కరోనావైరస్‌తో మనుషులు చనిపోతుంటే... మరో వైపు మాఫియా డాన్‌లు ఏం చేస్తున్నారు?

- రచయిత, సోఫియా బెటీజా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఒక వైపు ఇటలీలో కరోనా బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంటే మరో వైపు ఈ విపత్తుని అవకాశంగా తీసుకుని కోట్ల కొద్దీ ధనార్జన చేయాలనీ ఇటలీకి చెందిన వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేర వ్యవస్థలు చేస్తున్న సహాయం తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని ఇటలీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
మాఫియా బృందానికి చెందిన ఒక వ్యక్తి సిసిలీ ద్వీపంలోని పాలెర్మో ప్రాంతంలో పేద ప్రజలకి ఆహారం సరఫరా చేస్తున్నారు.
"చాలా మంది నాకు ఫోన్ చేసి వాళ్ళ పిల్లలకి తిండి లేదని చెప్పి ఏడుస్తారు. ఐదుగురు పిల్లలు ఉన్న ఒక యుక్త వయస్సులో ఉన్న ఒక తల్లి నాకు రోజూ ఫోన్ చేసి తన పిల్లలకి తిండి పెట్టడానికి తన దగ్గర ఏమి లేదని ఏడుస్తుంది"
ఆయన ఒక మాఫియా నాయకుడికి సోదరుడు, కానీ ఆయన మాఫియా బృందంలో సభ్యుడు అని ఒప్పుకోలేదు. “మాఫియా అంటే ప్రజలకి సహాయం చేసే వారే అయితే మాఫియాగా పిలిపించుకోవడానికి తాను గర్వపడతానని” అన్నారు.
కరోనావైరస్ కొత్తగా వచ్చింది. అయితే, నిరుపేదలకు ఆహారం పంచడం మాత్రం మాఫియా ఉపయోగిస్తున్న పాత విధానమే.

ఇలాంటి పనుల ద్వారా ప్రజల నమ్మకాన్ని సంపాదించి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మారడమే వారి ఉద్దేశ్యమని కాలాబ్రియాలో మాఫియా వ్యతిరేక పరిశోధకునిగా పని చేస్తున్న నికోలా గ్రాటెరి అన్నారు. .
తమకు మద్దతు ఇచ్చే వ్యవస్థని కూడగట్టుకోవడమే వారి లక్ష్యమని ఆయన అన్నారు.
నిరుద్యోగం, మందకొడిగా నడుస్తున్న ఆర్ధిక వ్యవస్థతో ఇటలీ ఆర్ధిక పరిస్థితి సంక్షోభంలో ఉంది. దీంతో చాలా మంది పరిస్థితి నిస్సహాయంగా మారింది. కానీ, మాఫియా నుంచి ఎటువంటి చిన్న సహాయాన్ని తీసుకోవడమైనా ప్రమాదకరమే అని ఆయన హెచ్చరించారు.
"మాఫియా ఎప్పుడూ ప్రజల మీద దయతో ఎటువంటి పనీ చేయలేదు. అటువంటి ఆలోచనే వారి మనసులో ఉండదని, మాఫియాని అరికట్టే సంస్థలో పని చేసే ఎంజా రాండో చెప్పారు. "వాళ్లకి తెలిసిందంతా నేను నీకేమన్నా ఇస్తే నాకేమిస్తావు అనే సిద్ధాంతం మాత్రమే".
“మొదట్లో బదులుగా నాకేం ఇస్తావని అడగరు. కానీ, మాఫియా నుంచి సహాయం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో వారి రుణం తిరిగి చెల్లించుకోవాల్సిందే.”
మార్సెల్లో పాలెర్మో నగరం నడిబొడ్డులో ఒక రెస్టారంట్ ని నడుపుతారు. అయితే, మార్చ్ లో దీనిని మూసేయాల్సి వచ్చింది.

ఆయన ఒక వ్యాపార లాభాన్ని ఆశిస్తున్నారు. “ఇదంతా చాలా నేరుగా సాగే వ్యవహారం అని ఆయన అన్నారు. ఒక మాఫియా సభ్యుడు మన తలుపు కొట్టి మన వ్యాపారం కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతారు. అక్కడే ధర కూడా నిర్ణయిస్తారు. వెంటనే ఆ డబ్బు ని మీ అకౌంట్ కి బదిలీ చేస్తారు. కొంత సొమ్ముని నగదు రూపంలో ఇస్తారు”.
“ఇప్పుడు మా వ్యాపారం మునిగిపోతోంది. అలాంటి సమయంలో ఎవరైనా రక్షణ జాకెట్ విసిరితే అది అందుకుని ఈది ఒడ్డున పడాలో లేదా మన విలువలని పట్టుకుని వేలాడుతూ మునిగిపోవాలో నిర్ణయించుకోవడం మన చేతుల్లోనే ఉంది.”
కానీ, మాఫియా ఎప్పుడూ తిరిగి రాబట్టుకోవడానికి వెనక్కి వస్తుందని కొన్ని డజన్ల మాఫియా కేసులలో సాక్షి గా ఉన్న సిసీలియా కి చెందిన మాజీ మాఫియా నాయకుడు గాస్పరే ముటోలో చెప్పారు.
“నేను అలాగే చేసేవాడినని” చెప్పారు. “నేను చాలా దయగలవాడిగా కనిపించేవాడిని. నా నిజమైన రంగులని నేను ఎప్పుడూ లోకానికి కనపడనివ్వలేదు. కానీ, నేను 20 మందిని పైగా హత్య చేసిన నేరస్థుడినని గుర్తు పెట్టుకోండి”.
ముటోలో పోలీస్ రక్షణలో ఉన్న ఒక రహస్య స్థావరం నుంచి బీబీసీ తో మాట్లాడారు. ఆయన తన రోజులని పెయింటింగ్ వేసుకుంటూ గడుపుతున్నారు. మాఫియా సమాజంలోకి చొరబడే విధానాలు ఎక్కువగా ఆయన చిత్రాలలో కనిపిస్తాయి. ఆయన ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు అతనెవరో సహాయం తీసుకున్న వారు పట్టించుకోలేదని ఆయన అన్నారు.

"తిండి లేక పిల్లలు ఏడుస్తున్నప్పుడు, వ్యాపారం నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు తప్పుడు వ్యక్తుల నుంచి సహాయం తీసుకోవడం వలన వచ్చే ఫలితాల గురించి ఆలోచన ఉండదు. ఆ క్షణానికి కేవలం నీ మనుగడే ముఖ్యం”.
“తరువాత స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు మాఫియా బృంద సభ్యులు ప్రజల దగ్గరకి వెళ్లి , నీకు గుర్తు ఉన్నానా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసాను. ఇప్పుడు నీ సహాయం కావాలి. నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పిన వ్యక్తికి ఓటు వేయడమే”, అని అడుగుతాను.
ఏదైనా విపత్తు వచ్చినప్పుడు వెంటనే ఖర్చు పెట్టడానికి మాఫియా దగ్గర తగినంత డబ్బు ఉంటుందని ముటోలో చెప్పారు.
విపత్కర సమయాల్లో ప్రభుత్వ విభాగాల కన్నా మాఫియా సమర్ధవంతంగా పని చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుందని చెప్పారు.
దక్షిణ ఇటలీ లోని అపులియాలో ఆంటోనియోకి ఒక మాంసం దుకాణం ఉంది. అయితే, లాక్ డౌన్ వలన వ్యాపారం పూర్తిగా పోయింది. కొన్ని రోజుల క్రితం వారి దగ్గర మాంసం కొనుగోలు చేసే వినియోగదారుడు ఒక రోజు వచ్చి అప్పు ఇస్తానన్నారు.
"నేను నా భార్య ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నాం. మా హృదయాలు ద్రవించిపోయాయి. ఏమి జరుగుతుందో మాకు వెంటనే అర్ధం అయింది”.
“నేను నా భార్య ఆ డబ్బు తీసుకోవడానికి అంగీకరించలేదు."

"ఇలా అప్పులు ఇవ్వడం మాఫియా చేసే అతి కీలకమైన వ్యాపారం. ముందు అప్పు ఇస్తారు. తర్వాత బాధలు మొదలవుతాయి”, అని గ్రాటెరి చెప్పారు.
“మాఫియాకి ఎప్పుడూ డబ్బు సంపాదన ముఖ్య ఉద్దేశ్యంగా ఉండదు. కానీ, ఆ వ్యాపారాన్ని కబళించి తమ దగ్గర ఉన్న నల్ల ధనాన్ని న్యాయపరమైన సొమ్ముగా మార్చేందుకు చూస్తారు.”
లాక్ డౌన్ మొదలైన దగ్గర నుంచి దోపిడీకి గురవుతున్నామంటూ చిన్న వ్యాపారుల దగ్గర నుంచి హెల్ప్ లైన్ కి వచ్చే ఫిర్యాదులు 100 శాతం పెరిగాయి.
ప్రభుత్వం వీరికి సహాయం చేయలేని పక్షంలో వీళ్లంతా మాఫియా చేతుల్లో పడే ప్రమాదం ఉందని హెల్ప్ లైన్ లో పని చేసే అత్తిలియో సిమియోన్ అన్నారు.
ఇప్పుడు సంభవించిన విపత్తు చాలా మంది ఇటాలియన్ల జీవితాలని సంక్షోభంలోకి నెట్టేస్తుంది.
"ఇలాంటి పరిస్థితులు మాఫియా కి చాలా లాభాలని చేకూరుస్తాయి, అని ఎంజా రాండో హెచ్చరించారు.

మాఫియా ప్రజలకి అప్పుల రూపంలో సహాయం చేయడానికి ముందే ప్రభుత్వం సహాయ చర్యలు చేపడితే మాఫియా ప్రవేశాన్ని నివారించవచ్చని మాఫియా వ్యతిరేక నిపుణులు చెబుతున్నారు.
అవసరమైన వ్యాపారాలకి 22,000 పౌండ్ల (సుమారు ఇరవై లక్షల రూపాయిల) వరకు అప్పుగా ఇస్తామని ఇటలీ ప్రభుత్వం చెబుతోంది.
కానీ, ప్రభుత్వం నుంచి అప్పు తీసుకోవడానికి మార్సెల్లో సుముఖంగా లేరు.
"అది తిరిగి తీర్చడం చాలా కష్టం. మేము వ్యాపారాలు తెరిచినా సామాజిక దూరం పాటిస్తూనే ఉండాలి. దీంతో వినియోగదారులు తగ్గి , ఆదాయం తగ్గిపోతుంది.
నాకు తెలిసిన రెస్టారంట్ యజమానులు అందరూ ఇలాగే భావిస్తున్నారు. ప్రస్తుతం మమ్మల్ని ఏ ప్రశ్నలూ అడగకుండా మా వ్యాపారాలని మాఫియా కి అమ్మడమే మా దగ్గర ఉన్న ఏకైక మార్గం అని ఆయన అన్నారు.
"నాకు జీవితంలో పెద్ద వైఫల్యం సంభవించినట్లుగా అనిపిస్తోందని మార్సెల్లో అన్నారు. నేను ఎప్పుడూ మాఫియాని సమర్ధించలేదు. నేను నమ్మిన సిద్ధాంతాలన్నిటిని నేను వదులుకోవాల్సి వస్తోంది.
ఇందులో వ్యక్తుల పేర్లు వారి గోప్యత రీత్యా మార్చడమైనది.
ఇల్లస్ట్రేషన్స్: జీలా దస్ట్మాల్చి

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- రెమ్డెసివీర్: కరోనావైరస్పై పోరాడే శక్తి ఈ ఔషధానికి కచ్చితంగా ఉందంటున్న అమెరికా
- మాజీ క్రికెటర్ కంపెనీ రూపొందించిన వెంటిలేటర్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్
- ‘ఆర్థికవ్యవస్థ గాడిన పడాలంటే లాక్డౌన్ త్వరగా ముగించాలి’
- లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయాలో ఎలా నిర్ణయిస్తారు
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో సర్కస్‌లు ఇక అంతరించిపోయినట్లేనా?
- కరోనావైరస్: శ్రీకాళహస్తిలో కోవిడ్ కేసులు హఠాత్తుగా ఎలా పెరిగాయి? ఈ రెడ్ జోన్ గురించి ఎవరేమంటున్నారు
- సామాజిక దూరం పాటించమంటే దేశంలో వ్యతిరేకత ఎందుకు వస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








