భారతదేశం లాక్ డౌన్‌ని ఎందుకు పొడిగిస్తుంది? తొలగిస్తే ఎదురయ్యే ప్రమాదాలేంటి?

ఇండియా లాక్‌డౌన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్‌ని పొడిగిస్తారా? పొడిగిస్తారనే చెప్పవచ్చు.

ప్రభుత్వం మార్చి 24 వ తేదీన 100 కోట్లకు పైగా జనాభా ఉన్న 2 .9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకి కళ్లెం పెడుతూ ప్రజలంతా ఇంటి వద్దనే ఉండాలని కచ్చితమైన నిర్బంధం విధించింది. రైళ్లు, విమాన సేవలు, రోడ్డు ప్రయాణాలను కూడా నిలిపివేసింది.

ఇప్పటికే దేశంలో 5000 మందికి పైగా కరోనా బారిన పడగా 150 మందికి పైగా మరణించారు. రోజు రోజుకి చేస్తున్న వైద్య పరీక్షలు పెరుగుతున్న కొలది అసలు చిత్రం బయటకి వస్తోంది.

ఈ వైరస్ కొన్ని సామాజిక నివాస ప్రాంతాలలో వ్యాపించడం మొదలైనట్లు, కొన్ని కొత్త ప్రాంతాలలో వైరస్ సోకినట్లు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఈ ఇన్ఫెక్షన్లు మరింత వ్యాపించే అవకాశం ఉంది.

దీనిని అరికట్టడానికి కఠినమైన నిర్బంధం అమలు చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఇంకా ఇన్ఫెక్షన్ వ్యాప్తి తొలి దశలోనే ఉన్నట్లు కొంత మంది వైరాలజిస్టులు చెప్పారు. ఎంత మందికి కచ్చితంగా ఈ వైరస్ సోకింది, సామూహిక రోగ నిరోధక శక్తి పెరిగి ఎంత మంది కోలుకున్నారు అనే విషయాలకి సంబంధించిన సమగ్రమైన సమాచారం భారత్ దగ్గర ఇంకా లేదు. (యాంటీబాడీస్‌ను పరిశీలించిందేకు ఇప్పుడిప్పుడే చాలా తక్కువ స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు)

భారతదేశంలో ఉన్న 718 జిల్లాల్లో 250కి పైగా జిల్లాల్లో ఇన్ఫెక్షన్ సోకినట్లు నమోదు అయింది. ఇన్ఫెక్షన్ కి గురైన వారిలో మూడొంతుల మంది ఏడు రాష్ట్రాలలో ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ని పొడిగించమని అడుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందుతున్న సమూహాలు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుతో సహా ఆరు రాష్ట్రాలలో ఉన్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి
కరోనా టెస్టింగ్ ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

ఏఏ రంగాలపై ఎంతెంత ప్రభావం?

ఈ లాక్ డౌన్ దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ఇప్పటికే ప్రభావం చూపించడం మొదలు పెట్టింది. వైరస్ వ్యాప్తికి హాట్ స్పాట్ లుగా గుర్తించిన చాలా ప్రాంతాలు దేశ ఆర్ధిక వ్యవస్థకి అధిక మొత్తంలో ఆదాయాన్ని చేకూర్చేవి.

దేశంలో మూడొంతుల పన్ను వసూళ్లు మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరుగుతాయి. ఈ నగరంలో ఇప్పటికే 500 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడగా 45 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు సామాజికంగా వ్యాప్తి చెందడం మొదలైందని అధికారులు చెబుతున్నారు. మాస్క్‌లు ధరించడాన్ని ముంబై నగరం తప్పని సరి చేసింది.

వైరస్ హాట్ స్పాట్ లుగా గుర్తించిన సామాజిక ప్రాంతాలు దేశ ఉత్పత్తి రంగానికి కేంద్రాలు. ఇక్కడ వైరస్ వ్యాప్తి జరుగుతుందంటే ఇవి మరింత కాలం లాక్ డౌన్‌లో ఉండే అవకాశం ఉంది.

దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో సగం వాటా ఉండే కొన్ని సేవలు కూడా మరి కొంత కాలం లాక్ డౌన్‌లో ఉండే అవకాశం ఉంది.

వలస కార్మికులకి పని కల్పించే నిర్మాణ రంగం కూడా ఇప్పట్లో పనులు మొదలు పెట్టలేదు. లాక్ డౌన్ తర్వాత నిరుద్యోగ శాతం 20 పైనే పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఒక నివేదికలో తెలిపింది.

ప్రస్తుతానికి ప్రభుత్వాలు అన్నీప్రజలు బ్రతకడానికి అవసరమయ్యే వ్యవసాయం మీద దృష్టి పెట్టి, ఆహార సరఫరాకి కొరత రాకుండా చూడాలని ఆర్ధిక వేత్తలు సూచిస్తున్నారు.

భారతదేశంలో సగం జనాభా పొలాల్లో పని చేస్తుంది. శీతాకాలపు పంట అమ్మే సమయంలో, ఎండాకాలపు పంటలు వేసే సమయంలో ఈ లాక్ డౌన్ విధించారు. మొదట పండిన పంటని అమ్మి, కొత్త పంట వేయడమే ఇప్పుడు రైతుల ముందున్న పెద్ద సవాలు.

సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకుంటూ, ఈ పంటల్ని రైతుల దగ్గర నుంచి సేకరించి, మార్కెట్లకు సరఫరా చేయడానికి ప్రభుత్వం తక్షణమే ట్రక్కులను పంపించే ఏర్పాట్లు చేయగలగాలి.

"గ్రామీణ భారతదేశం దీని వలన ప్రభావితం కాకుండా చూడటమే పెద్ద సవాల్" అని ఆర్థికవేత్త రతిన్ రే అన్నారు.

‘‘నిజానికి, మే నెల అంతా పూర్తిగా నిర్బంధం సాగేటట్లు చూడటం కూడా కష్టమైన విషయమే. నెమ్మదిగా నిర్బంధాన్ని సడలించడం తప్ప ప్రస్తుతానికి ముందు వేరే మార్గం ఏమీ లేదు.’’

రోడ్లపై రాతలు

ఫొటో సోర్స్, Getty Images

లాక్‌‌ డౌన్ తొలగిస్తే ఎదురయ్యే ప్రమాదాలేంటి?

దీని గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. "హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలను పూర్తిగా మూసివేసి, హాట్ స్పాట్ కాని ప్రాంతాల్లో నిర్బంధాన్ని విడతల వారీగా సడలించటం చేస్తేనే మంచిదని, కరోనా వైరస్ నియంత్రణ ప్రభుత్వ సలహా విభాగానికి ముఖ్య అధిపతిగా ఉన్న ఎస్ కె సరిన్ చెప్పారు.

నిర్బంధాన్ని అనేక విడతల్లో సడలించడం, నిర్బంధించడం చేయడానికి ఇతర దేశాల్లాగే భారతదేశం కూడా సన్నద్ధం కావాలని గాబ్రియేల్ లియుంగ్ అనే ఎపిడెమియాలజిస్ట్ చెప్పారు.

‘‘ఈ సమయంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఆర్ధిక, సామాజిక నష్టం రాకుండా కొంత కాలం నిర్బంధం విధించడం, మళ్ళీ కొంత కాలం సడలించడం చేస్తూ ఉండాలి.

అయితే, ఇది ఆయా దేశాలలో ఉన్న పరిస్థితులు, ప్రజల ప్రవర్తనా శైలి మీద కూడా ఆధార పడి ఉంటుంది. ఒక వైపు వైరస్ వ్యాప్తి నియంత్రణ, ఆర్ధిక వ్యవస్థ రక్షణ, మరో వైపు సమాజాన్ని నియంత్రణలో ఉంచడం మధ్య జరిగే ముక్కోణ పోటీని జాగ్రత్తగా నిర్వహించడమే అతి పెద్ద సవాలు.’’

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేవరకూ, టెస్టింగ్ కిట్లు పెరిగి తగిన వైద్య సౌకర్యాలు సమకూర్చుకునే వరకూ లాక్ డౌన్ అంతమవ్వదనేది స్పష్టం అవుతోంది.

కేరళలో పటిష్టంగా పని చేస్తున్న ప్రజా ఆరోగ్య వ్యవస్థ, ప్రభుత్వ పని తీరు కారణంగా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉన్నప్పటికీ, లాక్ డౌన్ ఇప్పట్లో సడలించడానికి లేదని నిపుణులు చెబుతున్నారు.

ఈ లాక్ డౌన్ సడలించడం చాలా దేశాల ముందున్న ఒక క్లిష్టమైన విధాన సమస్య. లాక్ డౌన్ సడలింపు కొత్త ఇన్ఫెక్షన్లకి దారి తీసి, జీవితాలకి, జీవనాధారానికి మధ్య సవాలుగా నిలుస్తుందేమోననే భయం ఉంది.

లాక్ డౌన్ సడలించడం చాలా క్లిష్టంగా కనిపిస్తోందని ఫ్రెంచ్ ప్రధాని ఎడోర్డ్ ఫిలిప్ అన్నారు.

"ఇలాంటి విపత్తు సమయాల్లో నాయకులు 50 శాతం జ్ఞానంతో 100 శాతం నిర్ణయాలు తీసుకుని ఫలితాలు చవి చూడాల్సి వస్తోందని నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రట్ అన్నారు.

అధిక జనాభా, దేశ విస్తీర్ణం, బలహీన ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఉన్న భారతదేశంలో లాక్ డౌన్ సడలింపు ఇంకా కష్టం. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్లి పని చేసే కార్మికులు బహుశా మరే ఇతర దేశంలోనూ ఉండి ఉండరేమో. ఇక్కడ నిర్మాణ రంగానికి, సేవా రంగానికి వలస కార్మికులే వెన్నెముక.

రవాణా సేవలని పునరుద్ధరించకుండా దేశమంతా ఉన్న ఈ వలస కార్మికుల్ని ప్రభుత్వం మళ్ళీ ఎలా వారి వారి పని స్థలాలకి చేరుస్తుంది. ఈ ప్రక్రియలో మళ్ళీ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలా చూస్తుంది? సామాజిక దూరం పాటిస్తూ, స్క్రీనింగ్ చేస్తూ, టెంపరేచర్ పరీక్షించడం కూడా ప్రజా రవాణా వ్యవస్థ మీద పెద్ద భారం మోపుతుంది.

ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సమాధానాలు సులభంగా కనిపించినప్పటికీ నిర్ణయాలు మాత్రం కఠినంగానే కన్పిస్తాయి. లక్షలాది వలస కార్మికుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా భారత ప్రభుత్వం లాక్ డౌన్ ని ప్రకటించింది. ఈ ఇన్ఫెక్షన్ వీరి ద్వారా గ్రామాలకి వ్యాపించిందా లేదా అనేది రానున్న వారాలే చెప్పగలవు. లాక్ డౌన్ ని సడలించే ప్రక్రియలో మళ్ళీ ఇలాంటి తప్పులే చేస్తే భరించే స్థితిలో ఈ దేశం లేదు.

"నిర్బంధాన్ని సడలించే నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేయాలని", తక్షశిల ఇన్స్టిట్యూట్ కి చెందిన నితిన్ పాయ్ అన్నారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు కూడా తగిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి సామాజిక అత్యవసర స్థితిని తలపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆర్ధిక, వైద్య అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ఈ పరిస్థితిని భారత ప్రభుత్వం చాకచక్యంతో ఎదుర్కోగలిగేటట్లు చూడాలి.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)