కరోనావైరస్: భారత్‌లో చిన్నారుల ఆరోగ్యంపై లాక్ డౌన్ ప్రభావం చూపుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది చిన్నారులు చిక్కుల్లో పడ్డారు.
దేశవ్యాప్తంగా రోజూ వేల మంది చిన్నారులు రోజూ హెల్ప్ లైన్లకు కాల్ చేస్తున్నారు, మరెన్నో వేల మంది ఆకలితో అలమటిస్తూనే నిద్రపోతున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైన భారత్‌లో అత్యధికంగా సుమారు 47.2 కోట్ల మంది చిన్నారులున్నారు. తాజా లాక్ డౌన్ ప్రభావం సుమారు 4 కోట్ల మంది నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలపై పడిందని అంచనా.
వారిలో గ్రామాల్లో పొలాల్లో పని చేసేవారు, నగరాల్లో చెత్త ఏరుకునే వారు, రోడ్ల కూడళ్లలో బెలూన్లు, పెన్నులు అమ్ముకునేవారు.. ఇలా ఎందరో ఉన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
దేశ వ్యాప్తంగా నగరాల్లో రోడ్లపై, ఫ్లైఓవర్ల కింద, ఇరుకైన వీధుల్లోను, ఫుట్ పాత్‌లపై నివసించే లక్షలాది మందికి ప్రస్తుతం నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చేతన స్వచ్ఛంద సంస్థ డైరక్టర్ సంజయ్ గుప్తా. ఈ సంస్థ దిల్లీలోని వీధి బాలలు, బాల కార్మికుల బాగోగుల్ని చూస్తూ ఉంటుంది.
“లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. మరి వీధి బాలల సంగతేంటి? వాళ్లు ఎక్కడికి వెళ్లాలి?” అని ఆయన ప్రశ్నించారు.
దిల్లీలో సుమారు 70వేల మంది వీధి బాలలు ఉంటారని ఓ అంచనా. కానీ వాస్తవానికి వారి సంఖ్య అంత కన్నా ఎక్కువే ఉండవచ్చని అంటారు సంజయ్ గుప్తా. అంతే కాదు సాధారణంగా వాళ్లంతా ఎవరికి వారే బతుకుతుంటారని చెబుతారు.
“ఇప్పటి వరకు వాళ్ల బతుకు వాళ్లే బతికేవారు. బహుశా వాళ్ల జీవితంలో వేరొకొరిపై ఆధారపడాల్సి రావడం ఇదే మొదటిసారి కావచ్చు” అని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
“కానీ వాళ్లకీ ఈ వ్యవస్థకూ ఎలాంటి సంబంధం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లను చేరుకోవడం కూడా అంత సులభం కాదు. ఈ కర్ఫ్యూ ఇలాగే కొనసాగితే మా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కూడా ఎక్కడికీ వెళ్లలేరు“ అని ఆయన అన్నారు.
వాళ్లను చేరుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే చేతన వంటి స్వచ్ఛంద సంస్థల్ని తప్పనిసరి సేవల విభాగం కింద గుర్తించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
వీడియో సందేశాలు
అందుకే తాము ఆ పిల్లల్ని ఎప్పటికప్పుడు సంప్రదించేందుకు వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్నామని గుప్తా చెప్పారు.
“ఆ పిల్లల్లో చాలా మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. సాధారణంగా వాళ్లంతా గుంపులు గుంపులుగానే ఉంటారు. అందుకే వాళ్లకు ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మెసేజ్‌ల రూపంలో, టిక్ టాక్ వీడియోల రూపంలో పంపుతూ ఉంటాం” అని అన్నారు.
తిరిగి వాళ్లు వీడియో మేసేజ్‌లను కూడా సంజయ్‌కి పంపుతుంటారు. వాటిల్లో ఆయన కొన్ని నాకు పంపించారు. వాటిని చూస్తుంటే వాళ్ల జీవితాల్లో నెలకొన్న భయం, అనిశ్చితి కళ్లకు కడతాయి.
వాటిల్లో ఓ వీడియోలో ఓ వీధి బాలుడు ఇలా చెప్పుకొచ్చారు... “కొన్ని సార్లు కొంత మంది వచ్చి ఆహారాన్ని ఇస్తారు. వాళ్లెవ్వరో నాకు పెద్దగా తెలియదు. కానీ వారిచ్చేది చాలా కొంచెమే ఉంటుంది. అది కూడా రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే దొరుకుతుంటుంది.”
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
లాక్ డౌన్ పేరుతో వాళ్లను మంచినీళ్లు, వంట చెరకు తెచ్చుకునేందుకు కూడా అనుమతించడం లేదు.
“ఇలాగైతే మేం ఎలా బతకగలం? ప్రభుత్వం కచ్చితంగా మాకు సాయం చేయాలి” అని ఓ చిన్నారి ఆ వీడియోలో వేడుకున్నాడు.
అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం వారికి కావాల్సిన సాయం అందిస్తున్నామని చెబుతున్నాయి. దిల్లీ విషయానికే వస్తే వీధి బాలలకు, దయనీయమైన స్థితిలో ఉన్న కుటుంబాలకు రోజూ ఆహారాన్ని అందిస్తున్నామని బాలల హక్కుల కమిషన్ చెబుతోంది. ఇతర నగరాల్లో కూడా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు నిరాశ్రయులైన చిన్నారులకు ఆహారాన్ని అందిస్తున్నాయి.
కానీ ప్రస్తుతం సమస్య తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో వారికి కచ్చితంగా మూడు పూట్లా ఆహారం అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సంజయ్ గుప్తా అంటున్నారు.
నిన్న మొన్నటి వరకు రోడ్లపై కనిపించే చాలా మంది చిన్నారులు ఇప్పుడు కనిపించడం లేదని వాళ్లుండే ప్రాంతాలను గుర్తించడం అంత సులభం కాదని ఆయన చెప్పుకొచ్చారు. వాళ్ల సంఖ్య వేలల్లోనే ఉంటుందని వాళ్లు ఎక్కడ ఉన్నారో తమకు కూడా తెలియడం లేదని గుప్తా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హెల్ప్ లైన్‌కు లక్షల సంఖ్యలో ఫోన్లు
చిన్నారులకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసిన 24 గంటల అత్యవసర సేవల విభాగానికి మార్చి 24న లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి రోజూ వచ్చే ఫోన్ల సంఖ్య భారీగా పెరిగింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1098 హెల్ప్ లైన్ నెంబర్‌కి గతంలో వారానికి 2 లక్షల ఫోన్లు వస్తే.. ఇప్పుడు వాటి సంఖ్య 3 లక్షలకు చేరింది.
దేశంలోని మొత్తం 718 జిల్లాలకు గాని 569 జిల్లాల్లోనూ, 128 రైల్వే స్టేషన్లలోనూ ఈ హెల్ప్ లైన్ సౌకర్యం ఉంది. గతంలో పిల్లలపై వేధింపులు, హింస, తప్పిపోయిన వారి గురించి ఆ హెల్ప్ లైన్లకు ఫోన్లు వస్తుండేవి. కానీ ఇప్పుడు మాత్రం రోజూ వందలాది ఫోన్లు కరోనా మహమ్మారి గురించే వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఫోన్ చేసే వాళ్లలో పిల్లలు ఉంటున్నారు. అలాగే వారి తరపున అడిగే పెద్దలు కూడా ఉంటున్నారు. కొందరు ఆహారం కోసం ఫోన్ చేస్తుంటే, చాలా మంది కరోనావైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాల కోసం, వైద్య సాయం ఎక్కడ అందుతుందో తెలుసుకోవడం కోసం ఫోన్లు చేస్తున్నారు. చాలా మంది పిల్లలో కోవిడ్-19 విషయంలో తమ భయాందోళనల్ని కూడా ఫోన్లో చర్చిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇళ్లల్లో ఉండే చిన్నారుల పరిస్థితి ఆందోళనకరమే!
"ఇక ఇళ్లలో ఉండే చిన్నారుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంటోంది. చాలా మంది విద్యార్థుల స్కూల్ ఫైనల్ పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయి. భవిష్యత్ ఏంటన్న విషయంలో వారికి ఎలాంటి స్పష్టతా లేదు" అని బాలల హక్కుల కార్యకర్త భర్తీ అలీ అన్నారు.
"ఇంటి దగ్గర తల్లిదండ్రులు అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు, పదే పదే చేతులు కడుక్కోండి, శానిటైజర్లు వాడండి.. అంటూ చెబుతునే ఉంటున్నారు. ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పులపై వారు ఆసక్తిగా ఉన్నారు. అలాగే అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. అయితే ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు ఆ చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు.
పిల్లలు అదే పనిగా ఈ కరోనావైరస్ గురించి చదవడం, చూడటం వల్ల వారికి చిన్న పాటి దగ్గు, జలుబు వచ్చినా వారిలో ఆందోళన పెరిగిపోతోందని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ సంస్థ సభ్యురాలు డాక్టర్ ప్రీతి వర్మ అన్నారు.
“మొదట్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వడం, హోంవర్కులు లేకపోవడంతో వాళ్లు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ లాక్ డౌన్ కొనసాగుతుండటం, రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో చాలా మందిలో భయం పెరుగుతోంది” అని ఆమె చెప్పారు.
“ఇప్పుడు వాళ్లు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. వాళ్ల స్నేహితులకు, చుట్టూ ఉన్న సమాజానికి దూరమయ్యారు. ఓ రకంగా వాళ్లలో నిర్లిప్తత మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి ఇది తీవ్రం కావచ్చు కూడా” అని ప్రీతి వర్మ హెచ్చరించారు.
ఇటువంటి పరిస్థితుల్లో వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారిలో ధైర్యాన్ని కల్గించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని డాక్టర్ ప్రీతి వర్మ సూచించారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: లాక్డౌన్లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్జెండర్ల ఇబ్బందులు
- కరోనావైరస్: కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగలదా
- కరోనావైరస్తో కరువు బారిన పడనున్న 50 కోట్ల ప్రజలు - ఐక్య రాజ్య సమితి నివేదిక
- కరోనావైరస్: తుర్క్మెనిస్తాన్లో కోవిడ్-19 కేసులు ఎందుకు నమోదు కావటం లేదు?
- కరోనావైరస్ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా
- కరోనా వైరస్‌పై వియత్నాంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎలా పోరాడుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








