క‌రోనావైర‌స్: మేడిన్ ఆంధ్రప్రదేశ్ టెస్టింగ్ కిట్లు.. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్న ఏపీ

శాఖ‌లో టెస్టింగ్ కిట్లు సిద్ధం చేసిన ఏపీ ప్ర‌భుత్వం , ఉత్ప‌త్తి పెంచేందుకు ప్ర‌య‌త్నం
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

క‌రోనావైరస్ బాధితుల‌కు చికిత్స అందించేందుకు వైద్యుల‌కు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) సహా వివిధ ర‌కాల సామగ్రి కొర‌త క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దేశంలో అవ‌స‌రాల కోసం చైనా నుంచి పెద్ద సంఖ్య‌లో వాటిని దిగుమ‌తి చేసుకుంటున్నారు. చైనా నుంచి 1.7ల‌క్ష‌ల పీపీఈలు దిగుమ‌తి అయ్యాయి. వాటితో పాటు కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఉన్న నిల్వ ఆధారంగా వివిధ రాష్ట్రాల‌కు వాటిని కేటాయించారు. అయిన‌ప్ప‌టికీ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా లేక‌పోవ‌డంతో ప‌లువురు వైద్యులు బ‌హిరంగంగానే ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పీపీఈలు, టెస్టింగ్ కిట్లు, మాస్కులతో పాటుగా వెంటిలేట‌ర్ల కొర‌త కూడా అధిగ‌మించేందుకు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే కాకినాడ సెజ్ ప‌రిధిలో పీపీఈల త‌యారీ ప్రారంభ‌మైంది. విశాఖ మెడ్ సిటీలో టెస్టింగ్ కిట్లు కూడా సిద్ధం చేసింది.

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

పీపీఈ అవ‌స‌రం ఏంటి?

క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృత‌మ‌వుతున్న త‌రుణంలో ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్ష‌న్ ఎక్విప్‌మెంట్ అవ‌స‌రం పెరుగుతోంది. క‌రోనా బాధితుల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డానికి పూర్తిస్థాయిలో శ‌రీరాన్ని క‌ప్పి ఉంచి, వైర‌స్ నుంచి కాపాడేందుకు త‌గ్గ‌ట్టుగా పీపీఈలు అవ‌సరం.

ఒక రోగికి చికిత్స అందించ‌డానికి ఒక్కో వైద్యుడు 8 గంటల పాటు విధులు నిర్వ‌హిస్తే ముగ్గురు వైద్యులు, మ‌రో ముగ్గురు స‌హాయ‌క సిబ్బందికి క‌నీసంగా ఆరు పీపీఈలు అవ‌స‌రం అవుతాయ‌ని అంచ‌నా.

ఏపీలో బుధ‌వారం ఉద‌యానికి 318 మంది పేషెంట్లు ఆస్ప‌త్రిలో ఉన్నారు. వారికి వైద్యం అందించాల‌న్నా క‌నీసంగా రోజుకి వెయ్యి వ‌ర‌కూ పీపీఈలు అవ‌స‌రం ఉంటాయి. కానీ ప్ర‌స్తుతం అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా లేక‌పోవ‌డంతో అనేక చోట్ల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వైద్యులు కూడా ఉన్న వాటితోనే స‌రిపెట్టుకుంటూ చికిత్స చేయాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

కరోనావైరస్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ పీపీఈ

పీపీఈలు ఇవ్వ‌డం లేద‌ని ప‌లువురు వైద్యుల ఆందోళ‌న‌

వైద్య స‌హాయం అందిస్తున్న వారికి త‌గిన ర‌క్ష‌ణ సామగ్రి లేక‌పోవ‌డంతో కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బందిలో కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే విశాఖ‌లో న‌లుగురు డాక్ట‌ర్లు, మ‌రో ఆరుగురు స‌హాయ‌క సిబ్బందికి అలాంటి ప‌రిస్థితి దాపురించ‌డంతో వారిని కూడా క్వారంటైన్ కి త‌ర‌లించాల్సి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో వైద్యుల‌కు ర‌క్ష‌ణ సామాగ్రి అందించ‌కుండా స‌మ‌స్య‌ల్లోకి నెడుతున్నార‌ని తిరుప‌తికి చెందిన డాక్ట‌ర్ శ్రీధ‌ర్, న‌ర్సీప‌ట్నం ఏరియా ఆస్ప‌త్రి డాక్ట‌ర్ సుధాక‌ర్ వంటి వారు మీడియా సాక్షిగా విమ‌ర్శ‌లు కూడా గుప్పించారు. ప్ర‌భుత్వ తీరుని కూడా వారు త‌ప్పుబ‌ట్టారు. వైద్యుల ప‌రిస్థితి గ‌మ‌నంలోకి తీసుకోవాల‌ని విన్న‌వించారు.

‘వైద్య సిబ్బందికి కిట్లు లోటు లేకుండా చూస్తాం’

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రోగుల‌కు వైద్య సేవ‌లు అందిస్తున్న వారి ర‌క్ష‌ణ‌కు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్ర‌ట‌రీ కే జ‌వ‌హార్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ "పీపీఈ ల విష‌యంలో గానీ, కిట్లు, గ్ల‌వ్స్, శానిటైజ‌ర్లు, మాస్కులు స‌హా ఇత‌ర‌ సామాగ్రి కూడా అందుబాటులో ఉంచుతున్నాం. రాష్ట్రంలో 2ల‌క్ష‌ల వ‌ర‌కూ పీపీఈలు అవ‌స‌రం అవుతాయి. ఇప్ప‌టికే ప్రైవేటు వైద్య క‌ళాశాల‌ల వ‌ద్ద ఉన్న సామాగ్రి కూడా తీసుకున్నాం. కేంద్రం నుంచి కూడా కిట్లు వ‌చ్చాయి. కేసులు పెరిగిన‌ప్ప‌టికీ కొర‌త రాకుండా చూసేందుకు త‌గ్గ‌ట్టుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం. విశాఖ‌లోని మెడ్ టెక్ టెస్టింగ్ కిట్లు త‌యార‌వుతున్నాయి. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కిట్లు త‌యార‌వుతున్నాయి. ఇప్ప‌టికే 1000 కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చాం. 50 నిమిషాల్లోనే టెస్టింగ్ రిపోర్ట్ తెలుసుకునే సామర్థ్యం వ‌చ్చింది. ఒక్క కిట్ తో రోజుకు 20 టెస్ట్ లు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకో వారం రోజుల్లో 10 వేల కోవిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వ‌స్తాయి. పీపీఈల కొర‌త కూడా తీరితే క‌రోనా ఎదుర్కోవ‌డంలో అనేక స‌మ‌స్య‌లు తీరిపోతాయి. వైద్య స‌హాయం అందించ‌డంలో ఎటువంటి జాప్యం రాకుండా చూడ‌గ‌లం.." అంటూ వివ‌రించారు.

తాజాగా విశాఖ‌లో త‌యార‌యిన టెస్టింగ్ కిట్ల‌ను సీఎం జ‌గ‌న్ కూడా ప‌రిశీలించారు. అమ‌రావ‌తిలో ఆయ‌న క్యాంప్ ఆఫీసులో స‌మీక్ష సంద‌ర్భంగా అధికారులు ఆయ‌న‌కు నూత‌నంగా త‌యార‌యిన కిట్లు అందించారు. విశాఖ‌లో త‌యారీలో ఉన్న నిపుణుల‌తో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. వారిని అభినందించారు.

మేడిన్ ఆంధ్రప్రదేశ్ క‌రోనావైర‌స్ టెస్టింగ్ కిట్లు..

సొంతంగా పీపీఈల త‌యారీపై దృష్టి

ఓవైపు కేంద్రం నుంచి, ఇత‌ర మార్గాల్లోనూ ఉన్న అవ‌కాశాలను వినియోగించుకుంటూనే సొంతంగా త‌యారీ కోసం ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా కాకినాడ సెజ్ లో ఉన్న బొమ్మ‌ల తయారీ కేంద్రంలో ఇప్పుడు పీపీఈల త‌యారీకి శ్రీకారం చుట్టింది. వాస్త‌వానికి చైనాకి చెందిన ప‌ల్స్ ఫ్ల‌ష్ సంస్థ ఆధ్వ‌ర్యంలో గ‌త నాలుగేళ్లుగా బొమ్మ‌ల త‌యారీ సాగుతోంది. జీఎంఆర్ ఆధ్వ‌ర్యంలో ఉన్న కాకినాడ సెజ్ లో ఉన్న తొలి ప‌రిశ్ర‌మ‌గా చెప్ప‌వ‌చ్చు. స‌మీప గ్రామాల‌కు చెందిన వంద‌ల మంది మ‌హిళ‌లు ఈ బొమ్మ‌ల త‌యారీలో ఉపాధి పొందుతున్నారు. ప్ర‌స్తుతం లాక్ డౌన్ కార‌ణంగా అక్క‌డ టాయ్స్ ఉత్ప‌త్తి నిలిచిపోయింది.

ఈ నేప‌థ్యంలో త‌యారీలో త‌ర్ఫీదు పొందిన అక్క‌డి సిబ్బందితో పీపీఈలను సిద్ధం చేయించాల‌ని తూర్పు గోదావ‌రి జిల్లా అధికారులు త‌లంచారు. దానికి అనుగుణంగా ఎంపిక చేసిన వారికి శిక్ష‌ణ ఇచ్చి ప్ర‌క్రియ ప్రారంభించారు. శిక్ష‌ణ త‌ర్వాత సోమ‌వారం నుంచే ఈ ప‌ని ప్రారంభ‌మ‌య్యింది. పీపీఈ ల త‌యారీకి అవ‌స‌ర‌మైన సామాగ్రిని ముంబై, కోల్ క‌తా నుంచి దిగుమ‌తి చేసుకుని, సొంతంగా పీపీఈల త‌యారీ కి పూనుకున్నామ‌ని తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్ డి ముర‌ళీధ‌ర్ రెడ్డి తెలిపారు. "ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాల ప్ర‌కారం ఉన్న‌తాధికారుల సూచ‌న‌ల‌తో పీపీఈల త‌యారీకి సిద్ధ‌మ‌య్యాం. మొద‌ట దానికి త‌గిన నిపుణుల‌తో నాలుగు రోజుల పాటు శిక్ష‌ణ ఇచ్చాం. అప్ప‌టికే బొమ్మ‌ల త‌యారీలో అనుభ‌వం ఉండ‌డంతో పీపీఈల‌ను త‌యారు చేయ‌డం వారు వేగంగా నేర్చుకున్నారు. 40 మంది బృందం ప్ర‌స్తుతం ఈ ప‌నిలో ఉంది. రోజూ రెండు వేల సూట్లు సిద్దం చేస్తున్నాం. అది ఇంకా పెంచుతాం. వాటిని ప‌రిశీలించి, వైద్య నిపుణులు చేసిన సూచ‌న‌ల‌కు అనుగుణంగా మార్పులు చేశాం. ఇప్పుడు త‌యార‌వుతున్న పీపీఈలు పూర్తిస్థాయి నాణ్య‌తో ఉన్నాయి" అంటూ బీబీసీకి వివ‌రించారు.

మేడిన్ ఆంధ్రప్రదేశ్ క‌రోనావైర‌స్ టెస్టింగ్ కిట్లు..

‘బాధ్య‌త‌గా భావిస్తున్నాం’

ప్ర‌పంచ‌మంతా తీవ్ర విప‌త్తుని ఎదుర్కొంటున్న వేళ వైద్యుల‌కు అవ‌స‌ర‌మైన పీపీఈల త‌యారీ మాకు అప్ప‌గించ‌డం బాధ్య‌త‌గా భావిస్తున్నామ‌ని తూర్పు గోదావ‌రి జిల్లా డీఆర్డీయే అధికారి హ‌రిహ‌ర‌నాథ్ పేర్కొన్నారు. ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ "ప్ర‌స్తుతం అన్ని చోట్లా పీపీఈల కొర‌త ఉంది. దానిని తీర్చాల్సిన అవ‌స‌రం ఉంది. అలాంటి కీల‌క క‌ర్త‌వ్యాన్ని మాకు అప్ప‌గించారు. ఏపీఎంఎస్ఐడీసీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇది సాగుతోంది. రోజుకి 5వేల పీపీఈలు త‌యారు చేసే స్థాయికి చేరుకుంటాం. స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌ని ఆశిస్తున్నాం. విప‌త్తుని ఎదుర్కోవ‌డంలో బాధ్య‌త నెర‌వేరుస్తాం. ఇప్ప‌టికే అందుకు త‌గ్గ‌ట్టుగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆశించిన రీతిలో ఉన్నాయి. దానికి సంతోషిస్తున్నాం" అంటూ వివ‌రించారు.

పాల్స్ ప్లష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ మిస్టర్ అజయ్ సిన్హా మాట్లాడుతూ 'జిఎంఆర్ గ్రూప్ ఆధ్వ‌ర్యంలో సీఎస్ఆర్ కార్య‌క్ర‌మంలో భాగంగా పీపీఈల త‌యారీకి శ్రీకారం చుట్టాం. త‌యారీలో ఆధునిక సదుపాయాల‌ను ఉప‌యోగిస్తున్నాం అతుకులు లేని మెటల్ డిటెక్షన్ మెషీన్లు, హౌస్ టెస్టింగ్ ఆధారంగా ఉత్ప‌త్తి జ‌రుగుతోంది. వినియోగదారులకు చాలా సురక్షితంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బయో-కాలుష్యం నియంత్ర‌ణ‌కు త‌గ్గ‌ట్టుగా ఉంటాయి. శిక్ష‌ణ అందించిన త‌ర్వాత పూర్తిస్థాయిలో నైపుణ్యం ఉన్న వారితోనే వాటిని త‌యారు చేయిస్తున్నాం. అంటూ వివ‌రించారు.

ఇక ఏపీలో క‌రోనా నియంత్ర‌ణ‌లో పీపీఈల కొర‌త తీర‌డంతో పాటు మెడిక‌ల్ టెస్టింగ్ కిట్లు కూడా అందుబాటులోకి రావ‌డంతో మ‌రిన్ని మెరుగైన సేవ‌లందించే అవ‌కాశం ఏర్ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)