కరోనావైరస్: కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్‌ వైపు ఎందుకు చూస్తోంది?

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్‌కు వ్యాక్సీన్ అభివృద్ధి చేసే అంశంలో భారత్, అమెరికాలు కలిసి పనిచేస్తున్నాయని అమెరికా మంత్రి మైక్ పాంపేయో గతవారం చెప్పారు.

రెండు దేశాలు కలిసి అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న టీకా అభివృద్ధి కార్యక్రమంపై గడిచిన 3 దశాబ్దాలుగా కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు.

డెంగీ, డయేరియా, పేగు సంబంధ వ్యాధులు, విష జ్వరాలు, టీబీ వంటి వ్యాధుల్ని అరికట్టేందుకు రెండు దేశాలు కలిసి పని చేస్తూ వచ్చాయి. మరి కొద్ది రోజుల్లో డెంగీ వ్యాక్సీన్ ట్రయిల్స్‌‌ను కూడా త్వరలోనే మొదలుపెట్టబోతున్నాయి.

జనరిక్ డ్రగ్స్, వ్యాక్సీన్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. కీలకమైన ఆరు ముఖ్యమైన టీకాలతో పాటు ఇతర చిన్న టీకాల తయారీకి భారతదేశం కేంద్రంగా నిలిచింది. పోలియో, నిమోనియా, రోటావైరస్, బీసీజీ, మీజిల్స్ (త‌ట్టు), రుబెల్లా వంటి అనేక వ్యాధులకు టీకాలు ఇండియాలోనే తయారవుతాయి.

సీరం ఇన్‌స్టిట్యూట్
ఫొటో క్యాప్షన్, పుణెలో ఉన్న‌ సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ

టీకా తయారీలో ఆరు భారతీయ కంపెనీలు

ప్రస్తుతం దేశంలో సుమారు ఆరు కంపెనీలు కోవిడ్-19 టీకాను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి.

అందులో ఒకటి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అత్యధిక డోసుల టీకాల ఉత్పత్తి, అమ్మకాల ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఇది గుర్తింపు పొందింది.

53 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సంస్థ పుణెలోని రెండు ప్రధాన కేంద్రాల నుంచి సుమారు 150 కోట్ల డోసుల టీకాలను తయారు చేస్తోంది. ఈ సంస్థకు నెదర్లాండ్స్‌‌లోనూ, అలాగే చెక్ రిపబ్లిక్‌లోనూ మరో రెండు చిన్న ప్లాంట్లు ఉన్నాయి. సుమారు 7 వేల మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు.

165 దేశాలకు దాదాపు 20 రకాల వ్యాక్సీన్లను ఈ సంస్థ సరఫరా చేస్తోంది. సుమారు 80 శాతం వ్యాక్సీన్లను అతి తక్కువ ధరల్లోనే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ప్రస్తుతం దేశంలో సుమారు ఆరు కంపెనీలు కోవిడ్-19పై టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం దేశంలో సుమారు ఆరు కంపెనీలు కోవిడ్-19పై టీకాను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికాకు చెందిన బయోటెక్ కంపెనీ కొడాజెనిక్స్‌తో కలిసి “లైవ్ ఎటెన్యువేటెడ్” వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పనిలో నిమగ్నమై ఉన్న 80 కంపెనీల ఇదొకటి.

వైరస్ తీవ్రతను తగ్గించేందుకు లేదా అందులోని వ్యాధికారక కణాలను తగ్గించడం ద్వారా ఈ లైవ్ ఎటెన్యువేటెడ్ టీకా తయారుచేస్తారు. కానీ, ఆ వైరస్ మాత్రం సజీవంగానే ఉంటుంది. ప్రయోగశాలలోనే వ్యాధికారక వైరస్‌ను బలహీన పరిచినా వైరస్ సజీవంగా ఉండటం వల్ల ఒక్కోసారి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

“మేం ఏప్రిల్ నాటికి జంతువులపై ఈ టీకాను ప్రయోగిస్తాం. సెప్టెంబర్ తర్వాత మనుషులపై ప్రయోగాలకు సిద్ధం కాగలమని భావిస్తున్నాం” అని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా ఫోన్‌లో చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

బ్రిటిష్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నేతృత్వంలో జరుగుతున్న టీకా అభివృద్ధి కార్యక్రమంలో కూడా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామిగా ఉంది. జన్యుపరంగా మార్పులు చేసిన చింపాంజీ వైరస్ వీరు అభివృద్ధి చేస్తున్న సరికొత్త టీకాకు మూలం. ఇప్పటికే బ్రిటన్‌లో మనుషులపై ప్రయోగాలు మొదలయ్యాయి. అంతా సవ్యంగా జరిగితే సెప్టెంబర్ నాటికి శాస్త్రవేత్తలు సుమారు పది లక్షల డోసులు తయారు చేసే అవకాశం ఉంది.

“ఈ మహమ్మారిని అంతం చేసి లాక్ డౌన్‌ నుంచి బయట పడాలంటే ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది డోసుల అవసరం ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది” అని ఆక్స్‌ఫర్డ్‌లోని జెన్నర్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన ప్రొఫెసర్ అడ్రిన్ హిల్ బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ జెమ్స్ గాలాఘర్‌కు చెప్పారు.

ఈ వ్యాక్సీన్ తయారీలో భారత్ మిగిలిన దేశాల కన్నా ముందుంది అనడానికి ఇదే నిదర్శనం. పూనావాలా పని చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌కి అదనంగా 40 నుంచి 50 కోట్ల డోసులు తయారు చేసే సామ‌ర్థ్యం ఉంది. “మాకు భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అందుకు తగ్గ పెట్టుబడులు మేం పెట్టాం” అని ఆయన చెప్పారు.

గెలవండి -గెలిపించండి

మరోవైపు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కూడా యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్, అలాగే అమెరికాకు చెందిన ఫ్లుజెన్ సంస్థల భాగస్వామ్యంలో కోవిడ్-19 టీకాను ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు సుమారు 30 కోట్ల డోసులను తయారు చేస్తామని ప్రకటించింది.

జైడస్ కెడిల్లా రెండు టీకాలపై పని చేస్తోంది. అలాగే బయోలాజికల్ ఈ, ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్, మైనావెక్స్ సంస్థలు కూడా వేర్వేరుగా టీకాను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. మరో నాలుగైదు దేశీయ కంపెనీలు కూడా టీకాల తయారీలో ప్రారంభ దశలో ఉన్నాయి.

వ్యాక్సీన్

అత్యుత్తమ స్థాయిలో భారీ ఎత్తున తయారీని సాధ్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది మాత్రం పారిశ్రామిక వేత్తలు, ఫార్మాసూటికల్ కంపెనీలే.

ప్రపంచానికి మంచి చేయాలన్న లక్ష్యంతో పాటు తమ వ్యాపారాన్ని పెంచుకోవాలన్నదే ఈ సంస్థల యజమానుల లక్ష్యం కూడా.

ఓ రకంగా ఇది తాము గెలుస్తూ ప్రపంచాన్ని కూడా గెలిపించడం లాంటిదని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌ధాన శాస్త్ర‌వేత్త‌ సౌమ్య స్వామినాథన్ అన్నారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

భ్రమలు వద్దు

అయితే, ఇప్పటికిప్పుడు మార్కెట్లోకి వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చేస్తుందన్న భ్రమల్లో మాత్రం ప్రజలు ఉండవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

“మరి కొంతకాలం పాటు ప్రజలు ఈ కరోనావైరస్ భయంతో బతకాల్సిందే. ఎందుకంటే కచ్చితంగా టీకాను విజయవంతంగా అభివృద్ధి చేయగలం అన్న గ్యారంటీ ఏం లేదు” అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో గ్లోబల్ హెల్త్ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ డేవిడ్ నెబ్రో అన్నారు.

“కరోనావైరస్‌ టీకా ఒక్కోసారి దుష్పరిణామాలకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది” అని వెర్మాంట్ మెడికల్ సెంటర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు టిమ్ లహే ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోవిడ్-19 కేసులు 25 లక్షలు దాటిపోయాయి. మరణాల సంఖ్య 2 లక్షలు దాటింది. ఈ పరిస్థితుల్లో భారీ ఎత్తున సురక్షితమైన వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసేందుకు కచ్చితంగా కొంత సమయం పడుతుంది. ప్రయోగశాలలో తయారైన టీకాను కచ్చితంగా అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతే ప్రపంచానికి విడుదల చేయాలి.

“బహుశా రెండేళ్లు లేదా అంత కన్నా తక్కువ సమయంలోనే అత్యంత సురక్షితమైన టీకాను అభివృద్ధి చేయగలమని మేం అనుకుంటున్నాం” అని పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)