు భయపడుతున్నారు.

వలస కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'మేం ఇంటికి వెళ్లిపోతాం...'

బిహార్‌ నుంచి వలస వచ్చి కొంపల్లిలో టైలరింగ్ పనిచేసుకుంటున్న రుఖ్మాన్‌ది కూడా అదే సమస్య. ''నాకు నెలకు రూ.10 వేల జీతం వస్తుంది. ఈ నెల జీతంతో కిరాయి కట్టి, ఊరికి కొంత డబ్బు పంపాను. మేము ఇక్కడ ఇంట్లో ఆరుగురం కలిసి ఉంటాము. మాలో నలుగురికి జీతాలు రాలేదు. దాంతో ఇక్కడ కూడా సరకులు నేనూ, మరో వ్యక్తి కలిసి కొన్నాము. అవి కూడా అయిపోవచ్చాయి. రేషన్ కోసం వెళ్లినా మాకు రాలేదు'' అని చెప్పారు రుఖ్మాన్.

నగరంలో వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని బిహార్ వలస కూలీల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజు ఓఝా చెబుతున్నారు.

"మాకు రేషన్ దొరకడం కష్టంగా ఉంది. కొన్ని చోట్ల బతిమాలితే ఇస్తున్నారు. హోటళ్లలో, భవన నిర్మాణాల కోసం పనిచేసేవారికి ఈ నెల డబ్బులు అందలేదు. దాంతో తినడానికి కూడా వారికి కష్టంగా ఉంది. ఇన్ని రోజులపాటు పనిచేసినా కూడా ఇప్పుడు కాంట్రాక్టర్లు, హోటల్ వాళ్లు స్పందించట్లేదు. పని చేసుకొని బతికే మాకు ఇప్పుడు ఇతరులపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. సొంతూళ్లకు వెళ్తే కాస్త ధైర్యంగా అయినా ఉంటుంది. ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు'' అంటున్నారు ఓఝా.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

రేషన్ పంపిణీలో వలస కార్మికుల పట్ల వివక్ష చూపుతున్నారని, సహాయం కోసం బిహార్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించినప్పటికీ ఆ సాయం అందరికీ అందట్లేదని అన్నారు.

''ఈ లాక్‌డౌన్ ముగిశాక అందరం ఊళ్లకు తిరిగి వెళ్లిపోవాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ ఇబ్బందులేవో సొంతూరిలోనే పడితే కనీసం కుటుంబం దగ్గర ఉందన్న భరోసా అయినా ఉంటుంది. సిద్దిపేటలో ఒక పౌల్ట్రీఫామ్‌లో పనిచేసే ఇద్దరు కుర్రాళ్లను అమాంతం ఉద్యోగంలో నుంచి తొలగించారు. సాధారణంగా తినడానికి లేకపోయినా, కార్మికులు ముందుగా ఫోన్ రీచార్జ్ చేయించుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ క్షేమ సమాచారం తెలుసుకోవాలని వారు ఆశ పడతారు. కానీ, ఆ ఇద్దరు కుర్రాళ్ల దగ్గర రీచార్జ్‌కి కూడా డబ్బుల్లేవు. దాంతో, రోడ్డు మీద కనిపించిన వారిని బతిమాలుకొని నాకు ఫోన్ చేశారు. స్థానికంగా ఉండే కార్మికులకు నేను ఫోన్ చేసి చెప్పడంతో వాళ్లని ఆదుకున్నారు.

ఇలాంటి పరిస్థితిని ముందెప్పుడూ చూడలేదు. చాలామంది భయంతో ఉన్నారు. అందుకే తిండిలేకపోయినా కుటుంబం దగ్గరకు వెళ్లిపోతామని చాలామంది నాతో చెబుతున్నారు'' అని ఓఝా వివరించారు.

వలస కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఇదే సమస్య ఉంది. మంగళవారంనాడు ముంబైలో వేలాది వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లడానికి బాంద్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేస్తారని, రైళ్లను నడిపిస్తారని భావించి వాళ్లు అక్కడికి వచ్చారు. తమ స్వస్థలాలకు పంపించాలని ఆందోళన చేశారు. దాంతో పోలీసులు లాఠీలు ఝళిపించి వాళ్లను తిరిగి పంపారు.

గుజరాత్‌లోని సూరత్‌లో కూడా టెక్స్‌టైల్ మిల్లుల్లో పనిచేసే వందలాది వలస కార్మికులు ఇలానే తమను సొంతూళ్లకు పంపాలంటూ రోడ్డెక్కారు. కానీ, పోలీసులు వాళ్లను తిరిగి వారు వచ్చిన చోటుకే పంపిచేశారు. సూరత్‌లోనే దాదాపు 12 లక్షల మంది వలస కార్మికులు ఉంటారని, లాక్‌డౌన్ ముగిసేవరకు వారిని కట్టడి చేయడం కష్టమేనని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)