కాకినాడ సమీపంలోని మడ అడవులకు ముప్పు ఉందా? ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
బంగాళాఖాతం తీర ప్రాంతాన్ని ఆనుకుని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలోని కోరంగిలో ఉన్న మడ అడవులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్ర తీరం కోతకు గురి కాకుండా కాపాడటంలోను, ఎన్నో రకాల జలచరాలకు ఆశ్రయం ఇవ్వడంలోను మడ అడవులది ప్రత్యేక స్థానం. ఇటీవల పర్యటకంగానూ మడ అడవులు ప్రసిద్ధి పొందాయి.
అయితే ఆ భూములకు ఇప్పుడు ముప్పు ఏర్పడిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం మడ అడవులకు కీలకమైనదిగా చెబుతున్న ప్రాంతాన్ని ధ్వంసం చేస్తోందంటూ పర్యావరణ వేత్తలు, ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై ఏపీ హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కూడా స్పందించాయి.
దేశంలోనే రెండో అతి పెద్ద మడ అడవులు ఇవే...
కోరంగి మడ అడవుల ప్రాంతాన్ని 1978లోనే వన్యప్రాణి అభయారణ్యంగా గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 332.66 చదరపు కిలో మీటర్ల మేర మడ అడవులు విస్తరించగా, ఏపీ అటవీ శాఖ లెక్కల ప్రకారం కోరంగి మడ అడవులు 235.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఇవి విస్తీర్ణంలో దేశంలోనే రెండో అతిపెద్ద మడ అడవులుగా చెప్పవచ్చు. ప్రస్తుతం వివాదం నడుస్తున్న భూములు కోరంగి మడ అడవులకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.
సహజంగా విస్తరించిన ఈ మడ అడవుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. సముద్రపు కోతనుంచి ఇవి భూమిని రక్షిస్తాయి. ఇప్పటికే కాకినాడ వంటి ఓ పారిశ్రామిక నగరాన్ని ఈ మడ అడవులు అనేక విప్తతుల నుంచి కాపాడాయని తరచు పర్యావరణవేత్తలు చెబుతుంటారు.

ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూసేకరణతో మొదలైన వివాదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇళ్లులేని పేదలందరికీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు, ఇళ్లు కేటాయించే పథకానికి శ్రీకారం చుట్టింది. జులై 8న వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది.
అందులో భాగంగా ప్రభుత్వం అధీనంలో ఉన్న భూముల్ని పేదలకు కేటాయించేందుకు సన్నద్ధమైంది. కాకినాడ నగరంలోని పేదల ఇళ్ల స్థలాల కోసం కాకినాడ 10, 12 డివిజన్ల పరిధిలో దుమ్ములపేట, పర్లోవపేటలను ఆనుకుని ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసింది.
కాకినాడ పోర్టుకు చెందిన 126 ఎకరాల స్థలంలో ఇప్పటికే 5 ఎకరాలు రైల్వే అవసరాలకు కేటాయించారు. మరో 20 ఎకరాల్లో ఉప్పుటేరు విస్తరించి ఉంది. మిగిలిన 101 ఎకరాల స్థలాన్ని అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు సన్నద్దమైంది. దానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని చదును చేసి లేఔట్‌గా మార్చి ఇళ్ల స్థలాలుగా మార్చే ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మట్టిని తరలించి, ఆ ప్రాంతాన్ని సిద్ధం చేసే పని దాదాపుగా పూర్తి కావచ్చింది.

90 వేల కుటుంబాలకు జీవనోపాధి సమస్య
అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ పనిని అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. కాకినాడకు చెందిన మత్స్యకార సమితి ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసింది. మార్చి 16న సంబంధిత అధికారులకు సమస్యను నివేదించామని సమితి అధ్యక్షుడు చోడిపల్లి సతీష్ బీబీసీకి తెలిపారు.
కాకినాడకు రక్షణగా ఉన్న మడ అడవులకు కీలకమైన ప్రాంతాన్ని నాశనం చేయడం అంటే మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయడమే అని సతీష్ అంటున్నారు.
“కాకినాడలో 90వేల మంది మత్స్యకారులు వేట మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు సముద్రపు పాయల్ని కప్పిపెడుతున్నారు. ఇళ్ల స్థలాల పేరుతో వాటిని పూడ్చేస్తే మత్స్యసంపద నాశనం అవుతుంది. ఇప్పటికే వివిధ పరిశ్రమల కాలుష్యంతో చాలా వరకూ చేపల వేట పోయింది. ఇప్పుడు ఉన్న దారులు మూసుకుపోతున్నాయి. ఇలా చేస్తే మత్స్యకారుల భవిష్యత్ ఏం కావాలి? కాకినాడకు పెద్ద ముప్పు పొంచి ఉందని ఇప్పటికే అనేక నివేదికలు చెబుతున్నాయి. అలాంటి సమయంలో, ఉన్న రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తే నగర వాసులందరికీ సమస్య తప్పదు. అందుకే ఈ విషయంలో న్యాయపోరాటానికి సిద్ధమయ్యాం. ప్రభుత్వం తన ఆలోచన మార్చుకుని, సహజ వనరులను కాపాడాలని కోరుతున్నాం” అని తెలిపారు.

మడ అడవులు కాదు, ఖాళీ భూములు మాత్రమే
మడ అడవులను నాశనం చేస్తున్నారంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన బీబీసీకి తెలిపారు.
“కాకినాడలో గతంలో ఎన్నడూ లేని రీతిలో 25వేల కుటుంబాలకు ఒకేసారి ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నాం. ఇది ఓ చరిత్రాత్మక సందర్భం. దానిని అడ్డుకోవడమే విపక్షాల పని. కాకినాడ పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన ఆ భూములు 1978/79 నుంచి అభివృద్ధి చేయలేదు. ఖాళీగానే పడి ఉన్నాయి. సర్వే నెంబర్ 376 పార్టు, 375/1, 1985/పార్టు, 2004/పార్టులో ఉన్న భూమిలో ఇప్పటికే కొంత వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు. అందులో మిగిలిన భూములనే పేదలకు సిద్ధం చేస్తున్నాం. ఆటంకాలు అధిగమించి పేదలకు అందిస్తాం. పర్యావరణానికి నష్టం కలిగించే పని చేయడం లేదు. మడ అడవులకు, పోర్టు భూములకు సంబంధం లేదు. కాకినాడ నగరానికి మడ అడవులు చాలా దూరంగా ఉన్నాయి. ఈ భూములు నగరాన్ని ఆనుకుని ఉన్న భూములు” అని వివరణ ఇచ్చారు.

లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తారా?
ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా లాక్ డౌన్ సమయంలో తీర ప్రాంతాన్ని ధ్వంసం చేయడం సరికాదంటున్నారు పర్యావరణ వేత్త, జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ. మడ అడవుల పరిరక్షణ, భూ వివాదంపై ఆయన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
తాజా పరిణామాలపై ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. “బయో డైవర్సిటీ యాక్ట్ 2014 ప్రకారం మడ అడవులను ధ్వంసం చేయడం చట్టవిరుద్ధం. కాకినాడ పోర్ట్ కూడా మడ అడవులకు మధ్యలో ఉంది. 2016 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మడ అడవులు ఎక్కడ ఉన్నప్పటికీ వాటిని రిజర్వ్ ఫారెస్ట్‌గా పరిగణించాల్సి ఉంటుంది. సీఆర్‌జెడ్ నిబంధనలు 2011, 2019; పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, అటవీ పరిరక్షణ చట్టం 1980, వన్య ప్రాణుల పరిరక్షణ చట్టం 1972, జాతీయ జీవ వైవిధ్య చట్టం 2002, రాజ్యాంగ అధికరణాలు 48-A, 51-A(g) ఉల్లంఘనలు జరగడంతో పిటిషన్ దాఖలు చేశాం. కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వం, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చాం.
మడ అడవుల సమీపంలో 50 మీటర్ల పరిధిలో ఎటువంటి నిర్మాణాలకూ అనుమతి లేదని చట్టాలు చెబుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ మొదటి వారంలోనే టెండర్లు పిలిచి, వారం వ్యవధిలోనే ఆ భూములను పూడ్చేసే ప్రయత్నం చేయడం చట్టవిరుద్ధం. ఎన్జీటీలో పిటిషన్ వేయడంతో ఐదుగురు అధికారులతో కమిటీ వేశారు. విచారణ చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. ఆగస్ట్ 18కి కేసు వాయిదా వేశారు.
అందరికీ ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవుల మనుగడకు కీలకమైన ఈ ప్రాంతాన్ని, ఇతర చెరువులను పూడ్చేసే ప్రయత్నం చేయడం అంగీకారయోగ్యం కాదు. దీనిపై ఏపీ హైకోర్టులో కూడా పిటిషన్ వేశాం. ప్రస్తుతానికి దీనిపై స్టే విధించారు” అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నిర్మాణాలకు కూడా అనుకూలం కాదు
కాకినాడ నగరంలోని సముద్ర తీర ప్రాంతాల్లో గృహకల్ప వంటి వివిధ పథకాల్లో భాగంగా నిర్మించిన భవనాలు కూడా స్వల్పకాలంలోనే శిథిలావస్థకు చేరుతున్నాయని ప్రజా సంఘాల నేత పలివెల వీరబాబు చెబుతున్నారు.
“ఇప్పటికే దుమ్ములపేట వంటి ప్రాంతాల్లో 15 ఏళ్లు కూడా నిండని ప్రభుత్వ భవనాలు నివాసయోగ్యంగా లేకుండా పోయాయి. అనేక మంది ఖాళీ చేశారు. ఇప్పుడు సముద్ర తీరానికి మరింత సమీపంలో చిత్తడి నేలల్లో శాశ్వత భవనాల నిర్మాణం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వం తగిన ప్రత్యామ్నాయ స్థలాలు అన్వేషించాలి. కాకినాడ నగరంలో అనేక ప్రత్యామ్నాయ స్థలాలున్నాయి. కొనుగోలు చేసి అందిస్తామని చెప్పి పోర్టు భూములను వినియోగించడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా కొందరు టీడీపీ నేతలు, పర్యావరణవేత్తలు ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. అయితే మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వారి ఆరోపణల్ని ఖండించారు. ఈ విషయంలో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు, కాకినాడలో ప్రస్తుత వివాదానికి కారణమైన భూములు సాంకేతికంగా మడ అడవుల పరిధిలో లేనప్పటికీ వాటి పరిరక్షణకు ఇది అత్యంత కీలక ప్రాంతం అని పర్యావరణ పరిశోధకుడు కేవీవీ సత్యనారాయణ బీబీసీతో అన్నారు.
“కాకినాడ నగర పరిధిలో నోటిఫైడ్ భూములు లేవు. ఇవి పోర్ట్ కోసం కేటాయించిన స్థలాలు అని ఇప్పటికే అధికారులు ఆధారాలు అందించారు. అయినప్పటికీ నాలుగు దశాబ్దాలుగా అక్కడ ఎటువంటి కార్యకలాపాలు లేవు. ఖాళీ స్థలాలుగానే ఉండడం వల్ల వివిధ రకాల మత్య్స సంపదకు ఆవాసంగా మారాయి. ఇప్పుడు ఒకేసారి వేలమందికి అక్కడ నివాసం ఏర్పాటు చేస్తే పర్యావరణ సమస్యలు తప్పవు. కాబట్టి సముద్ర తీరంలో కాకుండా మరో చోట లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు పరిశీలించడం అవసరం” అని ఆయన తెలిపారు.
కోర్టు ఆదేశాలను పాటిస్తాం
కోరంగి మడ అడవుల భూములకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేవని తూర్పు గోదావరి జిల్లా అటవీశాఖ అధికారిణి నందనీ సలారియా తెలిపారు. తాజా వివాదాన్ని బీబీసీ ఆమె దృష్టికి తీసుకురాగా, మడ అడవులను అటవీ శాఖ పరిరక్షిస్తుందని తెలిపారు.
“ప్రస్తుతం పోర్టు భూముల విషయంలో కొన్ని అభ్యంతరాలున్నాయి. వివాదం న్యాయస్థానాల పరిధిలో ఉంది. ఎన్జీటీ ఆదేశాలతో కమిటీని కూడా నియమించారు. దర్యాప్తు సాగుతోంది. అన్ని వివరాలు వారికి అందిస్తాం. పర్యావరణానికి సంబంధించి ఎటువంటి సమస్య రాకుండా చూస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాం, కోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తాం” అని తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- విజయవాడలో 233 కరోనా కేసులు.. అందులో సగం ‘పేకాట, తంబోలా వల్ల వచ్చినవే’
- విశాఖపట్నం కేజీహెచ్: పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్ద దిక్కు
- కరోనావైరస్: గర్భంతో ఉన్న విద్యార్థి సఫూరా జర్గర్‌ను ఎందుకు జైల్లో పెట్టారు?
- మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ: ఆర్థిక జాతీయవాదం ఆచరణ సాధ్యమా? స్వావలంబన ఇంకెంత దూరం?
- కరోనావైరస్ లాక్డౌన్: జైలు నుంచి విడుదలైనా ఇంటికి వెళ్ళలేకపోతున్న ఖైదీ కథ
- కరోనావైరస్: ఇంటికి డబ్బు పంపించడానికి అవస్థలు పడుతున్న ప్రవాసులు
- కరోనావైరస్ను గెలిచిన 113 ఏళ్ళ బామ్మ
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








