కరోనావైరస్: అడుగడుగునా భయం.. భరించలేని మానసిక ఒత్తిడి.. కోవిడ్-19 బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యుల వెతలు

కరోనావైరస్:తీవ్రమైన మానసిక ఒత్తిడిలో కోవిడ్-19రోగులకు చికిత్సనందిస్తున్న వైద్యులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:తీవ్రమైన మానసిక ఒత్తిడిలో కోవిడ్-19రోగులకు చికిత్సనందిస్తున్న వైద్యులు

డాక్టర్ మిలింద్ బల్దీ కోవిడ్-19 వార్డులో డ్యూటీలో ఉండగా ఓ 46 ఏళ్ల వ్యక్తి తీవ్ర మైన శ్వాస కోశ ఇబ్బందులతో ఆస్పత్రికి వచ్చారు.

ప్రాణ భయంతో ఉన్న ఆయన... ‘‘నేను బతుకుతానా ?’’ అంటూ పదేపదే ప్రశ్నించాడు.

చాలా దీనంగా...“దయచేసి నన్ను రక్షించండి. నాకు చావాలని లేదు” అంటూ ప్రాథేయపడుతున్నాడు.

తన ప్రయత్నాలన్నీ తాను చేస్తానని భయపడాల్సినవసరం లేదని డాక్టర్ బల్దీ ఆయనకు హామీ ఇచ్చారు.

కానీ అదే వారిద్దరి మధ్య జరిగిన చివరి సంభాషణ. రెండు రోజులపాటు వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆ తర్వాత చనిపోయారు.

ఇండోర్‌లో ఓ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ బల్దికి ఆ రోగిని ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆ బాధాకరమైన క్షణాలు ఇప్పటికీ ఆయన కళ్లముందు మెదులుతునే ఉన్నాయి.

డాక్టర్ బల్దీ
ఫొటో క్యాప్షన్, డాక్టర్ బల్దీ

“నా చేతులు పట్టుకున్నాడు. కళ్ల నిండా బాధ, భయం నింపుకొని ఉన్న ఆయన ముఖాన్ని నేను నా జీవితంలో మరిచిపోలేను.” అని ఆ బాధకర సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆయన మరణం డాక్టర్ బల్దీని తీవ్ర వేదనకు గురి చేసింది.

క్రిటికల్ కేర్ వార్డుల్లో రోగులు చనిపోవడాన్ని చూడటం ఆయనలాంటి వైద్యులకు కొత్తేం కాదు. కానీ కోవిడ్-19 వార్డులో పని చేసే సమయంలో ఉండే మానసిక ఒత్తిడిని దేనితోనూ పోల్చలేమని ఆయన అన్నారు.

చాలా మంది కరోనావైరస్ రోగుల్ని ఐసొలేషన్లో ఉంచుతారు. ఒక వేళ వాళ్లు తీవ్రంగా జబ్బు పడితే వారి చివరి క్షణాల్లో చూడగలిగేది కేవలం డాక్టర్లను, నర్సులను మాత్రమే.

కరోనావైరస్:మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వైద్యులే మార్గం వెతుక్కోవాలంటున్న డా.ఫతేయుద్ధీన్
ఫొటో క్యాప్షన్, కరోనావైరస్:మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వైద్యులే మార్గం వెతుక్కోవాలంటున్న డా.ఫతేయుద్ధీన్

ఆ శూన్యం నన్ను ఎప్పటికీ వెంటాడుతునే ఉంటుంది

“ఏ వైద్యుడు కూడా ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకోడు.” అని కేరళలోని ఎర్ణాకులం మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్‌లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ ఫతేహుద్దీన్ అన్నారు.

సాధారణంగా ఇటువంటి భావోద్వేగ భారాన్నిరోగి కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరితో పంచుకుంటూ ఉంటారు వైద్యులు.

కానీ కోవిడ్-19 వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు.

తమ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిన కోవిడ్-19 రోగి కళ్లల్లోని శూన్యాన్ని తానెప్పటికి మర్చిపోలేనని డాక్టర్ ఫతేయుద్ధీన్ చెప్పుకొచ్చారు.

“ఆ వ్యక్తి మాట్లాడలేడు. కానీ కళ్లల్లో మాత్రం ఆయన అనుభవిస్తున్న వేదన, భయం స్పష్టంగా కనిపించాయి.“ అని చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

ఆ పరిస్థితుల్లో తాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయానని తెలిపారు డాక్టర్ ఫతేయుద్ధీన్. కారణం ఆ రోగి మరణానికి చేరువలో ఉండటమే. అయితే అంత క్లిష్టమైన సమయంలో తనకు కాస్త ఊరట కల్గించే విషయం.. అదే ఆస్పత్రిలో ఆయన భార్య కూడా కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందుతూ ఉండటం. అన్ని ఫతేయుద్ధీన్ అన్నారు.

ఆ పరిస్థితుల్లో వెంటనే ఆయన భార్యను వార్డు దగ్గరకు తీసుకొచ్చారు. ఆ కొద్ది క్షణాలు ఆయన వైపే చూస్తూ ఉండమన్నారు. కనీసం తన భార్య దగ్గరుందన్న సంతృప్తి అయినా ఆయనకు మిగులుతుందన్నది డాక్టర్ ఫతేయుద్ధీన్ ఆశ. మరోవైపు తమ 40 ఏళ్ల వైవాహిక అనుబంధం ఇలా ముగుస్తుందని కల్లో కూడా ఆనుకోలేదు ఆయన భార్య.

ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు ఫతేయుద్ధీన్. అయితే చివరి క్షణాల్లో కనీసం ఆయన భార్యను చూడగల్గేలా చేయడం కాస్త సంతృప్తినిచ్చిందని చెప్పారు.

“కానీ అన్ని సార్లు అలా జరగదు. కొన్ని సార్లు తమ ప్రియమైన వారికి వీడ్కోలు కూడా పలకకుండానే కొందరు చనిపోతుంటారన్నది నమ్మి తీరాల్సిన నిజం.” అని ఆయన అన్నారు.

డాక్టర్ మీర్ షానవాజ్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ మీర్ షానవాజ్

మేం కూడా మనుషులమే కదా!

చాలా మంది వైద్యులు తమ కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐసోలేషన్లో ఉంటున్నారు. ఈ పరిస్థితి మానసికంగా వారిని తీవ్రమైన భావోద్వేగాలకు గురి చేస్తోంది.

శ్రీనగర్‌లోని ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ మిర్ షహనవాజ్ మాటలే అందుకు నిదర్శనం.

“మేం కేవలం ఈ వ్యాధితో మాత్రమే పోరాడటం లేదు. మా కుటుంబాలను తిరిగి ఎప్పుడు చూస్తామో మాకు తెలియదు. దాంతో పాటు ఏ క్షణమైనా కోవిడ్-19 సోకవచ్చన్న భయం ఎప్పుడూ మమల్ని వెంటాడుతూనే ఉంటుంది.

వీటన్నింటితో పాటు రోగులు పడుతున్న మానసిక సంఘర్షణ మమల్ని మరింత ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటుంది. వాళ్ల భయాన్ని మేం పోగొట్టాలి. వాళ్లకు వైద్యం చేస్తూనే ఓ స్నేహితుడిలా వ్యవహరించాలి. వాళ్ల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడూ వారికి ధైర్యం చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎలా ఉంటామో ఒక్కసారి ఊహించుకోండి.” అంటూ తాము పడుతున్న మానసిక సంఘర్షణను వివరించారు.

ఈ పరిస్థితుల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతామని డాక్టర్ షెహనవాజ్ తెలిపారు.

“రాత్రి రూంకి వెళ్లిసరికి ఒక్కసారిగా అన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు ఏదో తెలియని భయం మొదలవుతుంది. మా పరిస్థితి ఎలా ఉంటుందో మాకే తెలియదు. డాక్టర్లంటే ప్రాణం పోసేవాడని అంటారు. రోగుల ప్రాణాలు కాపాడటానికి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం. కానీ మేం కూడా మనుషులమే కదా.. మాకు భయం ఉంటుంది కదా.” అని తన ఆవేదనను వ్యక్తం చేశారు షెహనవాజ్.

తమ ఆస్పత్రిలో కరోనావైరస్ కారణంగా మొదటసారిగా ఓ రోగి మరణించినప్పుడు వారి కుటుంబసభ్యులు ఆ మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఉందని తెలిసినప్పుడు తన సహచరుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడని ఆయన చెప్పారు.

“తమ వాళ్లు నవ్వుతూ మరణించాలని, వారితో చివరి సారిగా మాట్లాడాలని ఏ కుటుంబ సభ్యులైనా భావిస్తారు. ఎందుకంటే అవే వారికి జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు. కానీ కరోనావైరస్ కారణంగా మరణించిన తమ ప్రియతములకు కనీసం కన్నీటి వీడ్కోలు కూడా చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.“ అని అన్నారాయన.

కచ్చితంగా ఆ మానసిక ఒత్తిడికి తగిన పరిష్కారం చూపాలి. అటు రోగులకు, ఇటు వైద్యులకు ఈ పరిస్థితుల్లో సేవలందించేందుకు కచ్చితంగా ఓ మానసిక వైద్య నిపుణుని అవసరం ఎంతైనా ఉందని ఫతేయుద్ధీన్ అభిప్రాయపడ్డారు.

హెల్త్ కేర్ వర్కర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరో మమ్మల్ని చావుకు దగ్గరగా తీసుకెళ్తున్నట్టు ఉంటోంది

ఈ సమస్య కేవలం కోవిడ్-19 వార్డుల్లో పని చేస్తున్న వైద్యులకు మాత్రమే పరిమితం కాలేదు... వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు, కమ్యూనిటీ హెల్ వర్కర్లు, ఇతర అధికారులు కూడా ఇప్పుడు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

డాక్టర్ వర్షా సక్సేనా... జైపూర్‌లో కోవిడ్-19 అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం ఆమె పని. రోజూ చావుతో చెలగాటమాడుతున్నానన్న సంగతి తనకు తెలుసని అంటున్నారామె.

“మరో మార్గం లేదు. జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చెయ్యని యుద్ధం ఇది. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చెయ్యకూడదు.” అని ఆమె అన్నారు.

అదే సమయంలో తనలా పని చేస్తున్న వారికీ సరైన రక్షణ సామాగ్రి లేకపోవడం కూడా చిక్కుల్లో పడేస్తోందని డాక్టర్ వర్షా చెప్పారు.

“మాకు ఎక్కడ ఆ వ్యాధి సోకుతుందోనన్న భయం ఎప్పుడూ వెంటాడుతునే ఉంటుంది. మేం ఆ భయంతోనే బతకాలి. అయితే ఇలాంటి ప్రతికూల ఆలోచనల్ని దూరంగా ఉంచడానికి నిరంతరం మేం పోరాడుతునే ఉండాలి. కొన్ని సార్లు వ్యాధి సోకినా ఆ లక్షణాలు కనిపించవు. ఫలితంగా మా కారణంగా మరింత మంది వ్యాధి బారిన పడుతుంటారు. అందుకే క్షేత్ర స్థాయిలో పని చేసే వైద్యులకు తగిన రక్షణ సామాగ్రి అందజేయాలి. ” అని డాక్టర్ వర్ష తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆ మానసిక ఒత్తిడి కొన్ని సార్లు ఇంటి వరకు వస్తుంది. తన భర్త కూడా వైద్యుడేనని రాత్రి ఇద్దరం ఇంటికి చేరుకునేసరికి వండుకునే ఓపిక కూడా ఉండదని ఆ సమయంలో బ్రెడ్ తిని సరిపుచ్చుకుంటున్నామని వర్షా తన పరిస్థితిని వివరించారు.

డాక్టర్ వర్షాతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్నారు అఖీల్ ఖాన్. వైద్య బృందాలతో కలిసి తనలా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న అధికారులు సహా అందరిపైనా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటోందని,

ఎవరో తమను చావుకు దగ్గరగా తీసుకెళ్తున్నారన్న భయం కొందరిలో నెలకొంటోందని ఆయన తెలిపారు.

తన కుటుంబానికి కూడా దూరంగా నివసిస్తున్నానని ఖాన్ చెప్పారు. ఫలితంగా తన కుమార్తె పుట్టిన రోజుకు కూడా ఇంటికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఇంటికి వెళ్లి కనీసం దూరం నుంచైనా కన్న బిడ్డను చూడమని మనసు చెబుతోంది. కానీ కానీ బుద్ధి మాత్రం వద్దని హెచ్చరిస్తోంది. ఈ ఒత్తిడిని భరించడం చాలా కష్టం. అలాగని మా వృత్తికి ద్రోహం చెయ్యలేం. ఈ యుద్ధం నుంచి విజయవంతంగా బయటపడతామన్న ఆశతోనే ముందుకెళ్తున్నాం.”

డాక్టర్

మాకు మీ ప్రేమ కావాలి

కోవిడ్-19తో జరుగుతున్న పోరాటంతో సంబంధం లేని వైద్యులు, నర్సులకు ప్రమాదం లేదని చెప్పడానికి కూడా లేదు.

ఇతర సమస్యలతో కూడా చాలా మంది ఆస్పత్రులకు వస్తుంటారు. అలాంటి కొందరిలో కూడా కరోనావైరస్ లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. కరోనావైరస్ ప్రాథమికంగా మన జీవితాల్నే మార్చేసిందంటున్నారు కశ్మీర్లోని జీఎంసీ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ మొహిసిన్ బిన్ ముస్తాఖ్.

అఖీల్ ఖాన్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ అఖీల్ ఖాన్

తాము రోజూ ఇతర సమస్యలతో వస్తున్న రోగుల్ని పరీక్షిస్తూ ఉంటామని. వారిలో కూడా కొందరు కోవిడ్-19 బాధితులు ఉండొచ్చని ఆయన అన్నారు. ఇక కోవిడ్-19 రోగులకు చికిత్స చేస్తున్న కొందరు వైద్యులు మరణించడం, మరి కొందరికి పాజిటివ్ రావడం తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంటుందని ముస్తాక్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగని చేసేదేం లేదని, వీలైనంత వరకు మానసికంగా ధైర్యంగా ఉంటూ తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమేనని అన్నారాయన.

డాక్టర్ మెహనజ్ భట్, డాక్టర్ సర్తాజ్ భట్ కూడా అదే ఆస్పత్రిలో పని చేస్తున్నారు. తమలో కూడా ప్రస్తుతం అదే భయం నెలకొని ఉందని వారన్నారు.

ఇటీవల ఓ వ్యక్తికి కరోనా లక్షణాలో తమ ఆస్పత్రికి వచ్చారని వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తే వారి కుటుంబ సభ్యులు మా మాట వినకుండా ఇంటికి తీసుకెళ్లిపోయారని చివరకు పోలీసుల ద్వారా ఆయన్ను ఆస్పత్రికి రప్పించాల్సి వచ్చిందని డాక్టర్ సర్తాజ్ చెప్పారు. తన కెరియర్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. వాళ్లకు చికిత్స చేయాలంటే తమకు కూడా భయం వేస్తుందని చెప్పుకొచ్చారు.

డాక్టర్ మెహనాజ్, సర్తాజ్

“ఈ మధ్య కాలంలో మేం రోగితో దగ్గరగా మెలగడాన్ని పూర్తిగా తగ్గించాం. నిజానికి ఇటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో మాకెలాంటి శిక్షణ లేదు. చాలా మార్పులు చాలా త్వరగా జరిగిపోతున్నాయి. ఇది తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది.” అని డాక్టర్ మెన్హజ్ భట్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా కొందరు వైద్యులు, నర్సులపై జరుగుతున్న దాడులు కూడా వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

“మా ప్రాణాలను ఫణంగా పెట్టి మీ ప్రాణాలు కాపాడుతున్న వైద్యులపై కొందరు ఎందుకు దాడులకు దిగుతున్నారో అర్థం కావడం లేదు. మాకు మీ ప్రేమ కావాలి. మీ వల్ల భయం కాదు.” అన్ని అన్నారామె.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)