కరోనావైరస్: ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి? ఎలాంటి రోగులకు ఇది అవసరం?

ఇంటెన్సివ్ కేర్

ఫొటో సోర్స్, BBC/SCIENCE PHOTO LIBRARY

ఫొటో క్యాప్షన్, ఇంటెన్సివ్ కేర్
    • రచయిత, మిషెల్ రోబెర్ట్స్
    • హోదా, హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కరోనావైరస్‌కి గురై జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను శనివారం సెయింట్ థామస్ హాస్పిటల్లో చేర్పించారు.

ఇది కేవలం ఆరోగ్యం విషమించకుండా, వైద్యుల సలహా అనుసరించి ముందు జాగ్రత్త కోసం తీసుకున్న చర్య అని 10-డౌనింగ్ స్ట్రీట్ (ప్రధానమంత్రి కార్యాలయం) తెలిపింది.

ఇంటెన్సివ్ కేర్ అంటే ఏమిటి?

ఆరోగ్యం తీవ్రంగా విషమించిన రోగులను అనుక్షణం వైద్యపరంగా గమనిస్తూ, తగిన చికిత్స అందించడానికి హాస్పిటళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటారు.

ఈ యూనిట్లో తక్కువ మంది రోగులు ఉండి, అవసరమైతే ప్రతి రోగిని ప్రత్యేకంగా చూసుకోవడానికి వైద్య సిబ్బంది ఉంటారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అత్యుత్తమ వైద్య పరికరాలు కూడా ఉంటాయి.

బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ కొత్తగా నిర్మించిన నైటింగేల్ హాస్పిటల్లో 4000 ఇంటెన్సివ్ కేర్ పడకలు ఉన్నాయి.

నైటింగేల్ హాస్పిటల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నైటింగేల్ హాస్పిటల్

ఇంటెన్సివ్ కేర్ ఎవరికి అవసరం?

ఇంటెన్సివ్ కేర్ అందించడానికి చాలా కారణాలు ఉంటాయి.

కొంత మంది రోగులకు ఏదైనా శస్త్ర చికిత్స జరిగిన వెంటనే కోలుకోవడానికి ఇంటెన్సివ్ కేర్ అవసరం ఉంటుంది. ఉదాహరణకి, ఏదైనా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు తగిన వైద్యం అందించడానికి ఇంటెన్సివ్ కేర్‌లో రోగిని పెట్టవచ్చు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం మెరుగుపడకపోవటంతో ఆయన్ను ముందు జాగ్రత్త చర్యగా ఇంటెన్సివ్ కేర్‌కి తరలించారు.

కరోనావైరస్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. జాన్సన్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు వెంటిలేటర్ అమర్చలేదు.

ఎటువంటి వైద్యం అందిస్తారు?

ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టిన ప్రతి రోగీ వెంటిలేటర్ మీద ఉండాలనే నియమం ఏమీ లేదు. కొంత మందికి కృత్రిమ ఊపిరి అందించే సీపీఏపీ (కంటిన్యూయస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్) పరికరం వాడి వైద్యం చేస్తారు. ఈ పరికరానికి ఉండే మాస్క్ ద్వారా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందుతుంది. రోగికి ఈ పరికరం వాడేటప్పుడు మత్తు ఇవ్వవలసిన అవసరం ఉండదు. వెంటిలేటర్ వాడేటప్పుడు రోగికి మత్తు ఇవ్వవలసి ఉంటుంది.

ఐసీయూ గది

వెంటిలేటర్లు ఎలా పని చేస్తాయి?

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉండే రోగులకు చికిత్స అందించేందుకు అనేక వైద్య పరికరాలు వాడతారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి అనేక ట్యూబులు, మెషీన్లు, వైర్లు, కేబుళ్లతో కూడిన వైద్య పరికరాలను వారి శరీరానికి తగిలిస్తారు.

వారికి నరాల ద్వారా మందులు, ఇతర చికిత్స అందిస్తారు. ప్రత్యేక ఆహారాన్ని అందిస్తారు.

సెయింట్ థామస్ హాస్పిటల్ వైద్యులకు ఇంటెన్సివ్ కేర్‌లో రోగులకు చికిత్స అందించే అనుభవం ఉంది. కొన్ని తీవ్రంగా విషమించిన కేసుల్లో ఈసీఎంవో (ఎక్స్‌ట్రాకార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజెనేషన్) అనే లైఫ్ సపోర్ట్ పరికరాన్ని కూడా వాడతారు. ఇది కృత్రిమంగా గుండె, ఊపిరితిత్తులు చేసే పని చేస్తుంది. ఇలాంటి మెషీన్లు బ్రిటన్‌లో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

ఇంటెన్సివ్ కేర్ నుంచి కోలుకోవడం

రోగి అనారోగ్యం నుంచి కోలుకోగానే వారిని హాస్పిటల్లోని సాధారణ వార్డుకి గాని, రూముకి గాని మారుస్తారు. దీంతో, ఇంటెన్సివ్ కేర్‌లో బెడ్లు మరో అవసరమైన రోగికి చికిత్స అందించేందుకు ఖాళీ అవుతాయి.

కొంత మంది ఇంటెన్సివ్ కేర్‌ నుంచి కొన్ని రోజుల్లోనే బయటకి వస్తే, కొంత మందికి కొన్ని వారాలు, నెలలు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)