కరోనావైరస్: మళ్ళీ మనం ఎప్పటికైనా కరచాలనం చేసుకోగలమా?

- రచయిత, జేమ్స్ జెఫ్రీ
- హోదా, బీబీసీ కోసం
వేలాది ఏళ్లుగా వస్తున్న ఆత్మీయ స్పర్శను, ఒకరినొకరు తాకడాన్ని ఇప్పటికిప్పుడు మర్చిపోయేందుకు యావత్ ప్రపంచం తీవ్ర సంఘర్షణ పడుతోంది. కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని కబళించిన తర్వాత వదులుకోవాల్సిన అలవాట్లలో కరచాలనం ఒకటి కావచ్చు.
అప్పుడే కలిసిన కొత్త ముఖాలు పరస్పరం పలకరించుకోవడం దగ్గర నుంచి ఇక మళ్లీ జీవితంలో ఇంకెప్పుడూ కలిసే అవకాశం లేని చిరకాల మిత్రులు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకోవడం వరకు, చిన్న చిన్న వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే సాధారణ వర్తకుల నుంచి వందల కోట్ల డాలర్ల ఒప్పందాలు చేసుకునే బిజినెస్ టైకూన్ల వరకు ఈ ప్రపంచంలో అందర్నీ కలిపే బలీయమైన శక్తి షేక్ హ్యాండ్.
కరచాలనం కథలు
ఈ కరచాలనం పుట్టుకకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో పురాతన గ్రీకుల కాలం నుంచి ఈ హ్యాండ్ షేక్ ఉందన్నది ఒకటి.
అప్పట్లో శాంతికి చిహ్నంగా దీనిని భావించే వారు. ఇద్దరు వ్యక్తులు తమ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేవని ఒకరికొకరు స్పష్టం చేసుకునేందుకు గుర్తుగా పరస్పరం కరచాలనం చేసుకునేవారు.

మధ్యయుగ కాలంలో ఇది యూరోప్‌లో ప్రారంభమై ఉండవచ్చంటూ మరో కథనం కూడా ఉంది. ఆనాటి రాజులు పరస్పరం చేతులు కలుపుకొని బలంగా ఊపడం ద్వారా ఎదుటి వ్యక్తి రహస్యంగా దాచుకున్న ఆయుధాలు బయటపడతాయని నమ్మేవారు.
ఒకరికి తలొగ్గడాన్ని వ్యతిరేకిస్తూ సమ సమాజ స్థాపన కోసం అప్పట్లో ప్రయత్నించిన క్రైస్తవ సమాజంలో ఒక వర్గమైన క్వెకర్స్ దీన్ని ప్రముఖంగా వాడుకలోకి తీసుకొచ్చారన్న మరో కథనం కూడా ఉంది.
ఇక చేతులు కలపడం అన్నది “విద్యావంతులైన వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలిపే గుర్తు” అంటే మానవులు జంతువుల నుంచి సామాజికంగా ఎలా పరిణామం చెందారో చెప్పడానికి ఇదో గుర్తు అంటారు ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్సిటికి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ క్రిస్టైన్ లిగరే.
వేలాది ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ఈ కరచాలనం అన్నది ఎప్పటి నుంచో మన సమాజంలో పాతుకుపోయిందని చెప్పవచ్చు.
శారీరకంగా పరస్పరం స్పృశించడం అన్నది జంతువుల్లోనూ గుర్తించారు. 1960లో అమెరికన్ సైకాలజిస్ట్ హార్రీ హార్లో రీసస్ జాతికి చెందిన యువ వానరాల ఎదుగుదలలో ఈ ఆత్మీయ స్పర్శ, ఆప్యాయతలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో నిరూపించారు.
జంతు జాతి నుంచి మరిన్ని ఉదాహరణలను చూస్తే మానవ జాతితో సంబంధం ఉన్న చింపాజీలు కూడా తమ అరచేతుల్ని స్పృశించడం, కౌగలించుకోవడం, కొన్ని సార్లు చుంభించడం ద్వారా పరస్పరం పలకరించుకుంటూ ఉంటాయి. జిరాఫీల్లో జరిగే “నెక్కింగ్” ప్రక్రియ కూడా ఒకదానిపై మరొకదానికి ఉండే ఆకర్షణను తెలియజేయడంలో భాగమే.

పలకరింపులకు పలు మార్గాలు
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఒకరికొకరు పలకరించుకునేందుకు అనేక విధానాలు ఉన్నాయి. చాలా సంస్కృతుల్లో చేతులు జోడించడం కూడా ఉంది. అందులో సంప్రదాయ హిందూ సంస్కృతిలో భాగమైన “నమస్కారం” కూడా చాలా ప్రసిద్ధి చెందింది.
సమావో దేశంలో “ఐ బ్రో ఫ్లాష్” అంటే ఒక్కసారిగా కనుబొమ్మల్ని ఎగరేస్తూ బిగ్గరగా నవ్వడం కూడా పలకరించడంలో భాగమే.
ఇక ముస్లిం దేశాల్లో గుండెపై చేయి వేసుకోవడం ఒక గౌరవ ప్రదమైన పలకరింపు. అమెరికాలో సర్ఫింగ్ చేసే వాళ్లలో బాగా ప్రాచుర్యంలోకి ఉన్న మరో పలకరింపు “హవాయిన్ షాకా”. అరచేతిలో మధ్యలో ఉన్న మూడు వేళ్లను మూస్తూ బొటన వేలు, చిటికెన వేలును సాగదీస్తూ చేసే హస్త విన్యాసం ఇది.
చరిత్రను పరిశీలిస్తే ప్రతిసారీ పలకరింపులో శారీరక స్పర్శ ఉండాలన్న నిబంధనేం లేదన్న విషయం తెలుస్తోంది. 20వ శతాబ్దం మొదట్లో పిల్లలపై ఆప్యాయతను ప్రదర్శించడం అన్నది భావగర్భితమైన గుర్తే తప్ప నిజానికి దాని వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదని సైకాలజిస్టులు నమ్మేవారు. అంతేకాదు అలా తమ అనురాగాన్ని స్పర్శ ద్వారా ప్రదర్శించడం వల్ల వ్యాధుల్ని వ్యాపింపజేసే అవకాశం ఉందని, వయోజనుల్లో మానసిక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించేవారు.
లండన్‌లోని స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ విభాగంలో శాస్త్రవేత్తగా పని చేస్తున్న వాల్ కర్టిస్ “కరచాలనానికి, ఆత్మీయంగా బుగ్గను స్పృశించడం ద్వారా పరస్పరం పలకరించుకోవడానికి ప్రధాన కారణం ఎదుటి వ్యక్తి తనకు ఎలాంటి వ్యాధులు సంక్రమింపజేయలేడన్ననమ్మకం బలంగా ఉండటమే” అని తన “డోన్ట్ లుక్, డోన్ట్ టచ్” అనే పుస్తకంలో వివరించారు.
1920లో అమెరికన్ జర్నల్ ఆఫ్ నర్శింగ్‌లో వచ్చిన కథనాల్లో ఒకరి నుంచి మరొకరికి బ్యాక్టీరియా వ్యాపించడానికి చేతులే కారణమని పేర్కొన్నారు. అంతే కాదు అమెరికన్లు తమ స్నేహితుల్ని పలకరించేందుకు చైనా సంప్రదాయంలో భాగమైన స్వీయ కరచాలనానికి అలవాటు పడాలని కూడా అప్పట్లో సూచించారు.
ఇక ఇటీవల హ్యాండ్ షేక్ విషయంలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తే 2015లో అంటే ఇంకా కోవిడ్-19 సంక్షోభం తలెత్తక ముందు అమెరికాలోని UCLA ఆస్పత్రిలోని ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో షేక్ హ్యాండ్‌ను నిషేధించారు. అయితే ఇది కేవలం ఆరు నెలలు మాత్రమే అమల్లో ఉంది.
ఇక ముస్లిం మతాచారాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ మతానికి చెందిన చాలా మంది మహిళలు కరచాలనం చేసుకోవడంపై నిషేధం ఉంది.
అయితే ఈ అభ్యంతరాలన్నింటినీ పక్కన బెడితే 20వ శతాబ్దంలో హ్యాండ్ షేక్ అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఒకరినొకరు పలకరించుకునేందుకు, శుభాకాంక్షలు తెలుపుకునేందుకు విస్తృతంగా ప్రాచుర్యంలో ఉన్నఒక గుర్తుగా మారిపోయింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

ఇక భవిష్యత్తులో కరచాలనాలు ఉండవా?
ఓ వైపు ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తూ ఉన్నప్పటికీ హ్యాండ్ షేక్ భవిష్యత్తు మాత్రం ఇంకా అనిశ్చితిలోనే ఉంది.
“నిజంగా చెబుతున్నా.. భవిష్యత్తులో మళ్లీ మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటామనుకోవడం లేదు”అని వైట్ హౌజ్‌లో కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఆంథోని ఫౌచీ గత ఏప్రిల్ నెలలో వ్యాఖ్యానించారు.
“కేవలం కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాత్రమే కాదు, అలా చేయడం వల్ల ఈ దేశంలో విష జ్వరాల వ్యాప్తిని నిరోధించవచ్చు కూడా” అని ఆయన అన్నారు.
అమెరికాలో లాక్ డౌన్ నిబంధనల్ని సడలించే సమయంలో ఇచ్చిన సూచనల ప్రకారం సామాజిక దూరం దీర్ఘకాలం పాటు కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతోనూ, డయాబెటిస్, ఊబకాయంతో బాధపడుతున్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇది ఓ కరంగా “సైన్స్ ఫిక్షన్ ఆఫ్ డిస్టోపియా” అంటే ఎవరిని ముట్టుకోవాలి? ఎవర్ని ముట్టుకోకూడదు? ఎవర్ని దూరం పెట్టాలన్న విషయంలో ఈ సమాజం చీలిపోయేందుకు దారి తీస్తుందని డెల్ మెడికల్‌కు చెందిన క్లినికల్ ఇంటిగ్రేషన్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో అసోసియేట్‌గా పని చేస్తున్న స్టూవర్ట్ ఓల్ఫ్ వ్యాఖ్యానించారు.
ఇది మానసికంగా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
శారీరక స్పర్శ అన్నది బాగా మనలో నాటుకుపోయింది. అమెరికా అధ్యక్షుడు ఒక ఏడాదిలో సుమారు 65వేల మందితో కరచాలనం చెయ్యడం అందుకు నిదర్శనం.
“అలవాట్లను మార్చడం చాలా కష్టం” అంటారు ప్రిన్స్ టన్ యూనివర్శిటీలో మనుషులు ఎలా రిస్క్ చేస్తుంటారన్న అంశంపై పరిశోధనలు నిర్వహిస్తున్న సైకాలజీ అండ్ పబ్లిక్ ఎఫైర్స్ ప్రొఫెసర్ ఎల్కె వెబర్.

షేక్ హ్యాండ్‌కు ప్రత్యామ్నాయాలు
షేక్ హ్యాండ్‌కు బదులుగా చాలా ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. తల వంచడం అందులో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇది వాడుకలో ఉంది. నిజానికి దీని క్రెడిట్ కరోనావైరస్ కారణంగా అతి కొద్ది మరణాలు నమోదైన థాయిలాండ్‌కు చెందుతుందని చెప్పవచ్చు. అలాగే తల ఊపడం, నవ్వడం, చేతుల ద్వారా సంజ్ఞలు చేసుకోవడం ఇలా శారీరక స్పర్శ లేకుండా చాలా పలకరింపులు కూడా వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా మనుషులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోనేటప్పుడు తగిన ఉరట పొందేందుకు మానవ స్పర్శపై ఆధారపడతారు. కోవిడ్-19 వల్ల ఇప్పుడు అటువంటి స్పర్శ కరవయ్యే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ లిగరే అన్నారు.
“మనకు ఆప్తులైన వారు మరణించిన సందర్భంలో కానీ లేదా తీవ్రమైన కష్టం ఎదురైనప్పుడు కానీ ఆలింగనం చేసుకోవడం వల్ల ఊరట పొందుతామా? లేదా మన పక్కన కూర్చొని భుజంపై చేయి వేయడం ద్వారా సాంత్వన పొందుతామా? రెండింటిలో దేనికి మనం స్పందిస్తామన్న విషయం గురించి ఆలోచించాలి” అని ఆయన చెప్పారు.
మానవ సంబంధాల విషయానికి వచ్చేసరికి పిడికిళ్లతో గుద్దుకోవడం, అలాగే మోచేతుల్ని తగిలించడం అంత ఆమోదయోగ్యం కానీ పలకరింపులనే చెప్పాలి.
ప్రజారోగ్య విభాగంలో పని చేస్తున్న డెలియానా గ్రేసియా ఇప్పటికే షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని దూరం పెట్టారు. కానీ ఎప్పటినుంచో ఉన్న అలవాటును ఒక్కసారిగా ఆపేయడం కష్టమేనన్నది ఆమె అభిప్రాయం.
“ఆలింగనం చేసుకోవడాన్ని నేను ఎంతగానే ఇష్టబడతాను” అంటారు గ్రేసియా. “ముఖ్యంగా 85 ఏళ్ల నా తల్లికి దూరంగా ఉండటం చాలా కష్టం” అని చెబుతారు.
“ఆమెతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. అమ్మ దగ్గరకు వెళ్లి ఆ ముఖాన్ని నిమురుతూ ముద్దు పెట్టి నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానను అని చెప్పాలని ఉంటుంది” అని అంటారు గ్రేసియా.
“కానీ అలా చేస్తే వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఫలితంగా ఇద్దరం ఇబ్బంది పడాల్సి ఉంటుంది” అని ఆమె అన్నారు.
“ఒక వేళ ఆమె నా దగ్గరకు రావాలనుకున్నప్పటికీ నా వల్ల ఆమె ఎక్కడ జబ్బు పడుతుందోనన్న భయం నన్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. అందుకే నేను వద్దంటాను. కానీ ఆమె నా నుంచి వెళ్లిపోతుంటే నేను ఆమె వెంటే వెళ్తుంటాను. నా వరకు నాకు భరోసా ఉన్నప్పటికీ ఆమెను మాత్రం దగ్గరకు రానివ్వలేను. అయిస్కాంతంలోని సజాతి ధ్రువాల వలె ఉంటోంది మా పరిస్థితి” అని గ్రేసియా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

షేక్ హ్యాండ్ లేకపోతేభవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయా ?
బహుశా కరచాలనం, ఆత్మీయ స్పర్శ లేకపోవడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. ఇతర ప్రత్యామ్నాయాలతో పోల్చితే ఇదే ఉత్తమం అంటున్నారు ప్రొఫెసర్ వెబర్. ఈ విషయంలో ప్రస్తుతం ప్రజలు అతిగా స్పందిస్తున్నారన్నది ఆయన భావన.
“ఈ పరిస్థితుల్లో జనం అతిగా స్పందిస్తున్నారని చెప్పడాన్ని నేనేం వ్యతిరేకించడం లేదు” అని చెప్పారు.
మనుషులు మనుగడ సాగించాలంటే రోగాలను దూరంగా ఉంచాల్సిందే. అలాగని ఈ సంక్లిష్టమైన సమాజంలో జీవిస్తున్న మనం రోగాలు రాకుండా చూసుకోవడం పేరుతో ఆత్మీయ స్పర్శకు ఇప్పటికిప్పుడు దూరం కావద్దంటున్నారు అస్టిన్‌లోని టెక్సస్ విశ్వ విద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆర్థర్ మార్క్ మెన్.
“కరచాలనాన్ని విడిచి పెట్టే బదులు అందుకు ప్రత్యామ్నాయంగా చేతులు తరచు కడుక్కోవడం, శానిటైజర్లను ఉపయోగించడం, ముఖాన్ని తరచుగా ముట్టుకోకుండా ఉండటంపై ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది” అన్నది ఆయన సలహా.
“స్పర్శ వల్ల కలిగే అనుభూతితో పని లేకుండా సరికొత్త సాధారణ పలకరింపుని మనం అలవాటు చేసుకుంటామని మనం చెబుతున్నాం. కానీ మన చుట్టు ఉన్న మన వాళ్ల ఆత్మీయ సర్శ లేకపోవడం వల్ల మనం ఏం కోల్పోతున్నామన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నాం.” అని అన్నారు ఆర్థర్ మార్క్ మెన్.
ఇవి కూడా చదవండి:
- లాక్ డౌన్ ఎఫెక్ట్: పని మనుషులని పనుల్లోకి పిలవాలా? వద్దా? కోట్లాది కుటుంబాలని వేధిస్తున్న ప్రశ్న
- విశ్వ రహస్యం గుట్టు విప్పే ప్రయత్నంలో మరో 'ముందడుగు'
- కిమ్ జోంగ్ ఉన్‌కు గుండె ఆపరేషన్ జరిగిందా? లేదా?.. దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ ఏం చెప్పిందంటే..
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా
- కరోనావైరస్తో మనుషులు చనిపోతుంటే... మరో వైపు మాఫియా డాన్లు ఏం చేస్తున్నారు?
- కరోనావైరస్: లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై ఫిర్యాదు చేస్తారా
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








